Kanaka Durga flyover
-
రోడ్లకు మరిన్ని నిధులు
ఫ్లై ఓవర్‌పై రయ్ రయ్ మంటూ.. విజయవాడ ప్రజల చిరకాల స్వప్నం సాకారమైంది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కనకదుర్గ ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. 46 ఒంటి స్తంభాలపై 2.6 కిలోమీటర్ల మేర ఆరు వరుసలు, ఆరు మలుపులతో రూ.502 కోట్ల వ్యయంతో దీనిని నిర్మించారు. ఈ ఫ్లైఓవర్‌ను వర్చువల్ విధానంలో నాగపూర్ నుంచి కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి గడ్కరీ, తాడేపల్లి క్యాంప్ ఆఫీసు నుంచి సీఎం వైఎస్ జగన్ శుక్రవారం ప్రారంభించారు. దీంతో పాటు బెంజ్ సర్కిల్ మొదటి ఫ్లైఓవర్‌ను కూడా లాంఛనంగా ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అనంతరం కనకదుర్గ ఫ్లై ఓవర్‌పై వాహనదారులు తమ ప్రయాణాలను మొదలుపెట్టారు. శుక్రవారం రాత్రి కనకదుర్గ ఫ్లైఓవర్‌పై వాహనాల రద్దీ సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రహదారుల కనెక్టివిటీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చేసిన మరిన్ని ప్రతిపాదనలకు త్వరగా ఆమోదం తెలపాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కోరారు. కేంద్ర రహదారుల నిధి నుంచి రావాల్సిన నిధులను త్వరగా ఇప్పించాలని, రాష్ట్రంలో పోర్టులకు రహదారుల కనెక్టివిటీ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. విజయవాడలో కొత్తగా నిర్మించిన కనకదుర్గ ఫ్లై ఓవర్, బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్ ప్రారంభం, రూ.15,592 కోట్ల విలువైన 61 హైవే ప్రాజెక్టులకు ఈ–శిలాఫలకాల ఆవిష్కరణ కార్యక్రమంలో శుక్రవారం ఆయన తాడేపల్లి క్యాంప్ ఆఫీసు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. వేగంగా రహదారుల నిర్మాణం ► ఈ ప్రభుత్వ హయాంలో జాతీయ రహదారుల నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ఇది మొత్తం జాతీయ రహదారుల రూపురేఖలనే మారుస్తోంది. ► 2013–14లో రోజుకు 12 కి.మీ మాత్రమే రహదారుల నిర్మాణం జరగ్గా, ఇప్పుడు ప్రతి రోజూ 30 కి.మీ రహదారుల నిర్మాణం జరుగుతోంది. వినూత్న విధానంలో ప్రాజెక్టులు ► ప్రాజెక్టుల కోసం భిన్న మార్గాల్లో నిధులు సేకరించడంతో పాటు, టీఓటీ (టోల్–నిర్వహణ–బదిలీ) పద్ధతిలో ప్రాజెక్టులు చేపడుతున్నారు. టీఓటీ ప్రక్రియలో తొలుత 682 కి.మీ.కు సంబంధించి 30 ఏళ్లకు రూ.10 వేల కోట్ల ఆదాయం రావడం సంతోషకరం. అందులో ఆంధ్రప్రదేశ్‌లోనే 442 కి.మీ రహదారులు ఉన్నాయి. ► ప్రధాని నరేంద్ర మోదీ, మంత్రి నితిన్ గడ్కరీ దూరదృష్టితో దేశ వ్యాప్తంగా 7,800 కి.మీ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేలను దాదాపు రూ.3.3 లక్షల కోట్లతో చేపట్టారు. రహదారుల కనెక్టివిటీ వల్ల ఆర్థిక రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. ► గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేలలో రాష్ట్రంలో 375 కి.మీ పొడవైన 6 రహదారులు ఉండడం గమనించవలసిన విషయం. మీ (గడ్కరీ) హయాంలో 2,667 కి.మీ రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చడంతో, రాష్ట్రంలో జాతీయ రహదారులు 6,880 కిలోమీటర్లకు పెరిగాయి. ఈ–శిలాఫలకాల ఆవిష్కరణ కార్యక్రమంలో తాడేపల్లి క్యాంప్ ఆఫీసు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతోషకరం.. అభినందనీయం ► రాష్ట్రంలో ఇవాళ రూ.15,592 కోట్ల విలువైన 1,411 కి.మీ.కు సంబంధించి మొత్తం 61 ప్రాజెక్టులకు ఈ–శిలాఫలకాల ఆవిష్కరణ, వాటిని జాతికి అంకితం చేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. ► గిరిజన ప్రాంతాల్లో నాలుగు లైన్ల రహదారి కనెక్టివిటీ కోసం ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను ఆమోదించినందుకు అభినందనలు. ముఖ్యంగా రాజమండ్రి – రంపచోడవరం – కొయ్యూరు – అరకు – బౌడారా – విజయనగరం రహదారి నిర్మాణం. ► తూర్పుగోదావరి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లోని సుదూర గిరిజన ప్రాంతాలను కలిపే దాదాపు 380 కి.మీ రెండు లైన్ల రహదారిని ఆమోదించినందుకు ధన్యవాదాలు. ► నాలుగు లైన్ల మైదుకూరు – బద్వేలు – నెల్లూరు, మదనపల్లి – పీలేరు – తిరుపతి, అనంతపురం – గుంటూరు, కర్నూలు – దోర్నాల, అనంతపురం – మైదుకూరు రహదారులను కూడా అడిగిన వెంటనే మంజూరు చేశారు. ► విజయవాడ బెంజి సర్కిల్ వద్ద పశ్చిమం వైపున మూడు లైన్ల ఫ్లైఓవర్‌కు సంబంధించి నేను వ్యక్తిగతంగా చేసిన విజ్ఞప్తిని మన్నించి మంజూరు చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరికొన్ని ప్రతిపాదనలు ► రాష్ట్రంలో రహదారుల కనెక్టివిటీకి సంబంధించి మరికొన్ని ప్రతిపాదనలను మీ ముందు ఉంచుతున్నాను. అవి రాష్ట్రానికి ఎంతో ముఖ్యమైన ప్రాజెక్టులు. 1. కేంద్ర రహదారుల నిధి (సీఆర్ఎఫ్) నుంచి 2014 నుంచి 2019 వరకు రూ.2,611 కోట్లు మంజూరు చేశారు. కానీ దురదృష్టవశాత్తు గత ఏడాది 2019–20లో ఏ నిధులూ విడుదల చేయలేదు. కాగా ఇప్పుడు రూ.680 కోట్ల తొలి దశ విడుదలకు సంబంధించి మంత్రిత్వ శాఖ సానుకూలంగా ఉందని, ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక చెప్పారు. రెండో దశకు సంబంధించి రూ.820 కోట్ల ప్రతిపాదనలను కూడా సమర్పించాం. కాబట్టి వాటిని విడుదల చేయాలి. 2. విజయవాడలో శరవేగంగా పెరుగుతున్న ట్రాఫిక్‌ను దృష్టిలో ఉంచుకుని బైపాస్ రహదారులు అవసరం. నగరానికి పశ్చిమం వైపు ఇప్పటికే మంజూరు కాగా, పనులు కూడా త్వరలోనే మొదలు కానున్నాయి. తూర్పు వైపునకు సంబంధించి గతంలో ప్రతిపాదించిన 189 కి.మీ.కు బదులు 78 కి.మీ రింగ్ రోడ్డు నిర్మాణం చేపట్టాల్సి ఉంది. అందులో భాగంగా ఎన్‌హెచ్–65, ఎన్‌హెచ్–16ను కలుపుతూ 52 కి.మీ మేర రహదారి నిర్మించాల్సి ఉంది. ఇందులో కృష్ణా నదిపై పెద్ద వంతెనను తొలి దశలో నిర్మించాల్సి ఉంది. దీని వల్ల మచిలీపట్నం పోర్టుకు కనెక్టివిటీ ఏర్పడుతుంది. ఆ రహదారిపై ట్రాఫిక్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి, దాని నిర్మాణం కూడా లాభదాయకంగానే ఉంటుంది. అందువల్ల భూసేకరణ భారం రాష్ట్ర ప్రభుత్వంపై మోపకుండా ఆ ప్రాజెక్టును మంజూరు చేయాలని కోరుతున్నాను. 3. వెనకబడిన రాయలసీమ జిల్లాల్లోని ప్రాంతాలకు కనెక్టివిటీ ఏర్పాటు చేసే బెంగుళూరు – విజయవాడ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేను భారత్‌మాల తొలి దశలోనే చేపట్టాలి. కొడికొండ చెక్‌పోస్టు, పులివెందుల, ముద్దనూరు, మీదుగా ఆ రహదారి నిర్మాణం జరుగుతుంది. 4. అనంతపురంలో రహదారి విస్తరణ, ఎన్‌హెచ్–42కు అనుసంధానం, నగరంలో ఆర్ఓబీతో సహా నాలుగు లైన్ల రహదారి కోసం 2020–21 జాతీయ రహదారుల వార్షిక ప్రణాళికలో ఇప్పటికే కేటాయించిన రూ.90 కోట్లతో పాటు అదనంగా రూ.220 కోట్లు మంజూరు చేయాలి. 5. ఉభయ గోదావరి జిల్లాలకు మంచి అనుసంధానంగా నిలిచే ఎన్‌హెచ్–216పై నరసాపురం బైపాస్ నిర్మాణంలో భాగంగా వశిష్ట గోదావరిపై వంతెన నిర్మించాల్సి ఉంది. 6. ఎన్‌హెచ్–67లో భాగంగా కావలి, ఉదయగిరి, సీతారామపురం మధ్య ఉన్న రెండు లైన్ల రహదారిని అభివృద్ధి చేయాలి. ఇందుకోసం దాదాపు రూ.450 కోట్లు వ్యయం అవుతాయని అంచనా. 2020–21 జాతీయ రహదారుల వార్షిక ప్రణాళికలో ఆ మేరకు అదనంగా నిధులు మంజూరు చేయాల్సి ఉంది. ఈ రహదారి వల్ల నెల్లూరు, వైఎస్సార్ కడప, ప్రకాశం, చిత్తూరు జిల్లాల మధ్య కనెక్టివిటీ ఏర్పడుతుంది. 7. రాష్ట్రంలోని ఐదు ప్రధాన పోర్టులను జాతీయ రహదారులకు అనుసంధానించే విధంగా 400 కి.మీ. పొడవైన 25 రహదారుల నిర్మాణం చేపట్టాలి. వాటి నిర్మాణం వల్ల పోర్టులకు, పారిశ్రామిక రంగానికి అనుసంధానం ఏర్పడుతుంది. దీని వల్ల ఆర్థికంగా కూడా అభివృద్ది చెందవచ్చు. 8. విశాఖపట్నం నుంచి విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వరకు బీచ్ రోడ్డు అభివృద్ధి చేయాలి. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా అభివృద్ధి చేస్తున్న నేపథ్యంలో ఈ రహదారి నిర్మాణం ఎంతో అవసరం. రాష్ట్రాన్ని సందర్శించండి ► రాష్ట్రంపై మీరు మమకారం చూపుతున్నందుకు, ప్రాజెక్టులను మంజూరు చేస్తున్నందుకు మనసారా ధన్యవాదాలు. వీలైనంత త్వరగా ఆయా ప్రాజెక్టులు చేపట్టి, సకాలంలో పూర్తి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహయ, సహకారాలు అందజేస్తుంది. ► స్థానికంగా ఎదురయ్యే సమస్యల పరిష్కారంతో పాటు, భూసేకరణలో కూడా నిరంతరం మీకు తోడుగా నిలుస్తాం. రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రాజెక్టులను పరిశీలించడానికి ఒకసారి ఇక్కడికి రావాలని కోరుతున్నా. -
విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్ లేటెస్ట్ ఫొటోలు
-
కనకదుర్గ ఫ్లై ఓవర్ ప్రారంభం వాయిదా
సాక్షి, అమరావతి: ప్రతిష్టాత్మకంగా నిర్మించిన విజయవాడ కనకదుర్గ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవం వాయిదా పడింది. తొలుత ఈనెల 4న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీలు ఈ వంతెనను ప్రారంభించాల్సి ఉంది. అయితే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సోమవారం మరణించడంతో ప్రభుత్వం ఐదు రోజుల పాటు సంతాప దినాలుగా పాటిస్తోంది. దీంతో ఈ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవాన్ని వాయిదా వేశారు. రూ.502 కోట్ల వ్యయంతో ఈ వంతెనను నిర్మించిన సంగతి తెలిసిందే. (దేశ వ్యాప్తంగా కనకదుర్గా ఫ్లైఓవర్ అందాలు) మరోవైపు ఈ నెల నాలుగో తేదీనే మరికొన్ని రోడ్లు, వంతెనలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరగాల్సి ఉంది. ఇప్పటికే పూర్తయిన నగరంలోని బెంజి సర్కిల్ ఫ్లై ఓవర్ లాంఛన ప్రారంభోత్సవం కూడా వాయిదా పడింది. ఫిబ్రవరిలోనే ఈ వంతెనపై వాహనాల రాకపోకలకు అధికారులు అనుమతించారు. అలాగే రూ.100 కోట్లతో నిర్మించ తలపెట్టిన బెంజి సర్కిల్ రెండో ఫ్లై ఓవర్‌కు శంకుస్థాపన, రూ.740 కోట్లతో నిర్మించిన మచిలీపట్నం రోడ్డు ప్రారంభోత్సవం, రూ.2,700 కోట్లతో నిర్మించనున్న విజయవాడ బైపాస్ రోడ్ల రెండు ప్యాకేజీలకు శంకుస్థాపనలు చేయాల్సి ఉంది. ఈనెల 8వ తేదీ తర్వాత ఈ ఫ్లై ఓవర్ ప్రారంభించే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. -
దేశ వ్యాప్తంగా కనకదుర్గా ఫ్లైఓవర్ అందాలు
సాక్షి, విజయవాడ : దేశంలోనే అతి పొడవైన కనకదుర్గా ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి కౌంట్‌డౌన్ స్టార్ట్ అయింది. ఇందుకు సన్నాహక ఏర్పాట్లకు ఆదివారం అడుగులు పడ్డాయి. దేశంలోనే అత్యద్భుత ఫ్లై ఓవర్ కావటంతో ఈ ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. సెప్టెంబరు 4వ తేదీన వర్చువల్ ప్రారంభోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు ఈ ఫ్లై ఓవర్ ఇంజనీరింగ్ అద్భుతాన్ని పరిచయం చేయాలని కేంద్రం నిర్ణయించింది. దీని కోసం ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా డ్రోన్ బృందాన్ని విజయవాడకు పంపించింది.ఈ బృందం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఫ్లైఓవర్ అందాలను చిత్రీకరించింది. చిత్రీకరణలో ఆర్అండ్బీ స్టేట్ హైవేస్ విభాగం అధికారులతో పాటు కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ (మోర్టు) అధికారులు కూడా పాల్గొన్నారు. సెప్టెంబరు 4వ తేదీన ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి ముందు దేశవ్యాప్తంగా జాతీయ మీడియాలో ఫ్లైఓవర్‌కు సంబంధించిన డాక్యుమెంటరీని ప్రదర్శించనున్నారు. స్పైన్ అండ్ వింగ్స్ టెక్నాలజీతో ఒంటి స్తంభంపై ఆరు వరసలతో నిర్మించిన ఫ్లై ఓవర్ కావటం చేత దీనికి ప్రాధాన్యత ఏర్పడింది. దేశంలో ఢిల్లీ, ముంబయిల్లో మాత్రమే ఈ తరహా ఫ్లై ఓవర్లు ఉన్నాయి. అయితే ఆ రెండింటి కంటే అడ్వాన్స్ టెక్నాలజీతో ఈ ఫ్లైఓవర్‌ను నిర్మిస్తున్నారు.పైగా దేశంలోనే అతి పొడవైనది. ఈ టెక్నాలజీలో వై పిల్లర్స్ ఉండటం, వీటి నిడివి ఎక్కువగా ఉండటం కూడా ప్రత్యేకమని చెప్పుకోవాలి. ఈ టెక్నాలజీలో దేశంలోని అతి పొడవైన ఆరు వరసల ఫ్లై ఓవర్ కావటంతో దేశానికి గర్వకారణమైన విషయంగా కేంద్రం భావిస్తోంది. -
బెజవాడ ప్లైఓవర్: హైదరాబాద్ వెళ్లే వారికి సూచన!
సాక్షి, విజయవాడ: బెజవాడకు మణిహారంగా పరిగణించబడుతున్న కనకదుర్గ ఫ్లై ఓవర్ సిద్ధమయ్యింది. భవానిపురం నుంచి దుర్గగుడి మీదుగా రాజీవ్ గాంధీ పార్కు వరకు నిర్మించిన ఈ వంతెన ప్రారంభానికి అధికారుల అన్ని చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా కాంట్రాక్టర్ సోమా కంపెనీ లోడ్ లారీలను ఒకవైపుగా వెళ్లనిచ్చి లోడ్ టెస్ట్ నిర్వహించారు. బుధవారం నుంచి ఫ్లై ఓవర్ పై రెండవ లోడ్ టెస్ట్‌కి సిద్ధం అవుతుందని అధికారులు తెలిపారు. (తీరనున్న బెజవాడ వాసుల చిరకాల స్వప్నం) ఫ్లై ఓవర్‌పై లోడ్ టెస్ట్ కారణంగా విజయవాడ నగరంలలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. బుధవారం నుంచి 21వ తేదీ వరకూ ఫ్లై ఓవర్ లోడ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. విజయవాడ నుంచి హైద్రాబాద్ వైపు వెళ్లే వాహనాలకు ఎలాంటి ట్రాఫిక్ నియంత్రణ లేదని అధికారులు తెలిపారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలు మాత్రం భవానిపురం నుంచి ఆర్టీసీ వర్క్ షాప్- సితార జంక్షన్- సీవీఆర్ ఫ్లై ఓవర్- వైవీఆర్ ఎస్టేట్- పైపుల రోడ్- ఇన్నర్ రింగ్ రోడ్డు- రామవరపాడు రింగ్ వైపుగా వెళ్ళాలని అధికారులు సూచించారు. చదవండి: బాబు అక్రమాల కేసు గిన్నిస్ రికార్డు లెవల్లో.. -
తీరనున్న బెజవాడ వాసుల చిరకాల స్వప్నం
సాక్షి, అమరావతి: బెజవాడ వాసుల చిరకాల స్వప్నం తీరనుంది. నగరంలో నిర్మించిన కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభానికి సిద్ధమైంది. పెండింగ్‌లో ఉన్న కనకదుర్గ ఫ్లైఓవర్ పనులు పూర్తి అయ్యాయి. గురువారం మధ్యాహ్నం నుంచి 15వ తేదీ సాయంత్రం వరకూ ఫ్లైఓవర్ సామర్థ్యం పరీక్షలను అధికారులు నిర్వహించనున్నారు. ఫ్లైఓవర్ ‘లోడ్ టెస్ట్’ నిమిత్తం సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కుమ్మరిపాలెం నుంచి వినాయక గుడి వరకు వాహన రాకపోకలపై ఆంక్షలు ఉంటాయని అధికారులు తెలిపారు. విజయవాడ వైపు వచ్చే భారీ వాహనాలు/ ఇతర వాహనాలు ఇబ్రహీంపట్నం-గొల్లపూడి-సితార సెంటర్-కబేలా-సీవీఆర్ ఫ్లై ఓవర్- ఇన్నర్ రింగ్‌రోడ్డు-పైపుల రోడ్ జంక్షన్- రామవరపడు రింగ్‌రోడ్డు మీదగా జాతీయ రహదారి 65కి మీదగా వెళ్లాలని నగర అదనపు సీపీ బత్తిన శ్రీనివాసులు తెలిపారు. హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలు కృష్ణలంక పోలీస్‌స్టేషన్- పోలీస్ కంట్రోల్ రూమ్- పంజా సెంటర్- చిట్టినగర్- సొరంగం- గొల్లపూడి - ఇబ్రహీంపట్నం మీదగా వెళ్లాలని పేర్కొన్నారు. 15వ తేదీ సాయంత్రం వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని, ప్రజలందరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కనకదుర్గ ఫ్లైఓవర్ నిర్మాణం 98 శాతం పూర్తయిన నేపథ్యంలో ఈ నెల 20 తర్వాత ట్రయల్ రన్ నిర్వహించాలని ఇప్పటికే అధికారులు నిర్ణయించారు. అంతకు ముందుగా ‘లోడ్ టెస్ట్’ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా గురువారం మధ్యాహ్నం నుంచి 48 గంటల పాటు లోడ్ టెస్ట్‌ను కొనసాగించనున్నారు. 24 లారీల్లో ఇసుక/ కాంక్రీటును నింపుతారు. ఒక్కో లారీపై 28.5 టన్నుల చొప్పున మొత్తం 684 టన్నుల బరువును వంతెనపై స్పాన్ల మధ్య ఉంచుతారు. 48 గంటల తర్వాత ఏమైనా లోపాలు కనిపిస్తే సరిచేస్తారు. సమస్యలు లేవని నిర్ధారించుకున్నాక ఈనెల 20 తర్వాత ట్రయల్ రన్లో భాగంగా వాహనాలను అనుమతిస్తామని ఆర్ అండ్ బీ (క్వాలిటీ కంట్రోల్) సూపరింటెండింగ్ ఇంజినీర్ జాన్ మోషే తెలిపారు. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
డిసెంబర్ 31కి కనకదుర్గ ఫ్లైఓవర్ పూర్తి
భవానీపురం (విజయవాడ పశ్చిమ): డిసెంబర్ 31 నాటికి విజయవాడ కనకదుర్గ ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్తి చేసి నూతన సంవత్సర కానుకగా ప్రజలకు అందుబాటులోకి తెస్తామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. ఈ మేరకు కాంట్రాక్టు సంస్థకు ఆదేశాలిచ్చామన్నారు. ఆదివారం ఆయన దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఉన్నతాధికారులతో కలసి విజయవాడలో పనుల పురోగతిని పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. విజయవాడ– హైదరాబాద్ మార్గంలో ప్రయాణించే ప్రజలకు కనకదుర్గ ఫ్లై ఓవర్ అత్యంత ప్రాముఖ్యమైనదన్నారు. అందుకే తొలి ప్రాధాన్యతగా ఈ పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్ సూచించారని చెప్పారు. మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్తి చేసే క్రమంలో నెల రోజులపాటు కింద రోడ్డు మార్గంలో కొన్ని చోట్ల ట్రాఫిక్‌ను నిలిపేయాల్సి వస్తుందని, ఇందుకు ప్రజలు సహకరించాలని కోరారు. గత ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడంతో ఐదేళ్లకు కూడా పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. రోడ్లు, భవనాల శాఖ ముఖ్యకార్యదర్శి ఎంటీ కృష్ణబాబు మాట్లాడుతూ.. ఫ్లైఓవర్ నిర్మాణం నిమిత్తం కేంద్ర ప్రభుత్వం (నేషనల్ హైవేస్) నుంచి ఇప్పటి వరకు రూ. 233 కోట్లు విడుదలయ్యాయని, మరో రూ. 100 కోట్లు రావల్సి ఉందన్నారు. భూ సేకరణ కింద రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రూ. 114 కోట్లు ఖర్చు చేసిందని చెప్పారు. ఫ్లైఓవర్‌కు వయాడక్ట్ వంటి అదనపు పనులు చేయటం వలన రూ. 25 కోట్ల మేర అదనపు భారం పడిందని తెలిపారు. ఇప్పటికి దాదాపు 85 శాతం పనులు పూర్తయ్యాయని వివరించారు. కార్యక్రమంలో ప్రాజెక్ట్ ఎస్ఈ జాన్ మోషే, ఆర్అండ్బీ ఈఎన్సీ రాజీవ్‌రెడ్డి, కేంద్ర ప్రభుత్వ రీజనల్ రవాణా అధికారి ఎస్కే సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
హతవిధి!
ఒక రోజు పనులు పూర్తిస్థాయిలో జరిగితే.. వారం రోజులు ఆగిపోతాయి. మళ్లీ ప్రారంభమవుతాయి.. మరో రెండు, మూడు రోజుల్లోనే స్టాప్. ఇది కనకదుర్గ్గ ఫ్లైఓవర్ నిర్మాణ పనుల తీరు. మూడేళ్ల క్రితం ప్రారంభమైన ఈ ఫ్లైఓవర్ పనులు ఎప్పుటికీ పూర్తవుతాయో అర్థం కాని పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ పనులు నిరంతరాయంగా జరిగిన దాఖలాలు లేవు. ప్రభుత్వం, అధికార యంత్రాంగమే దీనికి కారణంగా కనిపిస్తోంది. నిర్మాణ పనులు జరుగుతున్న పలు ప్రదేశాల్లో తరచూ ఆంక్షలు పెడుతుండడంతో సక్రమంగా పనులు సాగడం లేదు. మరో వైపు సీఎం చంద్రబాబు వచ్చే మార్చినాటికి ఫ్లై ఓవర్ అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు ఆదేశాలిచ్చినా.. ఈ లెక్కన పనులు సాగితే మరో ఏడాదైనా నిర్మాణం పూర్తయ్యే అవకాశం లేదని ఇంజినీరింగ్ నిపుణులు చెబుతున్నారు. సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రి వద్ద నిర్మిస్తున్న కనకదుర్గా ఫ్లైఓవర్‌కు అడుగడుగునా అడ్డంకులే ఎదురవుతున్నాయి. జాతీయ రహదారిపై నిర్మిస్తున్న ఈ వంతెన వేగవంతంగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం, అధికార యంత్రాంగమే సహకరించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మార్చి నాటికి పూర్తి చేయాలని సీఎం ఆదేశం.. ఫ్లై ఓవర్ పనులు 2015 డిసెంబర్లో ప్రారంభమయ్యాయి. ఏడాదిలో పున్నమీఘాట్ నుంచి కార్పొరేషన్ కార్యాలయం వరకు పనులు పూర్తి చేయాలన్నది ప్రణాళిక. ముఖ్యమంత్రి చంద్రబాబే స్వయంగా ఈ ప్రాజెక్టు పనులను సమీక్షించేవారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 10 సార్లుకు పైగా డెడ్‌లైన్ నిర్ణయించారు. అయితే ఇప్పటికీ కేవలం 70 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. తాజాగా వచ్చే మార్చినాటికి పూర్తి చేయాలంటూ హుకుం జారీ చేశారు. ఆదేశాలెలా ఉన్నా.. ప్రస్తుత పరిస్థితి చూస్తే ప్రాజెక్టు ఇప్పట్లో పూర్తయ్యే పరిస్థితి లేదు. కనీసం మరో ఏడాదైనా పట్టే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. నిన్న బోటు రేసింగ్..నేడు ఎయిర్ షో.. ఫ్లైఓవర్ పనులు నెలల్లో 20 రోజులు కూడా సక్రమంగా జరగని పరిస్థితి కనిపిస్తోంది. గత రెండు, మూడు నెలల పనుల తీరును ఒకసారి పరిశీలిస్తే.. దసరా ఉత్సవాలని 10 రోజులు పనులకు కావాల్సిన వాహనాలను రాకపోకలు జరగకుండా అధికారులు అడ్డుకున్నారు. గత వారం ఎఫ్1హెచ్2ఓ రేస్ నిర్వహించారు. వీటిని చూడటానికి వందలాది మంది ప్రేక్షకులు తరలివస్తూ ఉండటంతో అక్కడ పనులు చేస్తే ఏ ప్రమాదం జరుగుతుందోనని ఆరేడు రోజులు పనులు జరగకుండా ఆపివేశారు. ఇప్పుడు ఎయిర్ షో పేరుతో మరో కొన్ని రోజులు పనులు నిలిచిపోతాయి. వచ్చే నెలల్లో భవానీదీక్షల విరమణ కార్యక్రమాలకు మరో పది రోజు లు ఫ్లై ఓవర్ పనులకు బ్రేక్ పడతాయి. ఈ విధంగా అడుగడుగునా పనులకు అడ్డంకులు ఎదురవుతూ ఉంటే పను లు ముందుకు సాగడం కష్టమేనని ఆర్అండ్బీ అధికారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. బరం పార్కులో కార్యక్రమాలు.. ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్తయ్యే వరకు బరం పార్కుకు భారీగా సందర్శకులు తరలి వచ్చే కార్యక్రమాలు నిర్వహించకుండా ఉంటే బాగుంటుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. -
వంతెన.. ఇంతేనా?
అది నిత్యం దాదాపు 57,000 వాహనాలు రాకపోకలు సాగించే రహదారి.. హైదరాబాద్ నుంచి అటు చెన్నై వెళ్లాలన్నా ఇటు కోల్‌కతా వెళ్లాలన్నా అదే మార్గం... అలాంటి కీలక దారిలో ట్రాఫిక్ ఆంక్షల వల్ల వాహనదారులు దాదాపు 40 కి.మీ. చుట్టూ తిరుగుతూ అల్లాడుతున్నారు. విజయవాడలో మూడేళ్లు అవుతున్నా సర్కారు ఫ్లై ఓవర్ పనులను పూర్తి చేయకపోవటంతో నరకం అనుభవిస్తున్నారు. పెరిగిన దూరంతో రవాణా రంగంపై ప్రతి నెలా అదనంగా రూ.34 కోట్ల డీజిల్ భారం పడుతోంది. ఈ నేపథ్యంలో రూ. 450 కోట్లతో చేపట్టిన వంతెన కన్నా వాహనదారులపై పడుతున్న ఇంధన భారమే అధికమనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సాక్షి, అమరావతి బ్యూరో: ట్రాఫిక్ కష్టాలను తలచుకుని విజయవాడ రావాలంటేనే లారీ యజమానులు, వాహనదారులు హడలిపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏడాదిలో పూర్తి చేస్తామన్న కనకదుర్గ ఫ్లైఓవర్ నిర్మాణం మూడేళ్లవుతున్నా ఇంకా పనులు పూర్తి కాకపోవటమే దీనికి కారణం. ఆ మార్గంలో రోజూ 57 వేల వాహనాలు విజయవాడలో కనకదుర్గ ఫ్లైఓవర్ నిర్మిస్తున్న మార్గం ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా అత్యంత కీలకమైంది. హైదరాబాద్– మచిలీపట్నం 65వ నంబర్ జాతీయ రహదారిని, చెన్నై– కోల్‌కతా 16వ నంబర్ జాతీయ రహదారిని అనుసంధానించే కీలకమైన రోడ్డు ఇది. హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలు ఈ మార్గం నుంచే విజయవాడలోకి ప్రవేశిస్తాయి. అటు చెన్నై వెళ్లాలన్నా ఇటు కోల్‌కతా వైపు వెళ్లాలన్నా ఈ దారి గుండానే ప్రయాణించాలి. విజయవాడలో ట్రాఫిక్ అంశంపై పోలీసు, రవాణా శాఖ, నేషనల్ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ 2015లో సంయుక్తంగా నిర్వహించిన సర్వే సర్వే ప్రకారం ఈ మార్గంలో నిత్యం 57 వేల వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ఇంత కీలకమైన మార్గంలో ఫ్లైఓవర్ నిర్మించాలని 2015లో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఏడాదిలోపే అంటే 2016 ఆగస్టు కృష్ణా పుష్కరాల నాటికే ఫ్లైఓవర్ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని చెప్పిన సీఎం చంద్రబాబు మూడేళ్లు అవుతున్నా పనులను పూర్తి చేయించలేకపోయారు. మూడేళ్లలో నాలుగుసార్లు గడువులు పొడిగించినా పనులు పూర్తి కాలేదు. చుట్టూ తిరిగి నగరంలోకి... కనకదుర్గ ఫ్లైఓవర్ నిర్మాణం నేపథ్యంలో విజయవాడ శివారులోని గొల్లపూడి నుంచి బెంజ్ సర్కిల్ మార్గంలో మూడేళ్లుగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దాదాపు ఏడాదిన్నరపాటు ఎలాంటి వాహనాలను అనుమతించలేదు. దీంతో చుట్టూ తిరిగి విజయవాడలోకి ప్రవేశించాల్సి వస్తోంది. నెహ్రూ బస్‌స్టేషన్ చేరుకునేందుకు దాదాపు గంట పడుతోంది. గొల్లపూడి నుంచి కబేళా జంక్షన్, చనుమోలు వెంకట్రావు ఫ్లై ఓవర్, సింగ్‌నగర్, రామవరప్పాడు రింగ్ మీదుగా ప్రయాణించాల్సి వస్తోంది. దీని వల్ల దూరం పెరిగింది. వాహనదారులకు సమయం కూడా వృథా అవుతోంది. రద్దీ ఎక్కువగా ఉండే ఇరుకు రోడ్లలో ప్రయాణానికి గంటన్నరకుపైగా సమయం పడుతోంది. మహానాడులో సీఎంకు ఫ్లైఓవర్ నిర్మాణంపై ‘సాక్షి’ కథనాలను చూపిస్తున్న ఎమ్మెల్యే వర్మ నెలకు రూ.34 కోట్ల భారం లారీలు, బస్సులకు దాదాపు 5 లీటర్ల డీజిల్ అదనంగా ఖర్చు అవుతుండటంతో ఒక్కో వాహనంపై రూ.380 దాకా భారం పడుతోంది. ఆ మార్గంలో నిత్యం ప్రయాణించే 57 వేల వాహనాల్లో లారీలు, రవాణా వాహనాలు, బస్సులు దాదాపు 30 వేల వరకు ఉంటాయని అంచనా. అంటే వీటిపై రోజూ రూ.1.14 కోట్ల అదనపు భారం పడుతోంది. ఈ లెక్కన నెలకు రూ.34 కోట్ల ఆర్థిక భారం పడుతుండటంతో రవాణా రంగం కుదేలవుతోంది. ఫలితంగా విజయవాడ రావాలంటేనే లారీ యజమానులు హడలిపోయే పరిస్థితి నెలకొంది. వాహనదారులు, ప్రజలు ఇంత ఇబ్బందులు పడుతున్నా ఫ్లై ఓవర్ నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. సీఎం చంద్రబాబు సమీక్షలతో హడావుడి చేయడం మినహా వంతెన వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవటం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మా బతుకులను దెబ్బతీస్తోంది ఫ్లైఓవర్ నిర్మాణంలో ప్రభుత్వం చేతగానితనం మా బతుకులను దెబ్బతీస్తోంది. హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా సర్వీసులు నడపాలంటే లారీ యజమానులు భయపడుతున్నారు. – మధు, లారీ సప్లయర్స్ అసోసియేషన్ కార్యదర్శి డీజిల్ ఖర్చు తడిసిమోపెడు హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చేందుకు మూడు గంటలు పడితే భవానీపురం నుంచి నగరంలోకి రావడానికి సుమారు గంటన్నర పడుతోంది. ట్రాఫిక్‌లో చుట్టూ తిరిగి రావాలంటే డీజిల్ ఖర్చు తడిసిమోపెడవుతోంది. పెరిగిన ఖర్చుతో కిరాయిలు గిట్టుబాటు కావటం లేదు. – చేపూరి వినయ్, ట్యాక్సీ డ్రైవర్ -
అనగనగా.. ఓ వంతెన!
సాక్షి, అమరావతి బ్యూరో: ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి నిచ్చెన వేస్తా అందట! రాష్ట్ర ప్రభుత్వ తీరు మాటలు కోటలు దాటుతున్నా కాలు గడప దాటడం లేదు. విజయవాడలో కేవలం రూ.450 కోట్లతో పూర్తయ్యే కీలకమైన ఓ వంతెన నిర్మాణాన్నే మూడేళ్లు అవుతున్నా పూర్తి చేయలేని రాష్ట్ర సర్కారు.. రూ.లక్షల కోట్లతో అమరావతిని కడతామంటూ ఊహా చిత్రాలను ఆవిష్కరిస్తోంది! సీఎం చంద్రబాబు ఏడాదిలోపే పూర్తి చేస్తామన్న విజయ వాడ కనకదుర్గ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు ఎక్కడివి అక్కడే మిగిలిపోవటం సర్కారు అసమర్థతకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకుంటూ బెజవాడ నడిబొడ్డున మూడేళ్లుగా ఓ ఫ్లై ఓవర్‌ను నిర్మించలేకపోవటాన్ని బట్టి రాష్ట్ర ప్రభుత్వాధినేత పరిపాలనా సామర్థ్యం ఏపాటిదో ఇట్టే అవగతమవుతోంది. పుష్కరాలు వచ్చాయి.. వెళ్లాయి విజయవాడలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి కేంద్ర ఉపరితల రవాణా శాఖ, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా చేపట్టిన కనకదుర్గ ఫ్లైఓవర్ నిర్మాణ పనులకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ 2015 డిసెంబర్ 5వతేదీన శంకుస్థాపన చేశారు. 2016 ఆగస్టు పుష్కరాలనాటికి ఫ్లైఓవర్ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని నాడు సీఎం చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. పుష్కరాలు వచ్చాయి వెళ్లాయి కానీ ఫ్లైఓవర్ నిర్మాణం 10 శాతం కూడా పూర్తి కాలేదు. ఆ తరువాత చంద్రబాబు 2016 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామన్నారు. అనంతరం గడువు 2017 ఆగస్టు 15 వరకు, తరువాత డిసెంబర్ 31వతేదీకి పొడిగించారు. చివరకు 2018 మార్చి 31 అన్నారు. అది కూడా పూర్తయి ఇప్పుడు మే నెల చివరికి వచ్చినా ఫ్లైఓవర్ పనులు పూర్తి కాలేదు. ఇప్పుడు ఇక ఎన్నికలకు ఏడాది లోపే సమయం ఉండటంతో 2019 జనవరి నాటికి పూర్తి చేస్తామంటూ మరోసారి మాయమాటలు చెబుతున్నారు. డీపీఆర్ నుంచి డిజైన్ దాకా అలసత్వమే కేంద్ర నిధులతో చేపట్టిన దుర్గ గుడి ఫ్లైఓవర్ పనులను పర్యవేక్షించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఆది నుంచి నిర్లక్ష్య వైఖరినే ప్రదర్శిస్తూ వచ్చింది. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండానే డీపీఆర్‌ను లోపభూయిష్టంగా తయారు చేశారు. ఫ్లై ఓవర్ నిర్మించే చోట భౌగోళిక స్వరూపం, పరిమితులను దృష్టిలో పెట్టుకోకుండా ఆషామాషీగా ఓ డిజైన్ రూపకల్పన పేరుతో సంవత్సరాల తరబడి సమయం వృథా చేసి దాన్ని ఆమోదించారు. అయితే తర్వాత మళ్లీ డిజైన్‌లో లోపాలు ఉన్నాయంటూ కొత్త వాటి పేరుతో మరి కొద్ది నెలలు కాలయాపన చేశారు. ఇరుకు మార్గంలో ఆ డిజైన్‌తో కష్టమే 417 పైల్స్, 47 స్తంభాలు, 47 స్తంభాల పైకప్పులు (స్పైన్, వింగ్స్ కలిపి) ఫ్లై ఓవర్ నిర్మించేలా డిజైన్ రూపొందించారు. పనులు ప్రారంభమైన కొన్నాళ్లకు ఆ డిజైన్‌తో నిర్మాణం సాధ్యం కాదని గుర్తించారు. దాదాపు 140 టన్నుల చొప్పున బరువు ఉండే ఒక్కో పైకప్పును స్తంభాలపైకి చేర్చడం అసాధ్యమని ఇంజనీర్లు చేతులెత్తేశారు. కేవలం మైదాన ప్రాంతాల్లో నిర్మాణాలకే అది సాధ్యమని, ఇరుకుగా ఉండే దుర్గ గుడి మార్గంలో అసాధ్యమని నిపుణులు తేల్చేశారు. దీంతో 2016 జూన్‌లో ఎట్టకేలకు కొన్ని మార్పులతో డిజైన్‌ను ఆమోదించారు. అయితే వెంటనే మేల్కొని డిజైన్‌లో మార్పులు చేసి ఉంటే పనులు వేగంగా జరిగేవి. ఆ పని చేయకుండా సమీక్షల పేరుతో కాలయాపన చేశారు. సీఎం స్వయంగా 15 రోజులకు ఒకసారి సమీక్ష జరిపిన ఫ్లై ఓవర్ పనులే ఇలా ఉంటే ఇక రాజధాని కట్టడానికి ఎన్ని శతాబ్దాల సమయం పడుతుందో? అని బెజవాడ వాసులు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. మార్చిన డిజైన్లోనూ లోపాలు! మార్పుల అనంతరం ఖరారు చేసిన డిజైన్ కూడా లోపభూయిష్టంగానే ఉందని ఇంజనీరింగ్ నిపుణులు పేర్కొంటున్నారు. ఫ్లై ఓవర్ మీద ఆరు మలుపుల్లో మూడు అత్యంత ప్రమాదకరమైనవని హెచ్చరిస్తున్నారు. ఫలితంగా ఫ్లై ఓవర్‌పై రోడ్డు ప్రమాదాలు సంభవించే అవకాశాలున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. బిల్లుల చెల్లింపుల్లోనూ తీవ్ర జాప్యం ఒకవైపు డీపీఆర్, డిజైన్లపై కనీస శ్రద్ధ చూపని రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టర్‌కు బిల్లుల చెల్లింపుల్లోనూ అంతులేని జాప్యాన్ని ప్రదర్శించింది. కేంద్ర ప్రభుత్వం సూచించినట్లుగా కనీసం గ్యారెంటీ ఇస్తే ఈపాటికి పనులు జరిగి ఉండేవి. ఈ బాధ్యతను సైతం చంద్రబాబు సర్కారు పట్టించుకోకపోవటం గమనార్హం. యాత్రలు, సదస్సులకు రూ.వందల కోట్లు ప్రత్యేక విమానాలు, విదేశీ యాత్రలు, సదస్సుల పేరుతోప్రచార ఆర్భాటం కోసం రూ.వందల కోట్ల ప్రజా ధనాన్ని వృథా చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన దుర్గ గుడి ఫ్లై ఓవర్ నిర్మాణాన్ని గాలికి వదిలేయటంతో ట్రాఫిక్ కష్టాలతో అల్లాడుతున్నారు. ఫ్లై ఓవర్ నిర్మాణానికి నిధులు విడుదల చేస్తే తరువాత కేంద్రం తిరిగి ఇస్తామంటున్నా ముందుకు రాకపోవటంతో పనులు మూడేళ్లుగా నత్త నడకను తలపిస్తున్నాయి. అసలు ఎప్పటికి పూర్తవుతుందో కూడా స్పష్టంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. ‘సింగపూర్ తరహా రాజధాని నిర్మిస్తాం... అమరావతిని అంతర్జాతీయ ప్రమాణాలతో కడతాం’ – ఇదీ నాలుగేళ్లుగా సీఎం చంద్రబాబు గ్రాఫిక్స్‌లో చూపిస్తున్న సినిమా హైదరాబాద్ నుంచి విజయవాడకు 4 గంటల్లోనే చేరుకోవచ్చు. కానీ నగరంలోని బస్టాండ్‌కు వెళ్లాలంటే గంటపైనే పడుతోంది. కీలకమైన కనకదుర్గ ఫ్లైఓవర్ నిర్మాణం మూడేళ్లుగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మారింది. పలు ప్రాంతాల నుంచి విజయవాడ చేరు కునేందుకు ఇదే కీలక దారి కావటంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. – రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతకు ఇది కాదా తార్కాణం? -
దుర్గగుడి ఫ్లైఓవర్ టెండర్ ఖరారు
రూ.282 కోట్లకు సోమా కంపెనీకి ఏడాదిలో నిర్మాణం పూర్తి చేయాలని షరతు ప్రారంభమైన ఇళ్ల తొలగింపు పనులు ఫ్లైవోవర్ పొడవు 2.5 కిలోమీటర్లు 5.2 కిలోమీటర్ల రోడ్డు నాలుగు లైన్లుగా విస్తరణ విజయవాడ : విజయవాడలో ఎట్టకేలకు కనకదుర్గ ఫ్లైవోవర్ పనులు ప్రారంభమయ్యాయి. గురువారం ఫ్లైఓవర్ టెండర్లను ఆర్అండ్బీ నేషనల్ హైవేస్ విభాగం అధికారులు రూ.282 కోట్లకు సోమా కన్స్ట్రక్షన్ కంపెనీకి ఖరారు చేశారు. ఏడాది కాలవ్యవధిలో పనులు పూర్తి చేసేలా షరతు విధించారు. ఈ క్రమంలో గురువారం నుంచి ఫ్లైఓవర్, రహదారి విస్తరణకు వీలుగా రోడ్లపై ఉన్న ఆక్రమణలు, రోడ్డుకు ఇరువైపులా ఉన్న నిర్మాణాల తొలగింపు ప్రక్రియ మొదలుపెట్టారు. దీంతో ఫ్లైఓవర్ నిర్మాణ పనులు మొదలైనట్లు జిల్లా అధికార యంత్రాంగం ప్రకటించింది. మరోపక్క అధికారిక లాంఛనాలన్నీ పూర్తిచేసుకొని సోమా సంస్థ మరో 15 రోజుల్లో నిర్మాణ పనులు మొదలుపెట్టేలా కసరత్తు సాగిస్తోంది. తొలగింపు పనులు మూడు రోజుల్లో పూర్తి... భవానీపురం లారీ స్టాండ్ నుంచి రాజీవ్ గాంధీ పార్కు వరకు 2.5 కిలోమీటర్ల పొడవున ఆరులైన్లలో ఫ్లైఓవర్ నిర్మాణం, భవానీపురం లారీ స్టాండ్ నుంచి కనకదుర్గ వారధి వరకు 5.2 కిలోమీటర్ల పొడవున ఉన్న రహదారిని నాలుగులైన్లుగా విస్తరణ పనులు ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా జరగనున్నాయి. ఇళ్ల తొలగింపు, అండర్ గ్రౌండ్లో ఉన్న వాటర్ పైప్లైన్ల మార్పు, రోడ్లపై ఉన్న విగ్రహాల తొలగింపు తదితర కార్యక్రమాలు గురువారం మొదలుపెట్టారు. తొలగింపు కార్యక్రమాలన్నీ మరో మూడు రోజుల్లోగా పూర్తి చేయటానికి రెవెన్యూ శాఖ, నగరపాలక సంస్థ అధికారులు కసరత్తు చేస్తున్నారు. నగర కమిషనర్ వీరపాండియన్ విద్యాధరపురంలో ఉన్న హెడ్‌వాటర్ వర్క్స్‌ను పరిశీలించారు. మార్కింగ్ అయిన మేరకు వాటర్‌వర్క్స్ ప్రహరీగోడను తొలగించారు. రహదారి విస్తరణలో 65 నివాస గృహాలు పోతాయని అధికారులు నిర్ధారించి వారికి జక్కంపూడిలోని ప్లాట్లు కేటాయించనున్నారు. హెడ్ వాటర్ వర్క్స్ నుంచి రథం సెంటర్ వరకు ఉన్న 5 ఎంజీడీ, 16 ఎంజీడీ వాటర్ పైప్‌లైన్, కుమ్మరిపాలెం సెంటర్ నుంచి నాలుగు స్తంభాల సెంటర్ వరకు ఉన్న 8 ఎంజీడీ, 11 ఎంజీడీ వాటర్ పైప్లైన్లను కూడా విస్తరణ పనుల కోసం తొలగించనున్నారు. విస్తరణలో అశోక స్థూపం, మహాత్మాగాంధీ, పొట్టి శ్రీరాములు, ఇతర జాతీయ నేతల విగ్రహాలు తొలగించి వాటిని నగరపాలక సంస్థ స్వాధీనం చేసుకొని వేరే ప్రాంతంలో ప్రతిష్టించేలా నగరపాలక సంస్థ అధికారులు అన్ని చర్యలు తీసుకోనున్నారు. టెండర్ దక్కింది ఇలా... విజయవాడ ఆర్అండ్బీ నేషనల్ హైవే విభాగం అధికారులు నిర్మాణానికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేసి ఈ ఏడాది ప్రారంభంలో ప్రభుత్వానికి పంపారు. దీనిలో భాగంగా రూ.338 కోట్ల నిర్మాణ వ్యయంతో ప్రతిపాదనలు సిద్ధం చేయగా కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టును పరిశీలించి టెండర్ విలువను రూ.464 కోట్లుగా నిర్ణయించింది. దీంతో ప్రాజెక్ట్‌ను కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో ఆర్అండ్బీ నేషనల్ హైవే విభాగం అధికారులు చేపట్టనున్నారు. టెండర్ దక్కించుకోవటానికి అనేక కంపెనీలు పోటీలో నిలిచాయి. ఈ క్రమంలో ఎల్అండ్టీ సంస్థ రూ.362 కోట్లు, నవయుగ కంపెనీ రూ.352 కోట్లు, సోమా కంపెనీ రూ.282 కోట్లకు టెండర్లు దాఖలు చేశాయి. తక్కువకు కోట్ చేసిన సోమా కంపెనీకి టెండర్ కేటాయించారు. ఈ క్రమంలో తొలగింపు కార్యక్రమంతో ట్రాఫిక్‌కు అవాంతరం కలగకుండా కమిషనరేట్ పోలీసులు ట్రాఫిక్ మళ్లింపు మొదలుపెట్టారు. ఈ నెల ఏడోతేదీ నుంచి ట్రాఫిక్ మళ్లింపు అమలులోకి రానుంది. టెండరు ఖరారు నేపథ్యంలో ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సీఎం చంద్రబాబును కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.