నత్తనడకన సాగుతున్న కనకదుర్గ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు
ఒక రోజు పనులు పూర్తిస్థాయిలో జరిగితే.. వారం రోజులు ఆగిపోతాయి. మళ్లీ ప్రారంభమవుతాయి.. మరో రెండు, మూడు రోజుల్లోనే స్టాప్. ఇది కనకదుర్గ్గ ఫ్లైఓవర్ నిర్మాణ పనుల తీరు. మూడేళ్ల క్రితం ప్రారంభమైన ఈ ఫ్లైఓవర్ పనులు ఎప్పుటికీ పూర్తవుతాయో అర్థం కాని పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ పనులు నిరంతరాయంగా జరిగిన దాఖలాలు లేవు. ప్రభుత్వం, అధికార యంత్రాంగమే దీనికి కారణంగా కనిపిస్తోంది. నిర్మాణ పనులు జరుగుతున్న పలు ప్రదేశాల్లో తరచూ ఆంక్షలు పెడుతుండడంతో సక్రమంగా పనులు సాగడం లేదు. మరో వైపు సీఎం చంద్రబాబు వచ్చే మార్చినాటికి ఫ్లై ఓవర్ అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు ఆదేశాలిచ్చినా.. ఈ లెక్కన పనులు సాగితే మరో ఏడాదైనా నిర్మాణం పూర్తయ్యే అవకాశం లేదని ఇంజినీరింగ్ నిపుణులు చెబుతున్నారు.
సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రి వద్ద నిర్మిస్తున్న కనకదుర్గా ఫ్లైఓవర్‌కు అడుగడుగునా అడ్డంకులే ఎదురవుతున్నాయి. జాతీయ రహదారిపై నిర్మిస్తున్న ఈ వంతెన వేగవంతంగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం, అధికార యంత్రాంగమే సహకరించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
మార్చి నాటికి పూర్తి చేయాలని సీఎం ఆదేశం..
ఫ్లై ఓవర్ పనులు 2015 డిసెంబర్‌లో ప్రారంభమయ్యాయి. ఏడాదిలో పున్నమీఘాట్ నుంచి కార్పొరేషన్ కార్యాలయం వరకు పనులు పూర్తి చేయాలన్నది ప్రణాళిక. ముఖ్యమంత్రి చంద్రబాబే స్వయంగా ఈ ప్రాజెక్టు పనులను సమీక్షించేవారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 10 సార్లుకు పైగా డెడ్‌లైన్ నిర్ణయించారు. అయితే ఇప్పటికీ కేవలం 70 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. తాజాగా వచ్చే మార్చినాటికి పూర్తి చేయాలంటూ హుకుం జారీ చేశారు. ఆదేశాలెలా ఉన్నా.. ప్రస్తుత పరిస్థితి చూస్తే ప్రాజెక్టు ఇప్పట్లో పూర్తయ్యే పరిస్థితి లేదు. కనీసం మరో ఏడాదైనా పట్టే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
నిన్న బోటు రేసింగ్..నేడు ఎయిర్ షో..
ఫ్లైఓవర్ పనులు నెలల్లో 20 రోజులు కూడా సక్రమంగా జరగని పరిస్థితి కనిపిస్తోంది. గత రెండు, మూడు నెలల పనుల తీరును ఒకసారి పరిశీలిస్తే.. దసరా ఉత్సవాలని 10 రోజులు పనులకు కావాల్సిన వాహనాలను రాకపోకలు జరగకుండా అధికారులు అడ్డుకున్నారు. గత వారం ఎఫ్1హెచ్2ఓ రేస్ నిర్వహించారు. వీటిని చూడటానికి వందలాది మంది ప్రేక్షకులు తరలివస్తూ ఉండటంతో అక్కడ పనులు చేస్తే ఏ ప్రమాదం జరుగుతుందోనని ఆరేడు రోజులు పనులు జరగకుండా ఆపివేశారు. ఇప్పుడు ఎయిర్ షో పేరుతో మరో కొన్ని రోజులు పనులు నిలిచిపోతాయి. వచ్చే నెలల్లో భవానీదీక్షల విరమణ కార్యక్రమాలకు మరో పది రోజు లు ఫ్లై ఓవర్ పనులకు బ్రేక్ పడతాయి. ఈ విధంగా అడుగడుగునా పనులకు అడ్డంకులు ఎదురవుతూ ఉంటే పను లు ముందుకు సాగడం కష్టమేనని ఆర్‌అండ్‌బీ అధికారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
బరం పార్కులో కార్యక్రమాలు..
ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్తయ్యే వరకు బరం పార్కుకు భారీగా సందర్శకులు తరలి వచ్చే కార్యక్రమాలు నిర్వహించకుండా ఉంటే బాగుంటుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment