దుర్గగుడి ఫ్లైఓవర్ టెండర్ ఖరారు
రూ.282 కోట్లకు సోమా కంపెనీకి
ఏడాదిలో నిర్మాణం పూర్తి చేయాలని షరతు
ప్రారంభమైన ఇళ్ల తొలగింపు పనులు
ఫ్లైవోవర్ పొడవు 2.5 కిలోమీటర్లు
5.2 కిలోమీటర్ల రోడ్డు
నాలుగు లైన్లుగా విస్తరణ
విజయవాడ : విజయవాడలో ఎట్టకేలకు కనకదుర్గ ఫ్లైవోవర్ పనులు ప్రారంభమయ్యాయి. గురువారం ఫ్లైఓవర్ టెండర్లను ఆర్‌అండ్‌బీ నేషనల్ హైవేస్ విభాగం అధికారులు రూ.282 కోట్లకు సోమా కన్‌స్ట్రక్షన్ కంపెనీకి ఖరారు చేశారు. ఏడాది కాలవ్యవధిలో పనులు పూర్తి చేసేలా షరతు విధించారు. ఈ క్రమంలో గురువారం నుంచి ఫ్లైఓవర్, రహదారి విస్తరణకు వీలుగా రోడ్లపై ఉన్న ఆక్రమణలు, రోడ్డుకు ఇరువైపులా ఉన్న నిర్మాణాల తొలగింపు ప్రక్రియ మొదలుపెట్టారు. దీంతో ఫ్లైఓవర్ నిర్మాణ పనులు మొదలైనట్లు జిల్లా అధికార యంత్రాంగం ప్రకటించింది. మరోపక్క అధికారిక లాంఛనాలన్నీ పూర్తిచేసుకొని సోమా సంస్థ మరో 15 రోజుల్లో నిర్మాణ పనులు మొదలుపెట్టేలా కసరత్తు సాగిస్తోంది.
తొలగింపు పనులు మూడు రోజుల్లో పూర్తి...
భవానీపురం లారీ స్టాండ్ నుంచి రాజీవ్ గాంధీ పార్కు వరకు 2.5 కిలోమీటర్ల పొడవున ఆరులైన్లలో ఫ్లైఓవర్ నిర్మాణం, భవానీపురం లారీ స్టాండ్ నుంచి కనకదుర్గ వారధి వరకు 5.2 కిలోమీటర్ల పొడవున ఉన్న రహదారిని నాలుగులైన్లుగా విస్తరణ పనులు ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా జరగనున్నాయి. ఇళ్ల తొలగింపు, అండర్ గ్రౌండ్‌లో ఉన్న వాటర్ పైప్‌లైన్ల మార్పు, రోడ్లపై ఉన్న విగ్రహాల తొలగింపు తదితర కార్యక్రమాలు గురువారం మొదలుపెట్టారు. తొలగింపు కార్యక్రమాలన్నీ మరో మూడు రోజుల్లోగా పూర్తి చేయటానికి రెవెన్యూ శాఖ, నగరపాలక సంస్థ అధికారులు కసరత్తు చేస్తున్నారు. నగర కమిషనర్ వీరపాండియన్ విద్యాధరపురంలో ఉన్న హెడ్‌వాటర్ వర్క్స్‌ను పరిశీలించారు. మార్కింగ్ అయిన మేరకు వాటర్‌వర్క్స్ ప్రహరీగోడను తొలగించారు. రహదారి విస్తరణలో 65 నివాస గృహాలు పోతాయని అధికారులు నిర్ధారించి వారికి జక్కంపూడిలోని ప్లాట్లు కేటాయించనున్నారు. హెడ్ వాటర్ వర్క్స్ నుంచి రథం సెంటర్ వరకు ఉన్న 5 ఎంజీడీ, 16 ఎంజీడీ వాటర్ పైప్‌లైన్, కుమ్మరిపాలెం సెంటర్ నుంచి నాలుగు స్తంభాల సెంటర్ వరకు ఉన్న 8 ఎంజీడీ, 11 ఎంజీడీ వాటర్ పైప్‌లైన్లను కూడా విస్తరణ పనుల కోసం తొలగించనున్నారు. విస్తరణలో అశోక స్థూపం, మహాత్మాగాంధీ, పొట్టి శ్రీరాములు, ఇతర జాతీయ నేతల విగ్రహాలు తొలగించి వాటిని నగరపాలక సంస్థ స్వాధీనం చేసుకొని వేరే ప్రాంతంలో ప్రతిష్టించేలా నగరపాలక సంస్థ అధికారులు అన్ని చర్యలు తీసుకోనున్నారు.
టెండర్ దక్కింది ఇలా...
విజయవాడ ఆర్‌అండ్‌బీ నేషనల్ హైవే విభాగం అధికారులు నిర్మాణానికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేసి ఈ ఏడాది ప్రారంభంలో ప్రభుత్వానికి పంపారు. దీనిలో భాగంగా రూ.338 కోట్ల నిర్మాణ వ్యయంతో ప్రతిపాదనలు సిద్ధం చేయగా కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టును పరిశీలించి టెండర్ విలువను రూ.464 కోట్లుగా నిర్ణయించింది. దీంతో ప్రాజెక్ట్‌ను కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో ఆర్‌అండ్‌బీ నేషనల్ హైవే విభాగం అధికారులు చేపట్టనున్నారు. టెండర్ దక్కించుకోవటానికి అనేక కంపెనీలు పోటీలో నిలిచాయి. ఈ క్రమంలో ఎల్‌అండ్‌టీ సంస్థ రూ.362 కోట్లు, నవయుగ కంపెనీ రూ.352 కోట్లు, సోమా కంపెనీ రూ.282 కోట్లకు టెండర్లు దాఖలు చేశాయి. తక్కువకు కోట్ చేసిన సోమా కంపెనీకి టెండర్ కేటాయించారు. ఈ క్రమంలో తొలగింపు కార్యక్రమంతో ట్రాఫిక్‌కు అవాంతరం కలగకుండా కమిషనరేట్ పోలీసులు ట్రాఫిక్ మళ్లింపు మొదలుపెట్టారు. ఈ నెల ఏడోతేదీ నుంచి ట్రాఫిక్ మళ్లింపు అమలులోకి రానుంది. టెండరు ఖరారు నేపథ్యంలో ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సీఎం చంద్రబాబును కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.