
సాక్షి, అమరావతి: బెజవాడ వాసుల చిరకాల స్వప్నం తీరనుంది. నగరంలో నిర్మించిన కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభానికి సిద్ధమైంది. పెండింగ్‌లో ఉన్న కనకదుర్గ ఫ్లైఓవర్ పనులు పూర్తి అయ్యాయి. గురువారం మధ్యాహ్నం నుంచి 15వ తేదీ సాయంత్రం వరకూ ఫ్లైఓవర్ సామర్థ్యం పరీక్షలను అధికారులు నిర్వహించనున్నారు. ఫ్లైఓవర్ ‘లోడ్ టెస్ట్’ నిమిత్తం సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
కుమ్మరిపాలెం నుంచి వినాయక గుడి వరకు వాహన రాకపోకలపై ఆంక్షలు ఉంటాయని అధికారులు తెలిపారు. విజయవాడ వైపు వచ్చే భారీ వాహనాలు/ ఇతర వాహనాలు ఇబ్రహీంపట్నం-గొల్లపూడి-సితార సెంటర్-కబేలా-సీవీఆర్ ఫ్లై ఓవర్- ఇన్నర్ రింగ్రోడ్డు-పైపుల రోడ్ జంక్షన్- రామవరపడు రింగ్‌రోడ్డు మీదగా జాతీయ రహదారి 65కి మీదగా వెళ్లాలని నగర అదనపు సీపీ బత్తిన శ్రీనివాసులు తెలిపారు. హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలు కృష్ణలంక పోలీస్స్టేషన్- పోలీస్ కంట్రోల్ రూమ్- పంజా సెంటర్- చిట్టినగర్- సొరంగం- గొల్లపూడి - ఇబ్రహీంపట్నం మీదగా వెళ్లాలని పేర్కొన్నారు. 15వ తేదీ సాయంత్రం వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని, ప్రజలందరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
కనకదుర్గ ఫ్లైఓవర్ నిర్మాణం 98 శాతం పూర్తయిన నేపథ్యంలో ఈ నెల 20 తర్వాత ట్రయల్ రన్ నిర్వహించాలని ఇప్పటికే అధికారులు నిర్ణయించారు. అంతకు ముందుగా ‘లోడ్ టెస్ట్’ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా గురువారం మధ్యాహ్నం నుంచి 48 గంటల పాటు లోడ్ టెస్ట్‌ను కొనసాగించనున్నారు. 24 లారీల్లో ఇసుక/ కాంక్రీటును నింపుతారు. ఒక్కో లారీపై 28.5 టన్నుల చొప్పున మొత్తం 684 టన్నుల బరువును వంతెనపై స్పాన్ల మధ్య ఉంచుతారు. 48 గంటల తర్వాత ఏమైనా లోపాలు కనిపిస్తే సరిచేస్తారు. సమస్యలు లేవని నిర్ధారించుకున్నాక ఈనెల 20 తర్వాత ట్రయల్ రన్‌లో భాగంగా వాహనాలను అనుమతిస్తామని ఆర్ అండ్ బీ (క్వాలిటీ కంట్రోల్) సూపరింటెండింగ్ ఇంజినీర్ జాన్ మోషే తెలిపారు.