విజయవాడ– శ్రీశైలం మధ్య త్వరలో సీ ప్లేన్
ఈ నెల 9న ట్రయల్ రన్
తక్కువ సమయంలో శ్రీశైలం చేరుకునే అవకాశం
ద్వాదశ జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తిపీఠం కలగలసి వెలసిన మహా పుణ్యక్షేత్రం.. ఇల కైలాసం శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ, విదేశాల నుంచి అనేకమంది భక్తులు వస్తుంటారు. ఇప్పటి వరకు అటవీ ప్రాంతంలో ఘాట్ రోడ్డు మీద ప్రయాణం ప్రతి ఒక్కరికీ గొప్ప అనుభూతిని కలిగిస్తుంది. ఇక నుంచి భక్తులకు సరికొత్త మధురానుభూతిని కలిగించేందుకు ‘సీ ప్లేన్’ను పర్యాటక శాఖ అందుబాటులోకి తీసుకురానుంది. నీటిలో విమానం ఎక్కి.. నీటిలోనే దిగడం ఈ సీ ప్లేన్ ప్రత్యేక. అయితే, అవసరమైనప్పుడు నేలపై కూడా సీ ప్లేన్ ల్యాండ్ అవుతుంది. విజయవాడ–శ్రీశైలం మధ్య సీ ప్లేన్ నడిపేందుకు ఈ నెల 9వ తేదీన ట్రయల్ రన్ నిర్వహించనుంది.
తగ్గనున్న ప్రయాణ సమయం
విజయవాడ–శ్రీశైలం మధ్య రోడ్డు మార్గంలో సుమారు 270 కిలో మీటర్లు దూరం ఉంటుందని, సీ ప్లేన్‌లో సుమారు గంటన్నర సమయంలో చేరుకునే అవకాశం ఉంటుందని పర్యాటక శాఖ అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం 14 సీటింగ్, 19 సీటింగ్ కెపాసిటీ కలిగిన రెండు సీప్లేన్లు అందుబాటులో ఉన్నాయని, ట్రయల్ రన్ తర్వాత ఖర్చు, నిర్వహణ, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఎప్పటి నుంచి ప్రారంభించాలి, ఎన్ని సర్వీసులు నడపాలి, టికెట్ ఎంత వసూలు చేయాలనేది నిర్ణయిస్తామని అధికారులు తెలిపారు. తొలి దశలో విజయవాడ–శ్రీశైలం సీ ప్లేన్ విజయవంతమైతే హైదరాబాద్, బెంగళూరు తదితర నగరాల నుంచి కూడా నడిపేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
ఇదీ సీ ప్లేన్ ప్రణాళిక...
సీప్లేన్ టేకాఫ్, టేకాన్‌కు నీటిలో సుమారు 1.16 కిలో మీటర్ల పొడవు, 120 మీటర్ల వెడల్పు ఉండాలి. పర్యాటకులు సీ ప్లేన్ ఎక్కేందుకు, దిగేందుకు నీటిపై ప్రత్యేక జెట్టీలు అవసరం.
శ్రీశైలం డ్యామ్ బ్యాక్ వాటర్ వద్ద గల ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ సమీపంలో సీ ప్లేన్ ల్యాండ్ అయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
విజయవాడ పున్నమి ఘాట్ నుంచి బయలుదేరి శ్రీశైలం డ్యామ్ వెనుక భాగంలోని ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ సమీపంలో సీ ప్లేన్ దిగుతుంది. అక్కడి నుంచి బోటులో ప్రయాణించి పాతాళగంగకు చేరుకుంటారు.
పాతాళగంగ వద్ద ప్లాస్టిక్ జెట్టిపై ప్రయాణికులు దిగి రోప్‌వే ద్వారా పైకి వచ్చి శ్రీశైలం ఆలయానికి చేరుకుంటారు.
తిరుగు ప్రయాణంలో మళ్లీ సీ ప్లేన్ శ్రీశైలం డ్యామ్ వెనుక భాగంలోని ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ సమీపంలో బయలుదేరి విజయవాడ పున్నమి ఘాట్‌కు చేరుతుంది.
చదవండి: నా శివయ్యను దర్శనం చేసుకోనివ్వరా.. శ్రీకాళహస్తిలో అఘోరీ ఆత్మహత్యాయత్నం
Comments
Please login to add a commentAdd a comment