ఫ్లై ఓవర్‌పై రయ్ రయ్ మంటూ..
విజయవాడ ప్రజల చిరకాల స్వప్నం సాకారమైంది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కనకదుర్గ ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. 46 ఒంటి స్తంభాలపై 2.6 కిలోమీటర్ల మేర ఆరు వరుసలు, ఆరు మలుపులతో రూ.502 కోట్ల వ్యయంతో దీనిని నిర్మించారు. ఈ ఫ్లైఓవర్‌ను వర్చువల్ విధానంలో నాగపూర్ నుంచి కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి గడ్కరీ, తాడేపల్లి క్యాంప్ ఆఫీసు నుంచి సీఎం వైఎస్ జగన్ శుక్రవారం ప్రారంభించారు. దీంతో పాటు బెంజ్ సర్కిల్ మొదటి ఫ్లైఓవర్‌ను కూడా లాంఛనంగా ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అనంతరం కనకదుర్గ ఫ్లై ఓవర్‌పై వాహనదారులు తమ ప్రయాణాలను మొదలుపెట్టారు.
శుక్రవారం రాత్రి కనకదుర్గ ఫ్లైఓవర్‌పై వాహనాల రద్దీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రహదారుల కనెక్టివిటీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చేసిన మరిన్ని ప్రతిపాదనలకు త్వరగా ఆమోదం తెలపాలని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కోరారు. కేంద్ర రహదారుల నిధి నుంచి రావాల్సిన నిధులను త్వరగా ఇప్పించాలని, రాష్ట్రంలో పోర్టులకు రహదారుల కనెక్టివిటీ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. విజయవాడలో కొత్తగా నిర్మించిన కనకదుర్గ ఫ్లై ఓవర్, బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్ ప్రారంభం, రూ.15,592 కోట్ల విలువైన 61 హైవే ప్రాజెక్టులకు ఈ–శిలాఫలకాల ఆవిష్కరణ కార్యక్రమంలో శుక్రవారం ఆయన తాడేపల్లి క్యాంప్ ఆఫీసు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
వేగంగా రహదారుల నిర్మాణం
► ఈ ప్రభుత్వ హయాంలో జాతీయ రహదారుల నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ఇది మొత్తం జాతీయ రహదారుల రూపురేఖలనే మారుస్తోంది.
► 2013–14లో రోజుకు 12 కి.మీ మాత్రమే రహదారుల నిర్మాణం జరగ్గా, ఇప్పుడు ప్రతి రోజూ 30 కి.మీ రహదారుల నిర్మాణం జరుగుతోంది.
వినూత్న విధానంలో ప్రాజెక్టులు
► ప్రాజెక్టుల కోసం భిన్న మార్గాల్లో నిధులు సేకరించడంతో పాటు, టీఓటీ (టోల్–నిర్వహణ–బదిలీ) పద్ధతిలో ప్రాజెక్టులు చేపడుతున్నారు. టీఓటీ ప్రక్రియలో తొలుత 682 కి.మీ.కు సంబంధించి 30 ఏళ్లకు రూ.10 వేల కోట్ల ఆదాయం రావడం సంతోషకరం. అందులో ఆంధ్రప్రదేశ్‌లోనే 442 కి.మీ రహదారులు ఉన్నాయి.
► ప్రధాని నరేంద్ర మోదీ, మంత్రి నితిన్ గడ్కరీ దూరదృష్టితో దేశ వ్యాప్తంగా 7,800 కి.మీ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేలను దాదాపు రూ.3.3 లక్షల కోట్లతో చేపట్టారు. రహదారుల కనెక్టివిటీ వల్ల ఆర్థిక రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతుంది.
► గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేలలో రాష్ట్రంలో 375 కి.మీ పొడవైన 6 రహదారులు ఉండడం గమనించవలసిన విషయం. మీ (గడ్కరీ) హయాంలో 2,667 కి.మీ రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చడంతో, రాష్ట్రంలో జాతీయ రహదారులు 6,880 కిలోమీటర్లకు పెరిగాయి.
ఈ–శిలాఫలకాల ఆవిష్కరణ కార్యక్రమంలో తాడేపల్లి క్యాంప్ ఆఫీసు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
సంతోషకరం.. అభినందనీయం
► రాష్ట్రంలో ఇవాళ రూ.15,592 కోట్ల విలువైన 1,411 కి.మీ.కు సంబంధించి మొత్తం 61 ప్రాజెక్టులకు ఈ–శిలాఫలకాల ఆవిష్కరణ, వాటిని జాతికి అంకితం చేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది.
► గిరిజన ప్రాంతాల్లో నాలుగు లైన్ల రహదారి కనెక్టివిటీ కోసం ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను ఆమోదించినందుకు అభినందనలు. ముఖ్యంగా రాజమండ్రి – రంపచోడవరం – కొయ్యూరు – అరకు – బౌడారా – విజయనగరం రహదారి నిర్మాణం.
► తూర్పుగోదావరి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లోని సుదూర గిరిజన ప్రాంతాలను కలిపే దాదాపు 380 కి.మీ రెండు లైన్ల రహదారిని ఆమోదించినందుకు ధన్యవాదాలు.
► నాలుగు లైన్ల మైదుకూరు – బద్వేలు – నెల్లూరు, మదనపల్లి – పీలేరు – తిరుపతి, అనంతపురం – గుంటూరు, కర్నూలు – దోర్నాల, అనంతపురం – మైదుకూరు రహదారులను కూడా అడిగిన వెంటనే మంజూరు చేశారు.
► విజయవాడ బెంజి సర్కిల్ వద్ద పశ్చిమం వైపున మూడు లైన్ల ఫ్లైఓవర్‌కు సంబంధించి నేను వ్యక్తిగతంగా చేసిన విజ్ఞప్తిని మన్నించి మంజూరు చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
మరికొన్ని ప్రతిపాదనలు
► రాష్ట్రంలో రహదారుల కనెక్టివిటీకి సంబంధించి మరికొన్ని ప్రతిపాదనలను మీ ముందు ఉంచుతున్నాను. అవి రాష్ట్రానికి ఎంతో ముఖ్యమైన ప్రాజెక్టులు.
1. కేంద్ర రహదారుల నిధి (సీఆర్‌ఎఫ్) నుంచి 2014 నుంచి 2019 వరకు రూ.2,611 కోట్లు మంజూరు చేశారు. కానీ దురదృష్టవశాత్తు గత ఏడాది 2019–20లో ఏ నిధులూ విడుదల చేయలేదు. కాగా ఇప్పుడు రూ.680 కోట్ల తొలి దశ విడుదలకు సంబంధించి మంత్రిత్వ శాఖ సానుకూలంగా ఉందని, ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక చెప్పారు. రెండో దశకు సంబంధించి రూ.820 కోట్ల ప్రతిపాదనలను కూడా సమర్పించాం. కాబట్టి వాటిని విడుదల చేయాలి.
2. విజయవాడలో శరవేగంగా పెరుగుతున్న ట్రాఫిక్‌ను దృష్టిలో ఉంచుకుని బైపాస్ రహదారులు అవసరం. నగరానికి పశ్చిమం వైపు ఇప్పటికే మంజూరు కాగా, పనులు కూడా త్వరలోనే మొదలు కానున్నాయి. తూర్పు వైపునకు సంబంధించి గతంలో ప్రతిపాదించిన 189 కి.మీ.కు బదులు 78 కి.మీ రింగ్ రోడ్డు నిర్మాణం చేపట్టాల్సి ఉంది. అందులో భాగంగా ఎన్‌హెచ్–65, ఎన్‌హెచ్–16ను కలుపుతూ 52 కి.మీ మేర రహదారి నిర్మించాల్సి ఉంది. ఇందులో కృష్ణా నదిపై పెద్ద వంతెనను తొలి దశలో నిర్మించాల్సి ఉంది. దీని వల్ల మచిలీపట్నం పోర్టుకు కనెక్టివిటీ ఏర్పడుతుంది. ఆ రహదారిపై ట్రాఫిక్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి, దాని నిర్మాణం కూడా లాభదాయకంగానే ఉంటుంది. అందువల్ల భూసేకరణ భారం రాష్ట్ర ప్రభుత్వంపై మోపకుండా ఆ ప్రాజెక్టును మంజూరు చేయాలని కోరుతున్నాను.
3. వెనకబడిన రాయలసీమ జిల్లాల్లోని ప్రాంతాలకు కనెక్టివిటీ ఏర్పాటు చేసే బెంగుళూరు – విజయవాడ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేను భారత్‌మాల తొలి దశలోనే చేపట్టాలి. కొడికొండ చెక్‌పోస్టు, పులివెందుల, ముద్దనూరు, మీదుగా ఆ రహదారి నిర్మాణం జరుగుతుంది.
4. అనంతపురంలో రహదారి విస్తరణ, ఎన్‌హెచ్–42కు అనుసంధానం, నగరంలో ఆర్‌ఓబీతో సహా నాలుగు లైన్ల రహదారి కోసం 2020–21 జాతీయ రహదారుల వార్షిక ప్రణాళికలో ఇప్పటికే కేటాయించిన రూ.90 కోట్లతో పాటు అదనంగా రూ.220 కోట్లు మంజూరు చేయాలి.
5. ఉభయ గోదావరి జిల్లాలకు మంచి అనుసంధానంగా నిలిచే ఎన్‌హెచ్–216పై నరసాపురం బైపాస్ నిర్మాణంలో భాగంగా వశిష్ట గోదావరిపై వంతెన నిర్మించాల్సి ఉంది.
6. ఎన్‌హెచ్–67లో భాగంగా కావలి, ఉదయగిరి, సీతారామపురం మధ్య ఉన్న రెండు లైన్ల రహదారిని అభివృద్ధి చేయాలి. ఇందుకోసం దాదాపు రూ.450 కోట్లు వ్యయం అవుతాయని అంచనా. 2020–21 జాతీయ రహదారుల వార్షిక ప్రణాళికలో ఆ మేరకు అదనంగా నిధులు మంజూరు చేయాల్సి ఉంది. ఈ రహదారి వల్ల నెల్లూరు, వైఎస్సార్ కడప, ప్రకాశం, చిత్తూరు జిల్లాల మధ్య కనెక్టివిటీ ఏర్పడుతుంది.
7. రాష్ట్రంలోని ఐదు ప్రధాన పోర్టులను జాతీయ రహదారులకు అనుసంధానించే విధంగా 400 కి.మీ. పొడవైన 25 రహదారుల నిర్మాణం చేపట్టాలి. వాటి నిర్మాణం వల్ల పోర్టులకు, పారిశ్రామిక రంగానికి అనుసంధానం ఏర్పడుతుంది. దీని వల్ల ఆర్థికంగా కూడా అభివృద్ది చెందవచ్చు.
8. విశాఖపట్నం నుంచి విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వరకు బీచ్ రోడ్డు అభివృద్ధి చేయాలి. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా అభివృద్ధి చేస్తున్న నేపథ్యంలో ఈ రహదారి నిర్మాణం ఎంతో అవసరం.
రాష్ట్రాన్ని సందర్శించండి
► రాష్ట్రంపై మీరు మమకారం చూపుతున్నందుకు, ప్రాజెక్టులను మంజూరు చేస్తున్నందుకు మనసారా ధన్యవాదాలు. వీలైనంత త్వరగా ఆయా ప్రాజెక్టులు చేపట్టి, సకాలంలో పూర్తి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహయ, సహకారాలు అందజేస్తుంది.
► స్థానికంగా ఎదురయ్యే సమస్యల పరిష్కారంతో పాటు, భూసేకరణలో కూడా నిరంతరం మీకు తోడుగా నిలుస్తాం. రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రాజెక్టులను పరిశీలించడానికి ఒకసారి ఇక్కడికి రావాలని కోరుతున్నా.
Comments
Please login to add a commentAdd a comment