
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి కన్నబాబు
సాక్షి, రాజమహేంద్రవరం: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయాల సాధన దిశగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలన సాగుతోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. ఆయన మంగళవారం సాయంత్రం రాజమహేంద్రవరంలోని రివర్ బే హోటల్‌లోని మినీకాన్ఫరెన్స్ హాల్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బాబాసాహెబ్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని అమోదించి నేటికి 70 సంవత్సరాలు అయిన సందర్భంగా ముందుగా ఆయనకు మంత్రి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబునాయుడుకు రాజ్యాంగానికి తూట్లు పొడిచారని, ఆయనకు రాజ్యాంగ స్ఫూర్తిపై మాట్లాడే నైతికత లేదన్నారు. గడిచిన ఆర్నెల్లలో 1.40 లక్షల ఉద్యోగాలను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చారని మంత్రి కన్నబాబు పేర్కొన్నారు.
అందులో కనీసం పదిశాతం ఉద్యోగాలనైనా తన ఐదేళ్ల పాలనలో చంద్రబాబు ఇవ్వలేదన్నారు. అమెరికాలో పుట్టి ఉంటే బాగుండును, దళితులుగా ఎవ్వరైనా పుట్టాలనుకుంటారా అని చెప్పిన చంద్రబాబు ఏ ముఖం పెట్టుకుని రాజ్యాంగం గురించి మాట్లాడతారని ప్రశ్నించారు. పుట్టిన రోజుకు, వర్ధంతికి తేడా తెలియన లోకేష్ ఇంట్లో కూర్చుని రాజ్యాంగం గురించి ట్వీట్ చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఉల్లి ధరలు దేశవ్యాప్తంగా పెరిగితే ఒక్క మన రాష్ట్రంలోనే పెరిగినట్టు గగ్గోలు పెట్టడం చంద్రబాబుకి, లోకేష్‌కే చెల్లిందన్నారు. ‘లోకేష్‌ను సూటిగా అడుగుతున్నా.. మీ హెరిటేజ్‌లో ఉల్లి రేటు ఎంత ఉందో చెబుతావా? ఎంతకు కొని వినియోగదారులకు ఎంతకి అమ్ముతున్నారో చెప్పగలవా?’ అన్నారు. ఉల్లి ధరలు పెరిగితే వాటిని ప్రజలకు అందించటానికి రైతు బజార్లులో కేజీ రూ. 25 విక్రయించడం కనబడటం లేదా అని అడిగారు.
అమరావతిలో రాజధానిని నిర్మించినట్టు, దానిని మేము పాడు చేస్తున్నట్టు మాట్లాడడం విచిత్రంగా ఉందన్నారు. అసలు అమరావతిలో రాజధాని ఎక్కడ ఉందని, అక్కడ ఉన్నదంతా గ్రాఫిక్స్ కదా అని వ్యాఖ్యానించారు. అమరావతిలో నాలుగు బిల్డింగ్స్ కట్టి 7 వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారన్నారు. మద్యంపై ఒక స్టాండ్ లేకుండా చంద్రబాబు అండ్ కో మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. కాపు కార్పొరేషన్ చైర్మన్, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, వైఎస్సార్ సీపీ రాజమహేంద్రవరం సిటీ, రూరల్ కో ఆర్డినేటర్లు శ్రిఘాకోళ్లపు శివరామ సుబ్రహ్మణ్యం, ఆకుల వీర్రాజు, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ రావు, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శులు పాపారాయుడు, మిందే నాగేంద్ర పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment