రావికమతం /దేవరాపల్లి, న్యూస్‌లైన్: ప్రజారోగ్యం ప్రమాదకర స్థితిలో పడింది. వాతావరణంలో మార్పులతో వ్యాధులు కమ్ముకుం టున్నాయి. జలకాలుష్యం పుణ్యమా అని విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. వందలాది మంది మంచానపడి లేవలేని స్థితిలో అల్లాడిపోతున్నారు. గ్రామాల్లో కొరవడిన పారిశుద్ధ్యం, ఇళ్ల సమీపంలోనే పశువుల శాలలు, కలుషిత తాగునీటి కారణంగా పరిస్థితి అదుపు తప్పుతోంది. రావికమతం మండలం కన్నంపేట గ్రా మాన్ని పక్షం రోజులుగా పీడిస్తున్న జ్వరాలు మరొకరిని బలిగొన్నాయి.
నాగులాపల్లి బాబూరావు(33) వారం రో జులుగా జ్వరంతో బాధపడుతూ శుక్రవారం చనిపోయాడు. వారం రోజుల క్రితం ఇదే లక్షణాలతో దంట్ల శివలక్ష్మి(25), ఉలంపర్తి లోవరాజు(55) మృతి చెందిన సంగతి తెలిసిందే. నాటి నుంచి గ్రామంలో కొత్తకోట వైద్యాధికారి నరేంద్రకుమార్ మూడు సార్లు వైద్యశిబిరాలు ఏర్పాటు చేసి సేవలు అం దిస్తున్నా మాయదారి జ్వరాలు అదుపులోకి రావడం లేదు. తీవ్ర జ్వరంతో అల్లాడిపోతున్న బాబూరావును మూడు రోజుల క్రితం నర్సీపట్నంలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు పరిస్థితి విషమంగా ఉండటంతో విశాఖ మణిపాల్‌లో చేర్చారు. అక్కడి నుంచి కేజీహెచ్‌కు తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతిచెందాడు.
గ్రామంలో ఇంకా 30 మందికి పైగా జ్వర పీడితులున్నారు. ఏ ఇంటిలో చూసినా జ్వరం, తలనొప్పితో మంచానపడి మూలుగుతున్నవారే కన్పిస్తున్నారు. ఒక్కో ఇంటిలోనివారంతా జ్వరాల బారిన పడటంతో ఒకరికొకరు సాయం చేసుకోలేని దుస్థితి. విశాఖ వైద్యులతో మెగా వైద్యశిబిరం నిర్వహించాలని సర్పంచ్ దంట్ల అరుణ కోరారు. కాగా దేవరాపల్లి మండలం గరిసింగి పంచాయతీ శివారు సంతపాలెంలో డయేరియా విజృంభించింది.
వాంతులు, విరోచనాలతో ఇరటా గంగులు(50) శుక్రవారం మృతిచెందాడు. మరో పదిమంది అస్వస్థతతో దేవరాపల్లి, కె.కోటపాడు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాదల మరిడమ్మ , వాకపల్లి దేముడమ్మ , కాదల దేముడు, అతని భార్య ఈశ్వరమ్మతో పాటు మరి కొందరు డయేరియా బారినపడ్డారు. పరిస్థితి తీవ్రంగా ఉండటంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. దేవరాపల్లి పీహెచ్‌సీ వైద్యాధికారి జె.పద్మజ, ఏఎన్‌ఎం ఆర్.దేముడమ్మ గ్రామంలో వైద్యశిబిరం ఏర్పాటుచేసి రోగులకు సేవలు అందిస్తున్నారు.
వ్యాధుల విజృంభణ
Published Sat, Sep 7 2013 4:03 AM | Last Updated on Wed, Jun 13 2018 8:02 PM
Advertisement
Advertisement