► జాట్ల రిజర్వేషన్‌పై స్టేను స్వాగతిస్తున్నాం
► రాష్ట్రంలో కాపులతో అధికార పార్టీ ఓట్ల రాజకీయం
► బీసీ మహాజన సమితి నాయకుడు వై.కోటేశ్వరరావు
గుంటూరు వెస్ట్ : కాపులను బీసీల్లో చేరుస్తామని టీడీపీ ప్రభుత్వం మభ్యపెడుతోందని బీసీ మహాజన సమితి నాయకుడు, సీనియర్ న్యాయవాది వై.కోటేశ్వరరావు(వైకే) శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. జాట్‌లు, మరో 5 కులాలను ఓబీసీ జాబితాలో చేర్చి 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ హర్యానా ప్రభుత్వం గత మార్చిలో ఆమోదించిన చట్టం అమలుపై పంజాబ్, హర్యానా హైకోర్టు డివిజన్ బెంచి స్టే (నిలుపుదల) ఉత్తర్వులు జారీ చేయడం స్వాగతించదగ్గ విషయమని పేర్కొన్నారు. జస్టిస్ కేసీ గుప్తా కమిషన్ నివేదిక ప్రాతిపదికన ఆ కులాలకు 10 శాతం రిజర్వేషన్లు విద్య, ఉద్యోగ రంగాల్లో కల్పించిన విధానం రాజ్యాంగబద్ధంకాదని ప్రకటించాలని దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు మధ్యంతర స్టే ఉత్తర్వులను జారీ చేసింది.
గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి రిజర్వేషన్ చట్టాన్నే రూపొందించగా సుప్రీంకోర్టు 2015 మార్చిలో రామ్‌సింగ్ కేసులో కొట్టివేసింది. జాట్లు సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతుల కిందకు రారని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 340 ప్రకారం సాంఘికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులకే బీసీ రిజర్వేషన్లు వర్తిస్తాయి. ఆ విధంగా చూసినప్పుడు ఏపీలో కాపుల్ని బీసీల్లో చేరుస్తామని అధికార పార్టీ ఓట్ల రాజకీయం చేస్తున్నట్లు స్పష్టమవుతోందని వైకే తెలిపారు.