government tdp
-
అక్షరాగ్రహం
తిరుపతిలో కదం తొక్కిన జర్నలిస్టులు పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు వేయొద్దని నిరసన చిత్తూరు, పుంగనూరు ప్రాంతాల్లో భగ్గుమన్న వైఎస్ఆర్సీపీ 28 మండలాల్లో ఆందోళనలు తిరుపతి: సాక్షి టీవీ ప్రసారాల నిలిపివేతకు నిరసనగా జర్నలిస్టులు కదం తొక్కారు. మీడియా గొంతు నొక్కే క్రమంలో టీడీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజాస్వామిక చర్యలపై ధ్వజమెత్తారు. నిలిపివేసిన సాక్షి, నెంబర్ వన్ టీవీ ప్రసారాలను పునరుద్ధరించాలని హితవు పలికారు. జిల్లా వ్యాప్తంగా ఆదివారం జర్నలిస్టులు, వైఎస్సార్సీపీ, వామపక్ష, అఖిలపక్ష పార్టీల నాయకులు రోడ్డు మీదకొచ్చి సర్కారు తీరుపై నిరసన తెలియజేశారు. ర్యాలీలు, మానవహారాలు నిర్వహించి అంబేడ్కర్, మహాత్మాగాంధీ విగ్రహాలకు వినతిపత్రాలు అందజేశారు. 28 మండలాల్లో ప్రతిపక్ష, వామపక్ష పార్టీలు ఒక్కటై పత్రికా స్వేచ్ఛ కోసం గొంతెత్తి నినదించాయి. తిరుపతిలో భగ్గుమన్న జర్నలిస్టులు తిరుపతి ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 11 గంటలకు జర్నలిస్టులు నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్రెస్‌క్లబ్ నుంచి నాలుగు కాళ్లమండపం మీదుగా బస్టాండ్ వరకూ ర్యాలీ సాగింది. జర్నలిస్టు సంఘాల నాయకులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు ర్యాలీలో పాల్గొని పెద్దఎత్తున నినాదాలు చేశారు. అనంతరం బాపూజీ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. చిత్తూరులో వైఎస్సార్సీపీ నగర కన్వీనర్ లాయర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. బీజేపీ, వామపక్ష పార్టీల నాయకులు కూడా ఇందులో పాల్గొన్నారు. గాంధీబొమ్మ సెంటర్లో భారీ మాన వహారం నిర్వహించి ఆపైన మహాత్మునికి వినతిపత్రం అందజేశారు. సాయంత్రం వైఎస్సార్సీపీ మహిళావిభాగం జిల్లా అధ్యక్షురాలు గాయత్రీదేవి ఆధ్వర్యంలో పార్టీ సానుభూతిపరులు, మహిళలు నగర వీధుల్లో కొవొత్తులతో నిరసన ర్యాలీ నిర్వహించారు. సాక్షి ప్రసారాలను పునరుద్ధరించాలని ఆమె డిమాండ్ చేశారు. తిరుపతి ఎస్వీయూలో అఖిల పక్ష విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన ప్రదర్శన జరిగింది. విద్యార్థులు నోటికి నల్లరిబ్బను కట్టుకుని మౌనంగా నిరసన తెలిపారు.మదనపల్లి అంబేడ్కర్ సర్కిల్లో వైఎస్ఆర్సీపీ, అంబేడ్కర్ సేన, మాలమహానాడు, ఎంఆర్పీఎస్ నాయకులు నిరసన తెలిపారు.}M>-âహస్తి ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు బిక్షాల గోపురం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించి, సూపర్‌బజార్ దగ్గర మానవహారం నిర్వహించారు. గాంధీజీ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చారు.సత్యవేడు నియోజకవర్గంలోని నాగలాపురం, పిచ్చాటూరు మండలాల్లో వైఎస్ఆర్సీపీ నాయకులు, జర్నలిస్టులు నిరసన ర్యాలీ నిర్వహించారు. పలమనేరులో సీపీఎం, సీపీఐ, వైఎస్సార్సీపీ నాయకులు అంబేడ్కర్ విగ్రహం దగ్గర నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ దమనకాండను దుయ్యబట్టారు. పీలేరు నియోజకవర్గంలోని కలికిరి, గుర్రంకొండ, కలకడ, కేవీ పల్లి మండలాల్లోనూ నిరసన ర్యాలీలు కొనసాగాయి. పుంగనూరు నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో, పూతల పట్టు, గంగాధరనెల్లూరు నియోజకవర్గాల్లోని తవణంపల్లి, పెనుమూరు, వెదురుకుప్పం, కార్వేటినగరం, పాలసముద్రంతో పాటు కురబలకోట, తంబళ్లపల్లి, పెద్ద తిప్పసముద్రం మండలాల్లో జర్నలిస్టులు, వివిధ పార్టీల నాయకులు ప్రభుత్వ వైఖరిపై నిరసన వ్యక్తంచేశారు. -
కాపులను మభ్యపెడుతున్న ప్రభుత్వం
► జాట్ల రిజర్వేషన్‌పై స్టేను స్వాగతిస్తున్నాం ► రాష్ట్రంలో కాపులతో అధికార పార్టీ ఓట్ల రాజకీయం ► బీసీ మహాజన సమితి నాయకుడు వై.కోటేశ్వరరావు గుంటూరు వెస్ట్ : కాపులను బీసీల్లో చేరుస్తామని టీడీపీ ప్రభుత్వం మభ్యపెడుతోందని బీసీ మహాజన సమితి నాయకుడు, సీనియర్ న్యాయవాది వై.కోటేశ్వరరావు(వైకే) శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. జాట్లు, మరో 5 కులాలను ఓబీసీ జాబితాలో చేర్చి 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ హర్యానా ప్రభుత్వం గత మార్చిలో ఆమోదించిన చట్టం అమలుపై పంజాబ్, హర్యానా హైకోర్టు డివిజన్ బెంచి స్టే (నిలుపుదల) ఉత్తర్వులు జారీ చేయడం స్వాగతించదగ్గ విషయమని పేర్కొన్నారు. జస్టిస్ కేసీ గుప్తా కమిషన్ నివేదిక ప్రాతిపదికన ఆ కులాలకు 10 శాతం రిజర్వేషన్లు విద్య, ఉద్యోగ రంగాల్లో కల్పించిన విధానం రాజ్యాంగబద్ధంకాదని ప్రకటించాలని దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు మధ్యంతర స్టే ఉత్తర్వులను జారీ చేసింది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి రిజర్వేషన్ చట్టాన్నే రూపొందించగా సుప్రీంకోర్టు 2015 మార్చిలో రామ్‌సింగ్ కేసులో కొట్టివేసింది. జాట్లు సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతుల కిందకు రారని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 340 ప్రకారం సాంఘికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులకే బీసీ రిజర్వేషన్లు వర్తిస్తాయి. ఆ విధంగా చూసినప్పుడు ఏపీలో కాపుల్ని బీసీల్లో చేరుస్తామని అధికార పార్టీ ఓట్ల రాజకీయం చేస్తున్నట్లు స్పష్టమవుతోందని వైకే తెలిపారు. -
జేఎన్టీయూ ఏర్పాటు చేయాల్సిందే..
లేదంటే ఉద్యమిస్తాం పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి నరసరావుపేట : మండలంలోని కాకాని వద్ద కాకినాడ జవహల్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (జేఎన్టీయూ) ఇంజినీరింగ్ కళాశాలను ఏర్పాటు చేయకపోతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మాజీ ముఖ్యమంత్రులు కాసు బ్రహ్మానందరెడ్డి, టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి వేడుకల్లో పాల్గొనేందుకు శుక్రవారం నరసరావుపేటకు వచ్చిన ఆయన పీసీసీ క్రమశిక్షణ సంఘ చైర్మన్, మాజీ మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి సూచన మేరకు జేఎన్టీయూకు కేటాయించిన స్థలాన్ని పరిశీలించి విలేకర్లతో మాట్లాడారు. గత ప్రభుత్వం రూ.50 కోట్ల విలువైన 87 ఎకరాల స్థలాన్ని జేఎన్టీయూకు కేటాయిస్తూ జీవో జారీ చేసిందన్నారు. అయితే ఇదే స్థలాన్ని పారిశ్రామిక వాడ కోసం ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం నల్ల జీవో ఇచ్చిందని, దానిని వెంటనే రద్దు చేయాలని కోరారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. జేఎన్టీయూపై చంద్రబాబు హామీ ఇచ్చిన మూడు నెలలకే..ఏపీఐఐసీకి అప్పగించడం దారుణమన్నారు. పారిశ్రామిక వాడల పేరుతో ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెగబడుతుందని విమర్శించారు. ఆయన వెంట డీసీసీ అధ్యక్షుడు మక్కెన మల్లికార్జున రావు స్థానిక నాయకులు ఉన్నారు. -
ఎస్పీఎం కార్మికుల కన్నీళ్లు తుడువరా..?
► ఆ బాధ్యత మీది కాదా? ► స్వార్థ ప్రయోజనాలకే కాళేశ్వరం ప్రాజెక్టుకు శ్రీకారం ► మాజీ ఎమ్మెల్యే, సీపీఐ నాయకుడు గుండా మల్లేశ్ కాగజ్‌నగర్‌రూరల్ : కాగజ్‌నగర్‌లోని సిర్పూర్ పేపర్ మిల్లు కార్మికుల కన్నీరు తుడిచే బాధ్యత మీది కాదా అని సీపీఐ సీనియర్ నాయకులు, బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేశ్ ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. శుక్రవారం స్థానిక ఆర్అండ్బీ అతిథిగృహంలో నిర్వహించిన విలేకరుల సమావే శంలో ఆయన మాట్లాడారు. కాగజ్‌నగర్‌లోని సర్‌సిల్క్ మిల్లు 1984లో టీడీపీ ప్రభుత్వ హయాంలో మూతపడగా, సిర్పూర్ పేపర్ మిల్లు 2014లో టీఆర్ఎస్ హయాంలో మూతపడిందన్నారు. దీంతో కార్మికులు అన్నమో రామచంద్రా అంటూ... కాలం గడుపుతున్నా కేసీఆర్‌కు తెలియకపోవడం విడ్డూరమన్నారు. అతిచిన్న నేరాలకు జైళ్లకు పంపుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఎస్పీఎం మిల్లు మూతకు మూలకారకులైన బిర్లా యాజమాన్యం(పోదార్)పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. మిల్లు పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం పలుసార్లు సమావేశాలు ఏర్పాటు చేస్తే బిర్లా యాజమాన్యం కంటి తుడుపుగా కేవలం ఒకసారి మాత్రమే హాజరై ఢిల్లీలో మాకాం వేసిందన్నారు. బిర్లా యాజమాన్యంపై చర్యలు తీసుకోవడంతో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. కింగ్‌ఫిషర్ యాజమాని విజయ మాల్య వేల కోట్ల రూపాయలు ఎగవేసి విదేశాల్లో దాక్కున్నట్లుగా బిర్లా యాజమాన్యం కూడా ఎస్పీఎంపై రూ.420కోట్లు బ్యాంకులకు ఎగనామం పెట్టి ఢిల్లీలో తలదాచుకున్న చర్యలు తీసుకోవడంలో కేసీఆర్ ఎందుకు వెనకంజ వేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. ఈ నెల 6న కార్మిక కుటుంబాలు కేసీఆర్ ను కలిసేందుకు వెళ్తుతున్న సంగతి తెలిసిందే. కేసీఆర్ సీఎం అయ్యాక మూతపడిన పరిశ్రమలలో ఎస్పీఎం మొదటిదన్నారు. అధికారంలోకి వచ్చిన మూడు మాసాల్లోనే మిల్లును తెరిపిస్తామని హామీ ఇచ్చిన సీఎం తర్వాత గాలికి వదిలేయడటం అన్యాయమన్నారు. ఇంతవరకు 20మంది ఎస్పీఎం కార్మికులు ఆత్మహత్య చేసుకున్నా ప్రజాప్రతినిధులు కనికరించలేదన్నారు. కార్మికశాఖ, హోంశాఖ మంత్రిగా ఉన్న నాయిని నర్సింహారెడ్డి ఎస్పీఎం కార్మిక సంఘం అధ్యక్షుడిగా కొనసాగుతూ గత 20 మాసాల్లో ఒక్కసారి కూడా ఎస్పీఎం కార్మికుల బతుకులపై స్పందించపోవడం శోచనీయమన్నారు. దీంతో సీఎం, కార్మికశాఖ మంత్రులకు కార్మికులపై ఎంత అభిమానం ఉందో తేటతెల్లమవుతుందన్నారు. కేసీఆర్ పచ్చి స్వార్థపరుడు ముఖ్యమంత్రి పచ్చి స్వార్థపరులని గుండా మల్లేశ్ ఉదాహరించారు. సిద్దిపేట, తదితర తమ నియోజక వర్గాల అభివృద్ధికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారే తప్ప ఇతర నియోజకవర్గాలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అసెంబ్లీలో ఇచ్చిన పవర్పారుుంట్ ప్రెజెంటేషన్ నటనతో ఈ విషయం బయటపడిందన్నారు. ప్రాణహిత-చేవేళ ్ల ప్రాజెక్టును రద్దుతో ఆయన నైజం తెలిసిందన్నారు. 152 మీటర్ల ఎత్తు ఉన్న తుమ్మిడిహెట్టి బ్యారేజీని 148 మీటర్ల ఎత్తుకు తగ్గించి మహారాష్ట్ర ప్రభుత్వంలో ఒప్పందం చేసుకోవడంలో మతలబు ఏమిటో ప్రజలకు చెప్పాలన్నారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి సత్యనారాయణ, సీపీఐ కార్యదర్శి అంబాల ఓదెలు, నాయకులు మల్లయ్య, శంకర్ పాల్గొన్నారు. -
ఆ రెండు నెలల వేతనం మాటేంటి?
విజయనగరం మున్సిపాలిటీ :బాబు వస్తేనే జాబు వస్తుందంటూ ఎన్నికలకు ముందు ప్రకటనలు చేసి.. నిరుద్యోగ యువతను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన టీడీపీ సర్కారు తీరుపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కొత్త ఉద్యోగాలు కల్పించే మాట ఎటూలేకపోగా.. ఉన్న ఉద్యోగాల్లో తమ వారిని నియమించుకునేందుకు అన్యాయంగా వ్యవహరిస్తోంది. ఇటీవల కాలంలో జిల్లా వ్యాప్తంగా ఉపాధి హమీ పథకంలో విధులు నిర్వహిస్తున్న 314 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను పని తీరు ప్రామాణికం పేరుతో అన్యాయంగా తొలగించేశారు. గత నెలాఖరునే ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. అయితే జూన్ నెల నుంచే వారిని నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. రెండు నెలల పాటు వారి నిర్వహించిన విధులకు ఎటువంటి వేతనాలూ ఇవ్వకుండా శ్రమదోపిడీకి పాల్పడ్డారని బాధిత ఫీల్డ్ అసిస్టెంట్లు వాపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా 920 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిలో ఉపాధి పనులను పర్యవేక్షించేందుకు 870 మందిని ఫీల్డ్ అసిస్టెంట్లుగా నియమించారు. వీరిలో ఎవరైతే 2014 జూలై 1వ తేదీ నుంచి 2015 సంవత్సరం జూన్ 30వ తేదీ వరకు ఐదు వేల పనిదినాలు కన్నా తక్కువ పని కల్పించటం, వేతనదారులకు కేటాయించిన బడ్జెట్‌ను 75 శాతం వినియోగించని వారిపై వేటు వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా జిల్లాలో 314 మంది సిబ్బందిపై వేటు విధించారు. ఈ మేరకు గత నెల 25న సంబందిత ఫైల్‌పై కలెక్టర్ ఆమోదముద్ర వేశారు. ఈ నెల మొదటి వారంలో తొలగింపు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే తొలగింపు ఉత్తర్వుల్లో మాత్రం.. ‘మీ నియామక కాంట్రాక్ట్ ఈ ఏడాది జూన్ 30తో ముగిసింది... జూలై 1 నుంచి మీ సేవలు అవసరం లేదం’టూ పేర్కొనటం పట్ల బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము ఆగస్టు చివరి వారం వరకు విధులు నిర్వహించామని, జూన్ నెలలో తొలగించినట్లు ఉత్తర్వులు జారీ చేస్తే రెండు నెలల వేతనాలు సంగతేంటని వారు వాపోతున్నారు. ఒక్కో ఫీల్డ్ అసిస్టెంట్‌కు నెలకు సరాసరిన రూ.6వేల వరకు వేతనం పొందుతుండగా.. ఈ లెక్కన రెండు నెలల్లో 314 మందికి రూ.37లక్షల 68వేల మొత్తాన్ని నష్టపోవాల్సి ఉంటుంది. ఉన్న ఉద్యోగాన్ని ఎలానూ నిబంధనల పేరుతో తొలగించిన ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం రెండు నెలల విధి నిర్వహణకు వేతనాలు మంజూరు చేయాలని కోరుతున్నారు. ఉన్నతాధికారులకు నివేదిస్తాం.. : డ్వామా పీడీ ప్రశాంతి ఇదే విషయంపై డ్వామా పీడీ ప్రశాంతి వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా... వాస్తవానికి ప్రతి ఏడాది జూన్ నెలలో ఫీల్డ్ అసిస్టెంట్ల నియామక కాంట్రాక్ట్‌ను రెన్యువల్ చేయటం జరుగుతుందని, ఈ ఏడాది ప్రభుత్వం ఆదేశాలతో పనితీరు సరిగ్గాలేని 314 మంది కి రెన్యువల్ నిలిపివేశామని తెలిపారు. వారు ఆగస్టు వరకు చేసిన రెండు నెలల పనికి సంబంధించి ఉన్నతాధికారులకు నివేదిస్తామని, వారి ఆదేశాలనుసారం తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. -
అసమ్మతి సెగ...అధినేత పొగ
- గంటా తీరుపై సీఎం అసంతృప్తి - సర్వే ఫలితాలే సంకేతం - పెరుగుతున్న వైఫల్యాల చిట్టా - మంత్రి శిబిరంలో మొదలైన గుబులు సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: మంత్రి గంటా శ్రీనివాసరావు చాపకిందకునీళ్లు వస్తున్నాయా!?... ఇన్నాళ్లు జిల్లాలో వైరివర్గాల పోరుతోనే సతమతమవుతున్న ఆయనపై అధినేత చంద్రబాబు గుర్రుగా ఉన్నారా!?... టీడీపీలో తాజా పరిణామాలు అవుననే సంకేతమిస్తున్నాయి. ఇంటా బయటా ఆయన రాజకీయంగా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. తాజాగా ప్రభుత్వం నిర్వహించినట్లుగా చెబుతున్న సర్వేలో గంటాకు ప్రతికూల ఫలితాలు వచ్చాయన్న సమాచారం టీడీపీలో హాట్‌టాపిక్‌గా మారింది. ‘గంటా పని అయిపోయిం ది’అని నగరానికి చెందిన ఓ ఎమ్మెల్యే వ్యా ఖ్యానించారని టీడీపీవర్గాలు చెబుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. త్వరలో మంత్రివర్గ పునర్వ్వస్థీకరణ ఉండొచ్చనే సంకేతాల నేపథ్యంలో తాజా పరిణామాలు గంటా వర్గంలో గుబులు మొదలైంది. ఇంటా బయటా గడ్డు పరిస్థితి: జిల్లాలో మంత్రి అయ్యన్నవర్గంతో గంటాకస నిత్య కలహమే. అయ్యన్న వర్గానికి బాలకృష్ణ, సీఎం కుమారుడు లోకేష్ మద్దతు ఉందన్న ప్రచారం గంటాను కలవరపరుస్తోంది. మరోవైపు గంటా వ్యవహార శైలిపట్ల సీఎం చంద్రబాబు కొంతకాలంగా గుర్రుగా ఉన్నారని తెలుస్తోంది. కీలకమైన వ్యవహారాల్లో గంటా స్వతంత్రంగా వ్యవహరించడం చంద్రబాబుకు ఆగ్రహం తెప్పించినట్లు సమాచారం. తెలంగాణా ప్రభుత్వంతో వివాదాలను రాష్ట్రానికి అనుకూలంగా పరిష్కరించడంలో గంటా తగిన చొరవ చూపించలేదన్న ముద్ర పడింది. ఉన్నత విద్యామండలి, ఎంసెట్, తాజాగా అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం... ఇలా విద్యా శాఖకు సంబంధించిన అన్ని వ్యవహారాల్లోనూ రాష్ట్రం మాట చెల్లుబాటు కావడం లేదు. శాఖపై గంటా పట్టుసాధించలేకపోయారని సీఎం భావిస్తున్నారు. మరోవైపు కౌన్సెలింగ్‌తో నిమిత్తం లేకుండా నేరుగా ఉపాధ్యాయుల బదిలీలు చేస్తామని ప్రకటించడం తీవ్ర వివాదాస్పదమైంది. దీనిపై ఉపాధ్యాయసంఘాలు ఆందోళన చేశాయి. చివరికి సీఎం జోక్యం చేసుకుని కౌన్సెలింగ్ ద్వారానే బదిలీలు చేస్తామని ఉపాధ్యాయ సంఘాలకు చెప్పుకోవాల్సి వచ్చింది. తాజాగా నాగార్జున విశ్వవిద్యాలయంలో విద్యార్థిని ఆత్మహత్య సంఘటనపై కూడా గంటా సత్వరం స్పందించకపోవడం విమర్శలకు దారితీసింది. భోగాపురం ఎయిర్‌పోర్టుకు భూసేకరణ అంశంలో గంటా వ్యవహారాల శైలిపై అయ్యన్నవర్గం నేరుగా సీఎం చంద్రబాబుకే ఫిర్యాదు చేసింది. ఇలా ఒక్కోక్క అంశం గంటాకు వ్యతిరేకంగా పరిణమిస్తూ వచ్చింది. సర్వే చంద్రబాబు సంకేతమా!? : సర్వే ఫలితాలు గంటా వర్గంలో గుబులు పుట్టిస్తున్నాయి. రైతు-డ్వాక్రా రుణమాఫి, పింఛన్లు తదితర ప్రభుత్వ కార్యక్రమాలపై నిర్వహించిన సర్వే ఫలితాలను సీఎం విజయవాడలో ప్రకటించారు. వాటిలో భీమిలి నియోజకవర్గంలో సర్వే ఫలితాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అక్కడ ఎమ్మెల్యే పనితీరు బాగాలేదని సీఎం పరోక్షంగా సంకేతాలు ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. సర్వే అన్నదే లేదని... కేవలం గంటాను తప్పించేందుకు దీన్నో అవకాశంగా సీఎం తెరపైకి తెచ్చారని కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గంటా పని అయిపోయిందని జిల్లాలో ఆయన వైరివర్గం విసృ్తతంగా ప్రచారం చేస్తోంది. నగరానికి చెందిన ఓ ఎమ్మెల్యే కూడా కొందరితో మాట్లాడుతూ ఇదే వ్యాఖ్యలు చేయడం గమనార్హం. -
అంగన్వాడీ వేడి
సబ్ కలెక్టరేట్ ముట్టడికి యత్నం భారీగా పోలీసుల మొహరింపు సీఐటీయూ నేతల అరెస్టు విజయవాడ : దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న తమ డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీ సిబ్బంది చేస్తున్న పోరాటాన్ని ఉధృతృం చేశారు. రాష్ట్రవ్యాప్త ఆందోళనలో భాగంగా శుక్రవారం వందలాదిమంది అంగన్వాడీ సిబ్బంది సబ్ కలెక్టర్ కార్యాలయాృ్న ముట్టడించేందుకు విఫలయత్నం చేశారు. అప్పటికే భారీగా మోహరించిన పోలీసులు సీఐటీయూ, అంగన్వాడీ సిబ్బందిని అరెస్టుచేసి సూర్యారావుపేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆందోళనకారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలిచ్చారు. సీపీఎం రాష్ట్ర నాయకుడు యు.ఉమామహేశ్వరరావు తదితరులను పోలీసులు అరెస్టు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై నిప్పులు చెరిగారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకుంటే మార్చి 17న జరిగే చలో హైదరాబాద్ కార్యక్రమానికి పెద్దఎత్తున అన్ని సంఘాలతో తరలివచ్చి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామన్నారు. కాంగ్రెస్ నగర అధ్యక్షుడు మల్లాది విష్ణు మాట్లాడుతూ అంగన్వాడీ సిబ్బంది ఆందోళనకు తమ పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. సీపీఎం నగర కార్యదర్శి సిహెచ్.బాబూరావు, కాంగ్రెస్ నాయకుడు నరహరశెట్టి నరసింహారావు, సీఐటీయూ ముజఫర్ అహ్మద్, ఆర్.రోజా, జె.రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు. -
ఎక్కడమ్మా ‘బంగారు తల్లి’
ఇప్పటి వరకూ పథకంలో 17,015 మంది తల్లులు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. అయితే వీరిలో 7,621 మందికి మాత్రమే మొదటి విడత నగదు అందించారు. మిగిలిన వారికి నగదు ఎప్పుడు వస్తుందో కూడా అధికారులు చెప్పలేని స్థితిలో ఉన్నారు. దాదాపు ఏడాది నుంచి పథకానికి సంబంధించి రూపాయి కూడా ప్రభుత్వం చెల్లించడంలేదు. దరఖాస్తు చేసుకున్న వారిలో 16,014 మంది తల్లులకు మాత్రమే ఆధార్ ఉంది. 9394 మంది బాలింతలు పథకానికి సంబంధించిన మొదటి విడత చెల్లింపులకు ఎదురుచూపులు చూస్తున్నారు.ఒంగోలు సెంట్రల్: ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించిన బంగారు తల్లి పథకం లబ్ధిదారుల దరిచేరడం లేదు. 2013 మే 1 నుంచి ప్రారంభమైన ఈ పథకం ఆది నుంచి బాలారిష్టాలు ఎదుర్కొంటోంది. కొత్తగా అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని ‘మహాలక్ష్మి’గా మార్చి అమలు చేస్తామంది. కానీ దాని ఊసే పట్టించుకోలేదు. ఇప్పటికే చేరిన లబ్ధిదారులకు మొదటి విడత రూ.2,500 కూడా చెల్లించలేని పరిస్థితి. 2013 మార్చి నుంచి మే 24వ తేదీ వరకు ఎన్నికల కోడ్ నేపథ్యంలో బంగారు తల్లి పథకానికి సంబంధించి చెల్లింపులు జరగలేదు. అనంతరం రాష్ట్ర విభజనతో ఇప్పటి వరకు చెల్లింపు ప్రక్రియ నిలిచిపోయింది. బాండ్లు కూడా అందజేయలేదు. దీంతో పేద, బలహీనవర్గాల కుటుంబాల్లో ఆడపిల్లలు పుట్టిన బాలింతలు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఈ పథకం సెంట్రల్ బ్యాంకు ద్వారా అమలవుతోంది. అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన లబ్ధిదారుల ఖాతాలను వేరుపరిచే ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతోంది. పథకంలో చేరేందుకున్న నిబంధనలతో చాలా మంది అర్హత ఉన్నా..పథకానికి దూరమవుతున్నారు. కొత్తగా వివాహం అయిన వారికి ఆధార్‌కార్డు కానీ, రేషన్‌కార్డు కానీ ఉండదు. దీంతో వీరి పిల్లలకు ఈ పథకం వర్తించడం లేదు. ఆధార్ లేనివారు 1001 మంది: తెలుపు రేషన్ కార్డు ఉన్న బడుగు, బలహీన వర్గాల కుటుంబాల్లో పుట్టిన ఆడబిడ్డలకు అసరాగా ఉండటానికి ఉద్దేశించిన బంగారు తల్లి పథకం ఆడబిడ్డలకు ఆసరా ఇవ్వడంలేదు. చాలా మంది బాలింతలకు ఆధార్ కార్డులు లేవు. ఇప్పటికీ ఆధార్ లేని బాలింతలు 1001 మంది వరకూ ఉన్నారు. ఏఎన్ఎంలు గర్భిణిల పేర్లను నమోదు చేయాలి. అంగన్వాడీ కార్యకర్తలు జననాలను నివేదించాలి. గ్రామాధికారి ఆన్లైన్లో బాలిక వివరాలు న మోదు చేసి పాఠశాలకు వె ళ్లే వరకూ పర్యవేక్షించాలి. పాఠశాలల్లో హెచ్ఎంలు, కళాశాలల్లో చేరిన తర్వాత ప్రిన్సిపల్స్ వారి వివరాలను నమోదు చేయాలి. బంగారు తల్లి పథకాన్ని ఆధార్‌కు అనుసంధానం చేశారు. ఆధార్ ద్వారానే కుటుంబాలను గుర్తిస్తారు. ఎలక్ట్రానిక్ పేమెంట్ విధానంలో నేరుగా బాలికల బ్యాంకు ఖాతాలకే నగదు చెల్లిస్తారు. వీటికి బయోమెట్రిక్ విధానం కూడా పరిగణలోకి తీసుకుంటారు. ‘బంగారు తల్లి’తో ఉపయోగాలివీ... బంగారు తల్లి పథకం కింద 2013వ సంవత్సరం మే 1 తరువాత జన్మించిన ఆడపిల్లలకు రూ.2,500లను ఖాతాలో జమ చేస్తారు. బాలిక మొదటి పుట్టిన రోజు వెయ్యి రూపాయలు చెల్లిస్తారు. రెండో సంవత్సరం వచ్చేసరికి మరో వెయ్యి ఇస్తారు. మూడో సంవత్సరం అంగన్వాడీ కేంద్రంలో చేర్పిస్తే రూ.1500 జమచేస్తారు. ఇలా నాలుగైదేళ్లకు ఏటా రూ.1500 చొప్పున చెల్లిస్తారు. బాలిక మొదటి తరగతి నుంచి ఐదో తరగతి వరకు ఏడాదికి రూ.2 వేలు చొప్పున ఇస్తారు. బాలిక 6,7,8, తరగతులు చదివే వరకూ ఏడాదికి రూ 2,500 జమ చేస్తారు. బాలిక 9,10 తరగతులు చదివే సమయంలో ఏడాదికి రూ.3 వేలు చొప్పున చెల్లిస్తారు. ఇంటర్మీడియెట్ రెండు సంవత్సరాలకు ఏడాదికి రూ.3500ల చొప్పున జమ చేస్తారు. డిగ్రీలో చేరిన అనంతరం వరుసగా మూడు సంవత్సరాలు రూ.4 వేలు జమ చేస్తారు. డిగ్రీ పూర్తయిన తర్వాత ప్రభుత్వం ఆమె పేరిట లక్ష రూపాయలు జమ చేస్తుంది. -
రుణమాఫీ అమలులో విఫలం
బొబ్బిలి :ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులను నిర్వీర్యం చేసేలా టీడీపీ ప్రభుత్వం కమిటీలు వేసి ఎస్సీ, బీసీ రుణాలకు లబ్ధిదారులను ఎంపిక చేస్తుందని, వాటిని రద్దు చేసేలా ప్రభుత్వాన్ని అసెంబ్లీలో నిలదీస్తామని బొబ్బిలి ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్వీ సుజయ్ కృష్ణ రంగారావు అన్నారు. మంగళవారం ఆయన బొబ్బిలి కోటలో విలేకరులతో మాట్లాడారు. ఎటువంటి స్థాయి, స్థోమత లేనివారితో కమిటీలు వేసి పబ్బం గడిపేస్తున్నారన్నారు. పచ్చచొక్కాలకే పథకాలు ఇవ్వడానికి ఇటువంటివి చేస్తున్నారని ఆరోపించారు. ఇటువంటి కమిటీల వల్ల ప్రజలతో ఎన్నికైన ప్రజాప్రతినిధులకు విలువ లేకుండాపొతుందన్నారు. ఎన్నికల హామీగా ఇచ్చిన రుణమాఫీని అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. వ్యవసా య రుణాలను మాఫీ చేస్తామని చెప్పి, ఇప్పుడు పంట రుణాలు మాఫీ చేసే ప్రక్రియను ప్రారంభించారన్నారు. గ్రామాల్లో సదస్సులు పెట్టి పత్రాలు ఇ స్తున్నా.. రైతుల ఖాతాల్లోకి రూపాయి కూడా జమ కావడం లేదని చెప్పారు. దీనిపై ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చే విధంగా ప్రశ్నిస్తామని తెలిపారు. జిల్లాల్లో అనేక పరిశ్రమలు రకరకాల కారణాల వల్ల మూతపడుతున్నాయని, దీని వల్ల రోజు రోజుకు నిరుద్యోగ సమస్య పెరుగుతుందన్నారు. పరిశ్ర మలను తెరిపించడంలో ప్రభుత్వం చొరవ చూపక పోవడంతో ఈ దుస్థితి నెలకొందన్నారు. నిరుపేదలకు ఇచ్చే పింఛన్లలో కోత విధించి అర్హులకు అన్యా యం చేశారన్నారు. ఐదు రెట్లు పింఛన్లు పెంచామని గొప్పగా చెబుతూ వేలాది మందికి పింఛన్లు లేకుండా చేశారని ఆరోపించారు. అర్హత ఉన్నవారం దరికీ మళ్లీ పింఛన్లు మంజూరు చేయాలని, తప్పుడుగా తొలగించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హుద్‌హుద్ తుపాను వచ్చి రెండు నెలలైనా ఎవరికీ సాయం అందలేదన్నారు. గృహాలు కోల్పోయి నిరుపేదలు రోడ్డున పడ్డారని, ఉత్తరాంధ్ర జిల్లాల్లోని తీర ప్రాంతాల్లో మత్య్సకా రులకు అపార నష్టం కలిగిందన్నారు. బోట్లు, వలలు, ఇళ్లు పాడైనా...వారికి ఎటువంటి సహాయం అందలేదన్నారు. రైతులకు ఒక్క అరటి పంటకు మాత్రమే పరిహారం ఇచ్చి వరి, చెరుకు రైతులకు అన్యాయం చేశారని తెలిపారు. గతంలో లచ్చయ్యపేట చక్కెర కర్మాగారం సమస్యపై అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నించామని, కానీ ఇప్పటికీ పరిస్థితి మారలేదన్నారు. కొత్త సీజన్ కష్టాలు, పాత బకాయిలు తీర్చకపోవడం వంటివి ఇంకా వెంటాడుతున్నాయ న్నారు. వీటిన్నింటి గురించి అసెంబ్లీలో చర్చిస్తామని చెప్పారు. ఒప్పందాలు అమలయ్యేలా చూడండి పట్టణంలోని శ్రీలక్ష్మీ శ్రీనివాస మిల్లు యాజమాన్యం, కార్మిక సంఘ నాయకుల మధ్య జరిగిన ఒప్పందాలు అమలయ్యేలా చూడాలని బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్వీ సుజయ్ కృష్ణ రంగారావును కార్మిక సంఘ నాయకులు కోరారు. ఈ మేరకు మంగళవారం సీఐటీయూ, ఇఫ్టూ సంఘాల నాయకులు కోటలో ఎ మ్మెల్యేను కలిశారు. ఇటీవల రెండు నెలల పాటు మిల్లును మూసేసిన సమయంలో కార్మికులు చేసిన పోరాటాలకు సంఘీభావం తెలిపి వారి వెన్కంటి ఉన్నందుకు ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు. ఇటీవల యాజమాన్యంతో జరిగిన చర్చలు.. ఆ తరువాత విధుల్లోకి వెళ్లడం వాటిని కూలానుకూషం గా వివరించారు. మిల్లు ప్రస్తుతం తిరుగుతున్నా ఇంకా బదిలీ కార్మికులకు సరైన పని కల్పించడం లేదని, దీని వల్ల ప్రతి ఒక్కరూ ఇబ్బందులకు గురవు తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు వి. శేషగిరిరావు, ఎ. సింహాచలం, డి. శ్రీనివాసరావు, మోహన్, తదితరులు పాల్గొన్నారు. -
‘భరోసా’కు భంగం!
రామచంద్రపురం :పింఛన్ల పంపిణీ పథకం పేరును ‘ఎన్టీఆర్ భరోసా’గా మార్చిన టీడీపీ ప్రభుత్వం సంతోషం, సంతృప్తి, భద్రత, ఆరోగ్యం, భరోసా అయిదురెట్లు పెరిగాయంటూ ప్రచారం చేసుకుంటోంది. అయితే పింఛన్ల మొత్తం పెరుగుతుందని ఆశ పెట్టుకున్నవారిలో అనేకులకు అసలుకే ముప్పు వాటిల్లింది. పలు సాకులతో పలువురికి పింఛన్లు నిలిచిపోయాయి. ఏ లబ్ధిదారునికి ఏ రోజు ఏ ఆటంకం కలుగుతుందోనని బిక్కుబిక్కుమనాల్సిన పరిస్థితి నెలకొంది. తాజాగా జిల్లాలోని అర్బన్ ప్రాంతాల్లో పింఛన్ల పంపిణీ గత రెండు రోజులుగా నిలిచిపోయింది. ఎందుకు నిలిపివేశారో, తిరిగి ఎప్పుడు పంపిణీ చేస్తారో తెలియక పింఛన్‌దారులు అల్లాడుతున్నారు. జిల్లాలో పింఛన్ల పంపిణీ రెండు రకాలుగా జరుగుతోంది. గ్రామాల్లో పోస్టాఫీసుల ద్వారా పంపిణీ చేస్తుండగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఐసీఐసీఐ బ్యాంకుతో కలిసి మనిపాల్ గ్రూప్ సంస్థ పంపిణీకి ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. అర్బన్ ప్రాంతాల్లో ప్రతి నెలా వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఇతర లబ్ధిదారులు 57,560 మందికి రూ.6.36 కోట్లు పంపిణీ చేస్తున్నారు. మనిపాల్ గ్రూప్ జిల్లావ్యాప్తంగా సుమారు 85 మంది సిబ్బందితో బయో మెట్రిక్ మెషీన్ల ద్వారా ఈ పింఛన్లు పంపిణీ చేస్తోంది. ఐసీఐసీఐ బ్యాంకు ద్వారా సొమ్ములు సరఫరా చేసేలా కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ప్రభుత్వం ఈ బ్యాంకుకు సొమ్ములను విడుదల చేస్తుంది. ఈనెల రెండు నుంచి మున్సిపాలిటీలలో పింఛన్ల పంపిణీని ప్రారంభించిన మనిపాల్ సిబ్బంది 6 వరకు జిల్లావ్యాప్తంగా సుమారు 16 వేల మంది లబ్ధిదారులకు రూ.1.80 కోట్ల వరకు పింఛన్లను పంపిణీ చేసినట్టు సమాచారం. అయితే అర్ధాంతరంగా ప్రభుత్వం నుంచి పింఛన్ల పంపిణీని నిలుపుదల చేయాలని మనిపాల్ సంస్ధకు ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది. జిల్లాలో ఇంకా సుమారు 40 వేల మందికి రూ.5 కోట్లకు పైగా పింఛన్లు పంపిణీ చేయాల్సి ఉంది. అయితే విడుదల చేసిన సొమ్ముల వరకూ పంపిణీ చేసి, ఆపై నిలిపివేయాలని ఈనెల 6న ఆదేశించినట్టు సమాచారం. ఆదివారం మధ్యాహ్నం నుంచి పింఛన్ల పంపిణీకి సంబంధించిన సర్వర్లను ముందస్తు సమాచారం లేకుండానే నిలిపివేశారు. మనిపాల్ సిబ్బంది వద్ద గల బయోమెట్రిక్ మెషీన్లను కూడా ఆ సంస్థ ప్రతినిధులు స్వాధీనం చేసుకున్నారు. ఎందుకు నిలిపివేశారో..? మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పింఛన్ల కోసం వచ్చిన లబ్ధిదారులకు అవి రావటం లేదని తెలిసి ఆందోళన చెందుతున్నారు. ఎందుకు నిలిపివేశారో, ఎప్పుడు ఇస్తారో తెలియక గుబులు పడుతున్నారు. ఇలా అర్ధాంతరంగా సొమ్ముల పంపిణీ నిలిపివేయటమేమిటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటివరకు ఐసీఐసీఐ బ్యాంకు ద్వారా పంపిణీ జరుగుతుండగా ఇప్పుడు అర్ధాంతరంగా నిలిపివేసిన నేపథ్యంలో.. తర్వాతైనా ఇస్తారా లేక నిలిపివేస్తారా అనే అనుమానాలు పీడిస్తున్నాయి. పింఛన్లు ఆగిపోయిన సం గతి మున్సిపాలిటీ అధికారులకు కూడా తెలియని స్థితి ఏర్పడింది. కాగా జిల్లావ్యాప్తంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పింఛన్ల పంపిణీ విధులను నిర్వర్తిస్తున్న 80 మంది మనిపాల్ సిబ్బందికి కూడా ఈ పరిణామం జీర్ణం కావడం లేదు. ఈ పనిని నమ్ముకున్న తాము రోడ్డున పడతామని వాపోతున్నారు. ప్రభుత్వం ఇలా ఎందుకు చేసిందో తెలియని అయోమయం వారినీ వెన్నాడుతోంది. -
మరోసారి దగా!
విజయనగరం అర్బన్/కంటోన్మెంట్ : టీడీపీ ప్రభుత్వం రైతులను మరోసారి దగా చేసింది. ఇప్పటికే రుణమాఫీ అమలులో రోజుకో విధంగా ప్రకటనలు చేస్తూ.. రైతులను మోసం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు... గురువారం చేసిన ప్రకటన వారిని మరింత విస్మయానికి గురి చేసింది. ము ఖ్యమంత్రి ప్రకటన ప్రకారం జిల్లాలోని రైతులకు కనీసం 40 శాతం కూడా మాఫీ లభించేపరిస్థితి లేదు. మరోవైపు అర్హులైన జాబితాలను నేరుగా బ్యాంకులకు పంపి దాన్ని రహస్యంగా అధికార పార్టీ నేతల చేతిలో పెట్టడం వల్ల రైతులు రాజకీయ కక్ష సాధింపులు జరుగుతాయని ఆందోళన చెందుతున్నారు. ఈ కారణంగానే తొలి విడత అర్హుల జాబితాలో రూ. 50 వేల రూపాయల రుణమాఫీ పరిధిలో ఎంతమంది ఉన్నారన్నది ఆయా బ్యాం కు అధికారులు చెప్పలేకపోతున్నారు. తాజాగా నిధులు విడుదల చేస్తామన్న అర్హుల జాబితా గాని, వాళ్ల రుణం మొ త్తంగాని బ్యాంకర్లకు తెలియజేయకుండా టీడీపీ నాయకులు జాగ్రత్త పడుతున్నారు. కనీసం బ్యాంకుల రీజనల్ కార్యాలయాలకు కూడా సమాచారం ఇవ్వడం లేదు. దీంతో మాఫీ నిధులు రైతు ఖాతాలో జమ అయ్యే వరకు బ్యాంకర్లకు కూడా తెలియని పరిస్థితి నెలకొంది. 40 వేల మందికే తొలి విడత అర్హత జిల్లా వ్యాప్తంగా ఉన్న బ్యాంకులలో అప్లోడ్ చేసిన 2.78 లక్షల రైతుల్లో తొలి విడత అర్హత లభించిన వారు కేవలం 40 శాతం మంది మాత్రమే ఉన్నారు. జిల్లాలో అధికంగా రైతులు వినియోగించుకుంటున్న ఆంధ్రప్రదేశ్ గ్రామీ ణ వికాస్ బ్యాంకు, డీసీసీబీ, ఎస్బీఐ బ్యాంకులలో అర్హుల జాబితాను సంబంధిత రీజనల్ కార్యాలయాల్లో ప్రకటిం చారు. ఏపీజీవీబీ ద్వారా అప్లోడ్ చేసిన 64,124 మందిలో తొలి విడత 38,040 మందికి, డీసీసీబీలో 84,091 మందికి 34,181 మంది అర్హులు ఉన్నారు. ఇంకా జిల్లాలోని వివిధ బ్యాంకల తొలి విడత జాబితా లీడ్ బ్యాంకులకు చేరాల్సి ఉంది. ఈ జాబితాను క్షేత్రస్థాయిలో జన్మభూమి కమిటీలకు పంపి, తుది అర్హత జాబితా తెలియజేస్తారు. రూ. 400 కోట్ల బంగారు రుణాల మాఫీ వట్టిదేనా? జిల్లావ్యాప్తంగా 4. 60 లక్షల మంది రైతులుండగా అందులో 3.20 లక్షల మంది రూ.1400 కోట్ల రుణాలు తీసుకున్నారు.ఇందులో దీర్ఘకాలిక రుణాలు, అనుబంధ రుణాలు తీసి వేస్తే రూ.1,157 కోట్ల రుణాలు తీసుకున్నట్టు అధికారులు అంచనా వేసి లెక్కగట్టారు. ఇందులో రూ. 430 కోట్లు బంగారం రుణాలు కాగా, పంట రుణాలు రూ. 727 కోట్లు. ప్రస్తుతం ప్రభుత్వం చెప్పిన దాన్ని బట్టి ఇందులో రూ. 430 కోట్ల మా ఫీ మాటే లేదు. బంగారం రుణాలు తీసుకున్న వారు ఎంతమంది ఉన్నారన్న లెక్క కూడా ఇంకా లీడ్బ్యాం కుకు రాలేదని బ్యాంకర్లే చెబుతున్నారు. అసలు బంగారు రుణాల ఊసే ఎత్తడం లేదని ఆయా వర్గాలకు చెందిన రైతు లు ఆవేదన చెందుతున్నారు. రుణాలు మాఫీ అవుతా య న్న అర్హుల జాబితాలు బ్యాంకు శాఖలకు పంపించడం, వారి ఆధార్, ఓటరు కార్డులు సేకరించాలని చెప్పడంతో ఇంకా మాఫీ మొత్తం ఎం తన్నది ఇదమిద్థంగా తెలియడం లేదు. అలాగే జిల్లాలో కౌలురైతులు 80 వేల మంది ఉన్నప్పటికీ కేవలం 62 వేల మందే ఉన్నారని గుర్తించిన యంత్రాంగం ఇందులో 18 వేల మందికి గత ఏడాది రుణ అర్హత కార్డులి చ్చింది. ఇందులోనూ 13 వేల మంది పాత వారికి రుణాలను రెన్యు వల్ చేసింది తప్ప ఎటువంటి కొత్త రుణాలు ఇవ్వలేదు. ఈ 13 వేల మందికి రుణ ప్రణాళిక ప్రకారం ఇవ్వాలంటే రూ. 120 కోట్లు ఇవ్వాల్సి ఉంది. కానీ జిల్లాలో 13 వేల మందికి కేవలం రూ. 4 కోట్లు మాత్రమే ఇచ్చారు. పోనీ వీరికయినా రుణాలు మాఫీ అవుతాయని అనుకుంటే ఈ దఫా చంద్రబాబు ప్రకటించిన దానిలో కౌలురైతుల సమాచారమే లేదు. అదేవిధంగా డ్వాక్రా రుణాలకు సంబంధించి జిల్లావ్యాప్తంగా 42, 600 గ్రూపులు రు.340 కోట్ల రుణం తీసుకున్నారు. ఇందులో కూడా వడపోత పోసి 39,530 గ్రూపులకు రూ.250 కోట్లు మాత్రమే మాఫీకి అర్హులని తేల్చారు. అయితే డ్వాక్రా రుణాల సంగతి తేల్చని తెలుగుదేశం ప్రభుత్వం పలుమార్లు సాధికారత సంస్థ అని, రిజర్వు బ్యాంకులు మోకాలడ్డుతున్నాయని చెబుతోంది. గంట్యాడ మండలం బుడతనాపల్లికి చెందిన ఎలిశెట్టి సత్యనారాయణ కౌలురైతు. ఆయన గ్రామంలోని ఓ వ్యక్తి దగ్గర ఎకరాన్నర భూమిని కౌలుకు తీసుకున్నాడు. సాగు చేసేందుకు బ్యాంకులో రూ.15 వేల రుణం తీసు కున్నాడు. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయితే రుణమాఫీ అవుతుందని ఆశించాడు. కాని ఆయన మాట ల్లో కౌలు రైతుల ప్రస్తావన రాకపోవడంతో సత్యనారా యణ దిగాలు చెందుతున్నాడు. ముఖ్యమంత్రి హామీల అమలు తీరు చూసి ఆవేదన చెందుతున్నాడు. జిల్లాలోని కౌలురైతులందరి పరిస్థితి ఇలానే ఉంది. -
అటు టీ సర్కారు.. ఇటు ఏపీ ప్రభుత్వం
తరతరాల నుంచి తెలంగాణతో బంధం.. పోలవరం ముంపు నేపథ్యంలో తమ ప్రాంతాలను ఆంధ్రలో కలుపుతూ రాష్ట్రపతి గెజిట్ వెలువడినా రాజకీయ నేతల గందరగోళ ప్రకటనల మధ్య కొంతకాలం అయోమయం... చివరికి తెలంగాణ సర్కారు సమగ్ర సర్వేకు దూరం పెట్టడంతో ఇక ఆంధ్రతోనే తమ భవిష్యత్తు అని నిర్ధారించుకుని మమేకమయ్యే యత్నం.. మరోవైపు ముంపు ప్రాంతాల ప్రజలను ప్రత్యేక పాలనతో ఉద్ధరిస్తామంటూ ఏపీలోని టీడీపీ ప్రభుత్వం ఆర్భాటపు ప్రకటనలు తప్పించి నెలలు గడుస్తున్నా కనీస సౌకర్యాలు కల్పించని వైనం.. ప్రాథమిక వసతుల మాట దేవుడెరుగు.. ఇప్పటివరకు తమ గోడును వినేందుకు కూడా ఎవరూ కన్నెత్తి చూడటం లేదంటూ ముంపు ప్రాంతవాసుల ఆందోళన.. చివరికి అటు టీ సర్కారు.. ఇటు ఏపీ ప్రభుత్వం.. రెండింటికీ చెడ్డ రేవడిలా మిగిలిపోతామేమో అంటూ భవిష్యత్తుపై బెంగతో అల్లాడిపోతున్న కుకునూరు, వేలేరుపాడు మండలాల ప్రజల దురవస్థపై ‘సాక్షి’ ప్రత్యేక కథనమిది. (కుకునూరు, వేలేరుపాడుల నుంచి సాక్షి ప్రతినిధి) :మూడేళ్లలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామంటూ ఇప్పటివరకు చెబుతూ వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం తాజాగా నాలుగున్నరేళ్లలో పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటామంటూ ప్రకటనలు చేస్తోంది. ఇప్పటికీ కనీసం ప్రకటనల్లోనే స్పష్టత లేని పాలకులు అసలు పోలవరం ముంపు మండలాల ప్రజను ఇంతవరకు పట్టించుకోలేదు. తెలంగాణ నుంచి ఆంధ్రలోకి విలీనమైన కుకునూరు, వేలేరుపాడు మండలాలతో పాటు బూర్గంపహాడ్‌లోని ఆరు గ్రామాల ప్రజలకు ప్రత్యేకపాలన అందిస్తామంటూ చెబుతూ వచ్చిన అధికారులు ఆ రెండు మండల కేంద్రాల్లో ఒకటికి రెండుసార్లు మీటింగులు పెట్టడం తప్పించి గ్రామాల వైపు కన్నెత్తి చూడలేదు. అధికారులే కాదు.... అధికార పార్టీకి చెందిన ఏ ఒక్క నాయకుడూ ఇంతవరకూ ఆయా పల్లెల్లో ఒక్కసారి కూడా పర్యటించలేదు. అక్కడి పరిస్థితులన్నీ సజావుగా ఉంటే ఎవరు వచ్చినా రాకున్నా సమస్యలేదు. కానీ ప్రభుత్వ ‘గుర్తింపు’ సమస్య మొదలుకుని రేషన్ బియ్యం, నిత్యావసర వస్తువుల పంపిణీ వరకు అన్నీ సమస్యలతోనే అక్కడి వాసులు కొట్టుమిట్టాడుతున్నారు. పెన్షన్లు నిలిపివేసిన తెలంగాణ... అరకొరగా విదిలిస్తున్న ఆంధ్ర కుకునూరు, వేలేరుపాడు మండలాల్లోని వృద్ధులు, వికలాంగులు, వితంతువు, అభయహస్తం పెన్షన్లను ఆగస్టు నెల వరకు టీ సర్కారు పంపిణీ చేయగా, ఆ తరువాత జరిగిన సమగ్ర సర్వే అనంతరం నిలిపివేసింది. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలలకు సంబంధించిన పెన్షన్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది. వేలేరుపాడు మండలంలో మొత్తం 1791 పెన్షన్ల లబ్ధిదారులుండగా ఇందులో 830 వృద్ధాప్య, 739 వితంతు, 64 అభయహస్తం, 158 వికలాంగ లబ్ధిదారులున్నారు. వీరిలో సగానికి సగం మందికి గత మూడునెలలుగా పెన్షన్లు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక కుకునూరులో సుమారు 3263 మంది లబ్ధిదారులుండగా, వివిధ సాకులు చూపి 460 మందికి ఇప్పటికీ పెన్షన్లు అందించడం లేదు. నేటికీ అందని పంట నష్టం ఆగస్టు నెలలో సంభవించిన గోదావరి వరదలకు ఈ రెండు మండలాల్లో ఐదు వేల ఎకరాల్లో పత్తి పంట పూర్తిగా నాశనమైంది. ఇప్పటి వరకు ఏపీ ప్రభుత్వం నష్టపరిహారం అందించలేదు. తెలంగాణ పరిధిలోకి వచ్చే పొరుగు మండలాల రైతులకు పరిహారం అందినా వీరికి మాత్రం ఇంకా దక్కలేదు. పంట నష్టం సర్వే చేయమని మొత్తుకుంటే ఎట్టకేలకు ఇటీవల ఆంధ్ర వ్యవసాయ శాఖాధికారులు వచ్చి సర్వే చేపట్టారని రైతులు తెలిపారు. మధ్యాహ్న భోజనానికి సరఫరా కాని బియ్యం రెండు నెలల కిందటి వరకు విద్యార్థుల సంక్షేమ హాస్టళ్లకు తెలంగాణ ప్రభుత్వం నుంచి విడుదలయ్యే బియ్యం ఇప్పుడు ఆగిపోయూరుు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి సరఫరా కాకపోవడంతో నిర్వాహకులు అప్పులు చేసి బయట బియ్యాన్ని కొనుగోలు చేసి విద్యార్థులకు వండి పెడుతున్నారు. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించి బియ్యం సరఫరా కాలేదని పేరు చెప్పడానికి ఇష్టపడని అధికారి వెల్లడించారు. పరిహారం ఊసే లేదు పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా పంటలు కోల్పోయే రైతులకు ఇవ్వాల్సిన నష్టపరిహారంపై ఇప్పటివరకు అధికారుల నుంచి కనీస ప్రస్తావన కూడా ఎక్కడా రావడం లేదని ఆయా గ్రామాల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న కాలంలో 2006 సంవత్సరంలో ప్రాజెక్టు నిర్మాణం కోసం రైతుల భూములను తీసుకున్న అప్పటి ప్రభుత్వం ఎకరాకు రూ.లక్షా15 వేల చొప్పున న ష్ట పరిహారం ఇచ్చింది. కుకునూరు మండలంలోని గొమ్ముగూడెం, విజరం, కొండపల్లి గ్రామాల రైతులు అప్పట్లో పరిహారం పొందారు. అప్పటి నుంచి ఇప్పటివరకు మిగిలిన గ్రామాల రైతులకు పరిహారం దక్కలేదు. ఇప్పుడు ఆయా గ్రామాలు ఆంధ్రప్రదేశ్‌లో విలీనం కావడంతో తెలుగుదేశం ప్రభుత్వమే పరిహారం చెల్లించాల్సి ఉంది. కానీ ఆ ప్రస్తావన కూడా ఇంతవరకు తమ వద్ద ఎవరూ తేలేదని రైతులు చెబుతున్నారు. వేలేరుపాడు మండలంలోని అన్ని గ్రామాల్లో భూమికి భూమి ఇచ్చే విధానాన్ని అమలు చేయకపోవటంతో ఆరు ఎకరాల లోపు భూమి ఉన్న రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటు బ్యాంకుల్లో రుణాలు రాక, అటు ప్రభుత్వం నుంచి సహాయం అందక పంటలు సాగు చేసేందుకు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. పునరావాసం ప్రస్తావనే లేదు ఇక పునరావాసం గురించి ఇప్పటివరకు ఎవ్వరూ మాట్లాడటం లేదని ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పునరావాసం ఎక్కడ కల్పించనున్నారు.. మా పరంగా ఉన్న ఇబ్బందులేంటి అని అడిగే నాధుడే లేడని కుకునూరు మండలం నల్లకుంటలోని యువకుడు శీలం రమేష్ ‘సాక్షి’ ప్రతినిధి వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. ఇంకా టీ సర్కారు వెబ్సైట్లోనే రెండు మండలాలు ఇప్పటికీ కుకునూరు, వేలేరుపాడు మండలాలకు సంబంధించిన సమాచారం టీ సర్కారు అధికారిక వెబ్సైట్లోనే కొనసాగడం పాలనాపరంగా ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. సర్టిఫికెట్లు, కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలు ఇప్పటికీ తెలంగాణ ప్రభుత్వ ముద్రతోనే వస్తున్నాయి. దీంతో 42 రెవెన్యూ గ్రామాల ప్రజలు రుణాలు తీసుకోవాలన్నా, భూముల క్రయవిక్రయాలు, రిజిస్ట్రేషన్లు చేసుకోవాలన్నా ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. అధికారులు గ్రామాల్లో పర్యటించాలి అధికారులు గ్రామాల్లో పర్యటించి సమస్యలు తెలుసుకోవాలి. రైతులకు సరైన ధర చెల్లించి భూములు తీసుకోవాలి. ఇప్పటికే భూ సేకరణ చేసి తొమ్మిది సంవ త్సరాలు అయింది. బ్యాంకు రుణాలు ఇవ్వక పోవటంలో ప్రయివేటు వ్యాపారుల వద్ద వడ్డీకి తీసుకువచ్చి వ్యవసాయం చేస్తున్నారు. దీంతో నష్టం జరుగుతుంది. నష్టపోయిన పంటలకు కనీసం సర్వే కూడా చేయటం లేదు. సర్వే చేసిన వాటికి పరిహారం అందలేదు. - దాసరి సాయి, ప్రగతిశీల యువజన సంఘం కార్యదర్శి ఏ ఒక్క అధికారి కూడా మా గ్రామంలో పర్యటించలేదు మొత్తం గిరిజనులు నివసించే మా నల్లకుంట తండాను ఇంతవరకు ఒక్క అధికారి కానీ, ప్రజాప్రతినిధి కానీ సందర్శించలేదు. మా గ్రామంలో ఆడ మగ అందరం కూలి పనికి పోతాం. పని నుంచి వచ్చాక మంచినీళ్ల కోసం మళ్లీ కిలోమీటర్ల దూరం నడచి వెళ్లి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఏ రాష్ట్ర అధికారులైనా ఫరవాలేదు.. మా సమస్య పరిష్కరిస్తే చాలు.. అన్నట్టుంది మా పరిస్థితి. - శీలం రుక్మిణి, నల్లకుంట పంచాయతీ సభ్యురాలు ఇప్పటికీ జీతాలు టీ సర్కారు నుంచే మేము మానసికంగా కూడా ఆంధ్రలో కలిసిపోయాం. కానీ మాకు జీతాలు ఇప్పటికీ తెలంగాణ సర్కారు నుంచే వస్తున్నాయి. అధికారులు మా సమస్యల పరిష్కార దిశగా నిర్ణయాలు తీసుకోవాలి. పాఠశాలల్లో కనీస సదుపాయాలు కల్పించాలి. ప్రత్యేక పాలన అని ఘనంగా ప్రకటించిన అధికారులు ఆ దిశగా ఏ చర్యలూ తీసుకోవడం లేదు. బుక్యా హిరాముల్, టీచర్, గిరిజన పాఠశాల, నల్లకుంట డీఎస్సీలో మా పరిస్థితి ఏంటో ఆంధ్రలో కొత్తగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చింది. మేం ఎలా దరఖాస్తులు చేసుకోవాలి? ఈ సేవలో సాఫ్ట్వేర్ మార్చలేదు. అంతా గందరగోళంగా ఉంది. - చెరువుకట్ల సతీష్‌కుమార్, బెస్తగూడెం, దాచారం పంచాయతీ -
ఎందుకో ఈ అలక్ష్యం!
ఇచ్చేది గోరంత.. చూపించేది కొండంత అన్నట్లుంది జిల్లాలో వ్యవసాయ రుణాల పరి స్థితి. బ్యాంకర్లు కొత్తగా వ్యవసాయ రుణాలివ్వకున్నా.. లక్ష్యాన్ని చేరుకున్నట్లు చూపించే విషయంలో మాత్రం ముందంజలో ఉన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు తొలి అర్ధమాసాన్ని పరిశీలిస్తే ప్రభుత్వ ప్రాపకం కోసం వారు ఎంత వరకు ఆరాట పడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. మాఫీ.. కిరికిరి * తక్కువ రుణాలిచ్చినా.. లక్ష్యం చేరినట్లు చూపిస్తున్న బ్యాంకర్లు * రెన్యువల్‌తో కలిపినా 60 శాతం మందికే రుణాలు * తొలి అర్ధ సంవత్సరంలో ఇదీ జిల్లాలో పరిస్థితి ఒంగోలు: రైతు రుణమాఫీ పేరిట అన్నదాతలు గందరగోళంలోకి నెట్టేసిన టీడీపీ ప్రభుత్వం.. ఈ విషయంలో మాఫీ భారం ఎంత తగ్గినా తగ్గినట్టేనని శతథా ప్రయత్నిస్తోంది. ఆర్బీఐ అంగీకరించకపోవడంతో రైతు సాధికారత కార్పొరేషన్ ఏర్పాటుచేసి తద్వారా మాఫీ చేస్తామంటూ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు మాఫీని ఎగ్గొట్టేందుకు పలు ఆంక్షలు విధించి రైతు కుటుంబాల్లో తీవ్రమైన సంక్షోభాన్నే తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలో జిల్లాలో ఉన్న బ్యాంకర్లు ఈ ఏడాది వ్యవసాయ రుణాల లక్ష్యాన్ని చేరుకునేందుకు సరికొత్త ప్లాన్ ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఆంక్షల చట్రంలో రైతన్నలు వ్యవసాయ రుణం కావాలని బ్యాంకర్ల వద్దకు వెళ్తే‘పొలం ఏ ఊళ్లో ఉందో అక్కడే రుణం తీసుకోవాల’ని ంటూ సరికొత్త ఆంక్షలు పెడుతున్నారు. ఇవన్నీ తిరగలేక రైతు కాస్తా ప్రైవేటు రుణాలపై ఆధారపడుతున్నాడు. అయినా బ్యాంకర్లు మాత్రం లక్ష్యాన్ని చేరుకోవడంలో మాత్రం రికార్డుల పరంగా ముందే ఉండడం గమన్హాం. కౌలు రైతులకు రుణాలు నిల్ సాధారణంగా ఈ ఆరు నెలల కాలంలో ఖరీఫ్ సాగే ప్రధానం. కానీ ఖరీఫ్‌లో జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ శాఖ అంచనాల ప్రకాారం సాగు మొత్తం 64 శాతం మాత్రమే. ఇందులో కౌలుదారులు 20శాతంు. వారికి రుణాలు ఇచ్చిన దాఖలాలే జిల్లాలో లేవు. మిగిలిన 44 శాతంలోనూ చాలామంది రైతులు రుణాల ఊబిలో కూరుకుపోయి ఉన్నారు. రుణం కడతారా.. బంగారం వేలం వేయమంటారా అంటూ బ్యాంకర్లు తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చారు. తాము వ్యవసాయ రుణాలిస్తున్నామని చెబుతున్నా.. వాస్తవానికి వ్యవసాయానికి బంగారు ఆభరణాలపై ఇవ్వడాన్ని నిలిపివేశారు. కొత్తగా పట్టుమని 15 శాతం మందికి కూడా రుణాలిచ్చిన దాఖలాలు లేవు. రెన్యువల్స్‌లో మతలబు! ఈ ఏడాది వ్యవసాయ రుణ లక్షాన్ని చేరుకునేందుకు బ్యాంకర్లు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. సాధారణంగా గతంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు రైతు రుణాన్ని రెన్యువల్ చేసి పెద్ద మొత్తంలో రుణాలిచ్చినట్లు లెక్కలు చెప్పేవి. ఇప్పుడు వాణిజ్య, గ్రామీణ బ్యాంకులు కూడా అదే పంథా అనుసరించడం గమనార్హం. దాని ప్రకారం గతంలో రైతులు తీసుకున్న బంగారపు రుణాలను రద్దుచేసి, తాజాగా వాటికి రుణాలు ఇచ్చినట్లుగా బ్యాంకర్లు వారి ఖాతాలను రెన్యువల్ చేశారు. లేని పక్షంలో బంగారాన్ని వేలం వేస్తామంటూ హెచ్చరికలు చేస్తుండడంతో రైతులు వడ్డీ, అసలులో కొంతమొత్తం కట్టి తాత్కాలికంగా ఉపశమనం పొందగా... బ్యాంకర్లు మాత్రం ఈ ఏడాది ఖరీఫ్‌లో 74.67 శాతం ఖరీఫ్ రుణాలిచ్చినట్లు ప్రకటిస్తుండడం విశేషం. -
ఉండేనా..ఊడేనా..?!
నరసన్నపేట: ఏపీ వైద్య విధాన పరిషత్ పరిధి ప్రభుత్వ ఆస్పత్రులలో సేవలందిస్తున్న ఉద్యోగుల భవితవ్యం అంధకారంలో పడింది. రెన్యువల్ ఉత్తర్వులు అందక..వేతనాలు లేక కుటుంబాలతో సహా అవస్థలు పడుతున్నారు. కొత్త ప్రభుత్వం..వారి ఉద్యోగాలను రెన్యువల్ చేస్తుందో..లేదోనన్న భయం వారిని వెంటాడుతోంది. జిల్లాలోని ఆస్పత్రుల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన 300 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఆస్పత్రిలో సేవలను దృష్టిలో ఉంచుకుని..ఆస్పత్రుల అభివృద్ధి సంఘాల సిఫార్సుల మేరకు ఖాళీగా ఉన్న పోస్టుల్లో వీరిని నియమించారు. పతి ఆరు నెలలకు వీరి ఉద్యోగాలను రెన్యువల్ చేస్తూ వస్తున్నారు. కానీ ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం రాకముందు..గత ప్రభుత్వం జూన్ నెల వరకు వీరి ఉద్యోగాలను రెన్యువల్ చేసింది. అప్పటి ప్రభుత్వం ఆదేశాల మేరకు వీరంతా..తమ అమ్యూలమైన సేవలందించారు. జూలై నెల నుంచి రెన్యువల్ కావాల్సి ఉన్నా..వీరికి ఇప్పటి వరకు అటువంటి ఉత్తర్వులేవీ అందలేదు. జూలైతో పాటు ఆగస్టు, సెప్టెంబర్ నెలలకు వేతనాలు కూడా అందలేదు. అయితే..యథావిదిగా అక్టోబర్‌లో కూడా కొనసాగుతున్నారు. అయితే..ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో భయాందోళనకు గురవుతున్నారు. ఉద్యోగాలు..ఉంటాయా..ఊడిపోతాయా? అన్న సందేహం వీరిని వెంటాడుతోంది. స్పందించని ప్రభుత్వం కొత్త ప్రభుత్వం కొలువు దీరినా..వీరి కొనసాగింపు ఉత్తర్వులకు మాత్రం ఆమోదం తెలపలేదు. భవిష్యత్తులో రెన్యువల్‌కు కూడా అంగీకరించే పరిస్థితి లేదని వీరింతా భావిస్తూ..బయపడుతున్నారు. ఇప్పటికే..నాలుగు నెలల పాటు ఉచితంగా సేవలంఇంచిన దృష్ట్యాల ఒక వేళ ఆరు నెలలకు అనుమతించినా..భవిష్యత్తు ఎలా ఉంటోందోనని మథన పడుతున్నారు. చాలీచాలని వేతనాలు అప్పుడప్పుడూ చెల్లించే..వేతనాలు సైతం థర్డ్ పార్టీ ద్వారా చెల్లిస్తున్నారని చెబుతున్నారు. ప్రభుత్వం చెల్లిస్తున్న వేతనాలు ఎందుకూ సరిపోవడం లేదని..అయినా..సేవలందిస్తున్నామని వాపోతున్నారు. ప్రస్తుతం ఉద్యోగాలు ఊడిపోతే..కుటుంబాలతో సహా..రోడ్డున పడతామని పేర్కొంటున్నారు. ప్రభుత్వం మానవతా వాదంతో ఆలోచించి..న్యాయం చేయాలని వేడుకుం టున్నారు. -
అధికారుల్లో గుబులు
పొలంబడి, స్వచ్ఛ భారత్‌పై అవగాహన కార్డులు, పెన్షన్లకు దరఖాస్తుల స్వీకరణ మండలానికి రెండు బందాలు రోజుకో గ్రామంలో సమావేశం గామాల్లో అనేక సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదు. కనీసం మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం నిధులు మంజూరుచేయలేదు. రోజుకో కొత్త బూటకపు హామీతో రోజులను నెట్టుకొస్తున్న టీడీపీ సర్కారు ఏ ఒక్కటి అమలు చేయడం లేదు. రేషన్‌సరుకులు ఇవ్వడం లేదు. దీనికి తోడు ఆధార్‌కార్డును అన్ని సంక్షేమ పథకాలు లింకు పెట్టి లబ్ధిదారుల వడపోత కార్యక్రమాన్ని చేపట్టింది. రేషన్‌కార్డుల నుంచి రుణమాఫీ వరకు అన్ని పథకాల్లోకు సవాలక్ష ఆంక్షలు పెడుతూ లబ్ధిదారులను కుదిస్తూ వస్తోంది. దీనిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈమేరకు జనం ఎక్కడ నిలదీస్తారోనన్న గుబులు అధికారుల్లో వ్యక్తమవుతోంది. ప్రధానంగా రైతు, డ్వాక్రా రుణ మాఫీలకు సంబంధించి రైతులు, మహిళలు ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఎన్నికలకు ముందు రుణాలు రద్దు చేస్తామని చెప్పి అధికారం చేజిక్కించుకున్నాక హామీలను నెరవేర్చకపోవడం, కనీసం కొత్త రుణాలు ఇప్పించే ఏర్పాట్లు చేయకపోవడంతో రైతులు ఆగ్రహంతో ఉన్నారు. ఇటీవల నిర్వహించిన పొలం బడి కార్యక్రమంలో గ్రామాలకు అధికారులు వెళ్లిన ప్రతీ సందర్భంలోను రుణమాఫీపై రైతులు నిలదీస్తున్న సంఘటనలు కోకొల్లలు. ఆదర్శరైతు వ్యవస్థ రద్దుతో వారు ఉద్యమ బాట పట్టారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు జన్మభూమి కార్యక్రమం ద్వారా గ్రామాల్లో పర్యటిస్తే రైతులు, డ్వాక్రా మహిళలు రుణమాఫీపై నిలదీస్తే ఏమి చెప్పాలన్న విషయంపై మల్లగుల్లాలు పడుతున్నారు. -
కలిసికట్టుగా పనిచేస్తే భవిత మనదే
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ‘జిల్లాలో మంచి నాయకత్వం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో మనకు చాలా పట్టుంది. అంతా కలసిమెలసి పనిచేస్తే ఫలితాలు సాధించొచ్చు’ అని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ జిల్లా నేతలకు సూచించారు. బుధవారం ఉదయం హైదరాబాద్‌లో జిల్లా పార్టీ నేత లు జగన్‌ను కలిసి ఇక్కడి పరిస్థితిపై కాసేపు చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి జిల్లాలో పరిస్థితిని వివరించారు. పట్టణ ప్రాంతాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు అంతా కష్టపడి పనిచేయాలని జగన్ సూచించారు. గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి వచ్చిన ఓట్లపై విశ్లేషించారు. ఓటు బ్యాంకును కాపాడుకోవాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మోసపూరిత హామీలతో గద్దెనెక్కారని, ప్రజల్ని రుణమాఫీ పేరిట మోసం చేస్తున్నారని, ప్రజలకు అర్థమయ్యేలా అన్నీ వివరించాలని నేతలకు జగన్ సూచించారు. టీడీపీ ప్రభుత్వం అసంబద్ధమైన ప్రకటనలు చేస్తూ కాలం గడుపుతోందని, ప్రజలు ఆ మోసాలకు బలైపోకుండా చూడాలని ఉద్బోధించారు. వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ నిత్యం ప్రజల పక్షానే పోరాడుతుందని, ప్రజలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోదని, అవసరమైతే పోరాటాలకు దిగాలని నేతలకు సూచించారు. అదే విధంగా క్యాడర్‌కు కూడా భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామస్థాయి నుంచి అన్ని స్థాయిల్లోనూ కమిటీలు నియమించి పార్టీ పట్ల ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని కాపాడుకోవాలన్నారు. సమావేశాలు పెట్టి కార్యకర్తలకు పార్టీ కార్యక్రమాలు తెలియజేసి, పార్టీ పట్ల ప్రజల్లో విశ్వసనీయత ఉండేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి ధర్మాన ప్రసాదరావు సహా మరికొందరు నేతలు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ కదం
- మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ - కాంగ్రెస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా పాతగుంటూరు: టీడీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. సోమవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు జిల్లా అధ్యక్షుడు మక్కెన మల్లికార్జునరావు నేతృత్వంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కన్నా మాట్లాడుతూ అధికారంలోకి రాగానే రుణమాఫీ చేస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎన్నో ఆంక్షలు విధిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఖరీఫ్ సీజన్లో రైతులకు రుణాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. రుణ మాఫీ చేసి, కొత్తగా రుణాలు మంజూరు చేయకపోతే పార్టీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు కొనసాగిస్తామని హెచ్చరించారు. అలాగే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేయాలని, డ్వాక్రా మహిళలు, చేనేత కార్మికుల రుణాలను కూడా పూర్తిగా రద్దుచేయాలని డిమాండ్ చేశారు. బాబు వచ్చాక జాబు పోయింది: కాసు మరో మాజీ మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్‌షిప్పుల బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ‘బాబు వస్తే జాబు వస్తుంది’ అని ఎన్నికల సమయంలో టీడీపీ నాయకులు ప్రచారం చేశారని, బాబు అధికారంలోకి రాగానే ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించారని మండి పడ్డారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మక్కెన మల్లికార్జునరావు మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన అన్ని వాగ్దానాలను అమలు పరచాలని, లేని పక్షంలో కాంగ్రెస్‌పార్టీ ప్రజల తరఫున ఉద్యమాలు చేస్తుందని హెచ్చరించారు. అనంతరం కలెక్టరేట్ నుండి జిల్లాపరిషత్ కార్యాలయం వరకు కాంగ్రెస్‌పార్టీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. అక్కడ ప్రజావాణి నిర్వహిస్తున్న కలెక్టర్ కాంతిలాల్ దండేకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మస్తాన్‌వలి, పార్టీ నాయకులు వహీద్, కొరివి వినయ్ కుమార్, కూచిపూడి సాంబశివరావు, పక్కాల సూరిబాబు, రాంబాబు, రామకృష్ణారెడ్డి, ఎస్కె.సుభాని, పి.ఎ.ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.