ఎస్పీఎం కార్మికుల కన్నీళ్లు తుడువరా..?
► ఆ బాధ్యత మీది కాదా?
► స్వార్థ ప్రయోజనాలకే కాళేశ్వరం ప్రాజెక్టుకు శ్రీకారం
► మాజీ ఎమ్మెల్యే, సీపీఐ నాయకుడు గుండా మల్లేశ్
కాగజ్‌నగర్‌రూరల్ : కాగజ్‌నగర్‌లోని సిర్పూర్ పేపర్ మిల్లు కార్మికుల కన్నీరు తుడిచే బాధ్యత మీది కాదా అని సీపీఐ సీనియర్ నాయకులు, బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేశ్ ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. శుక్రవారం స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో నిర్వహించిన విలేకరుల సమావే శంలో ఆయన మాట్లాడారు. కాగజ్‌నగర్‌లోని సర్‌సిల్క్ మిల్లు 1984లో టీడీపీ ప్రభుత్వ హయాంలో మూతపడగా, సిర్పూర్ పేపర్ మిల్లు 2014లో టీఆర్‌ఎస్ హయాంలో మూతపడిందన్నారు. దీంతో కార్మికులు అన్నమో రామచంద్రా అంటూ... కాలం గడుపుతున్నా కేసీఆర్‌కు తెలియకపోవడం విడ్డూరమన్నారు.
అతిచిన్న నేరాలకు జైళ్లకు పంపుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఎస్పీఎం మిల్లు మూతకు మూలకారకులైన బిర్లా యాజమాన్యం(పోదార్)పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. మిల్లు పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం పలుసార్లు సమావేశాలు ఏర్పాటు చేస్తే బిర్లా యాజమాన్యం కంటి తుడుపుగా కేవలం ఒకసారి మాత్రమే హాజరై ఢిల్లీలో మాకాం వేసిందన్నారు. బిర్లా యాజమాన్యంపై చర్యలు తీసుకోవడంతో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. కింగ్‌ఫిషర్ యాజమాని విజయ మాల్య వేల కోట్ల రూపాయలు ఎగవేసి విదేశాల్లో దాక్కున్నట్లుగా బిర్లా యాజమాన్యం కూడా ఎస్పీఎంపై రూ.420కోట్లు బ్యాంకులకు ఎగనామం పెట్టి ఢిల్లీలో తలదాచుకున్న చర్యలు తీసుకోవడంలో కేసీఆర్ ఎందుకు వెనకంజ వేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు.
ఈ నెల 6న కార్మిక కుటుంబాలు కేసీఆర్ ను కలిసేందుకు వెళ్తుతున్న సంగతి తెలిసిందే. కేసీఆర్ సీఎం అయ్యాక మూతపడిన పరిశ్రమలలో ఎస్పీఎం మొదటిదన్నారు. అధికారంలోకి వచ్చిన మూడు మాసాల్లోనే మిల్లును తెరిపిస్తామని హామీ ఇచ్చిన సీఎం తర్వాత గాలికి వదిలేయడటం అన్యాయమన్నారు. ఇంతవరకు 20మంది ఎస్పీఎం కార్మికులు ఆత్మహత్య చేసుకున్నా ప్రజాప్రతినిధులు కనికరించలేదన్నారు. కార్మికశాఖ, హోంశాఖ మంత్రిగా ఉన్న నాయిని నర్సింహారెడ్డి ఎస్పీఎం కార్మిక సంఘం అధ్యక్షుడిగా కొనసాగుతూ గత 20 మాసాల్లో ఒక్కసారి కూడా ఎస్పీఎం కార్మికుల బతుకులపై స్పందించపోవడం శోచనీయమన్నారు. దీంతో సీఎం, కార్మికశాఖ మంత్రులకు కార్మికులపై ఎంత అభిమానం ఉందో తేటతెల్లమవుతుందన్నారు.
కేసీఆర్ పచ్చి స్వార్థపరుడు
ముఖ్యమంత్రి పచ్చి స్వార్థపరులని గుండా మల్లేశ్ ఉదాహరించారు. సిద్దిపేట, తదితర తమ నియోజక వర్గాల అభివృద్ధికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారే తప్ప ఇతర నియోజకవర్గాలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అసెంబ్లీలో ఇచ్చిన పవర్‌పారుుంట్ ప్రెజెంటేషన్ నటనతో ఈ విషయం బయటపడిందన్నారు. ప్రాణహిత-చేవేళ ్ల ప్రాజెక్టును రద్దుతో ఆయన నైజం తెలిసిందన్నారు. 152 మీటర్ల ఎత్తు ఉన్న తుమ్మిడిహెట్టి బ్యారేజీని 148 మీటర్ల ఎత్తుకు తగ్గించి మహారాష్ట్ర ప్రభుత్వంలో ఒప్పందం చేసుకోవడంలో మతలబు ఏమిటో ప్రజలకు చెప్పాలన్నారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి సత్యనారాయణ, సీపీఐ కార్యదర్శి అంబాల ఓదెలు, నాయకులు మల్లయ్య, శంకర్ పాల్గొన్నారు.