అసమ్మతి సెగ...అధినేత పొగ
- గంటా తీరుపై సీఎం అసంతృప్తి
- సర్వే ఫలితాలే సంకేతం
- పెరుగుతున్న వైఫల్యాల చిట్టా
- మంత్రి శిబిరంలో మొదలైన గుబులు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: మంత్రి గంటా శ్రీనివాసరావు చాపకిందకునీళ్లు వస్తున్నాయా!?... ఇన్నాళ్లు జిల్లాలో వైరివర్గాల పోరుతోనే సతమతమవుతున్న ఆయనపై అధినేత చంద్రబాబు గుర్రుగా ఉన్నారా!?... టీడీపీలో తాజా పరిణామాలు అవుననే సంకేతమిస్తున్నాయి. ఇంటా బయటా ఆయన రాజకీయంగా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. తాజాగా ప్రభుత్వం నిర్వహించినట్లుగా చెబుతున్న సర్వేలో గంటాకు ప్రతికూల ఫలితాలు వచ్చాయన్న సమాచారం టీడీపీలో హాట్‌టాపిక్‌గా మారింది. ‘గంటా పని అయిపోయిం ది’అని నగరానికి చెందిన ఓ ఎమ్మెల్యే వ్యా ఖ్యానించారని టీడీపీవర్గాలు చెబుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. త్వరలో మంత్రివర్గ పునర్వ్వస్థీకరణ ఉండొచ్చనే సంకేతాల నేపథ్యంలో తాజా పరిణామాలు గంటా వర్గంలో గుబులు మొదలైంది.
ఇంటా బయటా గడ్డు పరిస్థితి: జిల్లాలో మంత్రి అయ్యన్నవర్గంతో గంటాకస నిత్య కలహమే. అయ్యన్న వర్గానికి బాలకృష్ణ, సీఎం కుమారుడు లోకేష్ మద్దతు ఉందన్న ప్రచారం గంటాను కలవరపరుస్తోంది. మరోవైపు గంటా వ్యవహార శైలిపట్ల సీఎం చంద్రబాబు కొంతకాలంగా గుర్రుగా ఉన్నారని తెలుస్తోంది. కీలకమైన వ్యవహారాల్లో గంటా స్వతంత్రంగా వ్యవహరించడం చంద్రబాబుకు ఆగ్రహం తెప్పించినట్లు సమాచారం. తెలంగాణా ప్రభుత్వంతో వివాదాలను రాష్ట్రానికి అనుకూలంగా పరిష్కరించడంలో గంటా తగిన చొరవ చూపించలేదన్న ముద్ర పడింది. ఉన్నత విద్యామండలి, ఎంసెట్, తాజాగా అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం... ఇలా విద్యా శాఖకు సంబంధించిన అన్ని వ్యవహారాల్లోనూ రాష్ట్రం మాట చెల్లుబాటు కావడం లేదు. శాఖపై గంటా పట్టుసాధించలేకపోయారని సీఎం భావిస్తున్నారు. మరోవైపు కౌన్సెలింగ్‌తో నిమిత్తం లేకుండా నేరుగా ఉపాధ్యాయుల బదిలీలు చేస్తామని ప్రకటించడం తీవ్ర వివాదాస్పదమైంది. దీనిపై ఉపాధ్యాయసంఘాలు ఆందోళన చేశాయి.
చివరికి సీఎం జోక్యం చేసుకుని కౌన్సెలింగ్ ద్వారానే బదిలీలు చేస్తామని ఉపాధ్యాయ సంఘాలకు చెప్పుకోవాల్సి వచ్చింది. తాజాగా నాగార్జున విశ్వవిద్యాలయంలో విద్యార్థిని ఆత్మహత్య సంఘటనపై కూడా గంటా సత్వరం స్పందించకపోవడం విమర్శలకు దారితీసింది. భోగాపురం ఎయిర్‌పోర్టుకు భూసేకరణ అంశంలో గంటా వ్యవహారాల శైలిపై అయ్యన్నవర్గం నేరుగా సీఎం చంద్రబాబుకే ఫిర్యాదు చేసింది. ఇలా ఒక్కోక్క అంశం గంటాకు వ్యతిరేకంగా పరిణమిస్తూ వచ్చింది.
సర్వే చంద్రబాబు సంకేతమా!? : సర్వే ఫలితాలు గంటా వర్గంలో గుబులు పుట్టిస్తున్నాయి. రైతు-డ్వాక్రా రుణమాఫి, పింఛన్లు తదితర ప్రభుత్వ కార్యక్రమాలపై నిర్వహించిన సర్వే ఫలితాలను సీఎం విజయవాడలో ప్రకటించారు. వాటిలో భీమిలి నియోజకవర్గంలో సర్వే ఫలితాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అక్కడ ఎమ్మెల్యే పనితీరు బాగాలేదని సీఎం పరోక్షంగా సంకేతాలు ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. సర్వే అన్నదే లేదని... కేవలం గంటాను తప్పించేందుకు దీన్నో అవకాశంగా సీఎం తెరపైకి తెచ్చారని కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గంటా పని అయిపోయిందని జిల్లాలో ఆయన వైరివర్గం విసృ్తతంగా ప్రచారం చేస్తోంది. నగరానికి చెందిన ఓ ఎమ్మెల్యే కూడా కొందరితో మాట్లాడుతూ ఇదే వ్యాఖ్యలు చేయడం గమనార్హం.