ఎంవీపీ కాలనీలోని తన ఇంట్లో హుద్‌హుద్ బాధితులకు కేటాయించిన ఫ్లాట్ల నంబర్లు అందిస్తున్న మంత్రి గంటా శ్రీనివాసరావు
బహిరంగ ప్రదేశంలో.. సంబంధితులందరి సమక్షంలో తీయాల్సిన లాటరీని.. నాలుగ్గోడల మధ్య అనుకూలమైన కొద్దిమంది సమక్షంలో మమ అనిపించేశారు..వేల సంఖ్యలో నిర్మిస్తున్న హుద్‌హుద్ బాధితులకు నిర్మిస్తున్న ఫ్లాట్ల కేటాయింపు ప్రహసనమిది.. అది కూడా ఒక మంత్రి ఇంట్లో జరగడం ఆరోపణలకు, విమర్శలకు ఆస్కారమిస్తోంది.నాలుగేళ్ల క్రితం కకావికలం చేసిన హుద్‌హుద్ తుపానులో నష్టపోయిన వారి కోసం గ్రామీణ ప్రాంతంలో 810, ఆర్బన్ ప్రాంతంలో 4434 ఇళ్లు మంజూరు చేశారు. వీటిలో దాదాపు సగం మంత్రి గంటా నియోజకవర్గమైన భీమిలికే పోయాయి. నాలుగేళ్లపాటు ముక్కుతూ.. మూలుగుతూ ఎట్టకేలకు 2268 ఇళ్ల నిర్మాణం పూర్తి చేశారు. వీటిని కేటాయించేందుకే శుక్రవారం మంత్రి గంటా ఇంట్లో లాటరీ తీసి.. అక్కడికక్కడే కొందరికి పత్రాలు పంపిణీ చేసేశారు. మంత్రి అనుచరులకు, టీడీపీ కార్యకర్తలకు ఇళ్లు దక్కేలా చేసేందుకే ఈ మంత్రాంగం నెరిపారని మిగతా బాధితులు ఆరోపిస్తున్నారు.
సాక్షి, విశాఖపట్నం: సాధారణంగా హౌసింగ్ కాలనీలో ఫ్లాట్ల్ల కేటాయింపు లబ్ధిదారుల సమక్షంలో ఆ కాలనీలోనే చేపడతారు. ఎవరికీ అన్యాయం జరగకుండా ఉండేందుకు అందరూ చూస్తుండగా లాటరీ పద్ధతిలో కేటాయింపులు జరుపుతారు. కానీ ఇందుకు విరుద్ధంగా శుక్రవారం రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖలోని తన ఇంట్లో అతికొద్ది మంది లబ్ధిదారుల సమక్షంలో హుద్‌హుద్ ఫ్లాట్ల కేటాయింపు కోసం లాటరీ తీయడం పలు అనుమానాలకు తావిస్తోంది. అనర్హులకు ఇళ్ల కేటాయింపులు.. అడ్డగోలు దోపిడీపై ఎన్ని ఆరోపణలు వచ్చినా జిల్లా హౌసింగ్ అధికారుల స్టైలే వేరు. మంత్రులు, అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల ప్రాపకాన్ని పొందేందుకు వారు చూపిస్తున్న అత్యుత్సాహానికి ఈ ఘటన మరో ఉదాహరణగా నిలుస్తోంది.
సరిగ్గా మూడున్నరేళ్ల క్రితం విరుచుకుపడిన హుద్‌హుద్ తుపాన్ దెబ్బకు వేలాది మంది నిలువ నీడలేకుండా కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. విశాఖ జిల్లాలోనే లక్ష మందికిపైగా నిర్వాసితులు కాగా.. హుద్‌హుద్ పునర్నిర్మాణం పేరిట ఉత్తరాంధ్ర మూడు జిల్లాలకు కలిపి పదివేల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఏడాదిలోగా పూర్తి చేసి ఇవ్వాలని లక్ష్యం కాగా.. ఇంకా పూర్తి కాని దుస్థితి. ఇక విషయానికి వస్తే విశాఖ జిల్లాలో హుద్‌హుద్ బాధితుల కోసం గ్రామీణ ప్రాంతంలో 810, అర్బన్ ప్రాంతంలో 4434 ఇళ్లు మంజూరు చేశారు. వీటిలో అత్యధికంగా 2484 ఇళ్లు మంత్రి గంటా శ్రీనివాసరావు సొంత నియోజకవర్గమైన ఒక్క భీమిలికే కేటాయించారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 2268 ఇళ్ల నిర్మాణం పూర్తి కాగా, భీమిలిలో 784 ఇళ్ల నిర్మాణం పూర్తయింది.
వీటి కోసం కాలనీ వద్దే మొత్తం లబ్ధిదారుల సమక్షంలో ఫ్లాట్ల కేటాయింపు జరగాలి. కానీ ఇందుకు భిన్నంగా శుక్రవారం ఎంవీపీ కాలనీలోని తన స్వగృహంలో మంత్రి గంటా ఫ్లాట్ల కేటాయింపు కోసం లాటరీ తీశారు. ఫ్లాట్లు దక్కించుకున్న పార్టీ కార్యకర్తలు, అనుచరులను ఇంటికి పిలిచి వారికి ఫ్లాట్ల కేటాయింపు చేయడం వివాదాస్పదమవుతోంది. తమ అనుచరులకు అనువుగా ఉండే ఫ్లాట్లనే లాటరీలో పెట్టి కేటాయింపులు జరిపారన్న విమర్శలు విన్పిస్తున్నాయి. 216 మందికి గంటా ఇంట్లో లాటరీ ద్వారా కేటాయింపులు జరపడంపై మిగతా లబ్ధిదారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కాలనీలో అందరి సమక్షంలో తీయాల్సిన లాటరీని గంటా ఇంట్లో తీయడమేమిటని ప్రశ్నిస్తున్నారు. పారదర్శకతకు తూట్లు పొడుస్తూ హౌసింగ్ అధికారులు మంత్రి ప్రాపకం కోసమే ఈ పని చేశారని, ఈ లాటరీని రద్దు చేసి గృహ సముదాయం వద్దే అందరి సమక్షంలో ఫ్లాట్ల కేటాయింపు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment