అటు టీ సర్కారు.. ఇటు ఏపీ ప్రభుత్వం | two governments Confused | Sakshi
Sakshi News home page

అటు టీ సర్కారు.. ఇటు ఏపీ ప్రభుత్వం

Published Mon, Dec 1 2014 1:05 AM | Last Updated on Tue, Aug 21 2018 8:34 PM

అటు టీ సర్కారు..  ఇటు ఏపీ ప్రభుత్వం - Sakshi

అటు టీ సర్కారు.. ఇటు ఏపీ ప్రభుత్వం

తరతరాల నుంచి తెలంగాణతో బంధం.. పోలవరం ముంపు నేపథ్యంలో తమ ప్రాంతాలను ఆంధ్రలో  కలుపుతూ రాష్ట్రపతి గెజిట్ వెలువడినా రాజకీయ నేతల గందరగోళ ప్రకటనల మధ్య కొంతకాలం అయోమయం... చివరికి తెలంగాణ సర్కారు సమగ్ర సర్వేకు దూరం పెట్టడంతో ఇక ఆంధ్రతోనే తమ భవిష్యత్తు అని నిర్ధారించుకుని మమేకమయ్యే యత్నం.. మరోవైపు ముంపు ప్రాంతాల ప్రజలను ప్రత్యేక పాలనతో ఉద్ధరిస్తామంటూ ఏపీలోని టీడీపీ ప్రభుత్వం ఆర్భాటపు ప్రకటనలు తప్పించి నెలలు గడుస్తున్నా కనీస సౌకర్యాలు కల్పించని వైనం.. ప్రాథమిక వసతుల మాట దేవుడెరుగు.. ఇప్పటివరకు తమ గోడును వినేందుకు కూడా ఎవరూ  కన్నెత్తి చూడటం లేదంటూ ముంపు ప్రాంతవాసుల ఆందోళన.. చివరికి అటు టీ సర్కారు.. ఇటు ఏపీ ప్రభుత్వం.. రెండింటికీ  చెడ్డ రేవడిలా మిగిలిపోతామేమో అంటూ భవిష్యత్తుపై బెంగతో అల్లాడిపోతున్న కుకునూరు, వేలేరుపాడు మండలాల ప్రజల దురవస్థపై ‘సాక్షి’ ప్రత్యేక కథనమిది.
 
 (కుకునూరు, వేలేరుపాడుల నుంచి సాక్షి ప్రతినిధి) :మూడేళ్లలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామంటూ ఇప్పటివరకు చెబుతూ వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం తాజాగా నాలుగున్నరేళ్లలో పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటామంటూ ప్రకటనలు చేస్తోంది. ఇప్పటికీ కనీసం ప్రకటనల్లోనే స్పష్టత లేని పాలకులు అసలు పోలవరం ముంపు మండలాల ప్రజను ఇంతవరకు పట్టించుకోలేదు. తెలంగాణ నుంచి ఆంధ్రలోకి
 
 విలీనమైన కుకునూరు, వేలేరుపాడు మండలాలతో పాటు బూర్గంపహాడ్‌లోని ఆరు గ్రామాల ప్రజలకు ప్రత్యేకపాలన అందిస్తామంటూ చెబుతూ వచ్చిన అధికారులు ఆ రెండు మండల కేంద్రాల్లో ఒకటికి రెండుసార్లు మీటింగులు పెట్టడం తప్పించి గ్రామాల వైపు కన్నెత్తి చూడలేదు. అధికారులే కాదు.... అధికార పార్టీకి చెందిన ఏ ఒక్క నాయకుడూ ఇంతవరకూ ఆయా పల్లెల్లో ఒక్కసారి కూడా పర్యటించలేదు. అక్కడి పరిస్థితులన్నీ సజావుగా ఉంటే ఎవరు వచ్చినా రాకున్నా సమస్యలేదు. కానీ ప్రభుత్వ ‘గుర్తింపు’ సమస్య మొదలుకుని రేషన్ బియ్యం, నిత్యావసర వస్తువుల పంపిణీ వరకు అన్నీ సమస్యలతోనే అక్కడి వాసులు కొట్టుమిట్టాడుతున్నారు.
 
 పెన్షన్లు నిలిపివేసిన తెలంగాణ... అరకొరగా విదిలిస్తున్న ఆంధ్ర
 కుకునూరు, వేలేరుపాడు మండలాల్లోని వృద్ధులు, వికలాంగులు, వితంతువు, అభయహస్తం పెన్షన్లను ఆగస్టు నెల వరకు టీ సర్కారు పంపిణీ చేయగా, ఆ తరువాత జరిగిన సమగ్ర సర్వే అనంతరం నిలిపివేసింది. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలలకు సంబంధించిన పెన్షన్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది. వేలేరుపాడు మండలంలో మొత్తం 1791 పెన్షన్ల లబ్ధిదారులుండగా ఇందులో 830 వృద్ధాప్య,  739 వితంతు, 64 అభయహస్తం, 158 వికలాంగ లబ్ధిదారులున్నారు. వీరిలో సగానికి సగం మందికి గత మూడునెలలుగా పెన్షన్లు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక కుకునూరులో సుమారు 3263 మంది లబ్ధిదారులుండగా, వివిధ సాకులు చూపి 460 మందికి ఇప్పటికీ పెన్షన్లు అందించడం లేదు.
 
 నేటికీ అందని పంట నష్టం
 ఆగస్టు నెలలో సంభవించిన గోదావరి వరదలకు ఈ రెండు మండలాల్లో ఐదు వేల ఎకరాల్లో పత్తి పంట పూర్తిగా నాశనమైంది. ఇప్పటి వరకు ఏపీ ప్రభుత్వం నష్టపరిహారం అందించలేదు. తెలంగాణ పరిధిలోకి వచ్చే పొరుగు మండలాల రైతులకు పరిహారం అందినా వీరికి మాత్రం ఇంకా దక్కలేదు. పంట నష్టం సర్వే చేయమని మొత్తుకుంటే ఎట్టకేలకు ఇటీవల ఆంధ్ర వ్యవసాయ శాఖాధికారులు వచ్చి సర్వే చేపట్టారని రైతులు తెలిపారు.
 
 మధ్యాహ్న భోజనానికి  సరఫరా కాని బియ్యం
 రెండు నెలల కిందటి వరకు విద్యార్థుల సంక్షేమ హాస్టళ్లకు తెలంగాణ  ప్రభుత్వం నుంచి విడుదలయ్యే బియ్యం ఇప్పుడు ఆగిపోయూరుు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి సరఫరా కాకపోవడంతో నిర్వాహకులు అప్పులు చేసి బయట బియ్యాన్ని కొనుగోలు చేసి విద్యార్థులకు వండి పెడుతున్నారు. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించి బియ్యం సరఫరా కాలేదని పేరు చెప్పడానికి ఇష్టపడని అధికారి వెల్లడించారు.
 
 పరిహారం ఊసే లేదు
 పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా పంటలు కోల్పోయే రైతులకు ఇవ్వాల్సిన నష్టపరిహారంపై ఇప్పటివరకు అధికారుల నుంచి కనీస ప్రస్తావన కూడా ఎక్కడా రావడం లేదని ఆయా గ్రామాల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న కాలంలో 2006 సంవత్సరంలో ప్రాజెక్టు నిర్మాణం కోసం రైతుల భూములను తీసుకున్న అప్పటి ప్రభుత్వం ఎకరాకు రూ.లక్షా15 వేల చొప్పున న ష్ట పరిహారం ఇచ్చింది. కుకునూరు మండలంలోని గొమ్ముగూడెం, విజరం, కొండపల్లి గ్రామాల రైతులు అప్పట్లో పరిహారం పొందారు. అప్పటి నుంచి ఇప్పటివరకు మిగిలిన గ్రామాల రైతులకు పరిహారం దక్కలేదు. ఇప్పుడు ఆయా గ్రామాలు ఆంధ్రప్రదేశ్‌లో విలీనం కావడంతో తెలుగుదేశం ప్రభుత్వమే పరిహారం చెల్లించాల్సి ఉంది. కానీ ఆ ప్రస్తావన కూడా ఇంతవరకు తమ వద్ద ఎవరూ తేలేదని రైతులు చెబుతున్నారు. వేలేరుపాడు మండలంలోని అన్ని గ్రామాల్లో భూమికి భూమి ఇచ్చే విధానాన్ని అమలు చేయకపోవటంతో ఆరు ఎకరాల లోపు భూమి ఉన్న రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటు బ్యాంకుల్లో రుణాలు రాక, అటు ప్రభుత్వం నుంచి సహాయం అందక పంటలు సాగు చేసేందుకు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు.
 
 పునరావాసం ప్రస్తావనే లేదు
 ఇక పునరావాసం గురించి ఇప్పటివరకు ఎవ్వరూ మాట్లాడటం లేదని ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పునరావాసం ఎక్కడ కల్పించనున్నారు.. మా పరంగా ఉన్న ఇబ్బందులేంటి అని అడిగే నాధుడే లేడని కుకునూరు మండలం నల్లకుంటలోని యువకుడు శీలం రమేష్ ‘సాక్షి’ ప్రతినిధి వద్ద ఆందోళన వ్యక్తం చేశారు.
 
 ఇంకా టీ సర్కారు వెబ్‌సైట్‌లోనే   రెండు మండలాలు
 ఇప్పటికీ కుకునూరు, వేలేరుపాడు మండలాలకు సంబంధించిన సమాచారం టీ సర్కారు అధికారిక వెబ్‌సైట్‌లోనే కొనసాగడం పాలనాపరంగా ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. సర్టిఫికెట్లు, కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలు ఇప్పటికీ తెలంగాణ ప్రభుత్వ ముద్రతోనే వస్తున్నాయి. దీంతో 42 రెవెన్యూ గ్రామాల ప్రజలు రుణాలు తీసుకోవాలన్నా, భూముల క్రయవిక్రయాలు, రిజిస్ట్రేషన్లు చేసుకోవాలన్నా ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.
 
 అధికారులు గ్రామాల్లో పర్యటించాలి
 అధికారులు గ్రామాల్లో పర్యటించి సమస్యలు తెలుసుకోవాలి. రైతులకు సరైన ధర చెల్లించి భూములు తీసుకోవాలి. ఇప్పటికే భూ సేకరణ చేసి తొమ్మిది సంవ త్సరాలు అయింది. బ్యాంకు రుణాలు ఇవ్వక పోవటంలో ప్రయివేటు వ్యాపారుల వద్ద వడ్డీకి తీసుకువచ్చి వ్యవసాయం చేస్తున్నారు. దీంతో నష్టం జరుగుతుంది. నష్టపోయిన పంటలకు కనీసం సర్వే కూడా చేయటం లేదు. సర్వే చేసిన వాటికి పరిహారం అందలేదు.
 - దాసరి సాయి, ప్రగతిశీల యువజన సంఘం కార్యదర్శి
 
 ఏ ఒక్క అధికారి కూడా మా గ్రామంలో పర్యటించలేదు
 మొత్తం గిరిజనులు నివసించే మా నల్లకుంట తండాను ఇంతవరకు ఒక్క అధికారి కానీ, ప్రజాప్రతినిధి కానీ సందర్శించలేదు. మా గ్రామంలో ఆడ మగ అందరం కూలి పనికి పోతాం. పని నుంచి వచ్చాక మంచినీళ్ల కోసం మళ్లీ కిలోమీటర్ల దూరం నడచి వెళ్లి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఏ రాష్ట్ర అధికారులైనా ఫరవాలేదు..  మా సమస్య పరిష్కరిస్తే చాలు.. అన్నట్టుంది మా పరిస్థితి.       - శీలం రుక్మిణి, నల్లకుంట పంచాయతీ సభ్యురాలు
 
 ఇప్పటికీ జీతాలు టీ సర్కారు నుంచే
 మేము మానసికంగా కూడా ఆంధ్రలో కలిసిపోయాం. కానీ మాకు జీతాలు ఇప్పటికీ తెలంగాణ  సర్కారు నుంచే వస్తున్నాయి. అధికారులు మా సమస్యల పరిష్కార దిశగా నిర్ణయాలు తీసుకోవాలి. పాఠశాలల్లో కనీస సదుపాయాలు కల్పించాలి. ప్రత్యేక పాలన అని ఘనంగా ప్రకటించిన అధికారులు ఆ దిశగా ఏ చర్యలూ తీసుకోవడం లేదు.
 బుక్యా హిరాముల్, టీచర్, గిరిజన పాఠశాల, నల్లకుంట
 
 డీఎస్సీలో మా పరిస్థితి ఏంటో
 ఆంధ్రలో కొత్తగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చింది. మేం ఎలా దరఖాస్తులు చేసుకోవాలి? ఈ సేవలో సాఫ్ట్‌వేర్ మార్చలేదు. అంతా గందరగోళంగా ఉంది.
 - చెరువుకట్ల సతీష్‌కుమార్, బెస్తగూడెం, దాచారం పంచాయతీ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement