ఇప్పటి వరకూ పథకంలో 17,015 మంది తల్లులు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. అయితే వీరిలో 7,621 మందికి మాత్రమే మొదటి విడత నగదు అందించారు. మిగిలిన వారికి నగదు ఎప్పుడు వస్తుందో కూడా అధికారులు చెప్పలేని స్థితిలో ఉన్నారు. దాదాపు ఏడాది నుంచి పథకానికి సంబంధించి రూపాయి కూడా ప్రభుత్వం చెల్లించడంలేదు. దరఖాస్తు చేసుకున్న వారిలో 16,014 మంది తల్లులకు మాత్రమే ఆధార్ ఉంది. 9394 మంది బాలింతలు పథకానికి సంబంధించిన మొదటి విడత చెల్లింపులకు ఎదురుచూపులు చూస్తున్నారు.ఒంగోలు సెంట్రల్: ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించిన బంగారు తల్లి పథకం లబ్ధిదారుల దరిచేరడం లేదు. 2013 మే 1 నుంచి ప్రారంభమైన ఈ పథకం ఆది నుంచి బాలారిష్టాలు ఎదుర్కొంటోంది. కొత్తగా అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని ‘మహాలక్ష్మి’గా మార్చి అమలు చేస్తామంది. కానీ దాని ఊసే పట్టించుకోలేదు.
ఇప్పటికే చేరిన లబ్ధిదారులకు మొదటి విడత రూ.2,500 కూడా చెల్లించలేని పరిస్థితి. 2013 మార్చి నుంచి మే 24వ తేదీ వరకు ఎన్నికల కోడ్ నేపథ్యంలో బంగారు తల్లి పథకానికి సంబంధించి చెల్లింపులు జరగలేదు. అనంతరం రాష్ట్ర విభజనతో ఇప్పటి వరకు చెల్లింపు ప్రక్రియ నిలిచిపోయింది. బాండ్‌లు కూడా అందజేయలేదు. దీంతో పేద, బలహీనవర్గాల కుటుంబాల్లో ఆడపిల్లలు పుట్టిన బాలింతలు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఈ పథకం సెంట్రల్ బ్యాంకు ద్వారా అమలవుతోంది. అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన లబ్ధిదారుల ఖాతాలను వేరుపరిచే ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతోంది. పథకంలో చేరేందుకున్న నిబంధనలతో చాలా మంది అర్హత ఉన్నా..పథకానికి దూరమవుతున్నారు. కొత్తగా వివాహం అయిన వారికి ఆధార్‌కార్డు కానీ, రేషన్‌కార్డు కానీ ఉండదు. దీంతో వీరి పిల్లలకు ఈ పథకం వర్తించడం లేదు.
ఆధార్ లేనివారు 1001 మంది:
తెలుపు రేషన్ కార్డు ఉన్న బడుగు, బలహీన వర్గాల కుటుంబాల్లో పుట్టిన ఆడబిడ్డలకు అసరాగా ఉండటానికి ఉద్దేశించిన బంగారు తల్లి పథకం ఆడబిడ్డలకు ఆసరా ఇవ్వడంలేదు. చాలా మంది బాలింతలకు ఆధార్ కార్డులు లేవు. ఇప్పటికీ ఆధార్ లేని బాలింతలు 1001 మంది వరకూ ఉన్నారు. ఏఎన్‌ఎంలు గర్భిణిల పేర్లను నమోదు చేయాలి. అంగన్‌వాడీ కార్యకర్తలు జననాలను నివేదించాలి. గ్రామాధికారి ఆన్‌లైన్‌లో బాలిక వివరాలు న మోదు చేసి పాఠశాలకు వె ళ్లే వరకూ పర్యవేక్షించాలి. పాఠశాలల్లో హెచ్‌ఎంలు, కళాశాలల్లో చేరిన తర్వాత ప్రిన్సిపల్స్ వారి వివరాలను నమోదు చేయాలి. బంగారు తల్లి పథకాన్ని ఆధార్‌కు అనుసంధానం చేశారు. ఆధార్ ద్వారానే కుటుంబాలను గుర్తిస్తారు. ఎలక్ట్రానిక్ పేమెంట్ విధానంలో నేరుగా బాలికల బ్యాంకు ఖాతాలకే నగదు చెల్లిస్తారు. వీటికి బయోమెట్రిక్ విధానం కూడా పరిగణలోకి తీసుకుంటారు.
‘బంగారు తల్లి’తో ఉపయోగాలివీ...
బంగారు తల్లి పథకం కింద 2013వ సంవత్సరం మే 1 తరువాత జన్మించిన ఆడపిల్లలకు రూ.2,500లను ఖాతాలో జమ చేస్తారు. బాలిక మొదటి పుట్టిన రోజు వెయ్యి రూపాయలు చెల్లిస్తారు. రెండో సంవత్సరం వచ్చేసరికి మరో వెయ్యి ఇస్తారు. మూడో సంవత్సరం అంగన్‌వాడీ కేంద్రంలో చేర్పిస్తే రూ.1500 జమచేస్తారు. ఇలా నాలుగైదేళ్లకు ఏటా రూ.1500 చొప్పున చెల్లిస్తారు. బాలిక మొదటి తరగతి నుంచి ఐదో తరగతి వరకు ఏడాదికి రూ.2 వేలు చొప్పున ఇస్తారు. బాలిక 6,7,8, తరగతులు చదివే వరకూ ఏడాదికి రూ 2,500 జమ చేస్తారు. బాలిక 9,10 తరగతులు చదివే సమయంలో ఏడాదికి రూ.3 వేలు చొప్పున చెల్లిస్తారు. ఇంటర్మీడియెట్ రెండు సంవత్సరాలకు ఏడాదికి రూ.3500ల చొప్పున జమ చేస్తారు. డిగ్రీలో చేరిన అనంతరం వరుసగా మూడు సంవత్సరాలు రూ.4 వేలు జమ చేస్తారు. డిగ్రీ పూర్తయిన తర్వాత ప్రభుత్వం ఆమె పేరిట లక్ష రూపాయలు జమ చేస్తుంది.
ఎక్కడమ్మా ‘బంగారు తల్లి’
Published Mon, Jan 19 2015 4:19 AM | Last Updated on Sat, Sep 2 2017 7:52 PM
Advertisement