కలిసికట్టుగా పనిచేస్తే భవిత మనదే
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ‘జిల్లాలో మంచి నాయకత్వం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో మనకు చాలా పట్టుంది. అంతా కలసిమెలసి పనిచేస్తే ఫలితాలు సాధించొచ్చు’ అని వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ జిల్లా నేతలకు సూచించారు. బుధవారం ఉదయం హైదరాబాద్‌లో జిల్లా పార్టీ నేత లు జగన్‌ను కలిసి ఇక్కడి పరిస్థితిపై కాసేపు చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి జిల్లాలో పరిస్థితిని వివరించారు. పట్టణ ప్రాంతాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు అంతా కష్టపడి పనిచేయాలని జగన్ సూచించారు.
గత ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి వచ్చిన ఓట్లపై విశ్లేషించారు. ఓటు బ్యాంకును కాపాడుకోవాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మోసపూరిత హామీలతో గద్దెనెక్కారని, ప్రజల్ని రుణమాఫీ పేరిట మోసం చేస్తున్నారని, ప్రజలకు అర్థమయ్యేలా అన్నీ వివరించాలని నేతలకు జగన్ సూచించారు. టీడీపీ ప్రభుత్వం అసంబద్ధమైన ప్రకటనలు చేస్తూ కాలం గడుపుతోందని, ప్రజలు ఆ మోసాలకు బలైపోకుండా చూడాలని ఉద్బోధించారు. వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ నిత్యం ప్రజల పక్షానే పోరాడుతుందని, ప్రజలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోదని, అవసరమైతే పోరాటాలకు దిగాలని నేతలకు సూచించారు.
అదే విధంగా క్యాడర్‌కు కూడా భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామస్థాయి నుంచి అన్ని స్థాయిల్లోనూ కమిటీలు నియమించి పార్టీ పట్ల ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని కాపాడుకోవాలన్నారు. సమావేశాలు పెట్టి కార్యకర్తలకు పార్టీ కార్యక్రమాలు తెలియజేసి, పార్టీ పట్ల ప్రజల్లో విశ్వసనీయత ఉండేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి ధర్మాన ప్రసాదరావు సహా మరికొందరు నేతలు పాల్గొన్నారు.