జేఎన్‌టీయూ ఏర్పాటు చేయాల్సిందే..
లేదంటే ఉద్యమిస్తాం పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి
నరసరావుపేట : మండలంలోని కాకాని వద్ద కాకినాడ జవహల్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (జేఎన్‌టీయూ) ఇంజినీరింగ్ కళాశాలను ఏర్పాటు చేయకపోతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మాజీ ముఖ్యమంత్రులు కాసు బ్రహ్మానందరెడ్డి, టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి వేడుకల్లో పాల్గొనేందుకు శుక్రవారం నరసరావుపేటకు వచ్చిన ఆయన పీసీసీ క్రమశిక్షణ సంఘ చైర్మన్, మాజీ మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి సూచన మేరకు జేఎన్‌టీయూకు కేటాయించిన స్థలాన్ని పరిశీలించి విలేకర్లతో మాట్లాడారు. గత ప్రభుత్వం రూ.50 కోట్ల విలువైన 87 ఎకరాల స్థలాన్ని జేఎన్‌టీయూకు కేటాయిస్తూ జీవో జారీ చేసిందన్నారు.
అయితే ఇదే స్థలాన్ని పారిశ్రామిక వాడ కోసం ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం నల్ల జీవో ఇచ్చిందని, దానిని వెంటనే రద్దు చేయాలని కోరారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. జేఎన్‌టీయూపై చంద్రబాబు హామీ ఇచ్చిన మూడు నెలలకే..ఏపీఐఐసీకి అప్పగించడం దారుణమన్నారు. పారిశ్రామిక వాడల పేరుతో ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెగబడుతుందని విమర్శించారు. ఆయన వెంట డీసీసీ అధ్యక్షుడు మక్కెన మల్లికార్జున రావు స్థానిక నాయకులు ఉన్నారు.