తిరుపతిలో కదం తొక్కిన జర్నలిస్టులు
పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు వేయొద్దని నిరసన
చిత్తూరు, పుంగనూరు ప్రాంతాల్లో భగ్గుమన్న వైఎస్‌ఆర్‌సీపీ
28 మండలాల్లో ఆందోళనలు
తిరుపతి: సాక్షి టీవీ ప్రసారాల నిలిపివేతకు నిరసనగా జర్నలిస్టులు కదం తొక్కారు. మీడియా గొంతు నొక్కే క్రమంలో టీడీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజాస్వామిక చర్యలపై ధ్వజమెత్తారు. నిలిపివేసిన సాక్షి, నెంబర్ వన్ టీవీ ప్రసారాలను పునరుద్ధరించాలని హితవు పలికారు. జిల్లా వ్యాప్తంగా ఆదివారం జర్నలిస్టులు, వైఎస్సార్‌సీపీ, వామపక్ష, అఖిలపక్ష పార్టీల నాయకులు రోడ్డు మీదకొచ్చి సర్కారు తీరుపై నిరసన తెలియజేశారు. ర్యాలీలు, మానవహారాలు నిర్వహించి అంబేడ్కర్, మహాత్మాగాంధీ విగ్రహాలకు వినతిపత్రాలు అందజేశారు. 28 మండలాల్లో ప్రతిపక్ష, వామపక్ష పార్టీలు ఒక్కటై పత్రికా స్వేచ్ఛ కోసం గొంతెత్తి నినదించాయి.
తిరుపతిలో భగ్గుమన్న జర్నలిస్టులు
తిరుపతి ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 11 గంటలకు జర్నలిస్టులు నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్రెస్‌క్లబ్ నుంచి నాలుగు కాళ్లమండపం మీదుగా బస్టాండ్ వరకూ ర్యాలీ సాగింది. జర్నలిస్టు సంఘాల నాయకులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు ర్యాలీలో పాల్గొని పెద్దఎత్తున నినాదాలు చేశారు. అనంతరం బాపూజీ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. చిత్తూరులో వైఎస్సార్‌సీపీ నగర కన్వీనర్ లాయర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. బీజేపీ, వామపక్ష పార్టీల నాయకులు కూడా ఇందులో పాల్గొన్నారు. గాంధీబొమ్మ సెంటర్‌లో భారీ మాన వహారం నిర్వహించి ఆపైన మహాత్మునికి వినతిపత్రం అందజేశారు. సాయంత్రం వైఎస్సార్‌సీపీ మహిళావిభాగం జిల్లా అధ్యక్షురాలు గాయత్రీదేవి ఆధ్వర్యంలో పార్టీ సానుభూతిపరులు, మహిళలు నగర వీధుల్లో కొవొత్తులతో నిరసన ర్యాలీ నిర్వహించారు. సాక్షి ప్రసారాలను పునరుద్ధరించాలని ఆమె డిమాండ్ చేశారు.
తిరుపతి ఎస్వీయూలో అఖిల పక్ష విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన ప్రదర్శన జరిగింది. విద్యార్థులు నోటికి నల్లరిబ్బను కట్టుకుని మౌనంగా నిరసన తెలిపారు.మదనపల్లి అంబేడ్కర్ సర్కిల్‌లో వైఎస్‌ఆర్‌సీపీ, అంబేడ్కర్ సేన, మాలమహానాడు, ఎంఆర్‌పీఎస్ నాయకులు నిరసన తెలిపారు.}M>-âహస్తి ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు బిక్షాల గోపురం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించి, సూపర్‌బజార్ దగ్గర మానవహారం నిర్వహించారు. గాంధీజీ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చారు.సత్యవేడు నియోజకవర్గంలోని నాగలాపురం, పిచ్చాటూరు మండలాల్లో వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు, జర్నలిస్టులు నిరసన ర్యాలీ నిర్వహించారు.
పలమనేరులో సీపీఎం, సీపీఐ, వైఎస్సార్‌సీపీ నాయకులు అంబేడ్కర్ విగ్రహం దగ్గర నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ దమనకాండను దుయ్యబట్టారు. పీలేరు నియోజకవర్గంలోని కలికిరి, గుర్రంకొండ, కలకడ, కేవీ పల్లి మండలాల్లోనూ నిరసన ర్యాలీలు కొనసాగాయి. పుంగనూరు నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో, పూతల పట్టు, గంగాధరనెల్లూరు నియోజకవర్గాల్లోని తవణంపల్లి, పెనుమూరు, వెదురుకుప్పం, కార్వేటినగరం, పాలసముద్రంతో పాటు కురబలకోట, తంబళ్లపల్లి, పెద్ద తిప్పసముద్రం మండలాల్లో జర్నలిస్టులు, వివిధ పార్టీల నాయకులు ప్రభుత్వ వైఖరిపై నిరసన వ్యక్తంచేశారు.