కాంగ్రెస్ కదం
- మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్
- కాంగ్రెస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా
పాతగుంటూరు: టీడీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. సోమవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు జిల్లా అధ్యక్షుడు మక్కెన మల్లికార్జునరావు నేతృత్వంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కన్నా మాట్లాడుతూ అధికారంలోకి రాగానే రుణమాఫీ చేస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎన్నో ఆంక్షలు విధిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు.
ఖరీఫ్ సీజన్‌లో రైతులకు రుణాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. రుణ మాఫీ చేసి, కొత్తగా రుణాలు మంజూరు చేయకపోతే పార్టీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు కొనసాగిస్తామని హెచ్చరించారు. అలాగే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు చేయాలని, డ్వాక్రా మహిళలు, చేనేత కార్మికుల రుణాలను కూడా పూర్తిగా రద్దుచేయాలని డిమాండ్ చేశారు.
బాబు వచ్చాక జాబు పోయింది: కాసు
మరో మాజీ మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్పుల బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ‘బాబు వస్తే జాబు వస్తుంది’ అని ఎన్నికల సమయంలో టీడీపీ నాయకులు ప్రచారం చేశారని, బాబు అధికారంలోకి రాగానే ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్‌లను తొలగించారని మండి పడ్డారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మక్కెన మల్లికార్జునరావు మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన అన్ని వాగ్దానాలను అమలు పరచాలని, లేని పక్షంలో కాంగ్రెస్‌పార్టీ ప్రజల తరఫున ఉద్యమాలు చేస్తుందని హెచ్చరించారు.
అనంతరం కలెక్టరేట్ నుండి జిల్లాపరిషత్ కార్యాలయం వరకు కాంగ్రెస్‌పార్టీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. అక్కడ ప్రజావాణి నిర్వహిస్తున్న కలెక్టర్ కాంతిలాల్ దండేకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మస్తాన్‌వలి, పార్టీ నాయకులు వహీద్, కొరివి వినయ్ కుమార్, కూచిపూడి సాంబశివరావు, పక్కాల సూరిబాబు, రాంబాబు, రామకృష్ణారెడ్డి, ఎస్‌కె.సుభాని, పి.ఎ.ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.