విజయనగరం మున్సిపాలిటీ :బాబు వస్తేనే జాబు వస్తుందంటూ ఎన్నికలకు ముందు ప్రకటనలు చేసి.. నిరుద్యోగ యువతను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన టీడీపీ సర్కారు తీరుపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కొత్త ఉద్యోగాలు కల్పించే మాట ఎటూలేకపోగా.. ఉన్న ఉద్యోగాల్లో తమ వారిని నియమించుకునేందుకు అన్యాయంగా వ్యవహరిస్తోంది. ఇటీవల కాలంలో జిల్లా వ్యాప్తంగా ఉపాధి హమీ పథకంలో విధులు నిర్వహిస్తున్న 314 మంది ఫీల్డ్ అసిస్టెంట్‌లను పని తీరు ప్రామాణికం పేరుతో అన్యాయంగా తొలగించేశారు. గత నెలాఖరునే ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. అయితే జూన్ నెల నుంచే వారిని నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. రెండు నెలల పాటు వారి నిర్వహించిన విధులకు ఎటువంటి వేతనాలూ ఇవ్వకుండా శ్రమదోపిడీకి పాల్పడ్డారని బాధిత ఫీల్డ్ అసిస్టెంట్లు వాపోతున్నారు.
జిల్లా వ్యాప్తంగా 920 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిలో ఉపాధి పనులను పర్యవేక్షించేందుకు 870 మందిని ఫీల్డ్ అసిస్టెంట్‌లుగా నియమించారు. వీరిలో ఎవరైతే 2014 జూలై 1వ తేదీ నుంచి 2015 సంవత్సరం జూన్ 30వ తేదీ వరకు ఐదు వేల పనిదినాలు కన్నా తక్కువ పని కల్పించటం, వేతనదారులకు కేటాయించిన బడ్జెట్‌ను 75 శాతం వినియోగించని వారిపై వేటు వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా జిల్లాలో 314 మంది సిబ్బందిపై వేటు విధించారు. ఈ మేరకు గత నెల 25న సంబందిత ఫైల్‌పై కలెక్టర్ ఆమోదముద్ర వేశారు. ఈ నెల మొదటి వారంలో తొలగింపు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే తొలగింపు ఉత్తర్వుల్లో మాత్రం.. ‘మీ నియామక కాంట్రాక్ట్ ఈ ఏడాది జూన్ 30తో ముగిసింది... జూలై 1 నుంచి మీ సేవలు అవసరం లేదం’టూ పేర్కొనటం పట్ల బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తాము ఆగస్టు చివరి వారం వరకు విధులు నిర్వహించామని, జూన్ నెలలో తొలగించినట్లు ఉత్తర్వులు జారీ చేస్తే రెండు నెలల వేతనాలు సంగతేంటని వారు వాపోతున్నారు. ఒక్కో ఫీల్డ్ అసిస్టెంట్‌కు నెలకు సరాసరిన రూ.6వేల వరకు వేతనం పొందుతుండగా.. ఈ లెక్కన రెండు నెలల్లో 314 మందికి రూ.37లక్షల 68వేల మొత్తాన్ని నష్టపోవాల్సి ఉంటుంది. ఉన్న ఉద్యోగాన్ని ఎలానూ నిబంధనల పేరుతో తొలగించిన ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం రెండు నెలల విధి నిర్వహణకు వేతనాలు మంజూరు చేయాలని కోరుతున్నారు.
ఉన్నతాధికారులకు నివేదిస్తాం.. : డ్వామా పీడీ ప్రశాంతి
ఇదే విషయంపై డ్వామా పీడీ ప్రశాంతి వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా... వాస్తవానికి ప్రతి ఏడాది జూన్ నెలలో ఫీల్డ్ అసిస్టెంట్‌ల నియామక కాంట్రాక్ట్‌ను రెన్యువల్ చేయటం జరుగుతుందని, ఈ ఏడాది ప్రభుత్వం ఆదేశాలతో పనితీరు సరిగ్గాలేని 314 మంది కి రెన్యువల్ నిలిపివేశామని తెలిపారు. వారు ఆగస్టు వరకు చేసిన రెండు నెలల పనికి సంబంధించి ఉన్నతాధికారులకు నివేదిస్తామని, వారి ఆదేశాలనుసారం తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.
ఆ రెండు నెలల వేతనం మాటేంటి?
Published Thu, Sep 10 2015 11:51 PM | Last Updated on Sun, Sep 3 2017 9:08 AM
Advertisement
Advertisement