కాపులను బీసీల్లో చేర్చాలి
తెలగ, కాపు, బలిజ సంఘాల ధర్నాలు
కేంద్రమంత్రి చిరంజీవికి వినతిపత్రం
సాక్షి, హైదరాబాద్: తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల మాదిరిగా తొమ్మిదో షెడ్యూల్లో చేర్చి కాపులకు పది శాతం అదనపు రిజర్వేషన్ ఇవ్వాలని కాపు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. కాపులకు బీసీ రిజర్వేషన్ పునరుద్ధరించాలని కోరుతూ సోమవారం ఇందిరాపార్కు ధర్నాచౌక్‌లో తెలగ, బలిజ, కాపు ఐక్య కార్యాచరణ వేదిక; తెలగ, కాపు, బలిజ రిజర్వేషన్ సాధన సమితి సంయుక్త ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. కాంగ్రెస్‌పార్టీ 2004, 2009 ఎన్నికలలో తమ ప్రణాళికలో పెట్టినప్పటికీ మాటను నిలబెట్టుకోలేదని నేతలు విమర్శించారు. కాపులకు 1910 నుంచి 1966 వరకు బీసీ రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయని నేతలు గుర్తుచేశారు. కాపు సామాజికవర్గాలను బీసీ జాబితాలో చేరుస్తూ 1994లో అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డి జీవో-30 పేరిట ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ ఇప్పటివరకు అమలుకు నోచుకోలేదని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసే సమయంలో కాపులను బీసీ జాబితాలోకి చేర్చాలనే డిమాండ్‌ను ఉంచారని, ఈ డిమాండ్‌ను నేటికి ఎందుకు పరిష్కారం అయ్యేలా చూడలేదని మంత్రి రామచంద్రయ్యను నిలదీశారు. అనంతరం వారు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవిని కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పార్టీ వారికి ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
గాంధీ భవన్‌వద్ద ధర్నా
కాపు, బలిజ, తెలగ సామాజికవర్గాలను బీసీ జాబితాలో చేరుస్తామని 2004 ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చినా అమలు చేయకపోవడం తప్పేనని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అంగీకరించారు. ఈ విషయంలో తాము క్షమాపణ చెప్పక తప్పదన్నారు. ఆయా సామాజికవర్గాల జేఏసీ ఛైర్మన్ దాసరి రాము ఆధ్వర్యంలో సోమవారం గాంధీభవన్ వద్ద ధర్నా చేశారు. ఈ అంశంపై మంగళవారం కాంగ్రెస్‌కు చెందిన కాపు సామాజికవర్గ నేతలతో సమావేశమై చర్చిస్తామని బొత్స వారికి హామీ ఇచ్చారు.