‘‘ఈడబ్ల్యూఎస్‌కు ఉన్న 10 శాతం రిజర్వేషన్లలో 5 శాతం కాపులకు టీడీపీ సర్కారు కల్పించింది నిజమే అయితే మార్చిలో జరిగిన మెడికల్ పీజీ సీట్ల భర్తీలో కాపులకు ఈ రిజర్వేషన్లను ఎందుకు అమలు చేయలేదో చంద్రబాబు చెప్పాలి.
5 శాతం రిజర్వేషన్ల ద్వారా ఎంతమంది కాపులకు ఉద్యోగాలు ఇచ్చారో? ఎంతమందికి ఉన్నత విద్యలో సీట్లు ఇప్పించారో బాబు చెప్పాలి. ఒక్క మెడికల్ పీజీ సీటైనా ఈ 5 శాతం రిజర్వేషన్ల ద్వారా కాపులకు ఇచ్చి ఉంటే చంద్రబాబు ఆ విషయం బహిరంగంగా ప్రకటించాలి’’ అని కాపులు డిమాండ్ చేస్తున్నారు.
సాక్షి, అమరావతి: ఐదేళ్ల పాలనలో కాపులను నిలువునా వంచించిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాపులను బీసీల్లో చేరుస్తామని 2014 ఎన్నికల సమయంలో స్పష్టమైన హామీ ఇచ్చి గద్దెనెక్కిన చంద్రబాబు రెండేళ్లపాటు ఆ సంగతే మర్చిపోయారు. కాపు రిజర్వేషన్ల ఉద్యమం ఉధృతరూపం దాల్చడం, కాపుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం కావడంతో విధి లేని పరిస్థితుల్లో తూతూమంత్రంగా మంజునాథ కమిషన్‌ను నియమించారు. చివరకు ఆ కమిషన్ చైర్మన్ సంతకం లేకుండానే హడావుడిగా నివేదికను తెప్పించుకుని, కాపులను బీసీల్లో చేరుస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి, కేంద్రానికి పంపించి చేతులు దులుపుకున్నారు. 2019లో రాజకీయ లబ్ధి కోసం మరోసారి బూటకపు ప్రకటనకు తెరలేపారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్) కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 10 శాతం రిజర్వేషన్లలో 5 శాతం రిజర్వేషన్లను కాపులకు ఇస్తామన్నారు. అది ఆచరణ సాధ్యం కాదని తెలిసినా మాయమాటలతో మోసం చేసేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలున్నాయి. కాపులను బీసీల్లో తానే చేర్చానని ఒకసారి, కేంద్రం ఇచ్చిన ఈబీసీ రిజర్వేషన్లలో 5 శాతం కాపులకు కేటాయించానని మరోసారి ప్రకటించి, అసలు కాపులు బీసీలా, ఓసీలా అనే గందరగోళ పరిస్థితుల్లోకి నెట్టేయడానికి చంద్రబాబు కారకుడయ్యాడే తప్ప ఆ దిశగా చిత్తశుద్ధితో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదని కాపులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రానికి అధికారం ఉందా?
ఇప్పటి వరకూ రిజర్వేషన్లు వర్తించని వారికి (అగ్రవర్ణాలకు) పేదరికమే కొలబద్ధగా, కులాలతో సంబంధం లేకుండా విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో రాజ్యాంగ సవరణ ద్వారా చట్టం చేస్తే దాన్ని మార్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదని అందరికీ తెలుసు. ఇక్కడ పేదరికమే ప్రామాణికం తప్ప కులాల వారీగా రిజర్వేషన్లను విభజించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకు ఈ సంగతి తెలుసు. అయినా ఈ 10 శాతం రిజర్వేషన్లలో 5 శాతం కాపులకు కేటాయిస్తున్నట్లు 2019 ఎన్నికల ముందు ప్రకటించారు. ఇప్పుడేమో ఈడబ్ల్యూఎస్ కోటాలో 5 శాతం రిజర్వేషన్లను తాను కాపులకు ఇస్తే వైఎస్సార్‌సీపీ సర్కారు కాపులకు రిజర్వేషన్లు లేకుండా చేసిందని చంద్రబాబు అండ్ కో తప్పుడు ఆరోపణలకు దిగుతున్నారు.
కోర్టు కొట్టేస్తే పిల్లల భవిష్యత్తు ఏమిటి?
పార్లమెంట్ చేసిన చట్టం ద్వారా ఈడబ్ల్యూఎస్‌కు లభించిన 10 శాతం రిజర్వేషన్లలో చంద్రబాబు అన్నట్లు కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ టీడీపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోను న్యాయస్థానాలు కొట్టేస్తే పరిస్థితి ఏమిటని ప్రభుత్వ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టానికి సవరణలు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదు. ఇది తెలిసి కూడా కాపులకు 5 శాతం రిజర్వేషన్లు ఇస్తూ జీవో ఇచ్చి, ఇప్పుడు ఆ వర్గం వారికి ఉన్నత విద్యా కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తే దాన్ని కోర్టు కొట్టేస్తే పిల్లల భవిష్యత్తును అంధకారంలో పడేసినట్లు అవుతుంది. దీనికి బాధ్యత ఎవరు వహిస్తారని కాపు సామాజికవర్గం నిలదీస్తోంది. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు ఇంతగా దిగజారడం దారుణమని మండిపడుతోంది. కాపులతో సహా ఓసీల్లోని పేదలందరూ ఈ 10 శాతం రిజర్వేషన్లు పొందడానికి అర్హులే. వాస్తవానికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లతో కాపులే ఎక్కువగా ప్రయోజనం పొందుతారు. జనాభా ప్రకారం ఈబీసీ రిజర్వేషన్లలో కాపులకు 50 శాతానికి పైగా దక్కే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.
కేంద్రం ప్రశ్నకు జవాబు ఏదీ?
‘‘ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు(ఈడబ్ల్యూఎస్) కల్పించిన 10 శాతం రిజర్వేషన్లలో 5 శాతం మీరు కాపులకు ఇస్తామన్నారు. మరి 2017లో కాపులను బీసీల్లో చేర్చుతూ అసెంబ్లీలో బిల్లు చేసి పంపించారు. మరి కాపులను బీసీల్లో చేర్చాలన్న బిల్లును మీరు ఉపసంహరించుకుంటారా?’’ అని చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 2019 ఏప్రిల్ 4న కేంద్ర హోంశాఖ లేఖ రాసింది. దానికి చంద్రబాబు సమాధానం చెప్పలేదు. దీన్నిబట్టి కాపుల సంక్షేమం పట్ల చంద్రబాబు చిత్తశుద్ధి ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు.
చంద్రబాబు మోసకారి
‘‘చంద్రబాబు కాపులను ఓటు బ్యాంకు మాదిరిగానే వాడుకున్నాడు. 2014 ఎన్నికల ముందు కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశాడు. మంజునాథ కమిషన్ చైర్మన్ సంతకం లేకుండానే ఆ నివేదికను అసెంబ్లీలో పెట్టి, తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. అది అతీగతీ లేకుండా పోయింది. 2019 ఎన్నికలు వచ్చేసరికి కాపులకు ఈబీసీ కోటా అన్నాడు. కేంద్రం ఇస్తామన్న 10 శాతం రిజర్వేషన్లలో కాపులకు 5 శాతం ఇస్తామన్నాడు. అది సాధ్యం కాదని తెలిసినా కాపులను దగా చేయడానికి సిద్ధమయ్యాడు. అంటే కాపులకు బీసీ రిజర్వేషన్లు కాకుండా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఇచ్చే కోటాకు వారిని పరిమితం చేసేలా కుట్ర పన్నాడు.
కాపులకు రిజర్వేషన్లు అంటూ చంద్రబాబు చేసిన తీర్మానాలు సరికాదని సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్లు దాఖలయ్యాయి. ఈబీసీ కోటా సంగతిని త్వరగా తేల్చకపోవడంతో ప్రస్తుత విద్యా సంవత్సరంలో విద్యార్థులు నష్టపోతున్నారని ఏపీ హైకోర్టులోనూ పిటిషన్లు దాఖలయ్యాయి. కేంద్రం ఇచ్చిన ఈబీసీ కోటా, చంద్రబాబు ప్రభుత్వం చేసిన తీర్మానాలపై సుప్రీంకోర్టు వెలువరించే తీర్పే శిరోధార్యమని హైకోర్టు స్పష్టం చేసింది. ఈలోపు విద్యార్థులు నష్టపోకుండా, రిజర్వేషన్లతో సంబంధం లేకుండా 10 శాతం ఈబీసీ కోటాలో సూపర్ న్యూమరరీ విధానంలో మెడికల్, ఇంజనీరింగ్ సీట్లు పెంచుకుని, భర్తీ చేయాలని హైకోర్టు ఇంటీరియం రిలీఫ్ ఇచ్చింది. హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈబీసీ కోటాను అమలు చేయక తప్పలేదు. లేకపోతే కోర్టు ధిక్కార నేరం అవుతుంది’’
– ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ, శాసన మండలిలో చీఫ్ విప్, వైఎస్సార్‌సీపీ
Comments
Please login to add a commentAdd a comment