
ఉధృతమవుతున్న ఉద్యమం
మచిలీపట్నం :కాపులను బీసీల్లో చేర్చాలని కోరుతూ ముద్రగడ పద్మనాభం చేస్తున్న దీక్షకు మద్దతుగా ఉద్యమంఊపందుకుంటోంది. మచిలీపట్నంలో కాపు సంఘాల నాయకులు శనివారం రాత్రి జిల్లా పరిషత్ సెంటరు నుంచి కోనేరుసెంటరు వరకు ర్యాలీ నిర్వహించారు. కాపులను బీసీల్లో చేర్చాలని, ప్రభుత్వ ద్వంద వైఖరి విడనాడాలని కోరుతూ నినాదాలు చేశారు. కాపులను బీసీల్లో చేర్చేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీకి చెందిన కాపు నాయకులు పంచపర్వాల కాశీవిశ్వనాధం, కొట్టే వెంకట్రావు, లోగిశెట్టి వెంకటస్వామి, బీజేపీ మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ ఇన్‌చార్జి పంతం గజేంద్ర, వైఎస్‌ఆర్ సీపీకి చెందిన మేకల సుబ్బన్న, లంకా సూరిబాబు, గాజుల భగవాన్, చలమలశెట్టి సుబ్రమణ్యం పాల్గొన్నారు.
నాయర్ బడ్డీ సెం టరులో మిరియాల కాపునాడు జిల్లా అధ్యక్షుడు ఘంటా సురేష్, గాజుల సత్యనారాయణ కాపునాడు కార్యాల యంలో రిలే దీక్ష చేపట్టారు. బహిరంగ ప్రదేశంలో రిలే దీక్షలు చేపడితే అరెస్టు చేస్తామని పోలీసులు హెచ్చరించటంతో శనివారం సాయంత్రానికి ఈ దీక్షలను విరమించారు. ఈ దీక్షలకు వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు మాదివాడ రాము సంఘీభావం తెలిపారు. పెడనలో.. పెడనలోని కాపుల బజారులో కాపు యువజన సంఘం అధ్యక్షుడు కూనపరెడ్డి రంగయ్యనాయుడు ఆధ్వర్యంలో 70 మంది గరిటెలతో పళ్లాలను కొట్టి తమ నిరన తెలిపారు. కృత్తివెన్ను మండలం లక్ష్మీపురంలో రిలే దీక్షలు చేసేందుకు ఏర్పాటు చేసిన వేదికను పోలీసులు తీసివేయడంతో మండుటెండలో దీక్షలు చేపట్టారు. పులగం త్రిమూర్తులు, పులగం సుబ్రమణ్యం, కొప్పర్తి రంగారావు రిలే దీక్షల్లో పాల్గొన్నారు. బంటుమిల్లి ముంజులూరు, కంచం క్రాస్‌రోడ్ వద్ద వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా కార్యదర్శి బండారు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో గరిటెలతో పళ్లాలపై కొట్టి నిరసన వ్యక్తం చేశారు.
కైకలూరులో...
కైకలూరులో కాపునాడు సంఘం ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేపట్టారు. పేటేటి భాస్కరరావు ఆధ్వర్యంలో పలువురు కాపు సామాజిక వర్గానికి చెందిన వారు రిలేదీక్షల్లో పాల్గొన్నారు. కలిదిండిలో పేటేటి వివేకానంద, కోరుకొల్లులో రిటైర్డ్ డీఎస్పీ చెన్నంశెట్టి చక్రవర్తి ఆధ్వర్యంలో దీక్షలు చేశారు. వైఎస్సార్ సీపీ కైకలూరు నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు శిబిరాలను సందర్శించారు.