కాపు రామచంద్రారెడ్డి
అనంతపురం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై పోలీసుల దౌర్జన్యానికి నిరసనగా రాయదుర్గంలో ఆత్మహత్యయత్నం చేసిన ఆ పార్టీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిని బళ్లారి ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉంది. పోలీసుల చర్యకు నిరసనగా రాజశేఖర రెడ్డి అనే కార్యకర్త ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకునేందుకు ప్రయత్నించాడు. పోలీసులు, కార్యకర్తలు అతనిని అడ్డుకున్నారు. రాయదుర్గంలోనూ, నియోజకవర్గం అంతటా ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కేసులున్నాయన్న నెపంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన దాదాపు వందమంది కార్యకర్తల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తమపై దౌర్జన్యం చేశారని, లాఠీలతో, బూట్లతో కుళ్లబొడిచారని సర్పంచ్లు, వార్డు సభ్యులు, కార్యకర్తలు చెప్పారు. బళ్లారిలో ఉన్న ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డికి కార్యకర్తలు ఈ విషయం ఫోన్ చేసి చెప్పారు. ఆయన వెంటనే బయలుదేరి రాయదుర్గం వచ్చారు.
ఏ కారణం లేకుండా తమ కార్యకర్తలపై థర్డ్ డిగ్రీ ఎందుకు ప్రయోగించారని ఆయన పోలీసులను ప్రశ్నించారు. తమ కార్యకర్తలను ఎందుకు కొట్టారని అడిగారు. వారు ఏమైనా దొంగతనం చేశారా? అని ప్రశ్నించారు. పోలీసుల చర్యకు నిరసనగా పోలీస్ స్టేషన్ వద్దే బైఠాయించారు. తన కార్యకర్తలపై పోలీసులు దౌర్జన్యం చేయడాన్ని తాను చూడలేనన్నారు. కార్యకర్తల కోసం ప్రాణత్యాగానికి సిద్దపడ్డారు. పోలీసుల తీరుకు ఆయన పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఇది గమనించిన కార్యకర్తలు వెంటనే తాగిన పురుగుల మందును కక్కించడానికి ప్రయత్నించారు. ఆ తరువాత స్పృహ కోల్పోవడంతో కార్యకర్తలు వెంటనే ఆయనను బళ్లారి ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా, మరో పక్క పోలీసుల దౌర్జన్యాన్ని నిరసనగా రాజశేఖర రెడ్డి అనే కార్యకర్త ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యయత్నం చేశాడు. అతను నిప్పంటించుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ ఘటనలతో రాయదుర్గంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసుల వైఖరిని నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బుధవారం రాయదుర్గం బంద్కు పిలుపు ఇచ్చింది.