చంద్రబాబు తీరుపై బలరాం అసంతృప్తి
Published Wed, Sep 18 2013 4:32 AM | Last Updated on Sat, Jul 28 2018 3:21 PM
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: కొండ నాలికకు ముందేస్తే ఉన్న నాలిక ఊడిందన్నట్టుగా తయారైంది జిల్లా టీడీపీ పరిస్థితి. కరణం బలరాం, దామచర్ల జనార్దన్‌ల మధ్య విభేదాల పరిష్కారానికి చంద్రబాబు చేసిన ప్రయత్నం కాస్తా బెడిసికొట్టింది. నిత్యం కలహించుకుంటున్న వారిద్దరికీ చంద్రబాబు క్లాస్ తీసుకున్నారు. కానీ అధినేత తీరుపై బలరాం సీరియస్ అయ్యారు. తనకంటే జూనియర్ అయిన దామచర్లను, తనను ఒకేగాటన కట్టి మందలించడంపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. తనను చిన్నచూపు చూసి జిల్లాలో పార్టీని ఎలా గాడిలో పెడతారో చూస్తానంటున్నారు.
ఇద్దరికీ క్లాస్ పీకిన చంద్రబాబు
తన బస్సు యాత్రకు ముందే జిల్లా టీడీపీలో విభేదాల వ్యవహారాన్ని తేల్చేయాలని చంద్రబాబు భావించారు. కరణం బలరాం, దామచర్ల జనార్దన్‌లను చివరిసారిగా మందలించాలని నిర్ణయించారు. జిల్లాలో బస్సు యాత్ర ఖరారుపై చర్చించేందుకు హైదరాబాద్ వచ్చిన నేతలతో సమావేశాన్ని దీనికి అవకాశంగా తీసుకున్నారు. జిల్లా ముఖ్య నేతలతో బస్సు యాత్రపై చంద్రబాబు సోమవారం రాత్రి చర్చించాల్సింది. కానీ ముందుగా బలరాం, దామచర్లను ప్రత్యేకంగా పిలిపించారు. వారిద్దరి మధ్య విభేదాల అంశాన్ని సూటిగా ప్రస్తావించారు. ‘మీరిద్దరూ గొడవ పడుతుండటం వల్ల పార్టీ బజారున పడుతోంది. వరుసగా రెండుసార్లు ఓడిపోయాం. అయినా మీరు మారకపోతే ఎలా?...ఇలా అయితే నేను పార్టీని ఎలా నడపాలి? నా స్థానంలో మీరు ఒక రోజు ఉండండి తెలుస్తుంది. పార్టీని నడపడం ఎంత కష్టమో’అని ఇద్దరిపై చిందులు తొక్కినట్టు తెలుస్తోంది. చంద్రబాబు ఆగ్రహాన్ని గుర్తించిన దామచర్ల మౌనంగా ఉండిపోయారు. కానీ చంద్రబాబు మాటలకు బలరాం అడ్డుతగిలి అడ్డంగా దొరికిపోయారు.
తాను పార్టీ పటిష్టతకు ప్రయత్నిస్తుంటే జనార్దనే సహకరించడం లేదన్నారు. కాంగ్రెస్ నుంచి ముఖ్య నేతలను పార్టీలో చేర్చుకుంటే మంచిదని తాను ప్రతిపాదిస్తే జనార్దన్ అడ్డుకోవడమేమిటని అడిగారు. ‘మీరు కూడా ఆయన మాటలకే విలువిచ్చి నా ప్రతిపాదనను తిరస్కరించారు. ఎన్నో ఏళ్లుగా జిల్లా రాజకీయాలు చూస్తున్న నాకంటే జనార్దన్‌కు ఎక్కువ తెలుసా?’అని ప్రశ్నించారు. తననే తప్పుబట్టడంతో చంద్రబాబు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. బలరాంపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ‘ఏం మాట్లాడుతున్నావ్? అసలే రాష్ట్రంలో పరిస్థితులతో ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటన్నాం. ఇక సీనియర్‌వి అయిన నువ్వు కూడా తలనొప్పిగా మారితే ఎలా? నీ ఆధిపత్యం కోసం తపన తప్ప పార్టీ గురించి ఆలోచించవా? మీరు మారకపోతే నేనే ఒకరిని వదులుకోవాల్సి వస్తుంది. ఆ తరువాత మీ ఇష్టం’అని తేల్చిచెప్పేశారు. చంద్రబాబు అంత తీవ్రస్థాయిలో ముఖం మీదే మందలించడంతో బలరాం చిన్నబుచ్చుకున్నారు. ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయారు. సోమవారం రాత్రి బలరాం, జనార్దన్‌లతో మాట్లాడేసరికే సమయం మించిపోవడంతో జిల్లా నేతలతో సమావేశాన్ని చంద్రబాబు మంగళవారానికి వాయిదా వేశారు.
అధినేతపై బలరాం శివాలు: కాగా చంద్రబాబు తీరుపై కరణం బలరాం తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నట్టు తెలుస్తోంది. మంగళవారం ఆయన తన అనుయాయులతో మాట్లాడుతూ అధినేత తీరుపై విరుచుకుపడ్డారు. తనకంటే బాగా జూనియర్ అయిన జనార్దన్ ముందు తనను అంతగా మందలించడాన్ని బలరాం తప్పుబడుతున్నారు. తనకు ఏదైనా చెప్పాలంటే విడిగా పిలిపించి చెబితే సరిపోయేదని... కానీ జనార్దన్ ముందే తనను తూలనాడితే ఇక ఆయన తనకు జిల్లాలో ఏం గౌరవం ఇస్తారని అంటున్నారు. చంద్రబాబు తామిద్దరిపై ఆగ్రహం వ్యక్తం చేసినా జనార్దన్ మౌనంగా ఉండిపోవడాన్ని బలరాం తన సన్నిహితుల వద్ద ప్రస్తావించారు. ‘మాతో చంద్రబాబు ఏం చెప్పనున్నారో జనార్దన్‌కు ముందే తెలిసి ఉండాలి. కాబట్టే ఆయన అందుకు మానసికంగా సిద్ధపడిపోయి మౌనంగా ఉండిపోయారు.
ఇదేమీ తెలియని నేను ప్రతిస్పందించి అధ్యక్షుడితో మాటలు పడాల్సి వచ్చింది’అని బలరాం వాపోతున్నారు. ఈ వ్యవహారంలో పార్టీ జిల్లా ఇన్‌చార్జ్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి వైఖరిపై బలరాం సందేహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు తమను మందలించబోతున్న విషయాన్ని గోరంట్ల బుచ్చయ్య చౌదరి ముందుగానే జనార్దన్‌కు చేరవేశారన్నది ఆయన ఉద్దేశం. అందుకే జనార్దన్ మౌనంగా ఉండిపోయాడని... తాను మాత్రం దొరికిపోయానని భావిస్తున్నారు. ఇక తన తడాఖా చూపించాలని కరణం బలరాం భావిస్తున్నారు. జిల్లాలో పార్టీకి పూర్తిగా సహాయ నిరాకరణ చేస్తేగానీ తానేమిటో చంద్రబాబుకు తెలిసిరాదని ఆయన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. ఈ పరిణామాలతో మునుముందు జిల్లా టీడీపీలో విభేదాలు సరికొత్త మలుపు తిరగనున్నాయని స్పష్టమవుతోంది.
30 తరువాతే యాత్ర
బస్సు యాత్ర షెడ్యూల్‌పై చంద్రబాబు జిల్లా నేతలతో మంగళవారం చర్చించారు. డెయిరీ డెరైక్టర్ల ఎన్నికలు ఉన్నందున ఈ నెల 30 తరువాతే జిల్లాలో యాత్ర నిర్వహించాలని నిర్ణయించారు. నెల్లూరు జిల్లాలో యాత్ర నిర్వహించిన అనంతరం జిల్లాలోకి ప్రవేశిస్తామని ప్రకటించారు. సమావేశంలో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు దామచర్ల జనార్దన్, జిల్లా పార్టీ ఇన్‌చార్జ్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి, కరణం బలరాం, శిద్దా రాఘవరావు, మన్నం శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement