తిరుపతిలో పట్టాలు తప్పిన కరీంనగర్‌ ఎక్స్‌ప్రెస్‌ | Karimnagar Express Derailed At Tirupati | Sakshi
Sakshi News home page

తిరుపతిలో పట్టాలు తప్పిన కరీంనగర్‌ ఎక్స్‌ప్రెస్‌

Published Sun, Mar 19 2017 8:58 AM | Last Updated on Tue, Sep 5 2017 6:31 AM

Karimnagar Express Derailed At Tirupati

యార్డు లైన్‌లో మూడోసారి ఘటన
అప్రమత్తత కావడంలో అధికారుల నిర్లక్ష్యం


తిరుపతి : తిరుపతి రైల్వేస్టేషన్‌లోని యార్డు లైన్‌లో శనివారం రాత్రి కరీంనగర్‌ ఎక్స్‌ప్రెస్‌ ఖాళీ బోగీలతో పట్టాలు తప్పింది. తిరుపతి యార్డు లైన్లలో ఖాళీ బోగీల రైళ్లు పట్టాలు తప్పడం ఇది మూడోసారి. రెండునెలల క్రితం వారం వ్యవధిలోనే రాయలసీమ ఎక్స్‌ప్రెస్, వాస్కోడగామా ఎక్స్‌ప్రెస్‌లు ఇదే యార్డు లైన్‌లలో పట్టాలు తప్పాయి. ఆ రెండు సంఘటనలకు భిన్నంగా శనివారం రాత్రి జరిగిన ఘటనలో భారీ నష్టం వాటిల్లింది. ఇందులో ట్రాక్‌ ఎలక్ట్రికల్‌ పరికరాలతో సహా బోగీకి అమర్చిన బ్యాటరీ బాక్సులు పూర్తిగా దెబ్బతిన్నాయి. పట్టాలు కూడా కొంతమేరకు విరిగిపోయాయి. పట్టాల మధ్య అమర్చిన సిమెంట్‌ దిమ్మెలు ఎక్కువ స్థాయిలో ధ్వంసమయ్యాయి. సుమారు రూ.25లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు.

కరీంనగర్‌ ఎక్స్‌ప్రెస్‌ శనివారం రాత్రి 10.40 గంటలకు తిరుపతిలో బయలుదేరాల్సి వుంది. ఈ నేపధ్యంలో ఖాళీ బోగీలను యార్డులైన్లలలో నుంచి రాత్రి 9 గంటలకు రైలును ప్లాట్‌ఫారాలపైకి తరలిస్తుండగా పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ఇంజన్‌ నుంచి మూడవ బోగి (జనరల్‌ బోగి) పూర్తిగా పట్టాలు తప్పడంతో పట్టాలకు అడ్డంగా ఏర్పాటు చేసిన సిమెంట్‌ దిమ్మెలు ధ్వంసమయ్యాయి. అలాగే బోగీల మధ్య పటిష్టత కోసం ఏర్పాటు చేసిన అయస్కాంత రాడ్లు కూడా విరిగిపోయాయి. ఇటీవల యార్డు లైన్‌లలో రైళ్లు పట్టాలు తప్పడం సర్వసాధారణంగా మారడాన్ని రైల్వే యంత్రాంగం సీరియస్‌గా తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. వరుస ఘటనలకు బాధ్యులైన వారిపై ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడం వల్ల కూడా మరో ఘటనకు అవకాశం కలిగిందనే వాదనలు వినిపిస్తున్నాయి.

తిరుపతి నుంచి రేణిగుంట మార్గంలో రైల్వే ఓవర్‌ బ్రిడ్జి దగ్గర ఘటన జరగడంతో చిమ్మచీకట్లు కారణంగా అధికారులు సహాయక చర్యలను వేగవంతం చేయలేకపోయారు. రాత్రి 10:10 గంటలకు రేణిగుంట నుంచి బోగీలను మరమ్మతు చేసి పట్టాలపై నుంచి తొలగించేందుకు అవసరమైన యాక్సిడెంట్‌ రిలీఫ్‌ ట్రైన్‌(ఏఆర్‌టీ) వాహనం వచ్చాక సహాయక చర్యలను ప్రారంభించారు. సంఘటన తెలిసిన వెంటనే స్టేషన్‌ మేనేజర్‌ సుభోద్‌మిత్ర, ఆర్‌పీఎఫ్‌ సీఐ నాగార్జునరావుతో పాటు రైల్వే పోలీసు సిబ్బంది, రైల్వే సేఫ్టీ,  ఎలక్ట్రికల్, కోచ్‌ డిపో అధికారులు హుటాహుటిన చేరుకుని సంఘటన వివరాలను సేకరించారు.

ప్రయాణికుల అవస్థలు
కరీంనగర్‌ ఎక్స్‌ప్రెస్‌ తిరుపతి నుంచి నెల్లూరు, ఒంగోలు, విజయవాడ మీదుగా నడుస్తోంది. ఈనేపధ్యంలో శనివారం రాత్రి యార్డులైన్‌లో పట్టాలు తప్పడంతో రాత్రి 10.40 గంటలకు బయలుదేరాల్సిన ఈరైలు సకాలానికి వెళ్లకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా విజయవాడ వెళ్లాల్సినవారు రైల్వే స్టేషన్‌లో నిరీక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement