జూనియర్ కళాశాలగా అప్‌గ్రేడ్ పొందనున్నలావేరులోని కేజీబీవీ
సాక్షి, శ్రీకాకుళం : కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలకు (కేజీబీవీ) మంచి రోజులు రానున్నాయి. ప్రస్తుతం కేజీబీవీల్లో ప్రవేశాలకు ఎక్కడా లేని డిమాండ్ ఏర్పడింది. గ్రామీణ ప్రాంతాల్లోని బాలికలకు ఇంటర్మీడియెట్ విద్యను అందించాలనే ఉద్దేశంతో కేజీబీవీలను జూనియర్ కళాశాలలగా అప్‌గ్రేడేషన్ చేస్తున్నారు. మొత్తం 32 కేజీబీవీల్లో గత ఏడాది 2 అప్‌గ్రేడ్ కాగా, ఈ ఏడాది మరో 19 అప్‌గ్రేడ్ అవుతున్నాయి. దీంతో జిల్లాలో మొత్తం జూనియర్ కళాశాలలగా అప్‌గ్రేడ్ అయిన కేజీబీవీల సంఖ్య 21కు చేరుకుంది. వసతి సమస్య లేకుండా ఉంటే.. భవిష్యత్‌లో అన్ని కేజీబీవీల్లోను ఇంటర్మీడియెట్ కోర్సులు తీసుకొచ్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
బాలికలకు విద్య చేరువ..
గ్రామీణ ప్రాంతాల్లోని నిస్సహాయ బాలికలకు విద్యను చేరువ చేసేందుకు 2004లో అప్పటి కేంద్రప్రభుత్వం కేజీబీవీలను తీసుకువచ్చింది. రూపాయి ఖర్చు లేకుండా నాణ్యమైన విద్యను అందిస్తూ, వసతి, భోజనం కూడా కల్పించి వారిని తీర్చిదిద్దాలని భావించింది. ఇందులో భాగంగా శ్రీకాకుళం జిల్లాకు 32 కేజీబీవీలను కేటాయించారు. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పరిమితం చేస్తూ.. క్లాసుకు గరిష్టంగా 40 మంది చొప్పున విద్యార్థినులతో నిర్వహించారు. తొలిరోజుల్లో భవనాలు లేక కొన్ని అద్దె భవనాల్లో నడిపించారు. మరికొన్నింటిని ఆయా ప్రాంతాల్లోని గురుకుల పాఠశాలలు, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ సంస్థల ఆధ్వర్యంలో నిర్వహణను కొనసాగించారు.
2010 నుంచి ఆర్‌వీఎంలోకి..
కేజీబీవీ పాఠశాలలకు సొంత భవనాల నిర్మాణం జరిగిన తర్వా త 2010లో అప్పటి రాజీవ్ విద్యామిషన్ (ఆర్‌వీఎం) పరిధికి తీసుకొచ్చారు. అప్పటి నుంచి కేజీబీవీల్లో నాణ్యమైన విద్యను అందిస్తున్నారు. ఉత్తీర్ణత శాతంతోను రాష్ట్రంలో మొదటి మూడు స్థానాల్లో నిలుస్తూ వస్తున్నాయి. రూపాయి ఖర్చు లేకుండా ప్రస్తుతం సర్వ శిక్షా అభియాన్ (ఎస్‌ఎస్‌ఏ) నిర్వహణలో కేజీబీవీలు నడుస్తున్నాయి. జిల్లాలో 32 కేజీబీవీల్లో ప్రస్తుతం 6600 మంది వరకు విద్యార్థులు చదువుతున్నారు.
జూనియర్ కళాశాలలుగా ఉన్నతి..
కేజీబీవీల్లో ఇంటర్మీడియెట్ విద్యను గతంలో ప్రవేశపెట్టారు. జిల్లాలో కేవలం కోటబొమ్మాళి, జి.సిగడాం కేజీబీ వీలను జూనియర్ కళాశాలలగా అప్‌గ్రేడ్ చేశారు. జిల్లాకు చెందిన గత మంత్రులు అచ్చెన్నాయుడు, కళా వెంకటరావులు చెరో కళాశాలను పంచుకున్నారు. కేజీబీవీల్లో నియామకాలు సైతం ఈ మాజీ మంత్రుల సిఫారసుల మేరకే జరిగాయన్న విమర్శలు లేకపోలేదు. ఈ విద్యాసంవత్సరం ప్రారంభంలో రాష్ట్రవ్యాప్తంగా 140 కేజీబీవీలను జూనియర్ కళాశాలలగా అప్‌గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
ఈ జాబితాలో శ్రీకాకుళం జిల్లా నుంచి 19 కేజీబీవీలు ఉన్నాయి. దీంతో జిల్లాలో ఇప్పటి వరకు అప్‌గ్రేడ్ జరిగిన కేజీబీవీల సంఖ్య 21కు చేరింది. కొటబొమ్మాళి, గత ఏడాది అప్‌గ్రేడ్ అయిన జి.సిగడాంలలో ఎంపీసీ, బైపీపీ రెండేసి గ్రూపులను కేటాయింపు చేయగా.. ప్రస్తుతం కేటాయింపు చేసిన 19 కళాశాలలకు మాత్రం కేవలం ఒక గ్రూపును మాత్రమే మంజూరు చేసింది. ఆ ప్రాంతాల్లో ఆదరణ ఉన్న గ్రూపులకు అవకాశం కల్పించారు. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీ, పలు ఒకేషనల్ కోర్సులను మంజూరుచేశారు. తరగతులు, వసతి ఇతర సదుపాయాలను ఉచితంగా కల్పిస్తూ.. కోర్సుకు గరిష్టంగా 40 మందికి అడ్మిషన్లు కల్పిస్తారు. దీంతో 19 కేజీబీవీ కళాశాలలకు 40 మంది చొప్పున 760 మందికి ప్రవేశాలు కల్పించనున్నారు. వీటిల్లో విద్యార్థుకు పాఠాలు బోధించేందుకు పార్ట్‌టైమ్ లెక్చరర్ల నియామకాలకు సైతం అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
ఫలితాల్లోనూ అగ్రస్థానమే..
కేజీబీవీల్లో చదువుతున్న విద్యార్థులు సైతం ఉన్నతమైన ఫలితాలు సాధిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. 2019 మే నెలలో వెలువడిన టెన్త్‌క్లాస్ ఫలితాల్లో 10కి 10 గ్రేడ్ పాయింట్లు సాధించిన విద్యార్థులు 35 మంది ఉండటం గమనార్హం. రాష్ట్రంలో కేజీబీవీల్లో అత్యధికంగా 10కి 10 గ్రేడ్ పాయింట్లు సాధించడంలో 38 మంది విద్యార్థినులతో ప్రకాశం జిల్లా మొదటి స్థానంలో నిలవగా.. శ్రీకాకుళం 35 మందితో రెండోస్థానంలో నిలవడం విశేషం. గత ఐదేళ్లుగా జిల్లాలో కేజీబీవీలు టెన్త్‌లో సగటున 95 శాతానికిపైగా ఉత్తర్ణత సాధిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment