రైతులతో కలిసి రిజర్వాయర్ పనులు పరిశీలిస్తున్న కాటసాని
కర్నూలు, పాణ్యం: వాటా నీటిని సాధించుకోలేకపోగా ఉన్న నీటిని సైతం ఇతర జిల్లాలకు తరలిస్తున్నా నోరుమెదపని అధికార పార్టీ నాయకుల తీరు కారణంగానే జిల్లాలో నీటి సమస్యలు తలెత్తుతున్నాయని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఎలాంటి వాటా లేకున్నా ఇతర జిల్లాలకు ప్రభుత్వం నీటిని తరలిస్తుంటే ఏ నాయకుడూ ప్రశ్నించలేదన్నారు. తాగు, సాగునీరు అందించాలని కోరుతూ ఎంపీ ఎస్పీవైరెడ్డి రెండు రోజులుగా గోరుకల్లు రిజర్వాయర్ వద్ద దీక్ష చేస్తున్న నేపథ్యంలో మంగళవారం కాటసాని అక్కడకు వెళ్లి ఆయనతో మాట్లాడారు. ఈ ఏడాది గోరుకల్లు నుంచి గాలేరుకు తరలించే నీటిని నిలిపేందుకు గేట్లు ఏర్పాటు చేయకపోవడంతో సుమారు 30 టీఎంసీల నీరు వైఎస్సార్ జిల్లాకు తరలించారన్నారు. గోరుకల్లులో 8 టీఎంసీల వరకు నీరు నిల్వ ఉంచే అవకాశం ఉన్నా ఆ స్థాయిలో పనులు చేపట్టకపోవడం సర్కారు నిర్లక్ష్యమేనని తెలిపారు.
ఎలాంటి వాటా లేకున్నా నెల్లూరు జిల్లాకు 50 టీఎంసీల నీరు సరఫరా చేశారని, ఈ విషయాలపై ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలేదో చెప్పాలన్నారు. శ్రీశైలం నుంచి నాగర్జున సాగర్‌కు ఇష్టం వచ్చినప్పుడు గేట్లు ఎత్తి దించి నీటిని తరలించి జిల్లాను ఎండగట్టారని మండిపడ్డారు. నిర్లక్ష్యం, అవగాహన లోపంతో అధికార పార్టీ నాయకులు జిల్లాకు అన్యాయం చేశారన్నారు. పనులు పూర్తిస్థాయిలో చేపట్టి గోరుకల్లులో 12టీఎంసీలు నిల్వ చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. ప్రస్తుతం గోరుకల్లు డెడ్ స్టోరేజీ (1.2టీఎంసీలు)లో ఉందని, ఈ నీటిని మీరు(ఎంపీ)తరలించుకుపోవాలని చూస్తే కుదరదని, రైతులతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. అధికార పార్టీ నాయకుల చేతకాని తనంతోనే జిల్లాకు నీటి సమస్యలు వస్తున్నాయని, యావత్తు రైతాంగం సాగునీటి కోసం రోడ్డెక్కాల్సిన దౌర్భాగ్య పరిస్థితి దాపురించిందని ఘాటుగా విమర్శించారు.
జలహారతికోసమే నీటిని తరలించుకుపోయారు..
ఎమ్యెల్యే బీసీ అధికారులను బెదిరించి నీళ్లను దద్దనాలకు తీసుకుపోయారని, ఇక్కడి రైతుల నోట్లో మట్టి కొట్టి వందల ఎకరాల మిర్చి పంటను ఎండగట్టి మంత్రి ఆర్బాటాల కోసం జల హారతి ఇవ్వడానికే ఆ పని చేశారని కాటసాని దుయ్యబట్టారు. పంటలు ఎండుతున్న దశలో జలహారతులు అవసరమా అని కాటసాని ప్రశ్నించారు. చేతనైతే పోతిరెడ్డిపాడు నుంచి అదనంగా డ్రా చేసి రైతులకు సాగునీటిని ఇప్పించాలని, అలా చేసి ఉంటే కుందూ పరీవాహ ప్రాంతానికి కూడా మేలు జరిగి ఉండేదన్నారు. అనంతరం కాటసాని రైతులతో కలిసి రిజర్వాయర్ పనులు పరిశీలించారు. కలెక్టర్ సత్యనారాయణకు ఫోన్ చేసి నీటిని గోరుకల్లు నుంచి కాకుండా అలగనూరు నుంచి విడుదల చేయాలని సూచించారు. కాటసాని వెంట జెడ్పీటీసీ మాజీ సభ్యుడు సూర్యనారాయణరెడ్డి, నాయకులు అమరనాథ్‌రెడ్డి, లక్ష్మీమద్దయ్య, ప్రసాద్, కరుణాకర్‌రెడ్డి, రాముడు, చంద్రారెడ్డి, మహింద్రారెడ్డి తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment