కాటుకపల్లి-బండిరేవుల నడుమ ఘోర ప్రమాదం
భద్రాచలం రూరల్ / చింతూరు :భద్రాచలం, చట్టి జాతీయ రహదారి-30లో బుధవారం జరిగిన ఘోర ప్రమాదంలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఆరుగురు మృతి చెందారు. తూర్పుగోదావరి జిల్లా నెల్లిపాక, చింతూరు మండలాల సరిహద్దుల్లోని కాటుకపల్లి, బండిరేవు నడుమ కుంట నుంచి విజయవాడ వెళుతున్న ఆర్టీసీ బస్సు, భద్రాచలం నుంచి ఛత్తీస్‌గఢ్‌లోని కేర్లాపాల్ వెళుతున్న మహీంద్రా మ్యాక్స్ ఢీకొన్నాయి. మహీంద్రాలో ప్రయాణిస్తున్న ఏడుగురిలో ఇద్దరు మహిళ లు సహా ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందగా జగన్ వశీకర్ అనే వ్యక్తి తీవ్రగాయాలతో భద్రాచలం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడు తెలిపిన వివరాల ప్రకారం...ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా కేర్లాపాల్ గ్రామానికి చెందిన గజానన్ భద్రే కుటుంబం ఆస్పత్రి పని నిమిత్తం మహీంద్రా మ్యాక్స్‌లో భద్రాచలం వచ్చి తిరిగి వెళుతుండగా ఆర్టీసీ బస్సును వేగంగా ఢీకొంంది. గజానన్ భద్రే, సంతోష్, మహేష్ భద్రే, ప్రమీలా, కరీనాలతో పాటు డ్రైవర్ లక్ష్మీనాథ్ అక్కడికక్కడే మృతిచెందారు.
అతివేగమే ప్రమాదానికి కారణం
మహీంద్రా వాహనాన్ని వేగంగా నడుపుతున్న డ్రైవర్ ఆర్టీసీ బస్సు సమీపానికి రాగానే వాహనాన్ని నియంత్రించలేక బస్సు ముందు భాగాన్ని ఢీకొట్టాడు. మహీంద్రా వాహనం సగభాగం వరకు బస్సు ముందు భాగంలోకి దూసుకుపోయింది. ముందు సీట్లో కూర్చున్న ముగ్గురు, మధ్య సీట్లో కూర్చున్న ఇద్దరు మహిళలు, వెనుక సీట్లోని ఇద్దరు మృతి చెందారు. భద్రాచలం రూరల్, చింతూరు పోలీసులతో పాటు అనేకమంది ప్రయాణికులు గంటపాటు శ్రమించి బస్సులో ఇరుక్కున్న వాహనాన్ని, దాంట్లో చిక్కుకున్న మృతదేహాలను వెలికి తీయగలిగారు. చింతూరు సీఐ అమృతరెడ్డి, ఏడుగురాళ్లపల్లి ఆర్‌ఎస్‌ఐలు సోమ్లూనాయక్, శంకరప్రసాద్, భద్రాచలం రూరల్ ఎస్‌ఐలు రాజు, యాదగిరి సంఘటనా స్థలాన్ని సందర్శించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదస్థలాన్ని భద్రాచలం ఏఎస్పీ ప్రకాష్‌రెడ్డి సందర్శించి మృతదేహాలను పరిశీలించారు. ప్రమాదంతో 2 గంటల పాటు ట్రాఫిక్ స్తంభించింది. ఈ ఘటనలో బస్సు కండక్టర్‌తో పాటు కొందరు ప్రయాణికులకు స్వల్పగాయాలయ్యాయి.