
బెదిరింపులకు భయపడను
► జెడ్పీ వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకోవడంతో గ్రామాల్లో పండగ వాతావరణం
► కావలి జెడ్పీటీసీ మత్స్యకారుల ఆత్మగౌరవం కాపాడుతుందనుకున్నాం
► ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి
కావలి : తనకు సంబంధంలేని మద్యం కేసును అంటకడుతూ ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు విషపు రాతలతో చేస్తున్న బెదిరింపులకు తాను భయపడేది లేదని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి అన్నారు. సోమవారం పుల్లారెడ్డినగర్‌లోని తన నివాసంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తాను 28 ఏళ్ల పాటు వ్యాపార రంగంలో ఉన్నానన్నారు. తన స్నేహితులు ఎందరికో మద్యం అలవాటు ఉ న్నా.. తాను మాత్రం దానికి దూరమన్నారు. మద్యం తాగేవాళ్లను కూడా తాగొద్దని ఎన్నోసార్లు చెబుతుం టానన్నారు. అలాంటి తనపై ఎన్నికల మద్యం కేసంటూ తప్పుడు కథనాలతో అసత్య ప్రచారాన్ని చేస్తున్నాయన్నారు.
అసలు ఆ కేసుతో తనకు సంబంధం లేదన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్‌గా బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి గెలవడంతో నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల్లో పండగ వాతావరణం నెలకొందన్నారు. ఎక్కడికి వెళ్లినా ప్రతి ఒక్కరూ ధర్మం, న్యాయం ఈ ఎన్నికల్లో గెలిచాయని, దేవుడు ఉన్నాడంటూ ఉద్వేగంతో చెబుతున్నారన్నారు. నీచ రాజకీయాలతో కావలి మున్సిపల్ చైర్మన్ ఎన్నికల సమయంలో టీడీపీ ప్రవర్తించిన తీరు ప్రతి ఒక్కరికి తెలుసునన్నారు.
అదే పంథాను జిల్లా పరిషత్ ఎన్నికల్లో కూడా అవలంబించిందన్నారు. తమ పార్టీ నుంచి గెలిచిన కావలిరూరల్ జెడ్పీటీసీ ఎస్.పెంచలమ్మ మత్స్యకారుల ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా వైఎస్సార్‌సీపీ చైర్మన్ అభ్యర్థికి ఓటు వేస్తుందని తాను అనుకున్నానన్నారు. టీడీపీ అభ్యర్థికి ఓటు వేసే జాబితాలో ముందు వరుసలో ఆమె చేయి ఎత్తడం చూసి తనకు ఎంతో బాధ వేసిందన్నారు. జెడ్పీటీసీ సభ్యురాలు విప్ ధిక్కారణపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశామన్నారు. నిబంధనల ప్రకారం తప్పకుండా ఆమెపై అనర్హత వేటు పడుతుందన్నారు. తర్వాత జరిగే జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా తాను మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన వారినే పోటీలో నిలుపుతామన్నారు.
అందరి సహకారంతో నియోజకవర్గం అభివృద్ధి
అన్ని రాజకీయ పార్టీల సహకారంతో నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి తెలిపారు. జిల్లాకు చెందిన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, కావలికి చెందిన బీజేపీ రాష్ట్ర నేత కందుకూరి వెంకట సత్యనారాయణతో పాటు రాష్ట్ర రాజధాని నిర్మాణ సలహామండలి సభ్యుడిగా ఎంపికైన మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు సహకారాన్ని తాను తీసుకుంటానన్నారు.