
నిరసనాగ్రహం
అద్దంకి: పింఛన్ పీకేశారని ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్న వృద్ధురాలి ఘటన పలువురిని కదిలించింది. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ కావూరి సుబ్బులు (88) మృతదేహాన్ని అద్దంకి పట్టణంలోని మేదరమెట్ల-నార్కెట్‌పల్లి రాష్ట్రీయ రహదారిలో అంబేద్కర్ విగ్రహం వద్ద నడిరోడ్డుపై ఉంచి శుక్రవారం గ్రామస్తులు, బంధువులు గంటపాటు ధర్నా నిర్వహించారు. పింఛన్ పీకేశారని ఈ నెల ఐదో తేదీన ప్రకాశం జిల్లాలోని అద్దంకి మండలంలో ఉన్న కొంగపాడు గ్రామానికి చెందిన వృద్ధురాలు కావూరి సుబ్బులు ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకొని చికిత్స పొందుతూ బుధవారం మరణించిన విషయం పాఠకులకు విదితమే.
ఆమె మృతదేహంతో అద్దంకి వచ్చి న్యాయం చేయాలంటూ మేదరమెట్ల-నార్కెట్‌పల్లి రాష్ట్రీయ రహదారిపై ఎంఆర్‌పీఎస్, కేవీపీఎస్, సీఐటీయూ సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకోకు దిగారు. దాదాపు గంటపాటు రాస్తారోకో చేశారు. దీంతో స్థానిక ఎస్సై సీహెచ్ వెంకటేశ్వర్లు అక్కడికి వచ్చి సర్థి చెప్పినా వినలేదు. తమకు న్యాయం చేసే వరకూ కలదిలేది లేదని భీష్మించుకు కూర్చున్నారు. సీఐ సాంబశివరావు అక్కడికి చేరుకొని బాధితులకు న్యాయం జరిగేలా తహశీల్దార్‌తో మాట్లాడతామని చెప్పడంతో రాస్తారోకోను విరమించిరు.
కలెక్టర్‌తో మాట్లాడిన్యాయం చేస్తాం.. బాధ్యులపై చర్యలకు సిఫారసు చేస్తాం..
రాస్తారోకో విరమించి తహశీల్దార్ కార్యాలయానికి కుల సంఘాల పెద్దలు, వృద్ధురాలి బంధువులు చేరుకున్నారు. అక్కడ తహశీల్దార్ అశోక్ వర్థన్ ఇన్‌చార్జి ఎంపీడీఓ కృష్ణమోహన్, సీఐ సాంబశివరావు, ఎస్సై సీహెచ్ వెంకటేశ్వర రావు సమక్షంతో అధికారులు బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని, ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్లి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.
కమిటీ సభ్యుల వల్లే వృద్ధురాలు మరణించిందని, వారిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కేవీపీఎస్ డివిజన్ నాయకులు తంగిరాల వెంకటేశ్వర్లు, ఎంఆర్‌పీఎస్ నాయకులు అలూరి చిరంజీవి, డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు సీహెచ్ గంగయ్య, కోటేశ్వరరావు, నాగేశ్వరరావు, మృతురాలి బంధువలు పాల్గొన్నారు.