మంత్రి గారి తమ్ముడు..మహా ముదురు | KE Prathap Corruption in Kurnool Dhone | Sakshi
Sakshi News home page

తమ్ముడా.. మజాకా!

Published Sat, Mar 2 2019 1:35 PM | Last Updated on Sat, Mar 2 2019 1:35 PM

KE Prathap Corruption in Kurnool Dhone - Sakshi

అన్న చాటున తమ్ముడు ‘ప్రతాప’ం చూపుతున్నాడు. మంత్రి గారి తమ్ముడామజాకా.. అంటూ ఓ వైపు అధికారులకు చుక్కలు చూపిస్తూ.. మరో వైపు అక్రమ దందాకు తెరలేపారు. భూ బకాసురుడిగా మారి కనిపించిన ప్రభుత్వ భూములను కబ్జాకు పాల్పడుతున్నారు. వాగులు.. వంకలు.. పేదలకు పంపిణీ చేసిన స్థలాలు.. వక్ఫ్‌ భూములు రాత్రికి రాత్రే రియల్‌ వెంచర్లుగా మారిపోతున్నాయి. ఆన్‌లైన్‌లో రికార్డులు సైతం  తారుమారవుతున్నాయి. దేవుని మాన్యాలను వదలడం లేదు. అక్రమార్జనకు రియల్‌ దందాతో పాటు ఇసుక, మట్టి, మద్యం వ్యాపారం చేస్తున్న డోన్‌ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ కేఈ ప్రతాప్‌ వ్యవహారంపై ‘సాక్షి’ ఫోకస్‌..

సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఆయన సర్పంచ్‌ కాదు.. కనీసం వార్డు మెంబర్‌ కూడా కాదు. అయినా ఆయన చెప్పిందే అధికారులకు వేదం.. కేవలం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌గా ఉంటూనే అధికారికంగా ప్రొటోకాల్‌ పాటించేలా చేసుకుంటున్నారు. జన్మభూమి కమిటీ సమావేశాలు మొదలు.. అన్ని ప్రభుత్వ సమావేశాలను కూడా ఆయన   నిర్వహిస్తున్నారు. డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి జిల్లాలో చేపట్టే అధికారిక కార్యకలాపాలన్నీంటికీ కేఈ ప్రతాప్‌ సంధానకర్తగా వ్యవహరిస్తున్నారు. డిప్యూటీ సీఎం ఎక్కడ పర్యటించాలన్నా.. అధికారులు కూడా ముందస్తుగా ఈయన అనుమతి తీసుకోవాల్సిందే. అన్న చాటు తమ్ముడిగా డోన్‌లో అధికారాన్ని చెలాయిస్తూ అడ్డంగా దోచుకుంటున్నారు. రైల్వే జంక్షన్‌గా ఉన్న డోన్‌లో భూముల ధరలకు రెక్కలొచ్చింది మొదలు.. ఖాళీ భూములన్నింటినీ ఆయన హయాంలో అనుచరులు ఆక్రమించేసుకుంటున్నారు. మునిసిపాలిటీ మొదలు మార్కెట్‌ కమిటీ వరకూ ఆయనకు కప్పం
కట్టాల్సిందే. అన్న మౌనం పూర్తి అంగీకారం అన్నట్టుగా చెలరేగిపోతున్నారు.  

దర్జీల స్థలాలు.. దర్జాగా కబ్జా
20 ఏళ్ల క్రితం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు... ప్రస్తుత డిప్యూటీ సీఎంకేఈ కృష్ణమూర్తి జాతీయ రహదారి పక్కన ఉన్న 270 సర్వే నంబర్‌లో 4 ఎకరాల స్థలంలో టైలర్స్‌కు ఇళ్లపట్టాలు ఇచ్చారు. ఆయన చేతుల మీదుగా తమకు ఇళ్లపట్టాలు వచ్చాయన్న సంతోషంతో ఏకంగా ఆ కాలనీకి కేఈ కృష్ణమూర్తి నగర్‌గా పేరు పెట్టారు. అయితే, అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా... అన్న పంచిన పట్టాలను తమ్ముడుఆధ్వర్యంలో అధికారపార్టీ నేతలు స్వాధీనం చేసుకున్నారు. తమ ఇళ్ల పట్టాల్లో ఇళ్లు నిర్మించుకునేందుకు ఏర్పాటు చేసుకున్న సుమారు 200 బేస్‌ మట్టాలను నిర్దాక్షిణ్యంగా నేల మట్టం చేశారు. అయితే, ఇక్కడ ఎన్టీఆర్‌ గృహ నిర్మాణం పేరుతో బహుళంతస్తుల భవనాలను నిర్మిస్తున్నారు. అసలైన లబ్ధిదారులను కాదని టీడీపీ కార్యకర్తలనే లబ్ధిదారులుగా ఎంపిక చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి.  

వంకను కుదించి.. ప్రభుత్వ నిధులతో గోడ కట్టి
డోన్‌ పట్టణం నడి ఒడ్డున ఉన్న వంక భూమిని అధికారపార్టీకి చెందిన మరో నేత... చదును చేసుకుని పొలంగా మార్చడమే కాకుండా ఏకంగా ఉన్న కొద్దిపాటి వాగుకు అడ్డంగా గోడను కూడా నిర్మించారు. వాగు నీరు పొలంలోకి రాకుండా చేసేందుకు ఈ విధంగా చేసుకున్నారు. అయితే, ఈ గోడను కూడా ప్రభుత్వ నిధులతో నిర్మించడం గమనార్హం.  

నీరు – చెట్టులో 15 శాతం కమీషన్‌
నియోజకవర్గంలో ఉన్న వాగులు, వంకల్లో నీరు–చెట్టు పథకం కింద రూ.50 కోట్ల మేర పనులు మంజూరు చేసుకున్నారు. ఈ పనులను కాంట్రాక్టర్‌తోపాటు నేతలకూ అప్పగించారు. సుమారు 15 శాతం వరకూ కమీషన్‌ తీసుకుని పనులు అప్పగించినట్టు తెలుస్తోంది. అయితే, వాగులు, వంకల్లో మట్టి పూడిక తీత పనులు ముగిసిన తర్వాత... మళ్లీ నీరు–చెట్టు పథకం కింద చెక్‌డ్యాంల నిర్మాణ పనులను మంజూరు చేయించుకున్నారు. అయితే, ఈ పనులల్లో భారీగా ఆదాయం ఉండదని అనుకున్న తెలుగు తమ్ముళ్లు కాస్తా పనులను కాంట్రాక్టరుకు 5 శాతం కమీషన్‌కు అప్పగించారు. ఈ పనులు సిమెంటుతో కాకుండా ఇసుక సంచులతో చెక్‌డ్యాంలను నిర్మించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా నీరు–చెట్టు పనుల్లో తవ్విన మట్టిని... చెరువు కట్టడాలను మరింత పటిష్టం చేసేందుకు ఉపయోగించాలి. ఇందుకు విరుద్ధంగా.... చెరువుల నుంచి మట్టిని తరలిస్తున్న ప్రతి ట్రాక్టర్‌కు రూ.200 కప్పాన్ని ట్రాక్టర్‌ యజమానుల నుంచి వసూలు చేస్తున్నారు. అబ్బిరెడ్డిపల్లె, జగదూర్తి, ఉడుములపాడు, వెంగళాంపల్లె, కొచ్చెర్వు లాంటి చెరువుల వద్ద మట్టిని అక్రమంగా తరలిస్తూ ప్రతి రోజూ వేలాది రూపాయలను అక్రమంగా ఆర్జిస్తున్నారు.  

ఇసుక మేటల చాటున..
ఓ వైపు ప్రభుత్వం ఉచిత ఇసుకను అందిస్తున్నామని చెబుతోంది. ఇందుకోసం ఏకంగా ఇసుక పాలసీని తెచ్చామని ప్రచారం చేసుకుంటోంది. నియోజకవర్గంలో ఉన్న వాగులు, వంకల్లోని ఇసుకను ముందుగానే తోడుకుని భారీగా డంపులను ఏర్పాటు చేస్తున్నారు. ఎవరికి ఇసుక కావాలన్నా ఇక్కడి నుంచి తీసుకునే పరిస్థితి కల్పించారు. ట్రాక్టర్‌ కటకం ఇసుక రూ.800, ట్రాక్టర్‌ ప్లాస్టింగ్‌ ఇసుక రూ.1500 ఉండాల్సి ఉండగా టీడీపీ నాయకుని అండదండలతో ఇసుక రేట్లను అమాంతంగా పెంచేశారు. తాము తప్ప ఇసుకను ఎవరూ తరలించడం, విక్రయించడం చేయరాదని హుకూం జారీ చేశారు. కటకం ఇసుక రేటును రూ.2 వేలు, ప్లాస్టింగ్‌ ఇసుకను ట్రాక్టర్‌ రూ.5 వేల చొప్పున విక్రయిస్తున్నారు. వాస్తవానికి రోజువారీ అవసరాలకు మినహా ఇసుక డంప్‌లను ఏర్పాటు చేయడం నేరం. అంతేకాకుండా అటువంటి ఇసుక డంపులపై పోలీసు, రెవెన్యూ అధికారులు దాడులు చేసి స్వాధీనం చేసుకునే అధికారం కూడా ఉంది. అయితే, కళ్లెదుట భారీగా ఇసుక మేటలు కనిపిస్తున్నా అధికారులు మాత్రం మౌనాన్నే ఆశ్రయిస్తున్నారు. దీంతో ఇసుక కోసం సాధారణ ప్రజలు అధికారపార్టీ నేతలు చెప్పిందే రేటు చెల్లించి తీసుకెళ్లాల్సి వస్తోంది.   

డోన్‌ – బేతంచర్ల రహదారి పక్కనే పారిశ్రామిక వాడ ఆనుకొని ఉన్న 702 జెడ్‌లో ప్రభుత్వ ఆధీనంలో ఉన్న కొండను తొలిచి టీడీపీ నాయకులు నిరాటకంగా చదును చేస్తున్నా రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తున్నారు. ఇక్కడ చదును చేసిన స్థలాన్ని ఎకరా రూ.20 నుంచి రూ.30 లక్షల వరకు విక్రయించి సొమ్ము చేసుకొంటున్నారు.  

ప్యాపిలి మండలం ఊటకొండ గ్రామ పరిధిలోని ఉమా మహేశ్వర స్వామికి చెందిన 8.60 ఎకరాల భూమిని అధికారపార్టీ నాయకుడు ఆక్రమించుకున్నాడు. అనేక గ్రామాల్లో మాన్యం భూములను సైతం దిగమింగి దేవుళ్లకే శఠగోపం పెడుతున్నారు. ధూపదీప నైవేద్యాలు, నిత్యపూజల కోసం పూర్వికులు ఏర్పాటు చేసిన మాన్యం భూములను సైతం అధికారపార్టీ నాయకులు వదలడం లేదు.  

బంధువుల ఇంటికి దారేశారు..
డోన్‌ మునిసిపాలిటీలోనూ అధికారపార్టీ నేతలదే పెత్తనంగా సాగుతోంది. మునిసిపాలిటీ చైర్‌ పర్సన్‌ కోట్రికె గాయత్రీదేవి జన నివాసాల్లో అభివృద్ధి పనులు చేపట్టకుండా తన బంధువులైన కోట్రికె శేషయ్య కుటుంబీకుల స్థలాల్లో డ్రైనేజీ, సీసీరోడ్లును నిర్మించారు. ప్రజల నుంచి వసూలు చేసిన పన్నులను ఈ విధంగా పక్కదారి పట్టిస్తున్నారు.   
 ఏ మాత్రమూ జన నివాసాలు లేని ప్రాంతాల్లో కేవలం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు లబ్ధి చేకూర్చేందుకే కన్నపుకుంట, దత్తనగర్‌ ప్రాంతాల్లో సీసీరోడ్లను నాసిరకంగా నిర్మించి జేబులు నింపుకున్నారు. అంతేకాకుండా పనులన్నింటినీ నామమాత్రంగా టెండరు ప్రక్రియను అమలు చేసి అత్యధికం పనులను నామినేషన్‌పై అప్పగిస్తున్నారు.  
ఎవరైనా ధైర్యంగా కొన్ని పనులకు టెండర్లు వేసేందుకు వస్తే వారిపై దాడులకు తెగబడుతున్నారు. మున్సిపల్‌ టెండర్లలో పాల్గొనేందుకు వచ్చిన వైఎస్సార్‌సీపీ మద్దతుదారులపై  కేఈ ప్రతాప్‌ అనుచరులు దాడులు చేసి హత్యచేసేందుకు ప్రయత్నించారు.  
మున్సిపల్‌ పరిధిలో లే –అవుట్‌ లేకుండానే స్థలాలను ప్లాట్లుగా వేసి కోట్లాది రూపాయలను ఆర్జిస్తున్న రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల నుంచి లక్షలాది రూపాయలను అధికారపార్టీ నేతలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీని మూలంగా ఏటా కోట్లాది రూపాయల ఆదాయాన్ని మున్సిపాలిటీ నష్టపోతోంది.  

గోనె సంచుల్లోనూ గోకుడే
వేరుశనగ, కంది పంటలను కొనుగోలు చేసిన మార్క్‌ఫెడ్‌ అధికారులు రైతులకు ఖాళీ సంచులను తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా గతేడాది నియోజకవర్గంలోని రైతులకు లక్షా 80 వేల సంచులను తిరిగి ఇవ్వాల్సి ఉంది. అయితే అధికారపార్టీ నాయకునికి కప్పం కింద పెద్ద మొత్తంలో చెల్లించాల్సి రావడంతో మార్క్‌ఫెడ్‌ అధికారి రైతులకు ఖాళీ సంచులు ఇవ్వకుండా ఎగనామం పెట్టారు. అధికారి నుంచి వసూళ్లు చేసిన మొత్తాన్నే దిన, వారం సంత కోసం మున్సిపాలిటీకి సదరు నాయకుడు డిపాజిట్‌ చెల్లించారనే ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి.  

మరుగుదొడ్లలోనూ...
డోన్‌ నియోజకవర్గంలో పేద ప్రజలు నిర్మించుకొన్న వ్యక్తిగత మరుగుదొడ్ల బిల్లులను సైతం థర్డ్‌పార్టీ పేరుతో అధికారపార్టీ నేతలు దిగమింగారు. లబ్ధిదారులకు అందాల్సిన బిల్లులన్నీ థర్డ్‌పార్టీ అవతారం ఎత్తిన టీడీపీ నాయకులు తమ బ్యాంక్‌ ఖాతాల్లో లబ్ధిదారుల సొమ్మును వేయించుకొని స్వాహా చేశారు. ప్యాపిలి, బేతంచర్ల, డోన్‌ మండలాల్లోని అనేక గ్రామాల్లో ఈ దోపిడీ పర్వం నిరాటకంగా సాగింది. ఏకంగా ఇదే ఆరోపణలతో ఒక ఎంపీడీఓపై సైతం వేటు పడింది.  

దర్జీల స్థలాలు.. దర్జాగా కబ్జా
20 ఏళ్ల క్రితం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు... ప్రస్తుత డిప్యూటీ సీఎంకేఈ కృష్ణమూర్తి జాతీయ రహదారి పక్కన ఉన్న 270 సర్వే నంబర్‌లో 4 ఎకరాల స్థలంలో టైలర్స్‌కు ఇళ్లపట్టాలు ఇచ్చారు. ఆయన చేతుల మీదుగా తమకు ఇళ్లపట్టాలు వచ్చాయన్న సంతోషంతో ఏకంగా ఆ కాలనీకి కేఈ కృష్ణమూర్తి నగర్‌గా పేరు పెట్టారు. అయితే, అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా... అన్న పంచిన పట్టాలను తమ్ముడుఆధ్వర్యంలో అధికారపార్టీ నేతలు స్వాధీనం చేసుకున్నారు. తమ ఇళ్ల పట్టాల్లో ఇళ్లు నిర్మించుకునేందుకు ఏర్పాటు చేసుకున్న సుమారు 200 బేస్‌ మట్టాలను నిర్దాక్షిణ్యంగా నేల మట్టం చేశారు. అయితే, ఇక్కడ ఎన్టీఆర్‌ గృహ నిర్మాణం పేరుతో బహుళంతస్తుల భవనాలను నిర్మిస్తున్నారు. అసలైన లబ్ధిదారులను కాదని టీడీపీ కార్యకర్తలనే లబ్ధిదారులుగా ఎంపిక చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి.  

వంకను కుదించి.. ప్రభుత్వ నిధులతో గోడ కట్టి
డోన్‌ పట్టణం నడి ఒడ్డున ఉన్న వంక భూమిని అధికారపార్టీకి చెందిన మరో నేత... చదును చేసుకుని పొలంగా మార్చడమే కాకుండా ఏకంగా ఉన్న కొద్దిపాటి వాగుకు అడ్డంగా గోడను కూడా నిర్మించారు. వాగు నీరు పొలంలోకి రాకుండా చేసేందుకు ఈ విధంగా చేసుకున్నారు. అయితే, ఈ గోడను కూడా ప్రభుత్వ నిధులతో నిర్మించడం గమనార్హం.  

ఖాళీ జాగా.. వేసెయ్‌ పాగా..
మునిసిపాలిటీగా మారిన తర్వాత డోన్‌లో భూమి ధరలకు రెక్కలొచ్చాయి. దీంతో  అధికార తెలుగుదేశం పార్టీ నేతల కన్ను ప్రభుత్వ స్థలాలపై  పడింది. ప్రధానంగా వాగులు, వంక భూములతో పాటు వక్ఫ్‌ భూములపై కన్నేశారు. అనుకున్నదే తడువుగా.... ఆయా భూములను అధికార పార్టీ అండతో నేతలు కాస్తా తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు. ఈ విధంగా ఎక్కడ ఖాళీ జాగా కనిపించినా సరే తీసేసుకుని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నారు.  

పెద్దొంక హాంఫట్‌  
డోన్‌ పట్టణ నడిబొడ్డున ఉన్న సర్వే నంబర్‌ 323/ఏ లో ఉన్న 2.70 ఎకరాల విస్తీర్ణంలోని వక్ఫ్‌బోర్డు భూమిని అధికార పార్టీకి చెందిన మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ కేశన్న గౌడ్‌ను అడ్డుపెట్టి ఆక్ర మించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ భూమి విలువ ఎకరా సుమారు రూ. 5 కోట్లు ఉంటుందని అంచనా. దీనిపై వక్ఫ్‌ అధికారులు చర్యలు తీసుకునేందుకు జంకుతున్నారు. మరోవైపు రెవెన్యూ అధికారులు తమకేమీ సంబంధం లేదన్నట్టుగా మిన్నకుండిపోతున్నారు. ఏకంగా డిప్యూటీ సీఎం కాస్తా రెవెన్యూ మంత్రి కావడంతో రెవెన్యూ అధికారులు... ఫిర్యాదులు వచ్చినప్పటికీ కనీసం కన్నెత్తి చూసేందుకు కూడా వెనుకాడుతున్నారు. ఈ భూమికి ఆనుకొని ఉన్న పెద్దొంకను సమూలంగా నాశనం చేసి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం పెద్దొంక నీటిని ఇతర వంకలకు మళ్లించేందుకు పెద్దొంకకు గండికొట్టారు.  

నాయీ బ్రాహ్మణుల గూడు కొల్లగొట్టారు
పట్టణ నడిబొడ్డున కోట్లాది రూపాయల విలువ చేసే సర్వే నంబర్‌ 379/1 రెండెకరాల విస్తీర్ణంలోని భూమిని 15 ఏళ్ల క్రితం నాయీ బ్రాహ్మణులకు ఇళ్లపట్టాలు ఇవ్వడం జరిగింది. ఈ స్థలంలో లబ్ధిదారులు అధిక వడ్డీలకు అప్పులు చేసి బేస్‌ మట్టాల వరకు నిర్మాణాలు చేపట్టారు. అయితే మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ కేశన్న గౌడ్‌ ఆధ్వర్యంలో కేఈ ప్రతాప్‌ సూచనల మేరకు ఈ ప్రాంతంలోని బేస్‌ మట్టాలను ప్రొక్లైన్లతో నేలమట్టం చేశారు. నాయీ బ్రాహ్మణుల గోడును పట్టించుకోకుండా వారి స్థలాల్లో ప్లాట్లువేసి సెంటు రూ.5లక్షల చొప్పున విక్రయించి సొమ్ము చేసుకొన్నారు. ఈ విషయం పై నాయీ బ్రాహ్మణులు లోలోపల రగిలిపోతున్నారు. ఎవరికి ఫిర్యాదు చేసినా తమకు న్యాయం జరగదనే నిరాశలో మిన్నుకున్నారు.  

గంగ పుత్రుల స్థలం.. అనుచరుల పరం
పట్టణ శివారులోని పారిశ్రామిక వాడ సమీపంలోని సర్వే నంబర్‌ 564లో 4.80 ఎకరాలు, 914 సర్వే నంబర్‌లో 1.70 ఎకరాల విస్తీర్ణంలో గంగమ్మ మాన్యం భూమి ఉంది. టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ కేఈ ప్రతాప్‌ ఆధ్వర్యంలో ఆయన అనుచరులు మాన్యం భూమిని ఆక్రమించి పునాదులు కూడా తీశారు. దీంతో గంగపుత్రులు తమకు న్యాయం చేయాలంటూ కేఈ ప్రతాప్‌ను ఆశ్రయించగా ‘మీకు అంత భూమి అవసరం లేదు’ అని పంచాయితీ నిర్వహించి కేవలం రెండెకరాలు మాత్రమే కేటాయించి మిగిలిన 4.50 ఎకరాలను తన అనుచరులకు ధారాదత్తం చేశారనే విమర్శలు ఉన్నాయి. పక్కనే ఉన్న బుగ్గమాన్యం భూమిని సైతం ఆక్రమించి ప్లాట్లు వేసి టీడీపీ నాయకులు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. అయితే, ఇన్ని జరుగుతున్నప్పటికీ రెవెన్యూ అధికారులు మాత్రం అటువైపుగా వెళ్లి కనీసం పరిశీలించేందుకు కూడా సాహసించడం లేదు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement