కేసరపల్లిలో గొడవ పడుతున్న ఇరు వర్గాలు
కృష్ణాజిల్లా, గన్నవరం : మండలంలోని కేసరపల్లి ఎస్సీ కాలనీలో రెండు సామాజిక వర్గాల మధ్య నెలకొన్న విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. రెండు రోజుల క్రితం జరిగిన ఘర్షణ వాతావరణం సర్దుమణుగుతున్న సమయంలో ఓ వర్గాన్ని రెచ్చకొట్టే విధంగా మరో వర్గం సామాజిక మాధ్యమాల్లో వీడియో పోస్టు చేయడం మళ్లీ వివాదానికి దారి తీసింది. దీంతో ఆదివారం రాత్రి ఇరువర్గాల పరస్పర దాడులతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తొలుత సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోకు నిరసనగా అంబేడ్కర్‌నగర్ యువకులు ర్యాలీగా వెళ్తున్న క్రమంలో జగ్జీవన్‌రామ్‌నగర్‌కు చెందిన యువకులు ఎదురుపడడంతో ఘర్షణ చోటు చేసుకుంది. దీన్ని అడ్డుకునే క్రమంలో పికెటింగ్ ఉన్న పోలీసులు లాఠీలకు పని చెప్పడంతో గొడవ మరింత పెద్దదైంది. అక్కడ నుంచి అంబేడ్కర్‌నగర్ వాసులు ర్యాలీగా వెళ్ళి సావరగూడెం బైపాస్ వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకోకు దిగారు. జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించిపోవడంతో ఈస్ట్‌జోన్ ఏసీపీ విజయభాస్కర్, సీఐ శ్రీధర్‌కుమార్ సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకున్నారు. ఆందోళనకారులకు నచ్చచెప్పి రాస్తారోకోను విరమింపజేశారు.
అయితే తమ యువకులపై దాడిచేసి కొట్టారంటూ జగ్జీవన్‌రామ్‌నగర్ వాసులు కేసరపల్లి – బుద్దవరం రోడ్డుపై అడ్డంగా రాళ్లుపెట్టి ఆందోళనకు దిగారు. అంబేడ్కర్‌నగర్ వాసులను ఇటుగా వెళ్లనీయబోమని భీష్మించుకుని కూర్చున్నారు. ఇంతలో అంబేద్కర్‌నగర్‌వాసులు అక్కడికి చేరుకోవడంతో వీరి మధ్య మాటల యుద్ధం మళ్లీ మొదలైంది. దీంతో పోలీస్ బలగాలను రంగంలోకి దింపిన అధికారులు రోడ్డుపై కూర్చున్న ఆందోళనకారులను పక్కకు నెట్టే ప్రయత్నం చేశారు. అయినప్పటికి ఇరువర్గాలు వెనక్కి తగ్గకపోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సుమారు గంట సేపు అక్కడ గందరగోళ వాతావరణం నెలకొంది. దీంతో అదనపు సిబ్బందితో పాటు ఆందోళనకారులను చెదరకొట్టేందుకు టియర్ గ్యాస్ వెహికల్‌ను కూడా రంగంలోకి దింపారు. పరిస్థితిని అదుపు చేసేందుకు ఇరువైపుల పెద్దలతో పోలీస్ అధికారులు చర్చలు జరిపారు. చివరికి 11 గంటల సమయంలో ఇరువర్గాలను పంపించి వేయడంతో కొంత ఉద్రిక్తత తగ్గింది. అయితే నాలుగు రోజుల క్రితం ఇరువురు వ్యక్తుల మధ్య చోటు చేసుకున్న వివాదం చిలికిచిలికి గాలివానలా మారి గ్రామంలో అలజడి వాతావరణం నెలకొనడానికి దారి తీసింది. ఈ వివాదాన్ని మొదట్లోనే సర్దుబాటు చేయడంలో పోలీసుల వైఫల్యం చెందారు. ఫలితంగా గ్రామంలో ఇరువర్గాల పరస్పర దాడులు కొనసాగే పరిస్థితి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment