ట్విట్టర్‌లో టీ‘ఢీ’పీ! | Kesineni Nani, Buddha Engage In A War Of Words On Twitter | Sakshi
Sakshi News home page

ట్విట్టర్‌లో టీ‘ఢీ’పీ!

Published Mon, Jul 15 2019 9:15 AM | Last Updated on Mon, Jul 15 2019 1:41 PM

Kesineni Nani, Buddha Engage In A War Of Words On Twitter - Sakshi

సాక్షి, అమరావతి బ్యూరో : టీడీపీ ఎంపీ కేశినేని నాని.. ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మధ్య ట్విట్టర్‌ వేదికగా మాటల యుద్ధం జరుగుతోంది. ఇద్దరూ ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఆదివారం ఉదయం ప్రారంభమైన ఈ ట్వీట్‌ వార్‌ రాత్రి వరకు కొనసాగి.. ఏకంగా కాళ్లు పట్టుకోవడం, పునర్జన్మలు అంటూ తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకునే స్థాయికి వెళ్లింది. వీరిద్దరి మధ్య మాటల యుద్ధం ఈ స్థాయిలో జరుగుతున్నా టీడీపీ పెద్దలు ఎవరూ ఇప్పటి వరకూ స్పందించకపోవడం గమనార్హం.  

కేశినేని ట్వీట్‌కు బుద్ధా కౌంటర్‌
‘నాలుగు ఓట్లు సంపాదించలేని వాడు నాలుగు పదవులు సంపాదిస్తున్నాడు. నాలుగు పదాలు చదవలేనివాడు.. నాలుగు వాక్యాలు రాయలేనివాడు ట్వీట్‌ చేస్తున్నాడు. దౌర్భాగ్యం!’ అంటూ కేశినేని నాని ఆదివారం ఉదయం ట్వీట్‌ చేశారు. ఆయన ట్వీట్‌కు 9.32 గంటల సమయంలో రీట్వీట్‌ చేసిన బుద్ధా వెంకన్న.. ‘సంక్షోభ సమయంలో పార్టీ, నాయకుడి కోసం పోరాడేవాడు కావాలి. ఇతర పార్టీ నాయకులతో కలిసి కూల్చేవాడు ప్రమాదకరం. నీలాంటి అవకాశవాదులు కాదు.. చనిపోయేవరకు చంద్రబాబు కోసం సైనికుడిలా పోరాడేవాడు కావాలి’ అంటూ వ్యాఖ్యానించారు. ‘నిన్నటి దాకా చంద్రబాబు కాళ్లు.. రేపటి నుంచి విజయసాయిరెడ్డి కాళ్లు.. కాళ్లు కాళ్లే.. వ్యక్తులు మాత్రమే తేడా!’ అని కేశినేని నాని ట్విట్టర్‌లో హాట్‌ హాట్‌ వ్యాఖ్యలు చేశారు.

దీనికి స్పందించిన బుద్దా వెంకన్న.. కేశినేనికి స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. ‘నీకు ఏం చేయాలో తెలియక అబద్ధాలు ఆడుతున్నావు. దళిత నాయకుడు మాజీ స్పీకర్‌ బాలయోగి ఆస్తులన్నీ కాజేసిన దొంగ ఎవరో దేశం మొత్తానికి తెలుసు. ఒకే నంబర్‌పై దొంగ పర్మిట్లతో బస్సులు నడిపిన దొంగవి నువ్వే కదా.. నేను చెప్పాల్సిన నిజాలు చాలా ఉన్నాయి వినే ధైర్యం నీకుందా? నువ్వు చేసినవన్నీ అభాండాలు, నేను చెప్పేవన్నీ నిజాలు. బస్సుల మీద ఫైనాన్స్‌ తీసుకొని 1977లో సొంతంగా దొంగ రిసిప్ట్‌లు తయారు చేసుకుని ఫైనాన్స్‌ వారికి డబ్బులు చెల్లించకుండా నువ్వే దొంగ ముద్ర వేసుకొని కోట్లాది రూపాయలు ఫైనాన్స్‌ కంపెనీలకు ఛీట్‌ చేసిన నువ్వా ట్వీట్‌ చేసేది.

చిరంజీవి నీకు రాజకీయ జన్మనిస్తే చిరంజీవిని అనరాని మాటలని చిరంజీవి పార్టీని కూల్చావు.. చంద్రబాబు నీకు రాజకీయ పునర్జన్మ ఇస్తే ఇవాళ చంద్రబాబు గురించి శల్యుడిలా మాట్లాడుతున్నావు. విజయసాయి రెడ్డి మీద నేను పోరాడుతున్నానో నువ్వు పోరాడుతున్నావో ప్రజలకు తెలుసు. నీకు ఏం చేయాలో తెలియక అబద్ధాలు ఆడుతున్నావు.. ప్రజారాజ్యం నుంచి బయటకి వచ్చే ముందు ఆడిన ఆటలు ఈ పార్టీలో సాగవు’ అని కేశినేనిపై బుద్దా వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు.దానికి కేశినేని స్పందిస్తూ ‘రాజకీయ జన్మలు, రాజకీయ పునర్జన్మలు, రాజకీయ భవిష్యత్తులు గుళ్లో కొబ్బరిచిప్ప దొంగలకు, సైకిల్‌ బెల్లుల దొంగలకు, కాల్‌మనీగాళ్లకు, సెక్స్‌ రాకెట్‌గాళ్లకు, బ్రోకర్లకు, పైరవీదారులకు అవసరమని.. తనకు అవసరం లేదని ఘాటుగా ట్వీట్‌ చేశారు. ఈ మాటల యుద్ధం రాత్రి వరకు ఇలా  కొనసాగింది. 

వీరు ఇద్దరూ ట్వీటర్‌ పోరు నిర్వహిస్తుండగానే టీడీపీ నేత నాగుల్‌మీరా మధ్యలో స్పందిస్తూ.. ‘పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే పులి కాదు. పులి పులే నక్క నక్కే.. నాయకుని కోసం రాజీలేని పోరాటం చేసే తత్వం కేశినేని నాని డీఎన్‌ఏలోనే ఉంది. ప్రజాక్షేత్రం నుంచి గెలిచిన వారికే ప్రజానాయకులెవరో తెలుస్తుంది కాగితం పులులకు కాదు.’ అంటూ ట్వీట్‌ చేశారు. అయితే ఇరువురు నేతలు బహిరంగాంగా రచ్చకెక్కినా అసలు పార్టీలో ఏం జరుగుతోంది. ఇద్దరు నేతలు ఇలా బహిరంగంగా విమర్శలు చేసుకుంటున్నా.. పార్టీ అధినేత ఎందుకు మౌనంగా ఉన్నారు? ఎందుకు క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదు? అన్న ప్రశ్నలతో ఆ పార్టీ కేడర్‌ సతమతవుతోంది.

బుద్ధాకు కోపం ఇందుకేనా?
ఇటీవల విజయవాడలో ఓ సమావేశం నిర్వహించిన కేశినేని నాని.. వచ్చే ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి నాగుల్‌మీరాను గెలిపించాలని మాజీ కార్పొరేటర్లకు పిలుపునిచ్చారు. ఆ స్థానం నుంచి టికెట్‌ ఆశిస్తున్న బుద్ధా వెంకన్నకు ఇది ఆగ్రహం తెప్పించినట్లు సమాచారం. అప్పటి నుంచి నాని, వెంకన్న మధ్య మాటల యుద్ధం, వ్యంగ్యాస్త్రాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement