సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర పెద్దాస్పత్రి కేజీహెచ్ ఉద్యోగుల్లో ఏసీబీ భయం పట్టుకుంది. ఏపీ ఎన్జీవో సంఘం జిల్లా అధ్యక్షుడు, కేజీహెచ్ మెడిసిన్ స్టోర్స్ విభాగం సీనియర్ అసిస్టెంట్ కె.ఈశ్వరరావుకు ఆదాయానికి మించిన ఆస్తులున్నాయన్న అభియోగంపై ఏసీబీ దాడుల నేపథ్యంలో కేజీహెచ్ వైద్యులు, ఇతర సిబ్బందిలో ఆందోళన నెలకొంది. బుధవారం కేజీహెచ్‌లో ఎక్కడ చూసినా ఏసీబీ దాడుల అంశాన్నే చర్చించుకోవడం కనిపించింది. దాదాపు రెండు దశాబ్దాల పాటు కేజీహెచ్‌నే అంటిపెట్టుకుని ఈశ్వరరావుతో సన్నిహితంగా మెలిగిన ఉన్నతాధికారులు, మాజీ సూపరింటెండెంట్‌లు, మరికొందరు వైద్యులు, ల్యాబ్ టెక్నీషియన్‌లపైనా ఏసీబీ ఆరా తీస్తోంది. తీగలాగితే డొంక కదులుతుందన్న నమ్మకంతో ఏసీబీ అధికారులు అనుమానితుల ఆస్తులపై సోదాలు నిర్వహించనున్నట్టు తెలు స్తోంది. ఎన్జీవో సంఘం అధ్యక్షునిగా ఉన్న ఈశ్వరరావు తన పై అధికారులను మచ్చిక చేసుకుని ఆస్తులను కూడబెట్టినట్టు ప్రచారం జరుగుతోంది.
ఈశ్వరరావు అక్రమ సంపాదనకు పరోక్షంగా ఎవరు సహకరించార న్న దానిపై ఏసీబీ గురి పెట్టింది. ఆయనను ప్రోత్సహించిన వారికి చేకూరిన లబ్ధిపై కూడా దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఇటీవల కాలంలో భూములు, స్థలాలు, ఇళ్ల కొనుగోలు కు సంబంధించి ఎవరు రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారో సమాచారాన్ని సేకరిస్తున్నట్టు తెలిసిం ది. అంతేగాక కేజీహెచ్‌లో ఏళ్ల తరబడి ఒకే చోట తిష్టవేసిన సీనియర్ వైద్యులతో ఈశ్వరరావుకున్న లింకులపై కూపీ లాగుతోంది. ఇన్నాళ్లూ ఈశ్వరరావుతో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన వారంతా ఇప్పుడు ఆయనెవరో తమకు తెలియదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. రెండో రోజు బుధవారం కూడా ఏసీబీ అధికారులు పర్చేజింగ్ సెక్షన్‌లో సోదాలు నిర్వహించారు. కొన్ని కీలక రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఈశ్వరరావుతో పనిచేస్తున్న సిబ్బందిని పలు అంశాలపై ఆరా తీశారు. ఈ సెక్షన్‌లో ఈశ్వరరావు ఒక్కరే కాకుండా మరికొంత మంది కూడా అక్రమాస్తులు కూడగట్టారన్న సమాచారం ఏసీబీ వద్ద ఉన్నట్టు చెబుతున్నారు. ఇప్పుడు ఆ దిశగా కూడా ఏసీబీ అధికారులు దృష్టి సారిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఇప్పుడు కేజీహెచ్ వైద్యులతో పాటు ఈశ్వరరావు పనిచేస్తున్న సెక్షన్ విభాగపు ఉద్యోగుల్లోనూ రకరకాల ఊహాగానాలతో భయాందోళన నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment