డేంజర్: ఖైరతాబాద్ ఫ్లైఓవర్ | khairathabad flyover is in danger | Sakshi
Sakshi News home page

డేంజర్ :ఖైరతాబాద్ ఫ్లైఓవర్

Published Wed, Jan 22 2014 1:53 AM | Last Updated on Sat, Sep 2 2017 2:51 AM

khairathabad flyover is in danger

 సాక్షి, సిటీబ్యూరో :
 నిర్వహణ లోపం ఫ్లై ఓవర్ల పాలిట శాపంగా మారింది. ముఖ్యంగా ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ పరిస్థితి ప్రమాదకరంగా తయారైంది. ‘గ్రేటర్’ పరిధిలోని ఫ్లై ఓవర్లు, ఆర్‌ఓబీల నిర్వహణను ఆయా శాఖలు పట్టించుకోవడం మానేశాయి. ఫలితంగా ఏ క్షణాన ఏ ఫ్లై ఓవర్‌కు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియకుంది. గ్రేటర్‌లో 30కి పైగా ఫ్లై ఓవర్లు, ఆర్‌ఓబీలు ఉండగా.. వాటిలో కొన్నింటిని జీహెచ్‌ఎంసీ, కొన్నింటిని హెచ్‌ఎండీఏ, మరి కొన్నింటిని ఆర్ అండ్ బీ నిర్మించింది. ఆయా శాఖల మధ్య సమన్వయ లోపంతో నిర్వహణను గాలి కొదిలేశాయి. జీహెచ్‌ఎంసీ నిర్మించిన ఫ్లై ఓవర్ల మరమ్మతులు, నిర్వహణ బాధ్యతలు జీహెచ్‌ఎంసీవి కాగా, హెచ్‌ఎండీఏ, ఆర్‌అండ్‌బీలు తమ ఫ్లై ఓవర్ల బాధ్యత కూడా జీహెచ్‌ఎంసీదే నంటున్నాయి. జీహెచ్‌ఎంసీ మాత్రం అది తమ  బాధ్యత కాదంటోంది.
 
 రహదారుల విషయంలోనూ జీహెచ్‌ఎంసీ, ఆర్ అండ్‌బీల మధ్య ఇలాంటి వివాదమే ఉండగా.. గ్రేటర్‌లోని అన్ని రహదారుల నిర్వహణను జీహెచ్‌ఎంసీయే పర్యవేక్షించాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్నకుమార్ మహంతి ఇటీవల స్పష్టం చేశారు. ఫ్లై ఓవర్లు, ఆర్‌ఓబీల విషయంలో ఇలాంటి స్పష్టత లేకపోవడంతో అటు వాటిని నిర్మించిన హెచ్‌ఎండీఏ, ఆర్‌అండ్‌బీలు.. ఇటు జీహెచ్‌ఎంసీ వాటి నిర్వహణను గాలి కొదిలేయడంతో వాటి పరిస్థితి అయోమయంగా మారింది. తత్ఫలితంగా ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ ప్రమాదకర స్థితికి చేరుకుంది. నగరం నడిబొడ్డున, సచివాలయం సమీపంలోని ఉన్న ఈ ఫ్లై ఓవర్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. గత కొన్నేళ్లుగా ఎలాంటి నిర్వహణ లేకపోవడంతో ప్రతిరోజూ తీవ్ర ట్రాఫిక్ రద్దీని మోస్తున్న ఈ ఫ్లై ఓవర్ జాయింట్లు పలు ప్రాంతాల్లో వదులైపోయి ఆందోళన కలిగిస్తోంది. వాహనాలు నడిచేటప్పుడు ఫ్లై ఓవర్ విపరీతమైన కుదుపులకు గురవుతోంది. అయినప్పటికీ, ఏ ప్రభుత్వ విభాగం కూడా పట్టించుకున్న పాపాన పోవడం లేదు.
 
 మళ్లీ సీఎం హెచ్చరించాలా..?
 దాదాపు నాలుగేళ్ల క్రితం రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఖైరతాబాద్ ఫ్లై ఓవర్‌పై ప్రయాణిస్తుండగా కుదుపులెక్కువ కావడంతో అధికారులను ప్రశ్నించారు.  సీఎం కార్యాలయం ఆదేశాలతో అప్పట్లో జీహెచ్‌ఎంసీ రంగంలోకి దిగి మరమ్మతు చర్యలు చేపట్టింది. ఫ్లై ఓవర్‌పై రాకపోకలు నిలిపివేసి ఉరుకులు, పరుగులతో రిపేర్లు చేశారు. జాయింట్లు లూజైన చోట ప్రత్యేక మెటీరియల్‌తో, కాంక్రీట్ చిప్‌తో పనులు చేసి ఫ్లై ఓవర్‌ను తాత్కాలికంగా పటిష్టపరిచారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దీన్ని తిరిగి ఎవరూ పట్టించుకోలేదు. నిర్వహణను పూర్తిగా గాలికొదిలేశారు. నాలుగేళ్ల నాడు చేసిన మరమ్మతులు కొట్టుకుపోవడంతో తిరిగి  కుదుపులెక్కువయ్యాయని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అప్పుడు సీఎం కార్యాలయం ఆదేశించడతో మరమ్మతులు చేపట్టిన జీహెచ్‌ఎంసీ.. ఇప్పుడు అది తమ పని కాదన్నట్లు వ్యవహరిస్తోంది. ఇక హెచ్‌ఎండీఏ నిర్మాణం వరకే తమ బాధ్యత న్నట్లుగా ఆ విషయాన్నే మరచిపోయింది. ఈ నేపథ్యంలో.. ఇప్పుడు దీన్ని ఎవరు బాగుచే స్తారన్నది అంతుపట్టకుంది. కాగా రెండేళ్ల క్రితం నగరంలోని ఫ్లై ఓవర్ల పరిస్థితిని తెలుసుకునేందుకు కన్సల్టెంట్ ద్వారా సర్వే జరిపించిన జీహెచ్‌ఎంసీ.. తదుపరి చర్యల విషయంలో మాత్రం తనకేం పట్టనట్లు వ్యవహరిస్తోంది. సర్వే నిర్వహించిన కన్సల్టెంట్ సంస్థ  ఖైరతాబాద్ ఫ్లై ఓవర్‌కు పూర్తి భరోసా లేదని, లోపాల్ని వెంటనే సరిదిద్దాలని తన నివేదికలో సూచించడం గమనార్హం. లాలాపేట, మాసాబ్‌ట్యాంక్ ఫ్లై ఓవర్లకు సైతం తక్షణ మర మ్మతులు అవసరమని కన్సల్టెంట్ సంస్థ తన నివేదికలో పేర్కొంది.
 
 ఫై ్ల ఓవర్లు    నిర్మించింది
 1.వైఎంసీఏ(సికింద్రాబాద్)    హుడా
 2.మాసాబ్‌ట్యాంక్    హెచ్‌ఎండీఏ
 3.పాత విమానాశ్రయం    హుడా
 4.నారాయణగూడ    హుడా
 5.తెలుగుతల్లి    హుడా
 6.సీటీఓ    హుడా
 7.బషీర్‌బాగ్    హుడా
 8.తార్నాక     హుడా
 9.నాగోల్ చౌరస్తా    జీహెచ్‌ఎంసీ
 10.చాంద్రాయణగుట్ట    జీహెచ్‌ఎంసీ
 11.హైటెక్‌సిటీ జంక్షన్    హెచ్‌ఎండీఏ
 12.గ్రీన్‌ల్యాండ్స్    జీహెచ్‌ఎంసీ
 13.పంజాగుట్ట    జీహెచ్‌ఎంసీ
 14.బేగంపేట(కొత్తది)    జీహెచ్‌ఎంసీ
 15.పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే    హెచ్‌ఎండీఏ
 
 ఆర్వోబీలు    నిర్మించింది
 1.బేగంపేట    ఎంసీహెచ్
 2.ఖైరతాబాద్    ఎంసీహెచ్
 3.లాలాపేట    ఎంసీహెచ్
 4.మౌలాలి    ఆర్ అండ్ బీ
 5.ఆర్‌కే పురం    ఆర్ అండ్ బీ
 6. సనత్‌నగర్(ఎన్‌హెచ్-9)    ఆర్ అండ్ బీ
 7.ఫతేనగర్    ఎంసీహెచ్
 8.ఆడిక్‌మెట్    ఎంసీహెచ్
 9.సీతాఫల్‌మండి    జీహెచ్‌ఎంసీ
 10.డబీర్‌పురా    ఎంసీహెచ్
 11.హఫీజ్‌పేట    హెచ్‌ఎండీఏ
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement