ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: స్వాతంత్య్ర దిన వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సకాలంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ శ్రీనివాస్ శ్రీ నరేష్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సాంస్కృతిక కార్యక్రమాలలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు అవకాశం కల్పించాలని డీఈఓను ఆదేశించారు. ఐటీడీఏ, డీఆర్‌డీఏ, పరిశ్రమల శాఖ, ఉద్యానవన, ఎస్సీ, బీసీ, సెట్‌కం, వికలాంగులశాఖ, వ్యవసాయ శాఖల స్టాల్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. నిరంతర విద్యుత్ సరఫరా, సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని విద్యుత్, సమాచార శాఖ అధికారులను ఆదేశించారు. పోలీస్ పరేడ్ మైదానం, పతాకావిష్కరణ ఏర్పాట్లపై రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. శాఖల పనితీరుకు అద్దం పట్టేలా శకటాలను ఏర్పాటు చేయాలని సూచించారు.
విశిష్ట సేవలందించిన ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులకు ప్రశంస పత్రాలు ఇచ్చేందుకు ప్రతి కార్యాలయం నుంచి నాలుగో తరగతి సిబ్బందితో సహా ముగ్గురికి మించకుండా ఆగస్టు 12లోగా కలెక్టరేట్‌కు పేర్లు పంపించాలని అన్నారు. పోలీస్ పరేడ్ మైదానం వద్ద ప్రథమ చికిత్స కేంద్రం, మంచినీటి వసతి ఏర్పాటు చేయాలని జిల్లా వైద్యారోగ్యశాఖాధికారిని, మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. పాఠశాలల నుంచి వచ్చే విద్యార్థులకు అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకోవాలని అర్బన్ తహశీల్దార్‌కు సూచించారు.
ఈ వేడుకలకు స్వాతంత్య్ర సమరయోధులను ఆహ్వానించాలన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ తప్సీర్ ఇక్బాల్, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాస్, డీఎస్పీ బాలకిషన్‌రావు, సీపీఓ రత్నబాబు, జిల్లా పంచాయతీ అధికారి పటోళ్ళ ప్రభాకర్‌రెడ్డి, జడ్పీ సీఈఓ జయప్రకాష్ నారాయణ, డీఆర్‌డీఏ పీడీ పద్మాజారాణి, డీఈవో రవీంద్రనాధ్‌రెడ్డి, డీఎంఅండ్‌హెచ్‌ఓ భానుప్రకాష్, ఆర్డీవో సంజీవరెడ్డి, ఐసీడీఎస్ పీడీ సుఖజీవన్‌బాబు, ఉద్యానవనశాఖ ఏడీ సుబ్బారాయుడు, మెప్మా పీడీ వేణుమనోహర్, బీసీ వెల్ఫేర్ అధికారి వెంకటనర్సయ్య పాల్గొన్నారు.
‘స్వాతంత్య్ర’ వేడుకలను ఘనంగా నిర్వహించాలి
Published Wed, Aug 7 2013 3:49 AM | Last Updated on Thu, Mar 21 2019 8:29 PM
Advertisement