రంపచోడవరం, న్యూస్‌లైన్ : ఖమ్మం- తూర్పుగోదావరి మధ్య మారేడుమిల్లి వద్ద ఘాట్ రోడ్డుకు మరమ్మతులు చేస్తుండడంతో 40 రోజులు వాహనాల రాకపోకలు నిలిపివేశారు. వై.రామవరం మండలం ఎగువ ప్రాంతంలో ఉన్న గిరిజనులు వాహనాలు తిరగక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ రహదారిపై ఛత్తీస్‌గఢ్ - ఆంధ్రప్రదేశ్ మధ్య లారీలపై వస్తువుల రవాణా అవుతాయి. ఘాట్‌రోడ్డుపై రాకపోకలు నిలిపివేయడంతో పశ్చిమ గోదావరి మీదుగా చుట్టూ తిరిగి రావాల్సి వస్తోందని వాహనదారులు అన్నారు. జగ్దల్‌పూర్-రాజమండ్రి మధ్య బస్సు రాకపోకలు నిలిపివేశారు. ఘాట్ రోడ్డులో అడ్డుగా బండరాళ్లను ఉంచడంతో ద్విచక్ర వాహనాలు కూడా తిరిగే అవకాశం లేదు. మరో పది రోజుల్లో ద్విచక్ర వాహనాలు వెళ్లేందుకు అనుమతిస్తామని భద్రాచలం డివిజన్ రోడ్డు భవనాలు శాఖ అధికారులు తెలిపారు. ఘాట్ రోడ్డులో ఐదు కిలోమీటర్లు మేర కొండ చరియలను బాంబు బ్లాస్టింగ్ చేసి రోడ్డు, రక్షణగోడ నిర్మాణం పనులు పూర్తయ్యేందుకు మరో రెండు నెలలు అవసరమని అధికారులు చెబుతున్నారు.
గిరిజనులకు తప్పని ఇక్కట్లు
వై.రామవరం ఎగువ ప్రాంతాల్లోని గిరిజన గ్రామాలకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. ఇతర ప్రాంతాలకు జీకే వీధి మీదుగా కాకరపాడు జంక్షన్ నుంచి రాజవొమ్మంగి మీదుగా రంపచోడవరం చేరుకోవాల్సి వస్తోందని గిరిజనులు అన్నారు. అక్కడ జిల్లా పరిధిలో దాదాపు 40 గ్రామాలు ఉంటాయి. గత నెలలో వారికి రేషన్ బియ్యం నర్సీపట్నం మీదుగా పంపించడంతో ఖర్చులు తడిసి మోపిడయ్యాయని జీసీసీ అధికారులు తెలిపారు. వచ్చే నెల రేషన్ సరుకులు ఎలా పంపుతారో తెలియని పరిస్థితి. ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు ప్రయాణానికి ఇబ్బందులు ఎదురొంటున్నట్టు గిరిజనులు తెలిపారు. సమస్యలు అధికారులు తెలిపేందుకు రంపచోడవరం ఐటీడీఏ వద్దకు వెళ్లేందుకు కూడా దూరాభారం పెరిగిందని వారన్నారు.
మరో రెండు నెలలు రాకపోకలు బంద్
Published Thu, Sep 26 2013 12:12 AM | Last Updated on Fri, Sep 1 2017 11:02 PM
Advertisement