వామ్మో.. మహా ముదుర్లు!
Published Tue, Apr 4 2017 10:40 AM | Last Updated on Tue, Sep 5 2017 7:56 AM
► జిల్లాలో సంచలనం
► సృష్టిస్తున్న కిలాడీ ముఠా
► ఆర్థికశాఖ మంత్రి బంధువులమని
► రాజధానిలో పనులు ఇప్పిస్తామని మాయమాటలు
► ప్రజాప్రతినిధులను బురిడీ కొట్టించిన వైనం
► పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు
కడప అర్బన్ : సార్.. ఆర్థిక శాఖ మంత్రికి మేము దగ్గరి బంధువులం.. మీకు రాజధాని ప్రాంతంలో పనులు ఇప్పిస్తాం.. అంటూ జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధుల నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేసిన కిలాడీ ముఠా ఉదంతమిది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో మోసాలకు పాల్పడిన ఈ ముఠా జిల్లాలోని పలువురు ప్రముఖ నేతలను సైతం బురిడీ కొట్టించింది.
విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన బాలాజీ, మిర్యాలగూడకు చెందిన రామకృష్ణ అనే ఇద్దరు వ్యక్తులు తాము ఆర్థిక శాఖ మంత్రి సమీప బంధువులమని జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధుల వ్యక్తిగత కార్యదర్శులను కలిసి పరిచయం చేసుకుంటారు. ఆ తర్వాత రాజధాని ప్రాంతంలో ఏ పని కావాలన్నా తాము ప్రభుత్వం నుంచి అనుమతి ఇప్పిస్తామని నమ్మబలుకుతారు. వీరి వేషధారణ.. మాట తీరును చూసి ఇక ఏమాత్రం అనుమానించకుండా వెంటనే వారి మాయలో పడిపోతారు.
ఇలా జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి వద్ద రూ.2 లక్షలు, అధికార పార్టీకి చెందిన ఇద్దరు మాజీ ప్రజాప్రతినిధుల వద్ద రూ.5లక్షలు, రూ.2లక్షలు చొప్పున తమ అకౌంట్లలో జమ చేయించుకున్నారు. వీరు తమకు అనుకూలమైన మహిళల అకౌంట్లలో ఈ మొత్తాన్ని జమ చేయించుకుని ఆ తర్వాత జల్సా చేసుకుంటారు. వీరి చేతిలో మోసపోయిన ఓ మాజీ ప్రజాప్రతినిధి తన వద్ద రూ.5లక్షలు తీసుకున్నారని జిల్లా ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణకు ఫిర్యాదు చేయడంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి ఇద్దరు మోసగాళ్లను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. అయితే ఈ మొత్తాన్ని తమ అకౌంట్లలో జమ చేయించుకున్న మహిళల ఆచూకీ కోసం కూడా గాలింపు చర్యలు చేపట్టినట్లు సమాచారం.
Advertisement
Advertisement