
సభలో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు
సాక్షి ప్రతినిధి, అనంతపురం: సాగునీటి ప్రాజెక్టులతోనే అనంతపురం జిల్లాకు ‘కియా’ ప్లాంటు వచ్చిందని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. భవిష్యత్తులో మరిన్ని ప్రాజెక్టులు ‘అనంత’కు తరలిరానున్నాయన్నారు. ‘కియా మోటార్స్’లో మంగళవారం ప్రయోగాత్మక ఉత్పత్తి(ట్రయల్ ప్రొడక్షన్) కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. భారత్‌లో కొరియా రాయబారి షిన్‌బాన్గి్కల్, కియా ప్రెసిడెంట్ హాన్‌వూ పార్క్, ఎండీ కూక్యున్ షిమ్‌లు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘కియా’ను స్థాపించాలని కోరినప్పుడు.. ప్లాంటు స్థాపిస్తామని, కానీ ఇక్కడ నీళ్లు ఎక్కడ ఉన్నాయని ‘కియా’ ప్రతినిధులు అడిగారన్నారు. ఆర్నెల్ల సమయం కోరానని, గొల్లపల్లికి నీళ్లు తీసుకొచ్చానని, దీంతో వారు ‘కియా’ను స్థాపించారని చెప్పారు. 2017 ఏప్రిల్‌లో ‘కియా’తో ఎంఓయూ చేసుకున్నామని, తక్కువ కాలంలోనే ‘ట్రయల్ ప్రొడక్షన్’ను ప్రారంభించామని పేర్కొన్నారు. మరో ఆర్నెల్లలో కార్లను ఉత్పత్తి చేసి మార్కెట్‌లోకి విడుదల చేస్తామన్నారు. ‘‘నా జీవితంలో ఎప్పుడు హెలికాప్టర్‌లో తిరిగినా, ఇండియాలో.. పైగా అనంతపురంలో ఇంత మంచి ప్రాజెక్టు వస్తుందని ఊహించలేదు. కానీ సాధ్యమైంది. గతంలో వోక్స్‌వ్యాగన్, ప్రోటాన్ పరిశ్రమలు వస్తాయనుకున్నా! వోక్స్‌వ్యాగన్ పుణేకు తరలిపోయింది. దీంతో ఇక్కడ పరిశ్రమలు స్థాపించాలంటే అంతా భయపడ్డారు. నేనున్నానని చెప్పాను. మీరున్నప్పుడు సరే, తర్వాత సంగతేంటి? అని ప్రశ్నించారు. ఇలాంటి ప్రాజెక్టులు రావాలంటే తిరిగి టీడీపీ రావాలి. ఇది చారిత్రక అవసరం’’ అని చెప్పారు.
స్థానికులకే ఉద్యోగాలు రావాలంటే ప్రాజెక్టులు రావు..
భూములు కోల్పోయిన వారికి, స్థానికులకు ఉద్యోగాల కల్పనలో అన్యాయం జరుగుతోందని విలేకరులు ప్రశ్నించగా.. 376 మంది భూములిచ్చారు, వారి పిల్లలకు శిక్షణిచ్చి ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని సీఎం చెప్పారు. స్థానికులకే ఉద్యోగాలు రావాలంటే ఇక్కడికి ప్రాజెక్టులు రావని, స్థానికులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ కార్లు కూడా త్వరలోనే ‘కియా’ నుంచి వస్తాయన్నారు.
కొరియాలో ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా పార్క్
కొరియాలో ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా కియా ప్రెసిడెంట్ హాన్ వూ పార్క్‌ను అధికారికంగా నియమిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. కొరియన్లకు కొరియా సొంత దేశమైతే, ఆ తర్వాత అదే స్థాయిలో ఆంధ్రప్రదేశ్ కూడా ఉండేలా భవిష్యత్తు ఉండబోతోందన్నారు. హాన్‌వూ పార్క్ మాట్లాడుతూ అంతర్జాతీయంగా అధునాతన కార్లను కియా అందించబోతోందన్నారు. 536 ఎకరాల్లో విస్తరించిన ఈ ప్రాజెక్టుతో ఏడాదికి మూడు లక్షల కార్లను ఉత్పత్తి చేస్తామని చెప్పారు. అనంతరం ప్లాంటును సందర్శించిన సీఎం చంద్రబాబు, కియా ప్రతినిధులు తయారీ యూనిట్‌ను ప్రారంభించారు. ఆపై ట్రయల్‌రన్ ప్రాంతానికి వెళ్లి ‘కియా’ కారును ఆవిష్కరించారు. కారులో ‘ట్రయల్ రన్’ చేశారు. ఎండీ కూక్యున్ షిమ్ కారును నడపగా సీఎం, కియా ప్రెసిడెంట్ పార్క్, రాయబారి బాన్గి్కల్ అందులో కూర్చున్నారు. తర్వాత ఎలక్ట్రిక్ కారును ఏపీ ప్రభుత్వానికి బహుమానంగా ‘కియా’ ప్రతినిధులు అందజేశారు.
ఎవరికి టికెట్ ఇస్తే వారిని గెలిపించాలి: సీఎం
కదిరి: ‘‘వచ్చే ఎన్నికల్లో నేను ఎవరికి టికెట్ ఇస్తే వారిని గెలిపించాలి. సర్వేల ప్రకారం అందరికీ ఆమోదయోగ్యమైన అభ్యర్థులనే ఎంపిక చేస్తాం. సరైన సమయంలో సరైన అభ్యర్థులను ప్రకటిస్తా. మీరంతా వారికే ఓట్లు వేయాలి. గత ఎన్నికల్లో మనకు బొటాబొటీ మెజార్టీ సీట్లు వచ్చాయి. వైఎస్సార్‌సీపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు వచ్చారు కాబట్టి సరిపోయింది. ఆ వచ్చిన వారిలో కదిరి ఎమ్మెల్యే చాంద్‌బాషా కూడా ఒకరు. ఈసారి ఎన్నికల్లో అరకొర మెజార్టీ సీట్లు వస్తే అభివృద్ధి చేయడం కష్టం. అన్ని సీట్లు మనమే గెలవాలి’’ అని చంద్రబాబు అన్నారు. కదిరి మండలం చెర్లోపల్లి హంద్రీనీవా రిజర్వాయర్ నుంచి పుంగనూరు బ్రాంచ్ కెనాల్‌కు మంగళవారం నీళ్లు వదిలారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. ప్రధాని మోదీ సహకరించనప్పటికీ అందరూ గర్వపడే రాజధాని నిర్మిస్తానన్నారు. ఉమ్మడి ఆం«ధ్రప్రదేశ్‌లో సైబరాబాద్‌ను కట్టించింది తానేనని, ఎయిర్‌పోర్టు కట్టించిందీ తానేనని చెప్పారు. కేసుల మాఫీ కోసమే జగన్‌మోహన్‌రెడ్డి.. మోదీకి దాసోహమయ్యాడని ఆరోపించారు. కేసీఆర్, జగన్ ఇద్దరూ మోదీ ఏజెంట్లన్నారు. పోలవరం ప్రాజెక్టును 2019కల్లా పూర్తి చేస్తామని చెప్పారు. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి హంద్రీ–నీవాను అనుసంధానం చేస్తామన్నారు. 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మొత్తం 62 ప్రాజెక్టులు చేపట్టామని, అందులో 23 పూర్తి చేశామని, మరో 26 త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పారు. మిగిలిన 13 ప్రాజెక్టులకూ శ్రీకారం చుట్టామన్నారు. సీఎం ప్రసంగం గంటకుపైగా సాగింది. ఆయన ప్రసంగం మొదలెట్టిన 15 నిమిషాలకే కుర్చీలన్నీ ఖాళీ అవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment