వైఎస్‌కు ఇచ్చిన వాగ్దానం మేరకే అనంతకు కియా | Kia Motors Came To Anantapur Help Of YS Rajasekhara Reddy | Sakshi
Sakshi News home page

వైఎస్‌కు ఇచ్చిన వాగ్దానం మేరకే అనంతకు కియా

Published Tue, Jul 16 2019 3:49 AM | Last Updated on Tue, Jul 16 2019 3:50 AM

Kia Motors Came To Anantapur Help Of YS Rajasekhara Reddy - Sakshi

2007లో వైఎస్సార్‌కు ఇచ్చిన వాగ్దానాన్ని వివరిస్తూ సీఎం వైఎస్‌ జగన్‌కు  గత నెల 13న హాన్‌ వూ రాసిన లేఖ

సాక్షి, అమరావతి: దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డికి 2007లో ఇచ్చిన వాగ్ధానాన్ని దృష్టిలో ఉంచుకొని ఆంధ్రప్రదేశ్‌లో ‘కియా మోటార్స్‌’ను ఏర్పాటు చేసినట్లు కియా మోటార్స్‌ చైర్మన్, సీఈవో హాన్‌ వూ వెల్లడించారు. హ్యుండాయ్‌ మోటార్‌ గ్రూప్‌ భారత్‌లో అదనపు పెట్టుబడులు పెట్టాలని భావిస్తే మొదట ఆంధ్రప్రదేశ్‌కే ప్రాధాన్యత ఇస్తామని అప్పట్లో వైఎస్సార్‌కు వాగ్ధానం చేసినట్లు గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు కియా మోటార్స్‌ చైర్మన్, సీఈవో హాన్‌ వూ పార్క్‌ 2019 జూన్‌ 13న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి రాసిన లేఖను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ సోమవారం అసెంబ్లీలో చదివి వినిపించారు. అనంతపురం జిల్లాలో కియా మోటార్స్‌ ఏర్పాటుపై చంద్రబాబు చేసుకున్నంత ప్రచారం ప్రపంచంలో ఎవ్వరూ చేసుకోలేదని ఎద్దేవా చేశారు. ఏపీకి కియా రావడానికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కారణం కాదని, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి అనే విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలియాల్సి ఉందని ఆయన అసెంబ్లీలో చెప్పారు.
 
ఆ లేఖలో హాన్‌ వూ పార్క్‌ ఏమన్నారంటే... 
‘‘జగన్‌మోహన్‌రెడ్డి గారు.. 2019 ఎన్నికల్లో మీరు అఖండ విజయం సాధించి, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి పదవి చేపట్టినందుకు శుభాకాంక్షలు. మీ విజయాన్ని చూస్తే మీపై ఆంధ్రప్రదేశ్‌ ప్రజల నమ్మకం, విశ్వాసం ఏంటో అర్థమవుతుంది. మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ పేరు వింటుంటే నాకు 2007 నాటి మధుర స్మృతులు గుర్తుకొస్తున్నాయి. అప్పట్లో నా నేతృత్వంలోనే హైదరాబాద్‌లో హ్యుండాయ్‌ మోటార్‌ ఆర్‌ అండ్‌ డీ సెంటర్‌ (హ్యుండాయ్‌ మోటార్‌ ఇండియా ఇంజనీరింగ్‌)ను ఏర్పాటైంది. ఆ సమయంలో అప్పటి ముఖ్యమంత్రి, మీ తండ్రి అయిన దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డితో సమావేశం అయ్యాను.

అప్పడు ఆయన రాష్ట్రంలో ఆటోమొబైల్‌ ఫ్యాక్టరీని నెలకొల్పాలని అడిగారు. హ్యుండాయ్‌ మోటార్‌ గ్రూప్‌ తరఫున నేను మీ తండ్రిగారికి అప్పట్లో వాగ్ధానం చేశాను. భారత్‌లో మేము ఏదైనా ఫ్యాక్టరీని నెలకొల్పాలని అనుకుంటే మీ రాష్ట్రంలోనే ఏర్పాటు చేస్తామని చెప్పాను. మీ తండ్రితో ఉన్న సాన్నిహిత్యం, మేము ఇచ్చిన మాట మేరకు ఇండియాలోనే మొట్టమొదటి ప్లాంటుగా అనంతపురం జిల్లాలో కియా మోటార్స్‌ కంపెనీని ఏర్పాటు చేస్తున్నందుకు సంతోషిస్తున్నాను. ఇక్కడ జరిగే వ్యాపార, ఆర్థిక, సామాజిక వృద్ధి విషయంలో మీరు మాకు పూర్తి సహకారమందిస్తారని, మీ తండ్రిలాగే మీరు ఆయన పేరుప్రతిష్టలను కొనసాగిస్తారని మీపై మాకు పూర్తి నమ్మకం ఉంది’’ అంటూ హాన్‌ వూ పార్క్‌ తన లేఖలో పేర్కొన్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement