
కిక్కు..లక్కు
నెల్లూరు (క్రైమ్) : మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియ దాదాపు పూర్తయింది. అధికారులు లాటరీ ద్వారా విజేతలను ఎంపిక చేసి దుకాణాలను కేటాయించారు. 2014-15 సంవత్సరానికి జిల్లాలోని 348 మద్యం దుకాణాల కేటాయింపు కోసం శనివారం నగరంలోని కస్తూరిభా కళాక్షేత్రంలో నిర్వహిస్తున్న లక్కీ డ్రా ఆధ్యంతం ఉత్కంఠ భరితంగా సాగుతోంది. 321 దుకాణాలకు 3,988 మంది పోటీ పడ్డారు.
ఏజేసీ రాజకుమార్ సమక్షంలో డ్రా ప్రక్రియను ప్రారంభించారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కావాల్సిన డ్రా ప్రక్రియ రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది. రాత్రి పొద్దుపోయే వరకు సాగింది. జిల్లాలో 15 ఎక్సైజ్ సర్కిల్స్ ఉండగా రాత్రి 10.30 గంటల వరకు కేవలం ఆరు ఎక్సైజ్ సర్కిల్స్‌కు సంబంధించిన లాటరీ డ్రా నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యాపారులు, వారి అనుచరులతో జిల్లా పోలీసు కార్యాలయం నుంచి కేవీఆర్ పెట్రోల్ బంకు వరకు సందడి వాతావరణం నెలకొంది. పాస్ ఉన్న వారిని మాత్రమే లోనికి అనుమతించారు.
ఒక్కో దుకాణానికి ఒకటి, రెండు దరఖాస్తులు పడగా, కొన్ని దుకాణాలకు పదుల సంఖ్యలో దరఖాస్తులు దాఖలు కావడంతో ఎవరికి దుకాణం వస్తుందోనన్న ఆందోళన వ్యాపారుల్లో వ్యక్తమైంది. మద్యం దుకాణాలను దక్కించుకునేందుకు మహిళలు సైతం పోటీపడ్డారు. నెల్లూరు, గూడూరు ఎక్సైజ్ జిల్లాలకు వేర్వేరు కౌంటర్లు ఏర్పాటు చేసి డ్రా తీశారు. ఏజేసీ రాజకుమార్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ వై. చైతన్యమురళీ సమక్షంలో లక్కీ డ్రా నిర్వహించారు. దీంతో దుకాణాల కేటాయింపు కార్యక్రమం శరవేగంగా ముందుకు సాగింది. లక్కీ డ్రా కార్యక్రమాన్ని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ పి. శ్రీమన్నారయణరావు, నెల్లూరు, గూడూరు ఎక్సైజ్ ఈఎస్‌లు డాక్టర్ కె. శ్రీనివాస్, పి. సుబ్బారావు, వెంకటాచలం తహశీల్దార్ సుధాకర్ పర్యవేక్షించారు.
సింగిల్ దరఖాస్తులు 81
జిల్లాలోని 81 మద్యం దుకాణాలకు ఒక్కొక్క దరఖాస్తు దాఖలయ్యాయి. నెల్లూరు జిల్లా ఎక్సైజ్ పరిధిలో 33, గూడూరు జిల్లా పరిధిలో 48 దుకాణాలకు ఒక్కో దరఖాస్తే దాఖలు కావడంతో దరఖాస్తు దారులకే దుకాణాలు కేటాయించారు. నెల్లూరు నగరంలోని జేమ్స్‌గార్డెన్, నారాయణరెడ్డిపేట మద్యం దుకాణలకు మాత్రం ఒక్కో దానికి 106 దరఖాస్తులు వంతున దాఖలయ్యాయి.
27 దుకాణాలకు దరఖాస్తులు నిల్
నెల్లూరు, గూడూరు ఎక్సైజ్ జిల్లాల పరిధిలోని 27 దుకాణాలను దక్కిం చుకునేందుకు వ్యాపారులు అనాసక్తి ప్రదర్శించారు. దీంతో ఒక్క దరఖాస్తు కూడా దాఖలు కాలేదు. జలదంకి మండలం చామదల, గట్టుపల్లి, బోగోలు మండలం కోవూరుపల్లి, కలిగిరి మండలం గంగిరెడ్డిపాళెం, కావలి మండలం ఆనెమడుగు, వరికుంటపాడు, కొండాపురం మండలం కొమ్మి, ఇందుకూరుపేట మండలం కొత్తూరు, కుడితిపాళెం మద్యం దుకాణాలకు దరఖాస్తులు రాలేదు. గూడూరు డివిజన్‌లోనూ 16 దుకాణాలకు దరఖాస్తులు రాలేదు. దీంతో తిరిగి వాటికి నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది.
కొత్తదుకాణాల ఏర్పాటు
జూలై ఒకటి నుంచి కొత్త మద్యం పాలసీ అమలవుతుంది. లాటరీ ద్వారా దుకాణాలు సొంతం చేసుకున్న వ్యాపారులు ఎక్సైజ్‌శాఖ నిబంధనల మేరకు దుకాణాల్లో అన్ని ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. ఈ ఏడాది కొత్తగా ఎక్సైజ్‌శాఖ బార్‌కోడ్ విధానం అమల్లోకి తెచ్చింది. దీంతో దుకాణాల్లో కంప్యూటర్ బిల్లింగ్ ద్వారా అమ్మకాలు చేయాల్సి ఉంటుంది. దీని వల్ల ఎమ్మార్పీ ఉల్లంఘన జరిగే అవకాశం లేనట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో ఏఈఎస్‌లు, సీఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.
సర్కారుకు రూ. 9.97 కోట్లు రాబడి
జిల్లాలో 321 దుకాణాలకు వచ్చిన 3,988 దరఖాస్తులకు రూ.9.97 కోట్లు ఆదాయం ఎక్సైజ్‌శాఖకు చేకూరింది. గతేడాది దరఖాస్తుల రూపేణ ఎక్సైజ్ శాఖకు రూ.7.05కోట్లు ఆదాయం వచ్చింది. గతంతో పోలిస్తే సుమారు రూ.2.92 కోట్ల అదనపు ఆదాయం ప్రభుత్వానికి చేరింది. ప్రతి నాలుగు నెలలకోసారి 1/3వ వంతు లెసైన్సు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
వీటి ద్వారా సంవత్సరం మొత్తంలో సుమారు రూ. 133 కోట్లు ఆదాయం ఆబ్కారీశాఖకు లభించనుంది. ఇప్పటికే మొదటి విడత ఆదాయం సుమారు రూ.44 కోట్లు వచ్చే అవకాశం ఉంది. అన్ని షాపుల్లో మద్యం విక్రయాల ద్వారా ఈ ఏడాది ఎక్సైజ్‌శాఖకు సుమారు రూ.800 కోట్లకుపైగానే ఆదాయం లభించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.