నవ్యశ్రీ క్షేమం...
- తిరుపతిలో కిడ్నాపైన నవ్యశ్రీ మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్‌లో లభ్యం
- బస్సులో తరలిస్తుండగా పట్టుకున్న మిడ్జిల్ పోలీసులు
మిడ్జిల్: తిరుమల తిరుపతి దేవస్థానం ఆవరణలో ఆదివారం రాత్రి కిడ్నాప్‌నకు గురైన చిన్నారి నవ్యశ్రీ (4)ని నిందితుడు తరలిస్తుండగా మహబూబ్‌నగర్ జిల్లా పోలీసులు పట్టుకున్నారు. ఆమెను కిడ్నాప్ చేసిన నిందితుడు బాలస్వామి బస్సులో జడ్చర్ల మీదుగా నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి వైపు తీసుకెళ్తుండగా పోలీసులు పట్టుకుని, చిన్నారి ని తమవద్దే ఉంచారు. వివరాలు.. అనంతపు రం జిల్లా కనగానిపల్లి మండల పరిధిలోని తగరకుంటకి చెందిన నవ్యశ్రీ తండ్రి మహం త, తల్లి వరలక్ష్మి, తమ్ముడు హర్షతో కలిసి తిరుపతి వెళ్లింది. ఆదివారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి దేవస్థానం ఆవరణలో నిద్రి స్తున్న నవ్యశ్రీని రంగారెడ్డి జిల్లా తలకొం డపల్లి మండల పరిధిలోని అంతారానికి చెందిన వడ్డె బాలస్వామి ఎత్తుకొచ్చాడు. అదేరోజు రాత్రి తిరుపతి నుంచి జడ్చర్లకు వచ్చాడు.
సోమవారం జడ్చర్ల నుంచి తన సొంత గ్రామానికి బస్సులో వెళ్తుండగా.. వారు కూర్చున్న సీటు వెనుకభాగంలో దేవరకొండకు చెందిన యాదయ్య కూర్చున్నా డు. చిన్నారి మధ్యమధ్యలో ‘మా అమ్మ ఏదీ.. ఎక్కడుంది’.. అంటూ మారాం చేస్తుండడం తో యాదయ్యకు అనుమానం వచ్చింది. ఈ పాప ఎవరని పలుమార్లు బాలస్వామిని ప్రశ్నించాడు. కానీ అతను మా పాపే అంటూ బుకాయించాడు. అతని ప్రవర్తనపై అనుమా నం రావడంతో మిడ్జిల్ పోలీసులకు సమాచా రం ఇచ్చాడు. బస్సు మిడ్జిల్ దగ్గరికి వెళ్లగానే పోలీసులు ఆపి.. ఆ చిన్నారిని, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
స్టేషన్‌లో విచారణ జరుపుతుండగా, చిన్నారి తనను మా అమ్మ చనిపోయిందని కిడ్నాప్ చేసి తీసుకొచ్చాడని పోలీసులకు తెలిపింది. అయితే, ఆ చిన్నారిని పెంచుకునేందుకు కిడ్నాప్ చేసిన్నట్లు నిందితుడు బాలస్వామి పోలీసుల సమక్షంలో ఒప్పుకున్నాడు. నవ్యశ్రీ తగరకుంటలోని రోహిత్ ఇంగ్లిష్ మీడియంలో ఎల్‌కేజి చదువుతున్నట్లు తెలిపింది. ఈ విషయంపై ఎస్‌ఐ సైదులను వివరణ కోరగా చిన్నారిని కిడ్నాప్ చేసిన నిందితుడు బాలస్వామి, చిన్నారి, తమ అధీనంలో ఉన్నట్లు తెలిపారు.
నిందితుడికి మతిస్థిమితం లేదా?
నిందితుడు బాలస్వామి తల్లిదండ్రులు చనిపోయారు. ఇతనికి మతిస్థిమితం సరిగా లేకపోవడంతో భార్య వదిలేసింది. గ్రామంలో కట్టెలు కొట్టేందుకు కూలికి వెళ్తాడని, ఆ డబ్బులతో దేవస్థానాలు తిరుగుతాడని గ్రామస్తులు తెలిపారు. ఇతను ఈ పాపను ఎందుకు కిడ్నాప్ చేశాడో తెలియడం లేదని చెబుతున్నారు. కాగా, గతంలో ఇతనిపైనే ఎలాంటి కేసులు లేవని తెలిసింది.