కిడ్నీలతో బేరం! | Kidney bargain! | Sakshi
Sakshi News home page

కిడ్నీలతో బేరం!

Published Wed, Jul 30 2014 2:40 AM | Last Updated on Sat, Sep 2 2017 11:04 AM

కిడ్నీలతో బేరం!

కిడ్నీలతో బేరం!

మూత్రపిండాలను విక్రయించే ముఠా గుట్టురట్టు
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు
విజయవాడలో ఐదుగురి అరెస్ట్
పరారీలో కీలక నిందితుడు సాయికుమార్

 
విజయవాడ: కిడ్నీలతో వ్యాపారం చేసే ఓ ముఠా గుట్టును విజయవాడ పోలీసులు రట్టు చేసి ఐదుగురిని అరెస్టు చేశారు. వీరంతా మూత్రపిండాలను అక్రమంగా విక్రయించేందుకు సహకరిస్తున్నట్లు గుర్తించారు. నిందితుల్లో విజయవాడకు చెందిన మిరియాల క్రాంతి దుర్గాప్రసాద్, నాగసాయిదుర్గ, గొడవర్తి ఉమాదేవి, హైదరాబాద్‌లో ఉంటున్న బాలాజీసింగ్, పృథ్వీరాజ్‌సింగ్ ఉన్నారు. హైదరాబాద్‌కు చెందిన ప్రధాన సూత్రధారి, కిడ్నీ రాకెట్‌ను నడుపుతున్న సాయికుమార్ పరారీలో ఉన్నాడు. కేసు వివరాలను ఇన్‌ఛార్జ్ ఏసీపీ గుణ్ణం రామకృష్ణ, సీఐ సత్యానందం, ఎస్‌ఐ నరేష్‌లు మంగళవారం సత్యనారాయణపురం పోలీస్‌స్టేషన్‌లో మీడియాకు వివరించారు.

వెలుగులోకి ఇలా..

విజయవాడకు చెందిన మిరియాల క్రాంతిదుర్గాప్రసాద్ కూలర్ల వ్యాపారి. ఆర్థిక ఇబ్బందులతో తన కిడ్నీని విక్రయించేందుకు హైదరాబాద్‌లోని సత్య కిడ్నీ సెంటర్‌కు వెళ్లాడు. అతడు సమర్పించిన ధ్రువీకరణ పత్రాలపై అనుమానం వచ్చిన ఆస్పత్రి నిర్వాహకులు పరిశీలన కోసం విజయవాడ అర్బన్ తహశీల్దార్‌కు పంపారు. క్రాంతిదుర్గాప్రసాద్ తన సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు విజయవాడ అర్బన్ తహశీల్దార్ శివరావ్ ఈ నెల 15వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాయికుమార్ అనే వ్యక్తి హైదరాబాద్ కేంద్రంగా కిడ్నీ రాకెట్ ముఠాను నడుపుతున్నట్లు విచారణలో తేలింది.

భార్య కిడ్నీనే ఆమ్మేశాడు...

హైదరాబాద్‌కు చెందిన బాలాజీసింగ్‌కు ఓ ఆస్పత్రిలో సాయికుమార్ పరిచయమయ్యాడు. కిడ్నీలు విక్రయించేవారు ఉంటే రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఇస్తానని చెప్పటంతో బాలాజీసింగ్ తన భార్య పద్మాసింగ్ కిడ్నీని రూ.2 లక్షలకు విక్రయించాడు. అనంతరం బాలాజీసింగ్ తనకు తెలిసిన మరో ఐదుగురి కిడ్నీలను సాయికుమార్‌కు విక్రయించాడు. ఒకరి కిడ్నీని స్విమ్స్‌లో, మరో నలుగురి కిడ్నీలను సత్య కిడ్నీ సెంటర్‌లో మార్చినట్లు బాలాజీసింగ్ వెల్లడించాడు. మధ్యవర్తిగా వ్యవహరించినందుకు ఒక్కో కిడ్నీకి తనకు రూ.15 వేలు చొప్పున ఇచ్చేవాడని తెలిపాడు. ఈ క్రమంలోనే విజయవాడకు చెందిన క్రాంతి దుర్గాప్రసాద్ కిడ్నీని విక్రయానికి పెట్టినట్లు చెప్పాడు. చక్రవర్తి శ్రీనివాస్ అనే వ్యక్తికి కిడ్నీ మార్చాలని సాయికుమార్ చెప్పినట్లు తెలిపాడు. క్రాంతి దుర్గాప్రసాద్ బ్లడ్ గ్రూప్‌తో సరిపోవటంతో ఎంత డబ్బయినా ఇస్తానని చక్రవర్తి శ్రీనివాస్ చెప్పారు. ప్రస్తుతం ఆయన సత్య కిడ్నీ సెంటర్‌లో డయాలసిస్ పేషంట్‌గా ఉన్నట్లు చెప్పాడు. అయితే మిరియాల క్రాంతి దుర్గాప్రసాద్ కిడ్నీని అమ్మేందుకు ఆయన భార్య అంగీకరించలేదు. దీంతో తన స్నేహితుడైన విజయవాడకే చెందిన సాయిలోకేష్ భార్య నాగసాయిదుర్గను తన భార్యగా చూపించేందుకు ఫోర్జరీ సర్టిఫికెట్లు రూపొందించాడు. ఆస్పత్రి నిర్వాహకులు వీటిపై అనుమానంతో పరిశీలనకు పంపటంతో వెలుగులోకి వచ్చింది.

విశాఖలోనూ కిడ్నీ రాకెట్!

ప్రధాన నిందితుడు సాయికుమార్ పలువురిని ఏజెంట్లుగా నియమించుకుని వైద్యులతో కుమ్మక్కై కిడ్నీ రాకెట్‌ను నడుపుతున్నాడు. కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాలతోపాటు హైదరాబాద్‌లో కూడా కిడ్నీ రాకెట్ ముఠా కార్యకలాపాలు సాగిస్తున్నట్లు వెల్లడైంది. విశాఖపట్నంలో కూడా ఈ ముఠా సభ్యులు కార్యకలాపాలు సాగిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తనకు పలువురు వైద్యులు, రాజకీయ నాయకులతో సంబంధాలు ఉన్నాయని సాయికుమార్ చెప్పినట్లు బాలాజీసింగ్ విలేకరులకు తెలిపాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement