Kidney Business
-
కిడ్నీకి రూ. కోటి పేరుతో యువతిని..!
సాక్షి, కర్ణాటక: మహిళలే లక్ష్యంగా సైబర్ నేరగాళ్ల ఆగడాలకు అంతు లేకుండా పోతోంది. కుటుంబ సమస్యలు ఒక్కసారిగా పరిష్కరించుకోవాలనే ఉద్దేశ్యంతో కిడ్నీ విక్రయానికి పెట్టిన 24 ఏళ్ల యువతిని సైబర్ కీచకులు నిలువునా మోసగించారు. దీంతో బాధిత యువతి సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు ఈ ఘటనపై హడాపింగ్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు. ఆర్థిక సమస్యలు తొలగించుకోవాలని: తల్లిదండ్రులతో బెంగళూరులో నివాసం ఉంటున్న యువతి బ్యాంకు ఉద్యోగిని. మధ్యతరగతి కుటుంబం కావడంతో ఆర్థిక సమస్యలు ఉన్నాయి. వాటిని నుంచి గట్టెక్కడానికి యువతి ప్రయత్నాలు చేపట్టింది. ఓ సోషల్ మీడియాలో కిడ్నీ దానం చేస్తే రూ. కోటి ఇస్తామనే ప్రకటన గమనించి అక్కడి ఫోన్ నెంబర్లో విచారణ చేసింది. సైబర్ వంచకుడు యువతికి తిరిగి ఫోన్ చేసి కిడ్నీ ఇవ్వాలనుకుంటే మొదట కొంత ఫీజు చెల్లించాలని సూచించాడు. పోలీస్ సర్టిఫికెట్ ఇతరత్రా వాటికి ముందు నగదు చెల్లిస్తే అనంతరం ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుంటామని వంచక ముఠా యువతికి సూచించింది. వీరి మాటలు నమ్మిన యువతి కిడ్నీ ఇవ్వడానికి సమ్మతించి దశల వారీగా వారి వంచకులకు రూ. 3.14 లక్షలు చెల్లించింది. తిరిగి వంచకులు యువతిని నగదు అడగడంతో ఆమెకు అనుమానం రావడంతో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిందని అధికారులు తెలిపారు. చదవండి: బెజవాడలో కత్తులతో విద్యార్థుల వీరంగం బంగారు ఆభరణాలు విక్రయించి... లాక్ డౌన్ సమయంలో బ్యాంకులు పనిచేయలేదు. దీంతో సదరు యువతికి కూడా ఇంటికే పరిమితమైంది. ఈ క్రమంలో కష్టాలు తీరాలంటే డబ్బులు కావాలని, కిడ్నీ విక్రయిస్తే డబ్బులు వస్తాయని భావించి గూగుల్‌లో తీవ్రంగా సోదించింది. చివరికి ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలు విక్రయించి వంచకుల అకౌంట్‌కు జమ చేసి నిలువునా మోసపోయింది. ఏటా పెరుగుతున్న సైబర్ నేరాలకు ఎప్పడు అడ్డుకట్టపడతాయో. చదవండి: విషాదం : మత్తు కోసం స్పిరిట్ తాగి .. -
కిడ్నీ.. కిలాడీలు!
సాక్షి, నల్లగొండ : కిడ్నీ సమస్యతో చావుకు దగ్గరైన కన్న కూతురును దక్కించుకునేందుకు ఓ తండ్రి కిడ్నీ మాయగాళ్ల వలలో చిక్కాడు. తన పేరు బయటకు రావడం ఇష్టం లేని నల్లగొండ మండలానికి చెందిన ఆ బాధితుడి కన్నీళ్లను జిల్లా పోలీసులు తుడిచారు. నమ్మించి మోసం చేసిన వారినుంచి మొత్తం డబ్బులు రికవరీ చేసి.. బాధితుడికి రూ.10.17 లక్షలు అప్పజెప్పడంతో కథ సుఖాంతం అయ్యింది. అయితే, ఆరోగ్య అత్యవసరాలను కొందరు దళారులు ఎలా సొమ్ము చేసుకుంటున్నారో ఈ కేసును పరిశీలిస్తే ఇట్టే అర్థమవుతుంది. ఏం... జరిగిందంటే.. నల్లగొండ మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురు కిడ్నీ సమస్యతో చనిపోయింది. కొన్నాళ్లకు రెండో కూతురుకూ అదే సమస్య వచ్చింది. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. కిడ్నీ మార్పిడి మినహా మరో మార్గం లేదని వైద్యులు తేల్చి చెప్పారు. ఈ సమస్యనుంచి ఎలా బయట పడాలో తెలియక కన్నీళ్లతో ఆస్పత్రి వెలుపల కూర్చున్న బాధితుడిని.. అదే ఆస్పత్రిలో పనిచేస్తున్న ఓ మహిళ తనకు తెలిసిన వాళ్లు ఉన్నారని, కిడ్నీలు ఇప్పిస్తారని చెప్పి.. ఇద్దరు వ్యక్తులతో మాట్లాడించింది. ఆ తర్వాత నేరుగా సదరు దళారులు.. బాధితుడి గ్రామానికి వచ్చి ఒక కిడ్నీకి రూ.16.50లక్షలకు బేరం కుదుర్చుకుని రూ.లక్ష అడ్వాన్స్‌గా తీసుకువెళ్లారు. అది మొదలు వరుసబెట్టి నెల రోజుల్లోనే రూ.8.70లక్షలు వసూలు చేశారు. ఆ తర్వాత కూడా పరీక్షలు, ఇతరత్రా పేర మొత్తంగా రూ.10.17లక్షలు వసూలు చేసుకున్నారు. తీరా కిడ్నీ ఎక్కడ అని అడిగేసరికి మొఖం చాటేశారు. ఫోన్ చేసిన ప్రతిసారీ ఇదిగో అదిగో అంటూ దాటవేసిన వారు చివరికి బెదిరింపులకూ దిగారు. ఉన్న ఎకరం పొలం అమ్మగా వచ్చిన సొమ్మును మాయగాళ్ల చేతిలో పోసిన బాధితుడు రోజురోజుకూ క్షీణిస్తున్న తన కూతురు ఆరోగ్యాన్ని బాగు చేయించుకోలేని నిస్సాహాయ స్థితిలో లబోదిబోమంటూ ఎస్పీ ఏవీ రంగనాథ్‌ను కలిశాడు. తన గోడు వెళ్లబోసుకున్నాడు. తీగలాగిన పోలీసులు జరిగిన మోసాన్ని నిగ్గుతేల్చాలని ఎస్పీ .. వెంటనే టాస్క్‌ఫోర్స్‌ను పురమాయించారు. సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల, ముస్తాబాద్‌కు చెందిన శ్రీనివాస్, లింబరాజు అనే వ్యక్తులను నిందితులుగా గుర్తించి జిల్లాకు పట్టుకొచ్చారు. పోలీసుల విచారణలో వీరు తాము చేసిన మోసాన్ని పూసగుచ్చినట్టు చెప్పారు. బాధితుడినుంచి వసూలు చేసుకున్న సొమ్మునంతా రికవరీ చేసిన పోలీసులు వారిపై నల్లగొండ రూరల్స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఇదే తరహాలో సదరు మధ్యవర్తులు గతంలో కరీంనగర్, వరంగల్ తదితర జిల్లాలో కూడా మోసాలకు పాల్పడినట్లు ‘ఇంటరాగేషన్ ’లో తెలుసుకుని ఆ జిల్లా పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం బాధితుడికి సొమ్ములు అందడంతోపాటు.. నిందితులు రిమాండ్‌లో ఉన్నారు. దళారుల తరఫున ఓ జెడ్పీటీసీ సభ్యుడి వకాల్తా! ఈ మొత్తం ఉదంతంలో ఆసక్తికరమైన మరో చిన్న సంఘటన కూడా జరిగింది. కిడ్నీ దళారులు శ్రీనివాస్, లింబరాజులను పోలీసులు అరెస్టు చేసి రూరల్ స్టేషన్లో కేసు నమోదు చేశాక.. వసూలు చేసిన సొమ్ములు రికవరీ చేసి బాధితుడికి అప్పజెప్పే సమయంలో పంచాయితీ పేర ఓ జెడ్పీటీసీ సభ్యుడు నిందితుల పక్షాన వకాల్తా పుచ్చుకున్నాడు. ఆయనకు అదే స్టేషన్‌కు చెందిన ఓ కానిస్టేబుల్ బాసటగా నిలిచాడు. కేసు ఎందుకు పెట్టారని బాధితుడిపైనే ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమొత్తం మాత్రమే డబ్బులు ఇస్తారు.. పూర్తిగా ఇవ్వరంటూ బెదిరింపులకూ పాల్పడ్డాడు. అయితే, ఎస్పీ ఈ కేసును నేరుగా పర్యవేక్షించడంతో సదరు జెడ్పీటీసీ సభ్యుడి, రూరల్ పోలీస్‌స్టేషన్ కానిస్టేబుల్ పప్పులు ఉడకలేదు. మాయమాటలు నమ్మి మోసపోవద్దు మాయ మాటలతో బురిడీ కొట్టించే వారు ప్రతిచోటా ఉంటారు. కన్న కూతురుకు కిడ్నీ ఆపరేషన్ చేయించడం కోసం ఉన్న పొలం అమ్మి సొమ్ములు పోగొట్టుకున్న వ్యక్తి కలిసి వివరాలు చెప్పడంతో నిందితులను ట్రేస్ చేసి అరెస్టు చేసి తీసుకువచ్చాం. బాధితుడికి డబ్బులన్నీ తిరిగి ఇప్పించడమే కాకుండా, నిందితులపై కేసు నమోదు చేశాం. వివిధ రకాలుగా మోసపోయిన వారెవరైనా ధైర్యంగా ముందుకు వచ్చి సమాచారం ఇస్తే నిందితులను కచ్చితంగా పట్టుకుని న్యాయం జరిగేలా చూస్తాం. – ఏవీ రంగనాథ్, ఎస్పీ -
కిడ్నీ రాకెట్‌కు 2008లోనే బీజం
-
కిడ్నీ రాకెట్‌కు 2008లోనే బీజం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: నల్లగొండ కేంద్రంగా వెలుగుచూసిన కిడ్నీ రాకెట్‌కు ఏడేళ్ల క్రితమే బీజం పడిందా? అప్పటి నుంచి పకడ్బందీగా నెరపుతున్న ఆన్లైన్ లావాదేవీలతో ఎవరికీ అంతుచిక్కని విధంగా నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేశారా? ఈ రాకెట్‌తో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు చెందిన వందలాది మందికి సంబంధముందా? ఇప్పటి వరకు ఈ రాకెట్ ద్వారా దేశంలో 60 మంది కిడ్నీలు అమ్ముకున్నారా? ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే అంటున్నాడు కిడ్నీ రాకెట్లో దేశంలోనే కీలక ఏజెంట్‌గా వ్యవహరిస్తున్న సురేశ్‌భాయ్ అమృత్‌భాయ్ ప్రజాపతి. గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్‌లోని సఫాల్వివాన్ ప్రాంతానికి చెందిన ఇతను పోలీసు విచారణలో పలు ఆసక్తికర వెల్లడించారు. నల్లగొండ జిల్లా ఎస్పీ విక్రమ్‌జీత్ దుగ్గల్ వెల్లడించిన వివరాల ప్రకారం జాతీయ స్థాయిలో జరిగిన ఈ కిడ్నీ కుంభకోణం పూర్వాపరాలివి. 2008లోనే ‘ఆన్లైన్’ పోస్టింగ్.. గుజరాత్‌కు చెందిన సురేశ్ ప్రజాపతికి ఏడేళ్ల క్రితమే కిడ్నీ వ్యాపారం చేయాలనే ఆలోచన వచ్చింది. అయితే, వ్యాపారానికి నెట్వర్క్ కావాల్సి ఉన్నందున ఆ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకునేందుకు అతను ఇంటర్నెట్ను ఆయుధంగా ఉపయోగించుకున్నాడు. 2008లోనే పలు వెబ్సైట్లు, బ్లాగ్‌లలో కిడ్నీ అమ్మకానికి పెట్టాడు. ‘ఐ వాంట్ టు హెల్ప్ యూ. ఐ వాంట్ సమ్ మనీ. ఐ విల్ గివ్ యు మై కిడ్నీ.’ అంటూ కిడ్నీలు అవసరమున్నవారిని ఆకర్షించే ప్రయత్నం చేశాడు. అతను ఏ స్థాయిలో ఆన్లైన్ లావాదేవీలు నిర్వహించాడంటే ‘బ్లాగ్స్.సులేఖ.కామ్’లో కిడ్నీ ట్రాన్స్‌ప్లాం ట్ ఆర్గనైజర్‌ను క్లిక్ చేస్తే నేరుగా సురేశ్ ప్రజాపతి వివరాలు లభిస్తాయి. అదే విధంగా 2009, మే14న ఎంఆర్ఐషాన్షరీఫ్.బ్లాగ్స్పాట్.ఇన్ అనే వెబ్సైట్లో కూడా అతని వివరాలు పొందుపరిచాడు. ఈ క్రమంలో అతనికి మహారాష్ట్రకు చెందిన మరో వ్యక్తి సబ్ ఏజెంట్‌గా కలిశాడు. ఆన్లైన్ ద్వారా పరిచయం చేసుకుని సురేశ్ ప్రజాపతిని అతను ఇద్దరూ కలసి ఈ వ్యాపారం ప్రారంభించారు. ఈ మహారాష్ట్రకు చెందిన సబ్ఏజెంట్ను అరెస్టు చేయాల్సి ఉంది. 2013లో మొదలు.. అసలు ఈ వ్యాపారాన్ని 2013లో ప్రారంభించాడు సురేశ్ ప్రజాపతి. ఆన్లైన్ ద్వారా మంచి నెట్‌వర్క్‌ను తయారు చేసుకున్న అతను శ్రీలంకలోని ఏజెంట్ల సహకారంతో అక్కడి నాలుగు ఆసుపత్రులకు చెందిన డాక్టర్లతో కుమ్మక్కయ్యాడు. మూడేళ్లలో ఇప్పటివరకు 60 మంది కిడ్నీలను శ్రీలంకలో అమ్మించాడు. కొలంబోలోని నవలోక్, హేమ, లంకన్ ఆసుపత్రులతో పాటు బొరెల్లాలోని వెస్టర్న్ ఆసుపత్రులలో ఈ వ్యవహారాన్ని గుట్టు చప్పుడు కాకుండా నడిపించాడు. ఇందుకు ఆయా ఆసుపత్రుల్లో పనిచేస్తున్న డాక్టర్ మాధవ, డాక్టర్ మోనిక్, డాక్టర్. సాధన (నవలోక్), డాక్టర్. చమిల (హేమ), డాక్టర్. నిరోషిని (లంకన్), డాక్టర్. హబీబా షరీఫ్ (వెస్టర్న్)లు సహకరించారు. వీరంతా శ్రీలంకీయులే. వీరి సహకారంతో పాటు ఆయా ఆసుపత్రుల యజమానులు డాక్టర్. హర్షిద్ (నవలోక్), డాక్టర్. శరత్ (లంకన్), డాక్టర్. రిజ్వీ షరీఫ్ ఆయన కుమారుడు రికజ్ షరీఫ్‌లు కూడా తోడయ్యారు. కిడ్నీలు ఇండియావి..అమ్మేది శ్రీలంకలో.. రేటు మాత్రం డాలర్లలో ఇక, ఈ కిడ్నీ రాకెట్‌కు సహకరించేందుకు గాను శ్రీలంకలోని ఆసుపత్రులకు పెద్ద మొత్తంలో ముట్టజెప్పాడు సురేశ్ప్రజాపతి. ఒక్కో కిడ్నీని మార్పిడి చేసేందుకు గాను ఆస్పత్రి ఫీజుల కింద 22 వేల డాలర్లు చెల్లించాడు. కిడ్నీ మార్పిడి చేసేందుకు ఆసుపత్రి ఎథిక్స్ కమిటీ అనుమతి అవసరం. కాగా, అందులో ఒక ఆసుపత్రి డాక్టర్, మరో ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్‌తో పాటు ఆరోగ్య శాఖ నుంచి మరో ఉన్నతాధికారి సభ్యులుగా ఉంటారు. ఈ సభ్యులను మేనేజ్ చేసేందుకు గాను 500 డాలర్లు చెల్లించారా..? లేక ఎథిక్స్ కమిటీకి కూడా చెప్పకుండా కేవలం ఫీజు రూపంలో చెల్లించారా అనేది విచారణలో తేలాల్సి ఉంది. ఇక, ఈ కిడ్నీ మార్పిడి వ్యవహారంలో ఒక్కో కిడ్నీకి రూ.28 నుంచి 30 లక్షలను వసూలు చేస్తుంటాడు సురేశ్ ప్రజాపతి. అందులో రూ.5 లక్షలు కిడ్నీ విక్రేతలకు ఇచ్చి మిగిలినవి డాక్టర్లు, ఆసుపత్రి ఖర్చులతోపాటు ఏజెంట్లకు, ప్రయాణచార్జీలకు, వీసా ప్రాసెసింగ్, శ్రీలంక వెళ్లి వచ్చేందుకు టికెట్లు, అక్కడ వసతి సదుపాయాలకు ఖర్చు పెట్టేవాడు. సురేశ్ కూడబెట్టిన ఆస్తులివే.. ఏడేళ్ల క్రితమే తాను కిడ్నీని అమ్ముతానని ఆన్లైన్లో పెట్టిన సురేశ్ ప్రజాపతికానీ, అతనికి సహకరించిన దిలీప్కానీ కిడ్నీలు అమ్ముకోకపోవడం కొసమెరుపు. మరో విశేషమేమిటంటే ఈ రాకెట్ ద్వారా సురేశ్ ప్రజాపతి రూ.3 కోట్ల వరకు ఆస్తులు సంపాదించాడు. అహ్మదాబాద్‌లో రూ.1.40 కోట్ల విలువైన ఓ ఇల్లు, రూ.30 లక్షలతో ఓ ఆఫీసు, రూ.27 లక్షలతో తన ఆఫీసుకు, ఇంటికి ఫర్నీచర్, రూ.8.5 లక్షలు చెల్లించి, మిగతా బ్యాంకు నుంచి రుణం తీసుకుని ఓ ఆడి కారు కూడా కొన్నాడు. రూ. లక్ష వెచ్చించి బజాజ్ ఎవెంజర్ మోటార్ సైకిల్ కూడా కొన్నాడు. మొత్తం రూ.45 లక్షల వరకు ఏజెంట్లకు ముట్టచెప్పాడు. తాను గతంలో కొన్న అపార్ట్‌మెంట్‌కు ఉన్న రూ. 7లక్షల బ్యాంకు రుణం కూడా తీర్చేశాడు. ఇప్పుడు సురేశ్ ప్రజాపతి బ్యాంకు బాలెన్స్ ఎంతో తెలుసా.. రూ.21లక్షలు. ఇతనికి సహకరించిన దిలీప్ కూడా 15లక్షలు పెట్టి అహ్మదాబాద్‌లో ఇల్లు కొనుక్కుని మరో రూ.లక్ష ఖర్చుచేశాడు. మరో ముగ్గురు అరెస్టు ఈ కుంభకోణంలో కీలక పాత్రధారి, దేశవ్యాప్త ఏజెంట్ గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన సురేశ్‌భాయ్ అమృత్‌భాయ్ ప్రజాపతిని నల్లగొండ పోలీసులు అరెస్టు చేశారు. అతనికి సహకరిస్తున్న మరో ఏజెంట్ దిలీప్చౌహాన్ (గుజరాత్), తన కిడ్నీని అమ్ముకుని ఏజెంట్‌గా మారిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన జెను నూకరాజులను కూడా అదుపులోనికి తీసుకున్నారు. ముగ్గురినీ నల్లగొండ ఎస్పీ విక్రమ్‌జీత్ దుగ్గల్ మంగళవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ ముగ్గురి అరెస్టుతో ఇప్పటివరకు ఈ కేసులో అరెస్టయిన వారి సంఖ్య పదికి చేరింది. సమావేశంలో ఏఎస్పీ గంగారాం, నల్లగొండ డీఎస్పీ సుధాకర్, సీఐలు రవీందర్, టి.శ్రీనివాస్. శాలిగౌరారం సీఐ ప్రవీణ్ పాల్గొన్నారు. అమ్మినవాళ్లు... కొన్నవాళ్లు వీరే.. సురేశ్ ప్రజాపతి నెట్వర్క్ ద్వారా 60 మంది కిడ్నీలు అమ్ముకోగా, 54 మంది డబ్బు లు చెల్లించి కిడ్నీలు మార్పిడి చేయించుకున్నారని తేలింది. కిడ్నీలు అమ్ముకున్న వారిలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు చెందిన వారు 22 మంది ఉన్నారు. తమిళనాడు ఆరుగురు, మహారాష్ట్ర ఐదుగురు, క ర్నాటక నలుగురు, ఢిల్లీకి చెందిన ముగ్గురు, జమ్ము-కాశ్మీర్, మధ్యప్రదేశ్, కేరళ, ఛత్తీస్‌గఢ్‌లకు చెందిన ఒక్కొక్కరున్నారు. ఇతర రాష్ట్రాల వారు మరో 11 మంది ఉన్నారు. ఇక, కిడ్నీలు మార్పిడి చేసుకున్నవారిలో ఢిల్లీ (2), గుజరాత్ (8), మహారాష్ట్ర (6),జమ్ము-కాశ్మీర్ (5), పంజాబ్ (3)తోపాటు రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, అస్సాం రాష్ట్రాల నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. వీరితో పాటు మరో ఇద్దరు కూడా ఉన్నారు. అవయవ మార్పిడి చట్టం ప్రకారం అనుమతి లేకుండా కిడ్నీలు దానం చేయడంతో పాటు డబ్బులు వెచ్చించి మార్పిడి చేయించుకోవడం కూడా నేరమేనని, ఈ రాకెట్‌తో సంబంధమున్న అందరినీ అరెస్టు చేస్తామని ఎస్పీ దుగ్గల్ వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించిన కీలక నిందితుడి అరెస్టుతో శ్రీలంకకు సంబంధించిన సాక్ష్యాధారాలు బలంగా లభిస్తున్నాయని, అవసరమైతే శ్రీలంక వెళ్లి విచారణ జరిపేందుకు కూడా నల్లగొండ పోలీసులు సిద్ధంగా ఉన్నారని ఆయన వెల్లడించారు. -
కిడ్నీలతో బేరం!
మూత్రపిండాలను విక్రయించే ముఠా గుట్టురట్టు హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు విజయవాడలో ఐదుగురి అరెస్ట్ పరారీలో కీలక నిందితుడు సాయికుమార్ విజయవాడ: కిడ్నీలతో వ్యాపారం చేసే ఓ ముఠా గుట్టును విజయవాడ పోలీసులు రట్టు చేసి ఐదుగురిని అరెస్టు చేశారు. వీరంతా మూత్రపిండాలను అక్రమంగా విక్రయించేందుకు సహకరిస్తున్నట్లు గుర్తించారు. నిందితుల్లో విజయవాడకు చెందిన మిరియాల క్రాంతి దుర్గాప్రసాద్, నాగసాయిదుర్గ, గొడవర్తి ఉమాదేవి, హైదరాబాద్‌లో ఉంటున్న బాలాజీసింగ్, పృథ్వీరాజ్‌సింగ్ ఉన్నారు. హైదరాబాద్‌కు చెందిన ప్రధాన సూత్రధారి, కిడ్నీ రాకెట్‌ను నడుపుతున్న సాయికుమార్ పరారీలో ఉన్నాడు. కేసు వివరాలను ఇన్ఛార్జ్ ఏసీపీ గుణ్ణం రామకృష్ణ, సీఐ సత్యానందం, ఎస్ఐ నరేష్‌లు మంగళవారం సత్యనారాయణపురం పోలీస్‌స్టేషన్‌లో మీడియాకు వివరించారు. వెలుగులోకి ఇలా.. విజయవాడకు చెందిన మిరియాల క్రాంతిదుర్గాప్రసాద్ కూలర్ల వ్యాపారి. ఆర్థిక ఇబ్బందులతో తన కిడ్నీని విక్రయించేందుకు హైదరాబాద్‌లోని సత్య కిడ్నీ సెంటర్‌కు వెళ్లాడు. అతడు సమర్పించిన ధ్రువీకరణ పత్రాలపై అనుమానం వచ్చిన ఆస్పత్రి నిర్వాహకులు పరిశీలన కోసం విజయవాడ అర్బన్ తహశీల్దార్‌కు పంపారు. క్రాంతిదుర్గాప్రసాద్ తన సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు విజయవాడ అర్బన్ తహశీల్దార్ శివరావ్ ఈ నెల 15వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాయికుమార్ అనే వ్యక్తి హైదరాబాద్ కేంద్రంగా కిడ్నీ రాకెట్ ముఠాను నడుపుతున్నట్లు విచారణలో తేలింది. భార్య కిడ్నీనే ఆమ్మేశాడు... హైదరాబాద్‌కు చెందిన బాలాజీసింగ్‌కు ఓ ఆస్పత్రిలో సాయికుమార్ పరిచయమయ్యాడు. కిడ్నీలు విక్రయించేవారు ఉంటే రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఇస్తానని చెప్పటంతో బాలాజీసింగ్ తన భార్య పద్మాసింగ్ కిడ్నీని రూ.2 లక్షలకు విక్రయించాడు. అనంతరం బాలాజీసింగ్ తనకు తెలిసిన మరో ఐదుగురి కిడ్నీలను సాయికుమార్‌కు విక్రయించాడు. ఒకరి కిడ్నీని స్విమ్స్‌లో, మరో నలుగురి కిడ్నీలను సత్య కిడ్నీ సెంటర్లో మార్చినట్లు బాలాజీసింగ్ వెల్లడించాడు. మధ్యవర్తిగా వ్యవహరించినందుకు ఒక్కో కిడ్నీకి తనకు రూ.15 వేలు చొప్పున ఇచ్చేవాడని తెలిపాడు. ఈ క్రమంలోనే విజయవాడకు చెందిన క్రాంతి దుర్గాప్రసాద్ కిడ్నీని విక్రయానికి పెట్టినట్లు చెప్పాడు. చక్రవర్తి శ్రీనివాస్ అనే వ్యక్తికి కిడ్నీ మార్చాలని సాయికుమార్ చెప్పినట్లు తెలిపాడు. క్రాంతి దుర్గాప్రసాద్ బ్లడ్ గ్రూప్‌తో సరిపోవటంతో ఎంత డబ్బయినా ఇస్తానని చక్రవర్తి శ్రీనివాస్ చెప్పారు. ప్రస్తుతం ఆయన సత్య కిడ్నీ సెంటర్లో డయాలసిస్ పేషంట్‌గా ఉన్నట్లు చెప్పాడు. అయితే మిరియాల క్రాంతి దుర్గాప్రసాద్ కిడ్నీని అమ్మేందుకు ఆయన భార్య అంగీకరించలేదు. దీంతో తన స్నేహితుడైన విజయవాడకే చెందిన సాయిలోకేష్ భార్య నాగసాయిదుర్గను తన భార్యగా చూపించేందుకు ఫోర్జరీ సర్టిఫికెట్లు రూపొందించాడు. ఆస్పత్రి నిర్వాహకులు వీటిపై అనుమానంతో పరిశీలనకు పంపటంతో వెలుగులోకి వచ్చింది. విశాఖలోనూ కిడ్నీ రాకెట్! ప్రధాన నిందితుడు సాయికుమార్ పలువురిని ఏజెంట్లుగా నియమించుకుని వైద్యులతో కుమ్మక్కై కిడ్నీ రాకెట్‌ను నడుపుతున్నాడు. కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాలతోపాటు హైదరాబాద్‌లో కూడా కిడ్నీ రాకెట్ ముఠా కార్యకలాపాలు సాగిస్తున్నట్లు వెల్లడైంది. విశాఖపట్నంలో కూడా ఈ ముఠా సభ్యులు కార్యకలాపాలు సాగిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తనకు పలువురు వైద్యులు, రాజకీయ నాయకులతో సంబంధాలు ఉన్నాయని సాయికుమార్ చెప్పినట్లు బాలాజీసింగ్ విలేకరులకు తెలిపాడు.