కిడ్నీ రాకెట్‌కు 2008లోనే బీజం | International kidney racket: 2 more held | Sakshi
Sakshi News home page

కిడ్నీ రాకెట్‌కు 2008లోనే బీజం

Published Wed, Jan 20 2016 5:11 AM | Last Updated on Mon, Sep 17 2018 6:26 PM

కిడ్నీ రాకెట్‌కు 2008లోనే బీజం - Sakshi

కిడ్నీ రాకెట్‌కు 2008లోనే బీజం

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: నల్లగొండ కేంద్రంగా వెలుగుచూసిన కిడ్నీ రాకెట్‌కు ఏడేళ్ల క్రితమే బీజం పడిందా? అప్పటి నుంచి పకడ్బందీగా నెరపుతున్న ఆన్‌లైన్ లావాదేవీలతో ఎవరికీ అంతుచిక్కని విధంగా నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేశారా? ఈ రాకెట్‌తో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు చెందిన వందలాది మందికి సంబంధముందా? ఇప్పటి వరకు ఈ రాకెట్ ద్వారా దేశంలో 60 మంది కిడ్నీలు అమ్ముకున్నారా? ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే అంటున్నాడు కిడ్నీ రాకెట్‌లో దేశంలోనే కీలక ఏజెంట్‌గా వ్యవహరిస్తున్న సురేశ్‌భాయ్ అమృత్‌భాయ్ ప్రజాపతి. గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్‌లోని సఫాల్‌వివాన్ ప్రాంతానికి చెందిన ఇతను పోలీసు విచారణలో పలు ఆసక్తికర వెల్లడించారు. నల్లగొండ జిల్లా ఎస్పీ విక్రమ్‌జీత్ దుగ్గల్ వెల్లడించిన వివరాల ప్రకారం జాతీయ స్థాయిలో జరిగిన ఈ కిడ్నీ కుంభకోణం పూర్వాపరాలివి.
 
2008లోనే ‘ఆన్‌లైన్’ పోస్టింగ్..
గుజరాత్‌కు చెందిన సురేశ్ ప్రజాపతికి ఏడేళ్ల క్రితమే కిడ్నీ వ్యాపారం చేయాలనే ఆలోచన వచ్చింది. అయితే, వ్యాపారానికి నెట్‌వర్క్ కావాల్సి ఉన్నందున ఆ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకునేందుకు అతను ఇంటర్నెట్‌ను ఆయుధంగా ఉపయోగించుకున్నాడు. 2008లోనే పలు వెబ్‌సైట్లు, బ్లాగ్‌లలో కిడ్నీ అమ్మకానికి పెట్టాడు. ‘ఐ వాంట్ టు హెల్ప్ యూ. ఐ వాంట్ సమ్ మనీ. ఐ విల్ గివ్ యు మై కిడ్నీ.’ అంటూ కిడ్నీలు అవసరమున్నవారిని ఆకర్షించే ప్రయత్నం చేశాడు.

అతను ఏ స్థాయిలో ఆన్‌లైన్ లావాదేవీలు నిర్వహించాడంటే ‘బ్లాగ్స్.సులేఖ.కామ్’లో కిడ్నీ ట్రాన్స్‌ప్లాం ట్ ఆర్గనైజర్‌ను క్లిక్ చేస్తే నేరుగా సురేశ్ ప్రజాపతి వివరాలు లభిస్తాయి. అదే విధంగా 2009, మే14న ఎంఆర్‌ఐషాన్‌షరీఫ్.బ్లాగ్‌స్పాట్.ఇన్ అనే వెబ్‌సైట్‌లో కూడా అతని వివరాలు పొందుపరిచాడు. ఈ క్రమంలో అతనికి మహారాష్ట్రకు చెందిన మరో వ్యక్తి సబ్ ఏజెంట్‌గా కలిశాడు. ఆన్‌లైన్ ద్వారా పరిచయం చేసుకుని సురేశ్ ప్రజాపతిని అతను ఇద్దరూ కలసి ఈ వ్యాపారం ప్రారంభించారు. ఈ మహారాష్ట్రకు చెందిన సబ్‌ఏజెంట్‌ను అరెస్టు చేయాల్సి ఉంది.
 
2013లో మొదలు..
అసలు ఈ వ్యాపారాన్ని 2013లో ప్రారంభించాడు సురేశ్ ప్రజాపతి. ఆన్‌లైన్ ద్వారా మంచి నెట్‌వర్క్‌ను తయారు చేసుకున్న అతను శ్రీలంకలోని ఏజెంట్ల సహకారంతో అక్కడి నాలుగు ఆసుపత్రులకు చెందిన డాక్టర్లతో కుమ్మక్కయ్యాడు. మూడేళ్లలో ఇప్పటివరకు 60 మంది కిడ్నీలను శ్రీలంకలో అమ్మించాడు. కొలంబోలోని నవలోక్, హేమ, లంకన్ ఆసుపత్రులతో పాటు బొరెల్లాలోని వెస్టర్న్ ఆసుపత్రులలో ఈ వ్యవహారాన్ని గుట్టు చప్పుడు కాకుండా నడిపించాడు.

ఇందుకు ఆయా ఆసుపత్రుల్లో పనిచేస్తున్న డాక్టర్ మాధవ, డాక్టర్ మోనిక్, డాక్టర్. సాధన (నవలోక్), డాక్టర్. చమిల (హేమ), డాక్టర్. నిరోషిని (లంకన్), డాక్టర్. హబీబా షరీఫ్ (వెస్టర్న్)లు సహకరించారు. వీరంతా శ్రీలంకీయులే. వీరి సహకారంతో పాటు ఆయా ఆసుపత్రుల యజమానులు డాక్టర్. హర్షిద్ (నవలోక్), డాక్టర్. శరత్ (లంకన్), డాక్టర్. రిజ్వీ షరీఫ్ ఆయన కుమారుడు రికజ్ షరీఫ్‌లు కూడా తోడయ్యారు.
 
కిడ్నీలు ఇండియావి..అమ్మేది శ్రీలంకలో.. రేటు మాత్రం డాలర్లలో
ఇక, ఈ కిడ్నీ రాకెట్‌కు సహకరించేందుకు గాను శ్రీలంకలోని ఆసుపత్రులకు పెద్ద మొత్తంలో ముట్టజెప్పాడు సురేశ్‌ప్రజాపతి. ఒక్కో కిడ్నీని మార్పిడి చేసేందుకు గాను ఆస్పత్రి ఫీజుల కింద 22 వేల డాలర్లు చెల్లించాడు. కిడ్నీ మార్పిడి చేసేందుకు ఆసుపత్రి ఎథిక్స్ కమిటీ అనుమతి అవసరం. కాగా, అందులో ఒక ఆసుపత్రి డాక్టర్, మరో ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్‌తో పాటు ఆరోగ్య శాఖ నుంచి మరో ఉన్నతాధికారి సభ్యులుగా ఉంటారు.

ఈ సభ్యులను మేనేజ్ చేసేందుకు గాను 500 డాలర్లు చెల్లించారా..? లేక ఎథిక్స్ కమిటీకి కూడా చెప్పకుండా కేవలం ఫీజు రూపంలో చెల్లించారా అనేది విచారణలో తేలాల్సి ఉంది. ఇక, ఈ కిడ్నీ మార్పిడి వ్యవహారంలో ఒక్కో కిడ్నీకి రూ.28 నుంచి 30 లక్షలను వసూలు చేస్తుంటాడు సురేశ్ ప్రజాపతి. అందులో రూ.5 లక్షలు కిడ్నీ విక్రేతలకు ఇచ్చి మిగిలినవి డాక్టర్లు, ఆసుపత్రి ఖర్చులతోపాటు ఏజెంట్లకు, ప్రయాణచార్జీలకు, వీసా ప్రాసెసింగ్, శ్రీలంక వెళ్లి వచ్చేందుకు టికెట్లు, అక్కడ వసతి సదుపాయాలకు ఖర్చు పెట్టేవాడు.
 
సురేశ్ కూడబెట్టిన ఆస్తులివే..
ఏడేళ్ల క్రితమే తాను కిడ్నీని అమ్ముతానని ఆన్‌లైన్‌లో పెట్టిన సురేశ్ ప్రజాపతికానీ, అతనికి సహకరించిన దిలీప్‌కానీ కిడ్నీలు అమ్ముకోకపోవడం కొసమెరుపు. మరో విశేషమేమిటంటే ఈ రాకెట్ ద్వారా సురేశ్ ప్రజాపతి రూ.3 కోట్ల  వరకు ఆస్తులు సంపాదించాడు. అహ్మదాబాద్‌లో రూ.1.40 కోట్ల విలువైన ఓ ఇల్లు, రూ.30 లక్షలతో ఓ ఆఫీసు, రూ.27 లక్షలతో తన ఆఫీసుకు, ఇంటికి ఫర్నీచర్, రూ.8.5 లక్షలు చెల్లించి, మిగతా బ్యాంకు నుంచి రుణం తీసుకుని ఓ ఆడి కారు కూడా కొన్నాడు.

రూ. లక్ష  వెచ్చించి బజాజ్ ఎవెంజర్ మోటార్ సైకిల్ కూడా కొన్నాడు. మొత్తం రూ.45 లక్షల వరకు ఏజెంట్లకు ముట్టచెప్పాడు. తాను గతంలో కొన్న అపార్ట్‌మెంట్‌కు ఉన్న రూ. 7లక్షల బ్యాంకు రుణం కూడా తీర్చేశాడు. ఇప్పుడు సురేశ్ ప్రజాపతి బ్యాంకు బాలెన్స్ ఎంతో తెలుసా.. రూ.21లక్షలు. ఇతనికి సహకరించిన దిలీప్ కూడా 15లక్షలు పెట్టి అహ్మదాబాద్‌లో ఇల్లు కొనుక్కుని మరో రూ.లక్ష ఖర్చుచేశాడు.
 
మరో ముగ్గురు అరెస్టు
ఈ కుంభకోణంలో కీలక పాత్రధారి, దేశవ్యాప్త ఏజెంట్ గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన సురేశ్‌భాయ్ అమృత్‌భాయ్ ప్రజాపతిని నల్లగొండ పోలీసులు అరెస్టు చేశారు. అతనికి సహకరిస్తున్న మరో ఏజెంట్ దిలీప్‌చౌహాన్ (గుజరాత్), తన కిడ్నీని అమ్ముకుని ఏజెంట్‌గా మారిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన జెను నూకరాజులను కూడా అదుపులోనికి తీసుకున్నారు. ముగ్గురినీ నల్లగొండ ఎస్పీ విక్రమ్‌జీత్ దుగ్గల్ మంగళవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు.   ఈ ముగ్గురి అరెస్టుతో ఇప్పటివరకు ఈ కేసులో అరెస్టయిన వారి సంఖ్య పదికి చేరింది. సమావేశంలో ఏఎస్పీ గంగారాం, నల్లగొండ డీఎస్పీ సుధాకర్, సీఐలు రవీందర్, టి.శ్రీనివాస్. శాలిగౌరారం సీఐ ప్రవీణ్ పాల్గొన్నారు.
 
అమ్మినవాళ్లు... కొన్నవాళ్లు వీరే..
సురేశ్ ప్రజాపతి నెట్‌వర్క్ ద్వారా 60 మంది కిడ్నీలు అమ్ముకోగా, 54 మంది డబ్బు లు చెల్లించి కిడ్నీలు మార్పిడి చేయించుకున్నారని తేలింది. కిడ్నీలు అమ్ముకున్న వారిలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు చెందిన వారు 22 మంది ఉన్నారు. తమిళనాడు ఆరుగురు, మహారాష్ట్ర ఐదుగురు, క ర్నాటక నలుగురు, ఢిల్లీకి చెందిన ముగ్గురు, జమ్ము-కాశ్మీర్, మధ్యప్రదేశ్, కేరళ, ఛత్తీస్‌గఢ్‌లకు చెందిన ఒక్కొక్కరున్నారు. ఇతర రాష్ట్రాల వారు మరో 11 మంది ఉన్నారు.

ఇక, కిడ్నీలు మార్పిడి చేసుకున్నవారిలో ఢిల్లీ (2), గుజరాత్ (8), మహారాష్ట్ర (6),జమ్ము-కాశ్మీర్ (5), పంజాబ్ (3)తోపాటు రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, అస్సాం రాష్ట్రాల నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. వీరితో పాటు మరో ఇద్దరు కూడా ఉన్నారు. అవయవ మార్పిడి చట్టం ప్రకారం అనుమతి లేకుండా కిడ్నీలు దానం చేయడంతో పాటు డబ్బులు వెచ్చించి మార్పిడి చేయించుకోవడం కూడా నేరమేనని, ఈ రాకెట్‌తో సంబంధమున్న అందరినీ అరెస్టు చేస్తామని ఎస్పీ దుగ్గల్ వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించిన కీలక నిందితుడి అరెస్టుతో శ్రీలంకకు సంబంధించిన సాక్ష్యాధారాలు బలంగా లభిస్తున్నాయని, అవసరమైతే శ్రీలంక వెళ్లి విచారణ జరిపేందుకు కూడా నల్లగొండ పోలీసులు సిద్ధంగా ఉన్నారని ఆయన వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement