తొలి ఎత్తులోనే చిత్తు
Published Wed, Dec 4 2013 3:51 AM | Last Updated on Sat, Sep 2 2017 1:13 AM
కంచిలి, న్యూస్‌లైన్:ఎవరు ఏ పార్టీలో ఉన్నా వ్యక్తిగత అభిమానాన్ని చంపుకోలేం. దాన్నే తప్పుపడితే ఏం చేయలేం..గత ఎన్నికల్లో 4వేల ఓట్ల తేడాతో పార్టీని ఓడించిన వారినే ఈ రోజు నమ్ముతున్నారు.. వేదిక మీదకు ఆహ్వానించలేదని కొందరి అలకలు.. చాలా మంది ముఖ్యనేతల గైర్హాజరు వంటి పరిణామాలు కేంద్రమంత్రి కిల్లి కృపారాణిని ఉక్కిరిబిక్కిరి చేశాయి. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు కాంగ్రెస్‌ను వీడుతున్నట్లు స్పష్టమైన నేపథ్యంలో జిల్లాపై ఆయన ముద్రను చెరిపేసే కార్యక్రమాన్ని ఇచ్ఛాపురం నియోజకవర్గం నుంచి ప్రారంభించిన ఆమెకు తొలి ప్రయత్నంలోనే పార్టీ శ్రేణులు షాక్ ఇచ్చాయి. కంచిలిలో మంగళవారం సాయంత్రం జరిగిన నియోజకవర్గస్థాయి సమావేశానికి ఒక్క కవిటి మండలం నుంచే.. అది కూడా నరేష్‌కుమార్ అగర్వాలా(లల్లూ) వర్గీయులే హాజరయ్యారు.
కంచిలి, సోంపేట, ఇచ్ఛాపురం మండలాలతోపాటు ఇచ్ఛాపురం మున్సిపాలిటీ నుంచి ముఖ్యనేతలు, కార్యకర్తలు అరకొరగానే వచ్చారు. కంచిలి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కె.ఈశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ధర్మాన వర్గంగా ముద్రపడిన క్యాడర్ అంతా గైర్హాజరయ్యారు. ఈ నియోజకర్గానికే చెందిన డీసీసీ అధ్యక్షుడు నర్తు నరేంద్రయాదవ్, పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి నర్తు రామారావు, సోంపేట మాజీ ఎంపీపీ మంగి గణపతి తదితరులతోపాటు సర్పంచ్‌లు, ఇతర గ్రామస్థాయి నేతల హాజరు అంతంతమాత్రంగానే ఉంది. నియోజకవర్గంలో కాం గ్రెస్ వారిగా ముద్రపడిన సర్పంచ్‌లు 60 మంది వరకు ఉన్నప్పటికీ వారిలో చాలా మంది ఈ సమావేశానికి దూరంగా ఉన్నారు. వచ్చిన కొద్దిమంది కూడా అక్కడ ఏం జరుగుతుందన్నది గమనించడానికే ఆసక్తి చూపారు.
మాటల తూటాలు
లల్లూ వర్గీయులు ఈ సమావేశంలో ఉత్సాహంగా పాల్గొని ఆర్భాటం చేయగా, మిగతా నాయకులు అసంతృప్తితో మాటల తూటాలు సంధించారు. ప్రొటోకాల్ ప్రకారం తమను వేదిక పైకి ఆహ్వానించనందుకు కంచిలి మార్కెట్ కమిటీ అధ్యక్షుడు పి.వి.రమణ, సోంపేట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సంగారు గోవింద్‌లు కొంతసేపు అలకబూనారు. తర్వాత వేదికపైకి వచ్చిన పి.వి.రమణ ఉద్వేగంగా మాట్లాడారు. పార్టీలో ఎవరు ఉన్నా.. లేకపోయినా వ్యక్తిగత అభిమానాలు ఉంటాయని, దాన్ని తప్పుపడితే తానేం చేయలేనని అన్నారు. ఈ క్షణం ఏఎంసీ చైర్మన్ పదవికి రాజీనామా చేయమంటే చేసేస్తానని స్పష్టం చేశారు.
సీనియర్ నేత సత్యనారాయణ పాఢి మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలను గుర్తించటంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో పార్టీని 4వేల ఓట్ల తేడాతో ఓడించిన వారినే ఈ రోజు నమ్ముతున్నారని ఆరోపించారు. మరి పార్టీని నమ్ముకున్నవారికి ఇచ్చే గౌరవమేమిటని ప్రశ్నించారు. దీనిపై ఇచ్ఛాపురం నేత ఉలాల బాలయ్య మాట్లాడుతూ ఎవరికి వారు తమ గొప్పలు చెప్పుకోరాదని, ప్రజలు చెప్పాలని వ్యాఖ్యానించారు. ఈ పరిణామాలన్నీ కృపారాణి ఆశలపై నీళ్లు చల్లాయి. కేంద్రమంత్రి స్థాయిలో తాను సమావేశం పెట్టడం వల్ల వ్యక్తుల ప్రాబల్యానికి లొంగకుండా కాంగ్రెస్‌వాదులందరూ హాజరవుతారని భావించిన ఆమెకు నిరాశే మిగిలింది. జిల్లాపై పట్టుకు చేసిన తొలి ప్రయత్నమే తిప్పికొట్టింది.
Advertisement