అచ్చెన్నాయుడు ‘కార్మికుల’ మంత్రి కాదు
శ్రీకాకుళం అర్బన్ : తన సొంత జిల్లా కార్మికుల సమస్యలనే మూడు నెలలుగా పట్టించుకోని కార్మిక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ‘కార్మికుల మంత్రి కాదని’ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హై పవర్ కమిటీ సభ్యుడు తమ్మినేని సీతారాం తదితరులు ధ్వజమెత్తారు. తాండ్ర ప్రకాష్ అధ్యక్షతన శ్రీకాకుళంలోని ఎన్‌జీవో కార్యాలయంలో సీపీఐ(ఎంఎల్), డెమోక్రసీ ఆధ్వర్యంలో సోమవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ మూడు నెలలుగా ఆకలి బాధల్లో ఉండి కూడా అత్యంత శాంతియుతంగా, ప్రజాస్వామ్యయుతంగా ఆందోళన చేస్తోన్న అరబిందో ఉద్యోగులను ఆయన అభినందించారు.
వీరిపై పోలీసుల వ్యవహార సరళి అభ్యంతర కరమైనదిగా విమర్శించారు. ఈ సమావేశానికి హాజరయ్యే ముందు తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహనరెడ్డిని తాను సంప్రదించానని, అరబిందో ఉద్యోగులకు అండగా పార్టీ మద్దతు ఉంటుందని తనకు సూచించారని సీతారామ్ ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు డోల జగన్ మాట్లాడుతూ తమ పార్టీ అరబిందో యాజమాన్యంతో చర్చించి సామరస్య పరిష్కారానికి ప్రయత్నించాలనుకున్నట్టు తెలిపారు. సీపీఎం జిల్లా కార్యదర్శి బి.కృష్ణమూర్తి మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాకు చెందిన కె. అచ్చెన్నాయుడుకు కార్మికమంత్రి పదవి వచ్చినప్పుడు కార్మికవర్గం హర్షించిందనీ, కానీ ఆరు నెలల్లోనే ఆయన కార్మికశాఖకు మంత్రి కాదని తెలిసిపోయిందని ఎద్దేవా చేశారు.
సంక్రాంతి పండుగ రోజు కూడా విశాఖ లేబర్ కార్యాలయం ఎదుట వంటావార్పుతో ధర్నా నిర్వహించే పరిస్థితి రావడం కార్మికమంత్రికి తలవంపు అని ఈ సీపీఐ జిల్లా నాయకుడు గురుగుల్లి అప్పలనాయుడు అన్నారు. లోక్‌సత్తా పార్టీ నాయకుడు వి.అప్పలరాజు, సీపీఐ లిబరేషన్ పార్టీ నేత తిరుపతిరావు, ఇప్టూ రాష్ర్ట్ర అధ్యక్షుడు పి.ప్రసాద్, సీపీఐ జిల్లా నాయకుడు గురుగుబెల్లి అప్పలనాయుడు తదితరులు ప్రసంగించారు. ఈ సమావేశంలో ఇప్టూ నాయకులు మామిడి క్రాంతి, నేతింటి నీలంరాజు, అరబిందో యూనియన్ అధ్యక్షుడు కె.సన్యాసిరావుతో పాటు అరబిందో యూనియన్ ఆర్గనైజర్లు కేశవరావు, బాలాజీ, అశోక్, రామసత్యం, ప్రతాప్, శ్రీనివాస్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
25న ఐక్య సంఘీభావ సదస్సు
పై సమావేశం భవిష్యత్ కార్యక్రమాలపై ఏకగ్రీవంగా ఒక తీర్మానాన్ని ఆమోదించింది. కలెక్టర్‌ను, కార్మిక మంత్రిని వివిధ పార్టీలు వెంటనే కలుసుకొని మూడు రోజుల్లో పరిష్కారం కోసం డిమాండ్ చేయాలని నిర్ణయించారు. లేకుంటే ఉద్యమం ఉద్ధృతం చేస్తామని హెచ్చరిద్దామని సమావేశం నిర్ణయించింది. కలెక్టర్ కార్యాలయం ఎదుట ఒక రోజు వివిధ పార్టీలతో కలసి రిలే నిరాహార దీక్షలు చేపట్టాలని నిర్ణయించారు. ఈ నెల 25న శ్రీకాకుళం జిల్లాలో వివిధ పార్టీలు ఉమ్మడిగా అరబిందో సంఘీభావ సదస్సు నిర్వహించాలని సమావేశంలో తీర్మానించారు.