Labour Minister
-
పంచనామాపై బలవంతంగా సంతకం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, ఆయన కుటుంబసభ్యులు, బంధువులు, భాగస్వాములపై జరిగిన ఐటీ దాడుల అంశంలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ఐటీ శాఖ డిప్యూటీ డైరెక్టర్ సీఎండీ రత్నాకర్ పంచనామాపై తన అన్న మహేందర్‌రెడ్డితో బలవంతంగా సంతకం పెట్టించుకున్నారంటూ మల్లారెడ్డి చిన్న కుమారుడు భద్రారెడ్డి బోయిన్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు రత్నాకర్ కూడా ఫిర్యాదు చేశారు. మంత్రి తన విధులు అడ్డుకోవడంతో పాటు కీలక పత్రాలు ధ్వంసం చేశారని ఆరోపించారు. ఈ మేరకు కేసులు నమోదు చేసుకున్న బోయిన్పల్లి పోలీసులు తదుపరి దర్యాప్తు నిమిత్తం దుండిగల్ పోలీసుస్టేషన్‌కు బదిలీ చేశారు. నా అన్నను బెదిరించారు.. మంత్రి మల్లారెడ్డి పెద్ద కుమారుడు మహేందర్‌రెడ్డి ఐటీ సోదాల నేపథ్యంలో అస్వస్థతకు గురై మల్లారెడ్డి నారాయణ ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. కాగా బుధవారం రాత్రితో మహేందర్‌రెడ్డి ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు పూర్తి చేసిన అధికారులు దానికి సంబంధించిన పంచనామా రూపొందించారు. దీనిపై సంతకం చేయించుకోవడానికి డిప్యూటీ డైరెక్టర్ రత్నాకర్ ఆస్పత్రికి వెళ్లారు. అయితే గుండె నొప్పితో చికిత్స పొందుతున్న తన అన్న మహేందర్‌రెడ్డిని బెదిరించి, బలవంతంగా వాటిపై సంతకాలు తీసుకున్నారంటూ మల్లారెడ్డి చిన్న కుమారుడు, సీఎంఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ, మల్లారెడ్డి సొసైటీల అధ్యక్షుడు «భద్రారెడ్డి బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 1.30 గంటల సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా పోలీసులు రత్నాకర్‌పై ఐపీసీలోని 384 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. మరోవైపు రూ.100 కోట్ల డొనేషన్లకు సంబంధిత పత్రాలపై కూడా ఐటీ అధికారులు మహేందర్‌రెడ్డి సంతకాలు తీసుకున్నట్టు సమాచారం. కాగా తమ వద్ద రూ.100 కోట్లు లేవని, మేనేజ్మెంట్ కోటా లేనప్పుడు డొనేషన్ ఎలా ఇస్తారని మంత్రి మల్లారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రశ్నించారు. ల్యాప్‌టాప్, హార్డ్‌డ్రైవ్‌లు ఉన్న బ్యాగులు దొంగిలించారు.. ఇలావుండగా.. తాను పంచనామాపై సంతకం చేయించుకోవడానికి ఆస్పత్రికి వెళ్లినప్పుడు అక్కడకు తన అనుచరులతో కలిసివచి్చన మంత్రి మల్లారెడ్డి తన విధులకు ఆటంకం కలిగించారంటూ రత్నాకర్ గురువారం తెల్లవారుజామున 3.40 గంటలకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పంచనామా సహా కొన్ని పత్రాలు చించేశారని, అసభ్య పదజాలంతో దూషించడంతో పాటు బెదిరించారని పేర్కొన్నారు. ల్యాప్‌టాప్, హార్డ్ డ్రైవ్స్‌తో ఉన్న తన రెండు బ్యాగులు కూడా దొంగిలించారని ఆరోపించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా బోయిన్పల్లి పోలీసులు మల్లారెడ్డి తదితరులపై ఐపీసీలోని 342, 353, 201, 504, 506, 379 రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ రెండు ఉదంతాలు చోటు చేసుకున్న మల్లారెడ్డి ఆస్పత్రి దుండిగల్ పోలీసుస్టేషన్ పరిధిలోకి వస్తుంది. దీంతో జీరో ఎఫ్ఐఆర్లు నమోదు చేసిన అధికారులు తదుపరి దర్యాప్తు నిమిత్తం ఆ ఠాణాకు బదిలీ చేశారు. ఠాణా గేటు వద్ద ప్రత్యక్షమైన ల్యాప్‌టాప్! ఈ 2 కేసులు నమోదైన కొద్దిసేపటికే ఓ ల్యాప్‌టాప్ నాటకీయంగా బోయిన్పల్లి పోలీసుస్టేషన్ వద్ద ప్రత్యక్షమైంది. రత్నాకర్ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టారు. ఆయన ల్యాప్‌టాప్ సహా ఇతర వస్తువులు మల్లారెడ్డి ఇంట్లో ఉన్నాయా? ఎవరైనా తీసుకున్నారా? తదితర అంశాలు ఆరా తీశారు. ఈ నేపథ్యంలో గురువారం తెల్లవారుజామున 4.15 గంటల ప్రాంతంలో ఓ ల్యాప్‌టాప్ బోయిన్పల్లి పోలీసుస్టేషన్ గేటు వద్ద ప్రహరీని ఆనుకుని ఉండటం కానిస్టేబుళ్ల కంటపడింది. దీంతో వారు దాన్ని రత్నాకర్‌కు చూపించగా.. ఆ ల్యాప్‌టాప్ తనది కాదని, దాన్ని ఎవరో మార్చేశారని అన్నారు. దీంతో దాని పంచనామా నిర్వహించిన సిబ్బంది దుండిగల్ పోలీసులకు అప్పగించాలని నిర్ణయించారు. ఇదీ చదవండి: ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసు.. వెలుగులోకి రఘురామ కృష్ణరాజు పేరు -
ఈ-శ్రమ్ పోర్టల్‌లో పేరు రిజిస్టర్ చేసుకోవడం ఎలా?
నిర్మాణ కార్మికులు, వలస కార్మికులు, వీధి వ్యాపారులు, గృహ కార్మికులు వంటి అసంఘటిత కార్మికుల సమగ్ర డేటాబేస్ కోసం కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 26న ఈ-శ్రమ్ పోర్టల్‌ను ప్రారంభించింది. ఈ పోర్టల్ వల్ల అసంఘటిత రంగంలోని 38 కోట్ల మంది కార్మికుల పేర్లను నమోదు చేయడమే కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అందించే సంక్షేమ పథకాల ప్రయోజనాలను పొందవచ్చు అని కేంద్రం తెలిపింది. ఈ కార్మికుల కోసం రాష్ట్రాలు, కార్మిక సంఘాల సమన్వయంతో సామాజిక సంక్షేమ పథకాలను ఈ పోర్టల్ ద్వారా ఏకీకృతం చేయాలని భారత ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీనిలో పేర్లను నమోదు చేసుకున్న కార్మికులకు ఒక ప్రత్యేకమైన 12 అంకెల సంఖ్య గల కొత్త ఈ-శ్రమ్ కార్డు జారీ చేస్తారు. రిజిస్ట్రేషన్ కూడా ఇంట్లో నుంచే ఉచితంగా చేసుకోవచ్చు. కొత్త ఈ-శ్రమ్ కార్డు దేశవ్యాప్తంగా చెల్లుబాటు అవుతుంది. అసంఘటిత రంగంలోని కార్మికులు తమ ఆధార్ నెంబరు, బ్యాంకు ఖాతా వంటి వివరాలు సాయంతో కొత్త పోర్టల్‌లో తమ పేరును రిజిస్టర్ చేసుకోవచ్చు. ఏవైనా సందేహాలు ఉంటే జాతీయ టోల్-ఫ్రీ నంబర్ "14434"ను కూడా సంప్రదించవచ్చు. ఈ-శ్రమ్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవడం ఎలా ఈ-శ్రమ్ పోర్టల్ ఓపెన్ చేసి హోమ్ పేజీలో ఉన్న"రిజిస్టర్ ఆన్ ఈ-శ్రమ్" లింక్/సెక్షన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు కనిపిస్తున్న సెల్ఫ్ రిజిస్ట్రేషన్ దగ్గర ఆధార్ తో లింకు చేసిన మొబైల్ నెంబరును నమోదు చేయాలి. కాప్చా ఎంటర్ చేసిన తర్వాత ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ), ఉద్యోగుల స్టేట్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్(ఈఎస్ఐసీ)లో సభ్యుడు అయితే అవును అని, లేకపోతే కాదు అని ఎంచుకొని సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు వచ్చిన ఓటీపీ నమోదు చేసి SUBMIT మీద నొక్కండి. ఆ తర్వాత మీరు మీ ఆధార్ నెంబర్ చేసి మళ్లీ SUBMIT మీద నొక్కండి. ఆధార్ నెంబర్ మీదేనా కదా అనే తెలుసుకోవడానికి మీకు ఓటీపీ వస్తుంది దాన్ని నమోదు చేసి SUBMIT మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీ ఆధార్ లో ఉన్న పూర్తి వివరాలు కనిపిస్తాయి. మిగతా వివరాల నమోదు చేయడానికి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు మీ వ్యక్తి గత వివరాలు, చిరునామా, విద్య అర్హత, వృత్తి, బ్యాంకు వివరాలు వంటివి నమోదు చేయవచ్చు. పైన పేర్కొన్న వివరాలు నమోదు చేశాక మీరు ఈ-శ్రమ్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబరు లేనప్పటికీ కార్మికులు ఉచిత రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చు. మీ దగ్గరలో ఉన్న సీఎస్ సీ కేంద్రాలను సందర్శించి బయోమెట్రిక్ ఆథెంటికేషన్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు. రిజిస్టర్డ్ అసంఘటిత కార్మికులందరికీ ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన(పీఎంఎస్ బివై) కింద ఏడాది కాలానికి ప్రమాద బీమా కవరేజీ లభిస్తుంది. ప్రమాదవశాత్తు మరణం, శాశ్వత వైకల్యం చెందితే రూ.2 లక్షలు, పాక్షిక వైకల్యం చెందితే రూ.1 లక్ష రూపాయలు కేంద్రం జమ చేస్తుంది. -
కరోనా దెబ్బతో 71 లక్షల ఈపీఎఫ్ ఖాతాల తొలగింపు
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా కష్టకాలంలో ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్ఓ) నుంచి చందాదారులు భారీ ఎత్తున నిధులను విత్‌డ్రా చేశారు. ఏప్రిల్ ప్రారంభం నుంచి 80 లక్షల మంది చందాదారులు ఏకంగా రూ.30వేల కోట్ల వరకు నగదును ఉప సంహరించుకున్నారు. దాంతోపాటు ఉద్యోగాలను కోల్పోవడం, వేరే ఉద్యోగాల్లో చేరడం, ఇతర కారణాల వల్ల భారీ స్థాయిలో ఈపీఎఫ్ ఖాతాలు తొలగించాల్సి వచ్చింది. 2020 ఏప్రిల్ నుంచి డిసెంబరు మధ్యకాలంలో సుమారు 71 లక్షల ఈపీఎఫ్ ఖాతాలు మూసివేసినట్టు కేంద్ర వెల్లడించింది. రిటైర్మెంట్ ఫండ్ బాడీ ఈపీఎఫ్ఓ 2020 ఏప్రిల్‌లో డిసెంబర్లో 71.01 లక్షల మంది ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్ఓ) ఖాతాలను తొలగించింది. పార్లమెంటు సమావేశాల్లో సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర కార్మిక మంత్రి సంతోష్ గంగ్వార్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2020 ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు ముగిసిన ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) ఖాతాల సంఖ్య 71,01,929. అదే 2019 ఏప్రిల్-డిసెంబర్లో ఈపీఎఫ్ ఖాతాలను పూర్తిగా మూసివేసిన వారి సంఖ్య 66,66,563 ఉందని మంత్రి తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్ రోజ్‌గార్ పథకంలో భాగంగా.. ఆత్మనిర్భర్ భారత్ రోజ్‌గార్ యోజన (ఎబీఆర్‌వై) పథకం కింద ఫిబ్రవరి 21, 2021 వరకు రూ .186.34 కోట్లు విడుదల చేశారు. కోవిడ్ -19 మహమ్మారి సమయంలో సామాజిక భద్రతతో పాటు, కొత్తగా ఉపాధి కల్పన, ఉద్యోగాలను సృష్టించడంలో భాగంగా కంపెనీలను ప్రోత్సహించడానికి ఎబీఆర్‌వై పథకాన్ని కేంద్రప్రభుత్వం ప్రారంభించింది. ఎబీఆర్‌వై పథకం కింద 2021 ఫిబ్రవరి 28 వరకు 15.30 లక్షల మందికి ఉద్యోగాలను కవర్ చేస్తూ, 1.83 లక్షల సంస్థలు లేదా కంపెనీలు నమోదైనట్లు కేంద్ర మంత్రి పార్లమెంట్లో సమాధామిచ్చారు. ఇదిలాఉండగా... ఎబీఆర్‌వై పథకంలో భాగంగా భారత ప్రభుత్వం రెండేళ్ల కాలానికిగాను ఉద్యోగుల వాటా (12% వేతనాలు), యజమానుల వాటా (12% వేతనాలు) ఈపీఎఫ్‌ను చెల్లించనుంది. ప్రభుత్వం ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్‌లో (ఈటిఎఫ్) 2021 ఫిబ్రవరి 28 వరకు ఈపీఎఫ్ఓ రూ .27,532.39 కోట్లు పెట్టుబడి పెట్టిందని సంతోష్ గంగ్వార్ సభలో పేర్కొన్నారు. ఈపీఎఫ్ఓ 2019-20లో రూ .32,377.26 కోట్లు, 2018-19లో రూ .27,743.19 కోట్లు పెట్టుబడి పెట్టిందని తెలిపారు. (చదవండి:ఈపీఎఫ్ ఖాతాదారులు హోమ్ లోన్ తీసుకోండిలా!) -
వలసలపై డేటా భేష్!
దేశంలో ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికెళ్లే వలస కార్మికులు, ఇతరుల డేటా రూపొందించడానికి కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన మంత్రిత్వ శాఖ సంకల్పించడం మంచి పరిణామం. ఈ డేటా రూప కల్పన కోసం ఇతర మంత్రిత్వ శాఖల సహాయసహకారాలు తీసుకోవాలని కార్మిక శాఖ నిర్ణయిం చింది. వచ్చే జూన్‌కు డేటా సిద్ధమవుతుందని చెబుతున్నారు. కరోనా వైరస్ మహమ్మారి ప్రభుత్వా లకూ, పౌరులకూ చాలా గుణపాఠాలు నేర్పింది. వలస వచ్చేవారి విషయంలో ఖచ్చితమైన డేటా వుండాలని అంతక్రితం ఏ ప్రభుత్వమూ అనుకోలేదు. కానీ లాక్డౌన్ అమలు ప్రారంభించాక ఆ వివరాలు లేకపోవడం ఎలాంటి సమస్యలకు దారితీస్తుందో అనుభవపూర్వకంగా అర్థమైంది. వలస కార్మికుల్లో అత్యధికులు అసంఘటిత రంగంలో వుంటారు. లాక్డౌన్ విధిస్తున్నట్టు ప్రకటించి, రవాణా సౌకర్యాలు నిలిపేయడంతో అయోమయ పరిస్థితులు ఏర్పడ్డాయి. కార్మికులను, కూలీలను పనిలో పెట్టుకున్నవారే లాక్డౌన్ ఎత్తేసేవరకూ వారి బాగోగులు పట్టించుకోవాలని కేంద్రం సూచిం చినా కొద్దిమంది మినహా అత్యధికులు పట్టించుకోలేదు. పైగా వారికి ఇవ్వాల్సిన బకాయిలు ఎగ్గొట్టిన ఘనులు కూడా వున్నారు. అటు రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించిన సాయమైనా, ఇటు స్వచ్ఛంద సంస్థలు చేసిన సాయమైనా అందనివారెందరో వున్నారు. ఉన్నచోటే వుంటే ఆకలిదప్పులతో చనిపోవడం ఖాయమన్న నిర్ణయానికొచ్చినవారు కుటుంబాలతో సహా స్వస్థలాలకు నడక మొదలుపెట్టారు. అలా వెళ్లినవారి సంఖ్య కోటి పైమాటేనని కార్మిక మంత్రిత్వ శాఖ అంచనా వేసింది. ఉపాధి హామీ, ఒకే దేశం–ఒకే రేషన్‌వంటి పథకాల కోసం... ఈపీఎఫ్, ఈఎస్ఐ తదితర ప్రయోజనాలు వర్తింపజేయడానికి డేటా సేకరిస్తారు. అలాగే ఆధార్ డేటా సరేసరి. ఇలా భిన్న రంగాలకు చెందిన ప్రభుత్వ విభాగాలు సేకరించే డేటాను సమన్వయపరిస్తే అది కొంతవరకూ ఉపయోగపడొచ్చు. అలాగే ఒక రాష్ట్రం నుంచి వేరేచోట్లకు వెళ్లేవారు రిజిస్టర్ చేసుకోవడానికి అనువైన విధానాన్ని రూపకల్పన చేయాలి. మన దేశంలో వలస కార్మికులు ఎంతమంది వుంటారన్న విషయంలో స్పష్టమైన గణాంకాలు లేవు. వలస కార్మికుల సంఖ్య 45 కోట్ల వరకూ వుండొచ్చని 2011 జనాభా లెక్కలు తేల్చాయి. మన దేశంలో ఏటా సగటున 4.5 శాతం మేర అంతర్గత వలసలు పెరుగుతుంటాయని ప్రపంచ ఆర్థిక ఫోరం నివేదిక అంచనా వేసింది. ఎక్కువగా ఉత్తరప్రదేశ్, బిహార్‌ల నుంచే వేరే రాష్ట్రాలకు వలసలుంటాయి. వీరంతా మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, కేరళ తదితర రాష్ట్రాలకు వెళ్తుంటారని 2017నాటి ఆర్థిక సర్వే తెలిపింది. తాము వున్నచోట ఉపాధి లేకపోవడం, తక్కువ వేతనాలు లభించడం, కరువుకాటకాలు తలెత్తటం, మెరు గైన వైద్య సౌకర్యాలు కొరవడటం, శాంతిభద్రతలు లేకపోవటం వగైరా సమస్యల వల్ల చాలామంది వలసపోవడానికి సిద్ధపడతారు. తమ ప్రాంతం, భాష కానిచోట మనుగడ సాగించడం కష్టమని తెలిసినా వారికి అంతకన్నా గత్యంతరం వుండదు. కుటుంబాల్లోని పిల్లలకు విద్య, వైద్యం వంటి సౌకర్యాలు లభించాలంటే... కనీసం బ్యాంకు ఖాతా ప్రారంభించాలంటే ఏదో రకమైన గుర్తింపు కార్డు వుండాలి. చాలా సందర్భాల్లో అది అసాధ్యమవుతుంది. దేశంలోని వలస కార్మికుల్లో 22 శాతంమందికి ఎలాంటి గుర్తింపు కార్డు వుండదని 2011లో నిర్వహించిన అధ్యయనంలో తేలింది. భాష రాకపోవటం వల్ల, స్థానికులు కాకపోవటం వల్ల వారికి పనులు చూపించే దళారులు వలస కార్మికులను నిలువుదోపిడీ చేస్తుంటారు. మెరుగైన వేతనాలు, ఇతరత్రా ప్రయోజనాలు రాబట్టు కోవటం వలస కార్మికులకు సులభం కాదు. పనిచేసేచోట సమస్యలేర్పడితే వారిని ఆదుకునే వారుండరు. వలస కార్మికులు సృష్టించే సంపద తక్కువేమీ కాదు. మహా నగరాల్లో ఆకాశాన్నంటే భవంతుల నిర్మాణం మొదలుకొని చిన్న చిన్న పారిశుద్ధ్య పనుల వరకూ అన్నింటా వారి ప్రమేయం వుంటుంది. అయినా ఇన్ని దశాబ్దాలుగా వారికి సంబంధించిన సమగ్రమైన డేటా ప్రభుత్వాల దగ్గర లేదు. ఇది వలస కార్మికులకు, కూలీలకు మాత్రమే కాదు... ప్రభుత్వాలకు సైతం సమస్యే. ఏ ప్రాంతంలో జనాభా సాంద్రత ఎంతవుందో నిర్దిష్టమైన అంచనా కొరవడటంతో మంచినీరు, డ్రయి నేజ్ వంటి సౌకర్యాల అమలు తలకిందులవుతుంది. వారికి సరైన వేతనాలు లభిస్తున్నాయో లేదో, వారి సంక్షేమానికి ఇతరత్రా తీసుకోవాల్సిన చర్యలేమిటో నిర్ధారించుకోవడం అసాధ్యమవుతుంది. వలస కార్మికులకు కూడా కార్మిక చట్టాలు వర్తిస్తాయి. వాటికింద నిర్దిష్టమైన పనిగంటలు, వేతనం, ఇతర భత్యాలు అందాలి. అలాగే వారికి తగిన ఆవాసం, వైద్య సౌకర్యాలు కల్పించాలి. అనుకోని ప్రమాదం సంభవించినా, ఉన్నట్టుండి పని నుంచి తొలగించినా, మరెలాంటి సమస్య తలెత్తినా ఫిర్యాదు చేసే హక్కు వారికుంటుంది. వలస కార్మికుల ఉపాధి, పని పరిస్థితుల క్రమబద్ధీకరణ కోసమంటూ 1979లో చట్టం తీసుకొచ్చారు. దానికి మరింత పదును పెడుతూ 2011లో సవరణలు చేశారు. ఆ చట్టంకింద అయిదుగురు లేదా అంతకన్నా ఎక్కువమంది ఇతర రాష్ట్రాలవారిని పనిలో పెట్టుకునే కాంట్రాక్టర్లకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి. అలాగే వలస కార్మికులకు సంబంధించిన రిజిస్టర్ నిర్వహిస్తూండాలి. కానీ ఈ చట్ట నిబంధనలు ఎలా అమలవుతున్నాయో చూసేవారు కరువయ్యారు. అందుకే లాక్డౌన్ అనంతర పరిస్థితులపై ప్రభుత్వాలకు అంచనా లేకుండా పోయింది. ఇప్పుడు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ డేటా సేకరణకు నడుం కట్టింది గనుక అలాంటి సమస్యలు తీరుతాయని ఆశించాలి. వలస కార్మికుల సామాజిక భద్రతకు, సంక్షేమానికి తగిన చర్యలు తీసుకొనేందుకు ఈ డేటా తోడ్పడాలి. అలాగే వలస కార్మికులకు సంబంధించిన నిర్వ చనం అన్ని చట్టాల్లోనూ ఒకేలా లేదు. ఆ లోపాన్ని కూడా సరిచేయాలి. డేటా ఆధారంగా గుర్తింపు కార్డులు జారీచేసి, వలస కార్మికులకు సకల ప్రయోజనాలు సులభంగా అందుబాటులోకొచ్చేలా చర్యలు తీసుకోవాలి. -
వారికి శిక్ష తప్పదు..!
సాక్షి, విజయవాడ: ఈఎస్ఐ కుంభకోణం తమ దృష్టికి వచ్చిందని జాతీయ లేబర్ వెల్ఫేర్ బోర్డ్ చైర్మన్ జయప్రకాష్ తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈఎస్ఐలో జరిగిన అవినీతిని కేంద్ర కార్మిక శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు. కేంద్ర దర్యాప్తు బృందంతో విచారణ జరపాలని కేంద్రమంత్రిని కోరతామని చెప్పారు. ఈఎస్ఐ అవినీతికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలన్నారు. అచ్చెన్నాయుడు ప్రధాని పేరును వాడుకోవడాన్ని ఖండిస్తున్నామన్నారు. ఈఎస్ఐలో ఎన్నో అవకతవకలు జరిగినట్లు సమాచారం ఉందని వెల్లడించారు. తెలంగాణలో అవినీతికి పాల్పడిన కంపెనీలే ఏపీలో కూడా అవినీతికి పాల్పడ్డాయని చెప్పారు. అవినీతి పాల్పడిన వారికి శిక్ష తప్పదని జయప్రకాష్ స్పష్టం చేశారు. (ఈఎస్ఐ స్కామ్ : తవ్వేకొద్దీ బయటపడుతున్నభారీ అక్రమాలు) -
అచ్చెన్నాయుడు ‘కార్మికుల’ మంత్రి కాదు
శ్రీకాకుళం అర్బన్ : తన సొంత జిల్లా కార్మికుల సమస్యలనే మూడు నెలలుగా పట్టించుకోని కార్మిక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ‘కార్మికుల మంత్రి కాదని’ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హై పవర్ కమిటీ సభ్యుడు తమ్మినేని సీతారాం తదితరులు ధ్వజమెత్తారు. తాండ్ర ప్రకాష్ అధ్యక్షతన శ్రీకాకుళంలోని ఎన్జీవో కార్యాలయంలో సీపీఐ(ఎంఎల్), డెమోక్రసీ ఆధ్వర్యంలో సోమవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ మూడు నెలలుగా ఆకలి బాధల్లో ఉండి కూడా అత్యంత శాంతియుతంగా, ప్రజాస్వామ్యయుతంగా ఆందోళన చేస్తోన్న అరబిందో ఉద్యోగులను ఆయన అభినందించారు. వీరిపై పోలీసుల వ్యవహార సరళి అభ్యంతర కరమైనదిగా విమర్శించారు. ఈ సమావేశానికి హాజరయ్యే ముందు తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డిని తాను సంప్రదించానని, అరబిందో ఉద్యోగులకు అండగా పార్టీ మద్దతు ఉంటుందని తనకు సూచించారని సీతారామ్ ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు డోల జగన్ మాట్లాడుతూ తమ పార్టీ అరబిందో యాజమాన్యంతో చర్చించి సామరస్య పరిష్కారానికి ప్రయత్నించాలనుకున్నట్టు తెలిపారు. సీపీఎం జిల్లా కార్యదర్శి బి.కృష్ణమూర్తి మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాకు చెందిన కె. అచ్చెన్నాయుడుకు కార్మికమంత్రి పదవి వచ్చినప్పుడు కార్మికవర్గం హర్షించిందనీ, కానీ ఆరు నెలల్లోనే ఆయన కార్మికశాఖకు మంత్రి కాదని తెలిసిపోయిందని ఎద్దేవా చేశారు. సంక్రాంతి పండుగ రోజు కూడా విశాఖ లేబర్ కార్యాలయం ఎదుట వంటావార్పుతో ధర్నా నిర్వహించే పరిస్థితి రావడం కార్మికమంత్రికి తలవంపు అని ఈ సీపీఐ జిల్లా నాయకుడు గురుగుల్లి అప్పలనాయుడు అన్నారు. లోక్‌సత్తా పార్టీ నాయకుడు వి.అప్పలరాజు, సీపీఐ లిబరేషన్ పార్టీ నేత తిరుపతిరావు, ఇప్టూ రాష్ర్ట్ర అధ్యక్షుడు పి.ప్రసాద్, సీపీఐ జిల్లా నాయకుడు గురుగుబెల్లి అప్పలనాయుడు తదితరులు ప్రసంగించారు. ఈ సమావేశంలో ఇప్టూ నాయకులు మామిడి క్రాంతి, నేతింటి నీలంరాజు, అరబిందో యూనియన్ అధ్యక్షుడు కె.సన్యాసిరావుతో పాటు అరబిందో యూనియన్ ఆర్గనైజర్లు కేశవరావు, బాలాజీ, అశోక్, రామసత్యం, ప్రతాప్, శ్రీనివాస్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 25న ఐక్య సంఘీభావ సదస్సు పై సమావేశం భవిష్యత్ కార్యక్రమాలపై ఏకగ్రీవంగా ఒక తీర్మానాన్ని ఆమోదించింది. కలెక్టర్‌ను, కార్మిక మంత్రిని వివిధ పార్టీలు వెంటనే కలుసుకొని మూడు రోజుల్లో పరిష్కారం కోసం డిమాండ్ చేయాలని నిర్ణయించారు. లేకుంటే ఉద్యమం ఉద్ధృతం చేస్తామని హెచ్చరిద్దామని సమావేశం నిర్ణయించింది. కలెక్టర్ కార్యాలయం ఎదుట ఒక రోజు వివిధ పార్టీలతో కలసి రిలే నిరాహార దీక్షలు చేపట్టాలని నిర్ణయించారు. ఈ నెల 25న శ్రీకాకుళం జిల్లాలో వివిధ పార్టీలు ఉమ్మడిగా అరబిందో సంఘీభావ సదస్సు నిర్వహించాలని సమావేశంలో తీర్మానించారు.