పంచనామాపై బలవంతంగా సంతకం | IT Raids In Mallareddy Houses Alleged Forced Signature On Panchnama | Sakshi
Sakshi News home page

పంచనామాపై బలవంతంగా సంతకం

Published Fri, Nov 25 2022 4:24 AM | Last Updated on Fri, Nov 25 2022 3:07 PM

IT Raids In Mallareddy Houses Alleged Forced Signature On Panchnama - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:     రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, ఆయన కుటుంబసభ్యులు, బంధువులు, భాగస్వాములపై జరిగిన ఐటీ దాడుల అంశంలో కొత్త ట్విస్ట్‌ చోటు చేసుకుంది. ఐటీ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ సీఎండీ రత్నాకర్‌ పంచనామాపై తన అన్న మహేందర్‌రెడ్డితో బలవంతంగా సంతకం పెట్టించుకున్నారంటూ మల్లారెడ్డి చిన్న కుమారుడు భద్రారెడ్డి బోయిన్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు రత్నాకర్‌ కూడా ఫిర్యాదు చేశారు. మంత్రి తన విధులు అడ్డుకోవడంతో పాటు కీలక పత్రాలు ధ్వంసం చేశారని ఆరోపించారు. ఈ మేరకు కేసులు నమోదు చేసుకున్న బోయిన్‌పల్లి పోలీసులు తదుపరి దర్యాప్తు నిమిత్తం దుండిగల్‌ పోలీసుస్టేషన్‌కు బదిలీ చేశారు.  

నా అన్నను బెదిరించారు.. 
మంత్రి మల్లారెడ్డి పెద్ద కుమారుడు మహేందర్‌రెడ్డి ఐటీ సోదాల నేపథ్యంలో అస్వస్థతకు గురై మల్లారెడ్డి నారాయణ ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. కాగా బుధవారం రాత్రితో మహేందర్‌రెడ్డి ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు పూర్తి చేసిన అధికారులు దానికి సంబంధించిన పంచనామా రూపొందించారు. దీనిపై సంతకం చేయించుకోవడానికి డిప్యూటీ డైరెక్టర్‌ రత్నాకర్‌ ఆస్పత్రికి వెళ్లారు. అయితే గుండె నొప్పితో చికిత్స పొందుతున్న తన అన్న మహేందర్‌రెడ్డిని బెదిరించి, బలవంతంగా వాటిపై సంతకాలు తీసుకున్నారంటూ మల్లారెడ్డి చిన్న కుమారుడు, సీఎంఆర్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీ, మల్లారెడ్డి సొసైటీల అధ్యక్షుడు «భద్రారెడ్డి బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 1.30 గంటల సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా పోలీసులు రత్నాకర్‌పై ఐపీసీలోని 384 సెక్షన్‌ కింద కేసు నమోదు చేశారు. మరోవైపు రూ.100 కోట్ల డొనేషన్లకు సంబంధిత పత్రాలపై కూడా ఐటీ అధికారులు మహేందర్‌రెడ్డి సంతకాలు తీసుకున్నట్టు సమాచారం. కాగా తమ వద్ద రూ.100 కోట్లు లేవని, మేనేజ్‌మెంట్‌ కోటా లేనప్పుడు డొనేషన్‌ ఎలా ఇస్తారని మంత్రి మల్లారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రశ్నించారు.  

ల్యాప్‌టాప్, హార్డ్‌డ్రైవ్‌లు ఉన్న బ్యాగులు దొంగిలించారు.. 
ఇలావుండగా.. తాను పంచనామాపై సంతకం చేయించుకోవడానికి ఆస్పత్రికి వెళ్లినప్పుడు అక్కడకు తన అనుచరులతో కలిసివచి్చన మంత్రి మల్లారెడ్డి తన విధులకు ఆటంకం కలిగించారంటూ రత్నాకర్‌ గురువారం తెల్లవారుజామున 3.40 గంటలకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పంచనామా సహా కొన్ని పత్రాలు చించేశారని, అసభ్య పదజాలంతో దూషించడంతో పాటు బెదిరించారని పేర్కొన్నారు. ల్యాప్‌టాప్, హార్డ్‌ డ్రైవ్స్‌తో ఉన్న తన రెండు బ్యాగులు కూడా దొంగిలించారని ఆరోపించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా బోయిన్‌పల్లి పోలీసులు మల్లారెడ్డి తదితరులపై ఐపీసీలోని 342, 353, 201, 504, 506, 379 రెడ్‌ విత్‌ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ రెండు ఉదంతాలు చోటు చేసుకున్న మల్లారెడ్డి ఆస్పత్రి దుండిగల్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలోకి వస్తుంది. దీంతో జీరో ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసిన అధికారులు తదుపరి దర్యాప్తు నిమిత్తం ఆ ఠాణాకు బదిలీ చేశారు.  

ఠాణా గేటు వద్ద ప్రత్యక్షమైన ల్యాప్‌టాప్‌! 
ఈ 2 కేసులు నమోదైన కొద్దిసేపటికే ఓ ల్యాప్‌టాప్‌ నాటకీయంగా బోయిన్‌పల్లి పోలీసుస్టేషన్‌ వద్ద ప్రత్యక్షమైంది. రత్నాకర్‌ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టారు. ఆయన ల్యాప్‌టాప్‌ సహా ఇతర వస్తువులు మల్లారెడ్డి ఇంట్లో ఉన్నాయా? ఎవరైనా తీసుకున్నారా? తదితర అంశాలు ఆరా తీశారు. ఈ నేపథ్యంలో గురువారం తెల్లవారుజామున 4.15 గంటల ప్రాంతంలో ఓ ల్యాప్‌టాప్‌ బోయిన్‌పల్లి పోలీసుస్టేషన్‌ గేటు వద్ద ప్రహరీని ఆనుకుని ఉండటం కానిస్టేబుళ్ల కంటపడింది. దీంతో వారు దాన్ని రత్నాకర్‌కు చూపించగా.. ఆ ల్యాప్‌టాప్‌ తనది కాదని, దాన్ని ఎవరో మార్చేశారని అన్నారు. దీంతో దాని పంచనామా నిర్వహించిన సిబ్బంది దుండిగల్‌ పోలీసులకు అప్పగించాలని నిర్ణయించారు.    

ఇదీ చదవండి: ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసు.. వెలుగులోకి రఘురామ కృష్ణరాజు పేరు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement